రెండు విడతలుగా వాటర్‌గ్రిడ్ | Water grid in two phases | Sakshi
Sakshi News home page

రెండు విడతలుగా వాటర్‌గ్రిడ్

Published Wed, Jul 22 2015 1:22 AM | Last Updated on Sat, Aug 11 2018 6:34 PM

Water grid in two phases

రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం
తొలుత కృష్ణా బేసిన్‌కు ప్రాధాన్యం
11 సెగ్మెంట్లకు వ్యాప్కోస్ లైన్ క్లియర్
వారంలోగా తొలి విడత టెండర్లు
రూ.15,633 కోట్లతో 4 జిల్లాల్లో  పైప్‌లైన్లు
టెండర్ నిబంధనలకు సీఎం ఆమోదం

 
హైదరాబాద్: ఇంటింటికీ రక్షిత మంచినీటిని అందించేందుకు ఉద్దేశించిన తెలంగాణ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ (వాటర్‌గ్రిడ్)ను రెండు దశల్లో చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలి విడతగా కృష్ణా బేసిన్ పరిధిలో ఉన్న మెదక్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లోని 11 సెగ్మెంట్లలో పైపులైన్ల నిర్మాణం చేపట్టనుంది. రెండో విడతలో గోదావరి బేసిన్ నుంచి నీటిని సరఫరా చేసే జిల్లాల్లో పనులు మొదలుపెట్టనుంది. రెండో విడత ప్యాకేజీలను 22 సెగ్మెంట్లుగా విభజించింది. తొలి దశకు సంబంధించిన ప్రాజెక్టు అంచనాలను వ్యాప్కోస్ (వాటర్ అండ్ పవర్ కన్సల్టెన్సీ సర్వీసెస్) పూర్తి చేసింది. సెగ్మెంట్లవారీగా ప్రాజెక్టు అంచనాలను పరిశీలించిన వ్యాప్కోస్ ప్రతినిధులు తాము రూపొందించిన నివేదికలను మంగళవారం ప్రభుత్వానికి సమర్పించారు. దీంతో వారంలోగా పైప్‌లైన్ల ఏర్పాటుకు టెండర్లు పిలిచేందుకు పంచాయతీరాజ్‌శాఖ కసరత్తు చేస్తోంది. ఈ మేరకు అది రూపొందించిన నిబంధనలకు సీఎం కేసీఆర్ మంగళవారం ఆమోదం తెలిపారు. తొలి దశలోని నాలుగు జిల్లాల్లో రూ.15,633 కోట్లతో పైప్‌లైన్ల ఏర్పాటుకు వచ్చే బుధవారంలోగా టెండర్లు పిలవాలని నిర్ణయించింది. తర్వాత మరో 15 రోజుల్లోగా రెండో విడత పైప్‌లైన్ల ఏర్పాటుకు టెండర్ల ప్రక్రియ ప్రారంభించాలని భావిస్తోంది.

టెండ ర్లు పిలిచేందుకు వీలుగా వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టు పనులను 26 ప్యాకేజీలుగా విభజించింది. వాటి అంచనాలను ఖరారు చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. పైప్‌లైన్ ఏర్పాటులో కీలకమైన భూ సేకరణ ప్రక్రియను ‘రైట్ ఆఫ్ వే.. రైట్ ఆఫ్ యూజ్’ చట్టం ద్వారా పూర్తిచేయాలని భావిస్తోంది. మొత్తం 33 సెగ్మెంట్లలో సుమారు 1.25 లక్షల కిలోమీటర్ల మేర పైప్‌లైన్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇందుకవసరమైన సుమారు 6,000 ఎకరాల పైప్‌లైన్ల మార్గంలో 2,000 ఎకరాలను రైతుల నుంచి సేకరించాల్సి వస్తుందని అంచనా. పైప్‌లైన్ వెళ్తున్నందున పంట నష్టం పరిహారాన్నే అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాటర్‌గ్రిడ్‌కు భారీగా పైపులు అవసరమైనందున సరఫరా సంస్థలు రాష్ట్రంలో తమ యూనిట్లు పెట్టాలన్న నిబంధనను సడలించి దాన్ని కాంట్రాక్టర్ల ఇష్టానికే వదిలేసింది.

 రైట్ ఆఫ్ వే చట్టమంటే...
 గ్రామ పంచాయతీలు, పట్టణాలు, పరిశ్రమలకు మంచినీరు అందించే వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టుకు అవసరమైన భూమిని వినియోగించుకునే హక్కు కోసం ప్రభుత్వం రైట్ ఆఫ్ వే.. రైట్ ఆఫ్ యూజ్ చట్టాన్ని తెచ్చింది. దీని ప్రకారం పైప్‌లైన్లకు సేకరించిన భూమిలో చెట్లు నాటకూడదు, నిర్మాణాలు చేయకూడదు, బావులు, జలాశయాలు తవ ్వకూడదు. సాధారణ సాగుకు మాత్రం ఆంక్షలుండవు. పైప్‌లైన్లకు ఉద్దేశపూర్వకంగా నష్టం కలిగిస్తే జైలుశిక్ష విధిస్తారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement