Telangana drinking water scheme
-
తాగునీటి పథకం వేగవంతం
- మొదటి దశ బిడ్లు ఓపెన్ - మరోసారి పరిశీలించి 9 సెగ్మెంట్లలో కాంట్రాక్టు త్వరలో ఖరారు - రెండో దశ టెక్నికల్ బిడ్లు ఓపెన్ చేసిన అధికారులు - మూడో దశకు నేటి నుంచి టెండర్లు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మూడు దశల్లో చేపట్టనున్న తెలంగాణ తాగునీటి పథకానికి సంబంధించిన టెండర్ల ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. రూ.6,589 కోట్లతో చేపట్టనున్న మూడో దశ టెండర్లకు ఇటీవల టెండర్ నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం నేటి నుంచి ఈ-ప్రొక్యూర్మెంట్ ద్వారా ఆ పనుల కోసం టెండర్ల దాఖలుకు అవకాశం కల్పించింది. ఇక మొదటి దశ టెండర్ల ప్రక్రియలో కీలక ఘట ్టం బుధవారంతో ముగిసింది. 9 సెగ్మెంట్లలో చేపట్టే ఈ పనులకు సంబంధించిన ఫైనాన్షియల్ బిడ్లను తెరిచింది. దేశ వ్యాప్తంగా వివిధ కంపెనీలు ఈ-ప్రొక్యూర్మెంట్ వెబ్సైట్లో టెండర్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ టెండర్లలో అంచనా విలువల కంటే తక్కువ మొత్తానికి టెండర్లు దాఖలు చేసిన కంపెనీల ఫైనాన్షియల్ బిడ్లను ప్రాథమికంగా గుర్తించింది. వీటిపై మరోసారి పరిశీలన జరిపి, చర్చించి టెండర్లను త్వరలోనే ఖరారు చేయనుంది. అలాగే రెండో దశ టెండర్ల టెక్నికల్ బిడ్లను బుధవారం తెరిచింది. ఇందులో వివిధ కంపెనీల సాంకేతిక అర్హతలను పరిశీలించిన తరువాత ప్రాజెక్టు నియమ నిబంధనలకు అనుగుణంగా ఉన్న కంపెనీల ఫైనాన్షియల్ బిడ్లను త్వరలోనే తెరిచేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతోంది. -
తెలంగాణ-ప్రతిష్టాత్మక సామాజిక, సంక్షేమ పథకాలు
తెలంగాణ తాగునీటి సరఫరా ప్రాజెక్టు (Telangana Drinking Water Supply Project) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 42,000 కోట్లు. తొమ్మిది జిల్లాల్లో పథకం అమలు (హైదరాబాద్ మినహా). 25,139 గ్రామీణ ఆవాస ప్రాంతాలు, 67 పురపాలక సంస్థల్లో అమలు. 3.19 కోట్ల జనాభాకు రోజుకు ఒక్కో వ్యక్తికి 100 ఎల్పీసీడీల నీటిని అందిస్తారు. తెలంగాణ తాగునీటి ప్రాజెక్టుకు 67 టీఎంసీల నీరు అవసరం. ప్రాజెక్టు కాలవ్యవధి నాలుగేళ్లు. 1.25 లక్షల కిలోమీటర్ల పైపులైన్లు, 18 ఇన్‌టేక్ బావులు, 63 వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు, 17,407 స్టోరేజ్ ట్యాంకులు, 62 ఇంటర్మీడియట్ పంపింగ్ స్టేషన్లు నిర్మిస్తారు. ఈ ప్రాజెక్టుకు 187 మెగావాట్ల విద్యుత్ అవసరం అవుతుంది. స్మార్ట్ టెక్నాలజీతో నీటి వినియోగాన్ని పర్యవేక్షించడం ద్వారా వృథాను తగ్గిస్తారు. ప్రస్తుతం రాష్ట్రంలో అమమలవుతున్న తాగునీటి ప్రాజెక్టులు అన్నింటినీ తెలంగాణ తాగునీటి సరఫరా ప్రాజెక్టులో సమీకృతం చేస్తారు. తెలంగాణలో కృష్ణా, గోదావరి నదులు ప్రవహిస్తున్నాయి. నాగార్జునసాగర్, పాలేరు, వైరా, దుమ్ముగూడెం, శ్రీశైలం, శ్రీరాంసాగర్ ప్రాజెక్టు, సింగూరు, కడెం, కొమరం భీం వంటి ప్రాజెక్టుల్లో రాష్ట్ర త్రాగునీటి అవసరాలకు సరిపోయేట్లు సమృద్ధిగా నీటిని నిల్వ చేసుకోవచ్చు. ఈ మెగాప్రాజెక్టును 26 సెగ్మెంటులుగా విభజించారు. ఈ పథకం అమలుకు కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో పాటు ద్వైపాక్షిక, బహుళపాక్షిక ఏజెన్సీలు, ఆర్థిక సంస్థల నుంచి నిధులను సమీకరించటం జరుగుతుంది. తెలంగాణ హరితహారం రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో వృక్షాల విస్తీర్ణాన్ని 33 శాతానికి పెంచటమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. తెలంగాణ హరిత హారంలో భాగంగా రానున్న మూడేళ్లలో రాష్ర్ట వ్యాప్తంగా 230 కోట్ల మొక్కలు నాటాలని ప్రతిపాదించారు. ఇందులో 130 కోట్ల మొక్కలను నోటిఫైడ్ అటవీ ప్రాంతాలకు బయట నాటాలని నిర్ణయం. హెచ్ఎండీఏ పరిధిలో 10కోట్ల మొక్కలు నాటనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా బహుళ రహదారుల వెంట, నదులు, కాల్వలు చెరువు గట్టుల మీద, సంస్థల ప్రాంగణాలు, ఆధ్యాత్మిక ప్రదేశాలు, హౌసింగ్ కాలనీలు, కమ్యూనిటీ భూములలో పెద్ద ఎత్తున మొక్కలు పెంచడం ద్వారా సామాజిక అటవీ కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తారు. హరితహారం కార్యక్రమంలో అందర్నీ భాగస్వాములను చేస్తారు. ఇందుకు అనగుణంగా అవసరమైన విధి విధానాలు, చట్టాలు, పాలనా పరమైన అంశాల్లో మార్పులు చేస్తారు. అడవులను సంరక్షించటం, లైవ్ రూట్ స్టాక్‌ను ప్రోత్సహించటం ద్వారా నోటిఫైడ్ అడవుల లోపల 100 కోట్ల మొక్కలను నాటనున్నారు. ‘మన ఊరు-మన ప్రణాళిక’ కార్యక్రమం ద్వారా వచ్చే సూచనల ఆధారంగా తెలంగాణ హరితహారం కార్యక్రమంలో నర్సరీలు, మొక్కలు నాటే ప్రదేశాలను గుర్తిస్తారు. గుర్తించిన 3,888 నర్సరీల్లో 2015 సంవత్సరంలో 40 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో అటవీ, వ్యవసాయ, గిరిజన, ఉద్యానవన, సంక్షేమ శాఖలను కూడా అంతర్భాగం చేస్తారు. 2016లో మరో 40 కోట్ల మొక్కలను నాటేందుకు చర్యలు తీసుకుంటున్నారు. భూమి కొనుగోలు పథకం అత్యంత నిరుపేద ఎస్సీ కుటుంబాల్లోని మహిళలకు భూమి కొనుగోలు చేసి అందించేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది.ఈ పథకంలో భాగంగా ఎస్సీ లబ్దిదారు మహిళలకు మొదటి దశలో మూడు ఎకరాల భూమిని అందచేస్తారు.అర ఎకరం, ఎకరం, రెండు ఎకరాలు భూమి ఉన్న ప్రతి ఎస్సీ కుటుంబానికి మూడు ఎకరాలు ఉండే విధంగా రెండో దశలో మిగులు భూమిని పంపిణీ చేస్తారు.భూమి కొనుగోలు పథకంలో భాగంగా అందజేసిన భూమి అభివృద్ధికి ప్రభుత్వం తగిన ప్రోత్సాహాన్ని అందిస్తుంది. ఇందులో భాగంగా విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, సాగునీటి వనరులు, విద్యుత్ సౌకర్యం, పంపుసెట్లు మొదలయిన వాటిని కల్పించేందుకు ‘ సమగ్ర ప్యాకేజీ’ని రూపొందించారు.సాగువ్యయం, ఇతర ఖర్చుల మొత్తం వ్యయాన్ని నేరుగా లబ్దిదారుని ఖాతాలో జమచేస్తారు.భూమి కొనుగోలు పథకాన్ని లబ్దిదారుని నుంచి ఎలాంటి వాటా ధనం, బ్యాంక్ లింకేజీలతో సంబంధం లేకుండా 100 శాతం సబ్సిడీతో అమలుచేయడం జరుగుతుంది. ఈ పథకానికి అవసరమయిన భూమిని ఎకరం రెండు నుంచి ఏడు లక్షల వరకు కొనుగోలు చేసేందుకు కలెక్టర్లకు అధికారాలు ఇచ్చారు.2015, జనవరి 29 నాటికి 1,132 ఎకరాల ప్రైవేటు భూమి, 270 ఎకరాల ప్రభుత్వం భూమితో కలిపి మొత్తం 1,402 ఎకరాలను ఈ పథకం కింద మంజూరు చేశారు. సన్నబియ్యంతో మధ్యాహ్న భోజన పథకం విద్యార్థులకు మంచి విద్యతో పాటు నాణ్యమైన పౌస్టికాహారాన్ని అందించాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రారంభించారు.తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని హాస్టల్స్ విద్యార్థులకు, మధ్యాహ్న భోజన లబ్దిదారులకు ఈ పథకంలో భాగంగా సన్నబియ్యంతో భోజన వసతి కల్పిస్తారు.హాస్టల్స్‌లోని విద్యార్థులకు 6,663 మెట్రిక్ టన్నులు, మధ్యాహ్న భోజనానికి 5,837 మెట్రిక్ టన్నులు చొప్పున నెలకు 12,500 టన్నుల బియ్యం అవసరం అవుతాయి. ప్రస్తుత విద్యాసంవత్సరానికి సంబంధించి పాత బియ్యాన్ని కి.లో రూ.36 చొప్పున , కొత్త బియ్యంను (2014-15 పంట) రూ. 32.50 చొప్పున ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. ఈ పథకానికి సంబంధించిన సన్నబియ్యాన్ని బ్లాక్ మార్కెట్ లేదా రీసైక్లింక్ చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తారు. కల్యాణలక్ష్మీ పథకం (2014, అక్టోబరు 2) ఎస్సీ, ఎస్టీ అమ్మాయిలకు వివాహ సమయంలో ఆర్థిక సహాయం అందించేందుకు ప్రభుత్వం‘ కల్యాణలక్ష్మీ’ పథకాన్ని ప్రారంభించింది.తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.2 లక్షలు మించని ఎస్టీ, ఎస్టీ కుటుంబాలకు ఈ పథకం వర్తిస్తుంది.18 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ యువతులకు వివాహ సమయంలో రూ.51,000 ఆర్థిక సహాయం చేస్తారు. ఈ మొత్తాన్ని చెక్ రూపంలో పెళ్లి కుమార్తె అకౌంట్లో జమచేస్తారు. షాదీముబారక్ (2014, అక్టోబరు 2) మైనార్టీ కమ్యూనిటీ యువతుల వివాహ సందర్భంగా ఆయా కుటుంబాల ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు.తెలంగాణప్రభుత్వం ఈ పథకాన్ని 2014, అక్టోబరు 2న ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద వివాహానికి నెల రోజుల ముందు దరఖాస్తు చేసుకునే ప్రతి మైనార్టీ బాలికకు ఒకేసారి రూ.51,000 ఆర్థిక సహాయం అందజేస్తారు.ఈ మొత్తాన్ని పెండ్లికుమార్తె పేరిట అకౌంట్ పేయీ చెక్కు ద్వారా బ్యాంకు ఖాతాలో జమచేస్తారు. రాష్ట్రంలో వన్యప్రాణి, జీవవైవిధ్య సంరక్షణ తెలంగాణ రాష్ట్రంలో సుసంపన్నమైన మొక్కలు, పక్షి జాతులు, పర్యావరణ వ్యవస్థలు ఉన్నాయి. రాష్ట్రంలో 2939 జాతుల మొక్కలు, 365 పక్షి జాతులు, 103 క్షీరద జాతులు, 28 సరీసృప జాతులతో పాటు పెద్ద సంఖ్యలో అకశేరుక జాతులు ఉన్నాయి. జీవవైవిధ్యాన్ని సంరక్షించే లక్ష్యంతో ప్రభుత్వం 12 రక్షిత ప్రాంతాలను ప్రకటించింది. ఇందులో తొమ్మిది వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు, మూడు జాతీయ పార్కులు ఉన్నాయి. అంతరించిపోయే జాబితాలో ఉన్నవి-బురద మొసళ్లు. బురద మొసళ్లకు నిలయమైన సంరక్షణ కేంద్రాలు- మంజీరా వన్యప్రాణి సంరక్షణ కేంద్రం. శివరాం వన్యప్రాణి సంరక్షణ కేంద్రం. టెగర్ ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రంలో రెండు పులుల సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్: మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల మధ్య ఉన్న నల్లమల కొండ ప్రాంతంలోవిస్తరించి ఉంది. కవ్వాల్ టైగర్ రిజర్వ్: కవ్వాల్ పులుల సంరక్షణ కేంద్రం ఆదిలాబాద్ జిల్లాలో ఉంది. ఇది మహరాష్ట్రలోని తాడోబా అంధేరీ టైగర్ రిజర్వ్, చత్తీస్‌గఢ్‌లోని ఇంద్రావతి టైగర్ రిజర్వ్‌లకు కొనసాగింపుగా ఉంది. పులులు కవ్వాల్‌తో పాటు మిగిలిన రెండు సంరక్షణా కేంద్రాల మధ్య సంచరిస్తూ ఉంటాయి. బెల్లంపల్లి, మంచిర్యాల, కాగజ్‌నగర్ డివిజన్ల ద్వారా మూడు టైగర్ రిజర్వ్‌లను అనుసంధానం చేసి అంతరించిపోతున్న పులుల జాతులను సంరక్షించవచ్చు. తెలంగాణ బయో-డైవర్సిటీ బోర్డ్ తెలంగాణ రాష్ట్రంలో జీవవైవిధ్యాన్ని సంరక్షించడం, జీవ వనరులను అందరికీ న్యాయబద్దంగా పంపిణీ చేయటమే లక్ష్యంగా తెలంగాణ బయో డైవర్సిటీ బోర్డ్‌ను ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం మే 22 తేదీన అంతర్జాతీయ బయో డైవర్సిటీ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. బయో డైవర్సిటీ, దాని ప్రభావాల గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రతి జిల్లాకు ఒక బయో డైవర్సిటీ పార్కును ఏర్పాటు చేయాలని బయో డైవర్సిటీ బోర్డు ప్రతిపాదించింది. రాష్ట్రంలో పది జిల్లాల్లోని 66 మండలాలు, హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మొత్తం 170 బయో డైవర్సిటీ మేనేజ్మెంట్ కమిటీలను ఏర్పాటు చేశారు. -
వాటర్‌గ్రిడ్‌కు ఆదిలోనే ఆటంకం
* టెండర్ల ప్రక్రియలో ప్రతిష్టంభన * కొత్త ఎస్‌ఎస్‌ఆర్‌తో మళ్లీ అంచనాలు * మారనున్న తొలి టెండర్ షెడ్యూలు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ డ్రింకింగ్ వాట ర్ ప్రాజెక్ట్(వాటర్‌గ్రిడ్) తొలిదశ పనులకు ఆది లోనే ఆటంకం ఏర్పడింది. సుమారు రూ. 35 వేల కోట్ల విలువైన పనుల టెండర్ల ప్రక్రియలో ప్రతిష్టంభన నెలకొంది. 2015-16 సంవత్సరానికి నూతన షెడ్యూల్ స్టాండర్డ్ రేట్ల(ఎస్ఎస్ఆర్)ను ప్రభుత్వం విడుదల చేయడమే ఈ ప్రతిష్టంభనకు కారణమైంది. వాటర్‌గ్రిడ్ ప్రాజెక్ట్ పనుల నిమిత్తం గత నెల 23న గ్రామీణ నీటి సరఫరా అధికారులు నోటిఫికేషన్ జారీ చేసినప్పటికీ టెండరు(పనుల) వివరాలను జూలై 27న వెబ్సైట్లో అప్లోడ్ చేస్తామని పేర్కొన్నారు. ఇరిగేషన్ విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటైన బోర్డ్ ఆఫ్ చీఫ్ ఇంజనీర్స్ ఈ ఆర్థిక సంవత్సరానికి గత నెల 25న కొత్త ఎస్ఎస్ఆర్ రేట్లను విడుదల చేశారు. దీంతో వాటర్‌గ్రిడ్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అన్ని ప్యాకేజీల అంచనాలు మారనున్నాయి. ప్రాజెక్ట్ వ్యయం కూడా మరో 10 శాతం పెరిగే అవకాశం ఉందని ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఇంటేక్ వెల్స్‌తో కలిపి వాటర్‌గ్రిడ్ ప్రాజెక్ట్ వ్యయం రూ.40 వేల కోట్లు దాటనుంది. దీని నిర్మాణాన్ని మొత్తం 26 ప్యాకేజీలుగా విభజించిన అధికారులు తొలి విడతగా 11 ప్యాకేజీలకు టెం డర్లను పిలిచారు. ప్రాజెక్ట్ అంచనా వ్యయం రూ. 34,568 కోట్లు గా నిర్ధారించిన అధికారులు తొలుత రూ.15, 987 కోట్ల విలువైన పనులకు నోటిఫికేషన్ ఇచ్చారు. ఆగష్టు 11న టెక్నికల్ బిడ్లను, 14న ఫైనాన్షియల్ బిడ్లను తెరవనున్నట్లు ప్రకటిం చారు. ఈ నెల 14తో తొలివిడత టెండర్ ప్రక్రి య పూర్తి కావాల్సి ఉండగా, తాజా పరిణామాలతో గడువును పొడిగించే అవకాశం ఉంది. -
రెండు విడతలుగా వాటర్‌గ్రిడ్
రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం తొలుత కృష్ణా బేసిన్‌కు ప్రాధాన్యం 11 సెగ్మెంట్లకు వ్యాప్కోస్ లైన్ క్లియర్ వారంలోగా తొలి విడత టెండర్లు రూ.15,633 కోట్లతో 4 జిల్లాల్లో పైప్లైన్లు టెండర్ నిబంధనలకు సీఎం ఆమోదం హైదరాబాద్: ఇంటింటికీ రక్షిత మంచినీటిని అందించేందుకు ఉద్దేశించిన తెలంగాణ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ (వాటర్‌గ్రిడ్)ను రెండు దశల్లో చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలి విడతగా కృష్ణా బేసిన్ పరిధిలో ఉన్న మెదక్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లోని 11 సెగ్మెంట్లలో పైపులైన్ల నిర్మాణం చేపట్టనుంది. రెండో విడతలో గోదావరి బేసిన్ నుంచి నీటిని సరఫరా చేసే జిల్లాల్లో పనులు మొదలుపెట్టనుంది. రెండో విడత ప్యాకేజీలను 22 సెగ్మెంట్లుగా విభజించింది. తొలి దశకు సంబంధించిన ప్రాజెక్టు అంచనాలను వ్యాప్కోస్ (వాటర్ అండ్ పవర్ కన్సల్టెన్సీ సర్వీసెస్) పూర్తి చేసింది. సెగ్మెంట్లవారీగా ప్రాజెక్టు అంచనాలను పరిశీలించిన వ్యాప్కోస్ ప్రతినిధులు తాము రూపొందించిన నివేదికలను మంగళవారం ప్రభుత్వానికి సమర్పించారు. దీంతో వారంలోగా పైప్లైన్ల ఏర్పాటుకు టెండర్లు పిలిచేందుకు పంచాయతీరాజ్‌శాఖ కసరత్తు చేస్తోంది. ఈ మేరకు అది రూపొందించిన నిబంధనలకు సీఎం కేసీఆర్ మంగళవారం ఆమోదం తెలిపారు. తొలి దశలోని నాలుగు జిల్లాల్లో రూ.15,633 కోట్లతో పైప్లైన్ల ఏర్పాటుకు వచ్చే బుధవారంలోగా టెండర్లు పిలవాలని నిర్ణయించింది. తర్వాత మరో 15 రోజుల్లోగా రెండో విడత పైప్లైన్ల ఏర్పాటుకు టెండర్ల ప్రక్రియ ప్రారంభించాలని భావిస్తోంది. టెండ ర్లు పిలిచేందుకు వీలుగా వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టు పనులను 26 ప్యాకేజీలుగా విభజించింది. వాటి అంచనాలను ఖరారు చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. పైప్‌లైన్ ఏర్పాటులో కీలకమైన భూ సేకరణ ప్రక్రియను ‘రైట్ ఆఫ్ వే.. రైట్ ఆఫ్ యూజ్’ చట్టం ద్వారా పూర్తిచేయాలని భావిస్తోంది. మొత్తం 33 సెగ్మెంట్లలో సుమారు 1.25 లక్షల కిలోమీటర్ల మేర పైప్లైన్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇందుకవసరమైన సుమారు 6,000 ఎకరాల పైప్లైన్ల మార్గంలో 2,000 ఎకరాలను రైతుల నుంచి సేకరించాల్సి వస్తుందని అంచనా. పైప్‌లైన్ వెళ్తున్నందున పంట నష్టం పరిహారాన్నే అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాటర్‌గ్రిడ్‌కు భారీగా పైపులు అవసరమైనందున సరఫరా సంస్థలు రాష్ట్రంలో తమ యూనిట్లు పెట్టాలన్న నిబంధనను సడలించి దాన్ని కాంట్రాక్టర్ల ఇష్టానికే వదిలేసింది. రైట్ ఆఫ్ వే చట్టమంటే... గ్రామ పంచాయతీలు, పట్టణాలు, పరిశ్రమలకు మంచినీరు అందించే వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టుకు అవసరమైన భూమిని వినియోగించుకునే హక్కు కోసం ప్రభుత్వం రైట్ ఆఫ్ వే.. రైట్ ఆఫ్ యూజ్ చట్టాన్ని తెచ్చింది. దీని ప్రకారం పైప్లైన్లకు సేకరించిన భూమిలో చెట్లు నాటకూడదు, నిర్మాణాలు చేయకూడదు, బావులు, జలాశయాలు తవ ్వకూడదు. సాధారణ సాగుకు మాత్రం ఆంక్షలుండవు. పైప్లైన్లకు ఉద్దేశపూర్వకంగా నష్టం కలిగిస్తే జైలుశిక్ష విధిస్తారు. -
నెలాఖరులోగా పైప్‌లైన్ టెండర్లు
సేఫ్ స్టేజ్‌కి ఇన్‌టేక్‌వెల్స్ నిర్మాణం ఐదు డీపీఆర్‌లకు వ్యాప్కోస్ పచ్చజెండా ప్రాజెక్టు పనుల పురోగతిపై మంత్రి కేటీఆర్ సమీక్ష సాక్షి, హైదరాబాద్: తెలంగాణ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ (వాటర్‌గ్రిడ్)కు సంబంధించి ప్రధాన పైప్‌లైన్ ఏర్పాటుకు నెలాఖరులోగా టెండర్లు పిలవాలని గ్రామీణ నీటిసరఫరా విభాగం నిర్ణయించింది. ప్రాజెక్ట్‌కు సంబంధించి సెగ్మెంట్ల వారీగా అధికారులు రూపొందించిన సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక (డీపీఆర్)లకు వ్యాప్కోస్ నుంచి ఆమోదం లభించిన వెంటనే టెండర్లు పిలిచేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. వాటర్‌గ్రిడ్ ప్రాజెక్ట్ పనుల పురోగతిపై మంగళవారం జరిగిన సమీక్షలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.తారక రామారావు పైప్‌లైన్ టెండర్ల అంశంపై అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. ఆర్డబ్ల్యూఎస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. వివిధ ప్రాంతాల్లో చేపట్టిన ఇన్‌టేక్‌వెల్స్ అన్నీ దాదాపుగా సేఫ్స్టేజ్కి వచ్చాయని, దీంతో వాటర్‌గ్రిడ్ పనులను సకాలంలో పూర్తి చేయగలమన్న నమ్మకం ఏర్పడిందన్నారు. ప్రాజెక్ట్ పనులు పూర్తి అయిన వెంటనే ఆయా ప్రాంతాల్లో రక్షిత మంచినీటి సరఫరా జరిగేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించారు. తొలిదశలోనే ఫ్లోరైడ్ బాధిత ప్రాంతమైన నల్లగొండ, కరువు ప్రాంతమైన మహబూబ్‌నగర్ జిల్లాలకు నీళ్లిస్తామని చెప్పారు. గ్రామాల్లో అంతర్గత పైపులైన్ నెట్వర్క్, నీటి ట్యాంకుల నిర్మాణం కోసం ప్రత్యేకంగా సర్వే చేయించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఐదు డీపీఆర్‌లకు పచ్చజెండా.. సెగ్మెంట్ల వారీగా రూపొందించిన డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు (డీపీఆర్)లను వ్యాప్కోస్ పరిశీలన చేస్తోందని, మొత్తం 26 డీపీఆర్‌లలో ఇప్పటికే ఐదింటికి ఆమోదం తెలిపిందన్నారు. వారం రోజుల్లోగా డీపీఆర్‌ల పరిశీలన పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అలాగే.. వాటర్‌గ్రిడ్ ప్రాజెక్ట్ పర్యవేక్షణ నిమిత్తం ఔట్ సోర్సింగ్ పద్ధతిన వర్క్ ఇన్ స్పెక్టర్లు, సీనియర్ అసిస్టెంట్ల నియామకాన్ని వెంటనే చేపట్టాలని కోరారు. వాటర్‌గ్రిడ్ పైప్‌లైన్‌తో పాటు ఫైబర్ ఆప్టిక్ కేబుల్ ఏర్పాటుపై ఐటీశాఖ అధికారులతో త్వరలో సమావేశమవుతున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. సమావేశంలో పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి రేమండ్ పీటర్, ఆర్డబ్ల్యూఎస్ ఈఎన్సీ సురేందర్‌రెడ్డి, సలహాదారు జ్ఞానేశ్వర్ తదితరులున్నారు. ఇదిలా ఉంటే.. పంచాయతీరాజ్ విభాగంలో తెలంగాణకు చెందిన సిబ్బందిని ఆంధ్రప్రదేశ్ కు కేటాయించడంపై ఆగ్రహంతో ఉన్న విషయాన్ని ఉద్యోగులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఉన్నతాధికారులతో చర్చించి తగిన న్యాయం చేస్తామని కేటీఆర్ హామీ ఇవ్వడంతో పరిస్థితి సద్దుమణిగింది. -
గ్రిడ్ అధికారులు వచ్చేశారు..!
నల్లగొండ : తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లయ్ (వాటర్ గ్రిడ్) ప్రత్యేక విభాగాన్ని పర్యవేక్షించేందుకు ప్రభుత్వం నియమించిన అధికారులు విధుల్లో చేరారు. ఇంజినీరింగ్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ) కార్యాలయంలో పనిచేస్తున్న పలువురు అధికారులకు ఉద్యోగోన్నతి కల్పించి జిల్లాకు నియమించారు. గ్రిడ్ పనులు పర్యవేక్షించే సూపరింటెండెంట్ ఇంజినీర్ (ఎస్ఈ) స్థానానికి విజయ్‌పాల్‌రెడ్డిని నియమించారు. చౌటుప్పల్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ స్థానానికి సంపత్‌రెడ్డి, సూర్యాపేట ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ స్థానానికి జె.మధుబాబు నియమితులయ్యారు. ఈఎ న్సీ కార్యాలయంలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న ఈ ముగ్గురికి ఉద్యోగోన్నతి కల్పించి జిల్లా కు నియమించారు. జిల్లాలో రెండు సోర్సుల నుంచి కృష్ణా జలాలు సరఫరా చేయనున్నారు. దీంట్లో దామరచర్ల మండలం చిట్యాల వద్ద ఉన్న టెయిల్పాం డ్ ప్రాజెక్టుకు సూర్యాపేట ఈఈ, అక్కం పల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ప్రాజెక్టుకు చౌటుప్పుల్ ఈఈ నేతృత్వం వహిస్తారు. డీఈలు.. ఆరు సబ్ డివిజన్లకు అవసరమయ్యే డీఈలను కూడా ఆర్డబ్ల్యూఎస్ నుంచే తీసుకోనున్నారు. వీరితోపాటు వివిధ మండలాలకు అవసరమయ్యే 17 మంది జేఈలను మాతృత సంస్థ నుంచే సర్దుబాటు చేయనున్నారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగ నియామకాల ప్రక్రియ ఈఎన్సీ కార్యాలయం నుంచే జరుగుతోంది. రాజకీయ పలుకుబడి ఉన్న ఓ ఏజెన్సీకి నియామక బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. ఎస్టిమేట్ల స్క్రూటినీ... రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలకు కలిపి ఒక్కరే ఎస్ఈ. హైదరాబాద్‌లో సర్కిల్ కార్యాలయం ఉంటుంది. అక్కడి నుంచే ప్రాజెక్టు పనులు పర్యవేక్షిస్తారు. ఇక చౌటుప్పుల్, సూర్యాపేటలో త్వరలో ఈఈ కార్యాలయాలు ఏర్పాటు కానున్నాయి. ఈ రెండు చోట్ల కార్యాలయాల కోసం అధికారులు అన్వేషిస్తున్నారు. ప్రస్తుతానికి హైదరాబాద్ ఈఎన్సీ కార్యాలయం నుంచే విధులు నిర్వర్తిస్తున్నారు. టెయిల్‌పాండ్, ఏకేబీఆర్లకు సంబంధించిన ఎస్టిమేట్ల స్క్రూటీని చేస్తున్నారు. టెయిల్‌పాండ్ నుంచి తీసుకునే కృష్ణా జలాలకు రూ.1485 కోట్లు, ఏకేబీఆ ర్కు రూ.రెండు వేల కోట్లతో ప్రతిపాదనలు రూపొందించారు. -
పైలాన్ చేరని వాటర్‌గ్రిడ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన వాటర్‌గ్రిడ్ పథకం ఒకడుగు ముందుకు.. మూడడుగులు వెనక్కి అన్నట్లు సాగుతోంది. ప్రణాళికా లోపం, నిధుల కొరతతో ఇంటింటికీ రక్షిత మంచినీటిని అందించే పథకం ఆరంభానికి ముందే ఎదురీదుతోంది. టెండర్లకు ముందే ఆరోపణలు.. పునాది రాయి అయినా వేయక ముందే విపక్షాలు చేస్తున్న విమర్శలు వాటర్‌గ్రిడ్‌ను ముసురుకున్నాయి. తొమ్మిది జిల్లాల్లో 25 వేల ఆవాసప్రాంతాలకు, 69 పట్టణాలకు నల్లాల ద్వారా ఇంటింటికీ రక్షిత మంచినీటిని అందించడం ఈ ప్రాజెక్టు ద్వారా తలపెట్టిన బృహత్తర లక్ష్యం. కానీ ఈ ప్రాజెక్టు పనులన్నీ నత్త కంటే మెల్లగా సాగుతున్నాయి. పైపులైన్ల టెండర్లకు ఒత్తిళ్లు: వాటర్ గ్రిడ్‌కు రూ.35 వేల కోట్లకుపైగా ఖర్చు అవుతుంది. ఇందులో కీలకమైన పైపుల తయారీ.. కొనుగోలు.. లైనింగ్ ప్రక్రియపై బడా కంపెనీలన్నీ కన్నేశాయి. తెలంగాణ, ఏపీ కంపెనీలతో పాటు జిందాల్, కొరియన్ వాటర్ కంపెనీ ఇప్పటికే తమవంతు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఐసీఐసీఐ, ఎల్ఐసీతో కన్సార్టియంగా ఏర్పడి పెట్టుబడులు పెట్టడంతో పాటు.. ఈ పైపులైన్ కాంట్రాక్టును దక్కించుకునేందుకు జిందాల్ పావులు కదుపుతోంది. కొరియన్ వాటర్ కంపెనీ సైతం రూ.10 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేం దుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. బడా కంపెనీలన్నీ రాష్ట్ర సర్కారుపై రాజ కీయ ఒత్తిళ్లు తీసుకొస్తున్న ప్రచారం జోరందుకుం ది. అయితే పైపులకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ ఇప్పటికీ మొదలు కాలేదు. ఈలోగా కొన్ని కంపెనీలు తమకు అనుకూలంగా టెండర్ల నిబంధనలుండేలా పైరవీలు చేస్తుండటంతో సర్కారు తల పట్టుకుంది. నిధు ల సమీకరణకు వీలు గా రాష్ట్ర సర్కారు జనవరిలోనే తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లై కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. కానీ.. కార్పొరేషన్‌కు సంబంధిం చిన పాలకవర్గం నియామకాలు కాలేదు. నల్లగొండ జిల్లా చౌటుప్పల్‌లో నిర్మిస్తున్న పైలాన్ తుదిదశలో ఉంది. ఇప్పటికీ కార్యక్రమానికి పునాది రాయి పడలేదు. ఈలోగానే విపక్షాలు సర్కారుపై విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇంటేక్ వెల్స్కు సంబంధించిన ప్యాకేజీల కుదింపు, టెండర్లవ్యవధి తగ్గింపు.. టెండరు మార్గదర్శకాలను కొన్ని కంపెనీలకు అనుకూలంగా మార్చినట్లు విమర్శలు సర్కారును చుట్టుముట్టాయి. దీంతో పనుల వేగానికి కళ్లెం వేసినట్లు స్పష్టమవుతోంది. సర్వేకే ఆరు నెలలు వాటర్‌గ్రిడ్ తొలిదశ లైన్ సర్వే ఇటీవలే పూర్తయింది. నెల రోజుల్లో పూర్తవుతుందనుకున్న సర్వే కు ఆరు నెలలు పట్టింది. లైన్సర్వేకు లైటింగ్ డిటెక్షన్ రేంజింగ్(లైడార్) వంటి ఆధునిక సాంకేతికత పరిజ్ఞానాన్ని విని యోగిస్తామని చెప్పిన ప్రభుత్వం అది ఖరీదైన ప్రక్రియ కావటంతో వెనకడుగు వేసింది. -
ముచ్చటగా..మూడోసారీ!
నల్లగొండ : జిల్లాలో నిర్మించతలపెట్టిన తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లయ్ (టీడీడబ్ల్యూపీ) ప్రాజెక్టు నిర్మాణం అతీగతీ లేకుండా పోతోంది. ప్రభుత్వం తీసుకుంటున్న తొందరపాటు చర్యల వల్ల ప్రాజెక్టు ప్రతిపాదనలు ఓ కొలిక్కి రావడం లేదు. ఇప్పటికే ప్రాజెక్టు డిజైన్ రెండు సార్లు మార్చిన ప్రభుత్వం తాజాగా మూడోసారి డిజైన్ మార్చాలని నిర్ణయించింది. రాష్ట్ర మంత్రులు జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు వాటర్ గ్రిడ్ గురించి ఒక్కోరకంగా ప్రకటనలు చేయడం ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలో మార్పులు చేయడం పరిపాటిగా మారింది. వాటర్ గ్రిడ్ పనులు త్వరితగతిన ప్రారంభించాలని చౌటుప్పల్ వద్ద రూ.1.90 కోట్లతో చేపడుతున్న గ్రిడ్ పైలాన్ పనులు కూడా చివరి దశకు చేరుకున్నాయి. పైప్‌లైన్ సర్వే పనులు కూడా జరుగుతున్నాయి. వీటికోసం ప్రభుత్వం రూ. 2కోట్లు విడుదల చేసింది. పనులు ప్రారంభించేందుకు టెండర్లకు సిద్ధమవుతున్న తరుణంలో ముచ్చటగా మూడోసారీ ప్రతిపాదనలు మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. అది కూడా జిల్లా ప్రజలు, ప్రజాప్రతినిధులు మొదటి నుంచి తీ వ్రంగా వ్యతిరేకిస్తున్న పాత ప్రతిపాదనలకే ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. దీంతో అసలు జిల్లాలో వాటర్‌గ్రిడ్ ఎప్పటికి ప్రారంభమవుతుందో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. అంచనా వ్యయం పెరిగినందుకే... తొలుత ప్రతిపాదించిన దాని కంటే రెండోసారి రూపొందించిన ప్రతిపాదనల అంచనా వ్యయం రెట్టింపు స్థాయిలో ఉంది. అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, సాగర్ ఎడమ కాల్వల, ఉదయసముద్రం, పాలేరు రిజర్వాయర్లను కేంద్రంగా చేసుకుని జిల్లాలో నాలుగుచోట్ల గ్రిడ్లు నిర్మిచేందుకు తొలుత ప్రతిపాదించారు. దీనికి గాను అంచనా వ్యయం రూ.3,082 కోట్లు. అయితే ఏకేబీఆర్ నుంచి గ్రిడ్ నిర్మాణం చేపట్టాలనే ప్రతిపాదనను జిల్లా ప్రజలు, విపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. దీంతో పునరాలోచనలో పడిన ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకుంది. శ్రీశైలం బ్యాక్ వాటర్నుంచి పైప్‌లైన్ ద్వారా జిల్లాకు కృష్ణా జలాలు సరఫరా చేయాలని ప్రతిపాదించారు. శ్రీశైలం నుంచి డిండి వరకు 50 కి.మీ మేర పైప్‌లైను నిర్మించి కృష్ణాజలాలు తీసుకురావాలనుకున్నారు. డిండి నుంచి మన జిల్లాలోకి పైప్‌లైన్ తీసుకొచ్చి చింతపల్లి మండలం గొడకొండ్ల వద్ద ప్రతిపాదించిన ట్రీట్మెంట్ ప్లాంట్‌లోకి నీరు పంపింగ్ చేయాలని నిర్ణయించారు. ఈ పైప్‌లైన్ ద్వారా భువనగిరి, సూర్యాపేట మండలం ఉండ్రుకొండ, మనగాల మండలం బరాఖత్‌గూడెం వద్ద ప్రతిపాదించిన వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు నీటిని తరలించాలని ప్రతిపాదనలు సిద్దం చేశారు. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.5,800 కోట్లు. పాత ప్రాజెక్టుతో పోలిస్తే రూ.2718 కోట్లు అంచనా వ్యయం ఎక్కువ. దాదాపు రెట్టింపు స్థాయిలో ప్రాజెక్టు అంచనా వ్యయం ఎక్కువగా ఉండటంతోపాటు, పైప్‌లైన్ కంపెనీలకు లబ్ధిచేకూర్చేందుకే ప్రభుత్వం శ్రీశైలం బ్యాక్ వాటర్ ప్రతిపాదన తెర మీదకు తీసుకొచ్చిందని ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోశాయి. దీంతో ప్రభుత్వానికి మరో గత్యంతరం లేక ఏకేబీఆర్ నుంచే గ్రిడ్ పనులు చేపట్టాలనే పాత ప్రతిపాదనలకే మొగ్గు చూపింది. ఏకేబీఆర్ నుంచి సాధ్యమయ్యేనా...! ఏకేబీఆర్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 1.5 టీఎంసీలు, పుట్టంగండి నీటి సామర్థ్యం 0.4 టీఎ ంసీలు. నాగార్జునసాగర్‌లో పూర్తిస్థాయి నీటి నిల్వలు ఉన్నప్పుడు మాత్రమే ఏకేబీఆర్‌లో రిజర్వాయర్‌లో నీరు పుష్కలంగా ఉంటుంది. ఈ మొత్తం నీటినిల్వలను కేవలం సాగునీటి అవసరాలకు కాకుండా కే వలం తాగునీటి అవసరాలకు మాత్రమే వాడుకుంటే 4 5 రోజుల సరిపోతాయి. అదీగాక హైదరాబాద్ జంటనగరాలకు తాగునీటి అవసరాలకు ఏడాదికి 11 టీఎంసీలు సరఫరా చే స్తున్నారు. ఇక ఏకేబీఆర్ నుంచి ఉదయసముద్రానికి నీటిని తరలించే క్రమంలో తాగునీటితోపాటు, సాగునీటి అవసరాలకు చెరువులు కూడా నింపుతున్నారు. సాగర్‌లో నీటి నిల్వలు సమృద్ధిగా ఉన్నప్పుడు మాత్రమే ఇదంతా సాధ్యమవుతోంది. అయితే ప్రస్తుతం ప్రభుత్వం జిల్లాలో నిర్మించాలనుకుంటున్న నాలుగు గ్రిడ్లల్లో మూడు గ్రిడ్లు ఏకేబీఆర్ నీటి నిల్వల ఆధారంగా చేసుకునే నిర్మించాల్సి ఉంది. ఈ మూడు గ్రిడ్లకు 3.24 టీఎంసీలు నీరు అవసరమవుతాయని అధికారులు ప్రతిపాదించారు. ఐకేబీ ఆర్ నుంచి ప్రస్తుత అవసరాలకు నీరు సరఫరా చేయడం కష్టసాధ్యమవుతోందని..అలాంటి పరిస్థితుల్లో మూడు గ్రిడ్లకు ఏకేబీఆర్ నుంచి నీటిని తరలించాల్సిన పరిస్థితే వస్తే ఏమ్మార్పీ పరిధిలో ఆయకట్టు ఎడారిగా మారే ప్రమాదం ఉందని ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి. తొలుత ఏకేబీఆర్ ప్రతిపాదనను విరమించుకున్న ప్రభుత్వం మళ్లీ దానినే తెరమీదకు తీసుకురావడం పట్ల విమర్శలు వెల్లువెత్తే అవకాశం లేకపోలేదు. -
‘తెలంగాణ తాగునీటి పథకం’గా వాటర్‌గ్రిడ్
పేరును ఖరారు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టుకు ‘తెలంగాణ తాగు నీటి పథకం’ పేరును ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఖరారు చేశారు. వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టు పనుల పురోగతిపై సంబంధిత శాఖల మంత్రులు, ఉన్నతాధికారులతో మంగళవారం ఆయన సమీక్షించారు. సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ఈ పథకం అమలుకు సంబంధించి ఇప్పటికే ‘తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లయ్ కార్పొరేషన్’ ను ఏర్పాటు చేశామన్నారు. ప్రజలకు అత్యంత అవసరమైన సురక్షిత తాగునీటి పథకాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని, ప్రాజెక్టు పనుల పురోగతిని ప్రతీ వారం క్షేత్రస్థాయిలో సమీక్షించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టును మూడు దశాబ్దాల వరకు మంచినీటిని సరఫరా చేసే వ్యవస్థగా తీర్చిదిద్దాలని, ఇది అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవాలని సీఎం సూచించారు. పదిళ్లున్నా నీటి సరఫరా: ప్రధాన గ్రామాలతో పాటు గిరిజన తండాలు, ఆదివాసీ గూడేలు, గంగిరెద్దుల, ఎరుకల గుడిసెలు.. ఇలా పదిళ్లున్న ఆవాసాలకు సైతం మంచినీటి ని అందించాలని కేసీఆర్ ఆదేశించారు. ప్రతీ ఇంటికి మంచినీటి పైప్‌లైన్ వేసే బాధ్యతలను గ్రామీణ నీటి సరఫరా (ఆర్డబ్ల్యూఎస్) అధికారులే చేపట్టాలని, పైపుల నాణ్యత విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన సంస్థల నుంచే వాటిని కొనుగోలు చేయాలని, ఆయా కంపెనీల గత చరిత్రను కూడా పరిగణనలోకి తీసుకోవాలన్నారు. పైపులు వేయడంతో పాటు వాటి నిర్వహణను కూడా పదేళ్లపాటు ఆయా కంపెనీలే చూసుకునేలా బాధ్యతలను అప్పగించాలన్నారు. ప్రతీ దశలోనూ హైడ్రాలిక్ పరీక్షలు నిర్వహించాలని చెప్పారు. ఇంటేక్వెల్ ్స నిర్మాణ ం, ప్రాజెక్టుల నుంచి నీటి కేటాయింపుల విషయంలో సహకారాన్ని నీటి పారుదల శాఖ అధికారులు అందించాలని సీఎం ఆదేశించారు. అటవీ భూములను అభివృద్ధి పనులకు వినియోగించుకునే విషయంలో దేశవ్యాప్తంగా కొత్త విధానం రానుందని, అటవీశాఖ నుంచి లక్ష ఎకరాలు సేకరించి నష్టపరిహారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రైట్ ఆఫ్ వే కోసం ఆర్డినెన్స్: తెలంగాణ తాగునీటి పథకం ద్వారానే పట్టణ ప్రాంతాలకూ సురక్షితమైన తాగునీరు అందించాలని సీఎం కేసీఆర్ అధికారులకు సూచించారు. పట్టణాల్లోని వివిధ వాడలకు నీటిని తరలిం చేందుకు పైపులైన్లను ఆయా మున్సిపాల్టీలే నిర్మించుకోవాలన్నారు.సక్రమ నీటి సరఫరాకు పట్టణాల సమీపంలోని గుట్టలను విని యోగించుకోవాలన్నారు. పట్టణాల్లోని కాంటూర్ లెవల్స్‌ను కూడా తీసుకొని పైపులైన్ల నిర్మాణం చేపట్టాలని సీఎం సూచించారు. పైపులైన్ నిర్మాణానికి ‘రైట్ ఆఫ్ వే.. రైట్ ఆఫ్ యూజ్’ ఆర్డినెన్స్‌ను తేవాలని సీఎం నిర్ణయించారు. 620 ఇంజనీర్ పోస్టులకు ఓకే వాటర్‌గ్రిడ్‌లో 620 ఇంజనీర్ పోస్టులకు సీఎం పచ్చజెండా ఊపారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారానే వీటి భర్తీ చేపట్టాలని ఆదేశించారు. గోదావరి న ది నుంచి మంచినీటిని తరలించే క్రమంలో 3 చోట్ల రైల్వే ట్రాక్‌ను దాటాల్సి వస్తోందని అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. వెంటనే ఆయన దక్షిణమధ్యరైల్వే జనరల్ మేనేజర్ శ్రీవాత్సవతో మాట్లాడగా, ఆయన సానుకూలంగా స్పందించారు. సమావేశంలో మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, ప్రభుత్వ సలహాదారు పాపారావు, పార్లమెంటరీ కార్యదర్శి జలగం వెంకట్రావు, వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు రేమండ్ పీటర్, ఎస్కే జోషీ, గోపాల్, జనార్దన్‌రెడ్డి, మిశ్రా, ఇంజనీర్ ఇన్ చీఫ్‌లు సురేందర్‌రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, మురళీధర్, మెట్రోవాటర్ వర్క్స్ ఎండీ జగదీశ్వర్ తదితరులున్నారు. -
మాట తప్పం!
* త్వరలోనే రుణ మాఫీ అమలు చేస్తామన్న సీఎం కేసీఆర్ * 39 లక్షల మంది రైతులకు19 వేల కోట్ల రూపాయల లబ్ధి * దళిత కుటుంబాలకు ఆగస్టు 15న భూ పంపిణీ * ఫైలుపై సంతకం కూడా చేశా * తాగునీటి గ్రిడ్ కోసం ఏర్పాట్లు * నాలుగేళ్ల తర్వాత రాష్ర్టంలో నల్లాలేని ఇల్లుండదు * మూడున్నర లక్షలైనా డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మిస్తాం * 19న సెలవు, ఆ రోజున సర్వేలో లేకుంటే జనాభా లెక్కల్లో లేనట్లే * నిజామాబాద్ జిల్లా పర్యటనలో ముఖ్యమంత్రి వెల్లడి * అంకాపూర్ గ్రామానికి వరాలు, ఆసియా ఖండానికే ఆదర్శం కావాలని పిలుపు సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఇచ్చిన మాట ప్రకారం త్వరలోనే రైతులకు రుణ మాఫీ అమలు చేస్తామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. దీనిపై ఇప్పటికే ఆర్బీఐకి తీర్మానం చేసి పంపించామని, 39 లక్షల మందికి రూ. 19 వేల కోట్ల మేర రుణాలు మాఫీ అవుతాయని పేర్కొన్నారు. త్వరలోనే బ్యాంకుల్లో డబ్బులు జమవుతాయని అన్నదాతలకు కే సీఆర్ భరోసా ఇచ్చారు. సీఎంగా అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత గురువారం ఆయన తొలిసారిగా నిజామాబాద్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా రుణ మాఫీతో పాటు దళితులకు భూ పంపిణీ, పేదలకు ఇళ్ల నిర్మాణంపై స్పష్టతనిచ్చారు. ఆర్మూరులో రూ. 114.11 కోట్లతో నిర్మించ తలపెట్టిన రక్షిత మంచినీటి పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్మూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడారు. ‘‘ఎన్నికల్లో ప్రకటించిన విధంగా పేద దళితులకు భూ పంపిణీ పథకాన్ని ఆగస్టు 15న ప్రారంభించేందుకు అంతా సిద్ధం చేశాం. మొదటి విడతలో అవకాశమున్న ప్రతిచోటా అర్హులైన దళితులకు పట్టాలు అందజేస్తాం. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను గురువారం ఉదయమే జిల్లా కలెక్టర్లకు అందించాం. భూ పంపిణీ ఫైలుపై కూడా సంతకం చేశాను’’ అని సీఎం వెల్లడించారు. భూమి లేని దళితులకు మూడెకరాలు, రెండు ఎకరాలు ఉన్నవారికి ఒక ఎకరం, ఎకరం భూమి ఉన్న వారికి రెండెకరాలు అందజేస్తామని వివరించారు. భూమితో పాటు విద్యుత్ సరఫరా, మోటార్, ఒక ఏడాది పంట పెట్టుబడిని కూడా ప్రభుత్వమే అందిస్తుందని కూడా చెప్పారు. ఈ సందర్భంగా తమ ప్రభుత్వం చేపడుతున్న పలు ప్రభుత్వ పథకాలను గుర్తు చేస్తూ.. పలు వర్గాలకు సంక్షేమ వరాలు కురిపిస్తూ కేసీఆర్ ప్రసంగం సాగింది. నాలుగేళ్లలో ఇంటింటికీ నల్లా రాష్ట్రంలో నాలుగేళ్ల తర్వాత నల్లా లేని ఇల్లే ఉండదు. శాశ్వతంగా నీటి కొరతను తీర్చేందుకు ‘తెలంగాణ డ్రింకింగ్ వాటర్ గ్రిడ్’కు రూపకల్పన చేశాం. కరీంనగర్ పర్యటన సందర్భంగా ప్రకటించిన ఈ పథకాన్ని అమలు చేసేందుకు రెండు రోజుల్లోనే అంతా సిద్ధం చేశాం. ఇప్పటికే ఆయా జిల్లాల్లో ఉన్న రక్షిత మంచినీటి పథకాలను ఈ గ్రిడ్‌కే అనుసంధానం చేసి రాష్ట్ర ప్రజలందరికీ పెపులైన్ల ద్వారా తాగునీటిని అందిస్తాం. ఇంటిం టికీ నల్లా కనెక్షన్ ఇస్తాం. ఆదివాసీ, దళిత, గిరిజన యువతుల వివాహాలకు ‘కల్యాణలక్ష్మి’ పథకం కింద రూ. 50 వేల సాయం అందిస్తాం. 19న సర్వేకు సహకరించండి గత ప్రభుత్వాల హయాంలో ఎన్నో అక్రమాలు, అవినీతులు జరిగాయి. ఆ ప్రభుత్వాలను ఇప్పుడు విమర్శించదలచుకోలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ప్రస్తుత తరుణంలో సమగ్ర సర్వే అవసరమైంది. ఈ నెల 19న దీన్ని చేపట్టనున్నాం. దీనికి ప్రతి ఒక్కరూ సహకరించాలి. ఆ రోజు బస్సులు, ప్రైవేట్ వాహనాలు కూడా నడవవు. ఆ రోజు సెలవు దినం. ప్రతి ఒక్కరు ఇళ్లలోనే ఉండాలి. ఎలాంటి కార్యక్రమాలు ఉన్నా రద్దు చేసుకోవాలి. పెళ్లిళ్లు ఉన్నా రద్దు చేసుకోవాలని కోరుతున్నా. ఈ సమగ్ర సర్వే ఎంతో ముఖ్యమైనది. ఆ లెక్కల్లోకి ఎక్కకపోతే జనాభా లెక్కల్లో కూడా లేనట్లే. అధికారులకు ప్రతి ఒక్కరు సహకరించాలి. స్కూల్ పిల్లలను రోడ్డెక్కించకండి మంత్రులు, ముఖ్యమంత్రుల సభల కోసం విద్యార్థులను రోడ్లెక్కిస్తే ఇకపై చర్యలు తీసుకుంటాం. ఆర్మూరు పర్యటనలో పిల్లలను సభకు తరలించడం చాలా బాధకు గురి చేసింది. స్కూల్ పిల్లలను ఎండలో నిలబెట్టడం అధికారులు, ప్రజాప్రతినిధులకు మంచిది కాదు. సభలు, కార్యక్రమాలకు వారిని రోడ్ల మీదకు తీసుకురావద్దు. రాష్ట్రవ్యాప్తంగా ఇది వర్తిస్తుంది. ఇలాంటి చర్యలను నిషేధిస్తాను. దసరా, దీపావళిలోగా కొత్త పింఛన్లు అన్ని రకాల పెన్షనర్లకు దసరా, దీపావళి మధ్య రూ. వెయ్యి పింఛన్ అందిస్తాం. వికలాంగులకు రూ.1500 ఇస్తాం. సర్వే ముగియగానే బీడీ కార్మికులకు రూ.1000 భృతిని చెల్లిస్తాం. గృహ నిర్మాణంలో ఇదివరకే చాలా అవినీతి జరిగింది. పైరవీకారులే లాభపడ్డారు. దీనిపై సీబీసీఐడీ ద్వారా విచారణ చేపడుతున్నాం. ఇది పూర్తికాగానే బడుగు, బలహీన వర్గాలకు రెండు పడక గదులతో కూడిన ఇళ్లను నిర్మిస్తాం. ఈ మోడల్ ఇల్లు వ్యయం రూ. 3 లక్షల నుంచి మూడున్నర లక్షలకు పెరిగింది. అయినప్పటికీ నిర్మించి తీరుతాం. ఆర్మూర్‌లోనే తొలి మోడల్ కాలనీని ఏర్పాటు చేస్తాం. వారం రోజుల్లో ఆర్మూరులోని ఎర్రజొన్న రైతుల ఇళ్ల వద్దకే అధికారులు వెళ్లి వారికి రావాల్సిన 11 కోట్ల రూపాయల బకాయిలను అందజేయాలని ఆదేశిస్తున్నా. -
పల్లెపల్లెకూ తాగునీరు
* తెలంగాణ తాగునీటి గ్రిడ్ ఏర్పాటు: సీఎం కేసీఆర్ * రూ. 30 వేల కోట్ల భారీ ప్రాజెక్టు * నాలుగేళ్లలో అమలు చేస్తాం * గుజరాత్ మోడల్లో బృహత్తర పథకం * నల్లగొండ జిల్లా నుంచి ప్రారంభం * అన్ని పథకాలూ గ్రిడ్తోనే అనుసంధానం * ప్రధాన పట్టణాలకు అంతర్జాతీయ శోభ * లండన్, న్యూయార్క్‌లా కరీంనగర్ * విదేశాల్లో ఉద్యోగాలిచ్చే స్థాయికి సింగరేణి * తిరుపతి స్థాయిలో కొండగట్టు అభివృద్ధి * కరీంనగర్, సింగరేణిల్లో వైద్య కళాశాలలు * 19న సర్వేకు సహకరించండి, పెళ్లిళ్లున్నా రద్దు చేసుకోండి * కరీంనగర్ జిల్లా పర్యటనలో కేసీఆర్ సాక్షి ప్రతినిధి, కరీంనగర్: తెలంగాణలో తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి రాష్ర్ట ప్రభుత్వం నడుం బిగించింది. నాలుగేళ్లలో రాష్ట్రంలోని అన్ని నగరాలు, పట్టణాలతో పాటు ప్రతి మారుమూల పల్లెకూ తాగునీటిని అందిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ఇందుకోసం ప్రస్తుతమున్న తాగునీటి పథకాల నిర్వహణ వ్యవస్థలను రద్దు చేసి వాటి స్థానంలో ‘తెలంగాణ తాగునీటి గ్రిడ్’ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. అధికారంలోకి వచ్చాక తొలిసారి చేపట్టిన జిల్లాల పర్యటనలో భాగంగా కేసీఆర్ మంగళవారం కరీంనగర్‌కు వచ్చారు. ఈ సందర్భంగా జిల్లాతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ.. రాష్ర్ట తాగునీటి అవసరాలను తీర్చేందుకు ప్రత్యేక గ్రిడ్‌ను ప్రకటించారు. ‘ఇది నిజంగానే సవాల్‌తో కూడుకున్నది. ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా చేపడతాం. ప్రతి మారుమూల గ్రామానికి తాగునీటిని అందించాలంటే 160 టీఎంసీల నీరు అవసరం. 80 టీఎంసీల నీటిని కృష్ణా నుంచి.. మరో 80 టీఎంసీలను గోదావరి నుంచి తీసుకుంటాం. ఈ భారీ ప్రాజెక్టుకు రూ. 25 వేల నుంచి రూ. 30 వేల కోట్లు ఖర్చవుతుంది. దాదాపు లక్ష కిలోమీటర్ల నిడివితో పైపులైన్లు వేయాల్సి ఉంటుంది. సమగ్ర ప్రతిపాదనలు తయారు చేయిస్తున్నాం. ఇప్పుడు పురోగతిలో ఉన్న సీపీడబ్ల్యూ పథకాలు, ఇతర స్కీములన్నింటినీ ఈ గ్రిడ్తోనే అనుసంధానం చేస్తాం. గుజరాత్లో ఇలాంటి పథకాన్ని చేపట్టారు. దాన్ని అధ్యయనం చేసేందుకు త్వరలోనే ఎమ్మెల్యేలు, అధికారుల బృందాన్ని అక్కడకు పంపిస్తాం. అవసరమైతే నేనే స్వయంగా వెళ్లాలనుకుంటున్నా. అక్కడి విధానంలో ఏమైనా లోపాలుంటే సవరించి ఇక్కడ అమలు చేస్తాం’ అని కేసీఆర్ వివరించారు. ఫ్లోరైడ్ సమస్య తీవ్రంగా ఉన్న నల్లగొండ జిల్లాతో పాటు కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో తనతో పాటు ఇద్దరు డిప్యూటీ సీఎంలు, ఆర్థిక మంత్రి ఒకేసారి ఈ ప్రాజెక్టు పనులను ప్రారంభిస్తారని చెప్పారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులతో పాటు కొత్తగా చేపట్టే ప్రాజెక్టులన్నింటిలోనూ పది శాతం జలాలను తాగునీటి అవసరాలకు, మరో పది శాతాన్ని పారిశ్రామిక అవసరాలకు కేటాయిస్తామన్నారు. దీనిపై విధాన నిర్ణయం తీసుకుని అమలు చేస్తామన్నారు. ఆ నాలుగింటిని తీర్చిదిద్దుతాం హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని నాలుగు ప్రధాన పట్టణాలను అధునాతనంగా అభివృద్ధి చేస్తామని సీఎం వివరించారు. ‘కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, ఖమ్మం పట్టణాలను అంతర్జాతీయ ్రపమాణాలతో తీర్చిదిద్దుతాం. కరీంనగర్‌ను అద్దం తునకలా తయారు చేస్తాం. ప్రజలు ఊహించని విధంగా లండన్, న్యూయార్క్ తరహాలో అభివృద్ధి చేస్తాం. రింగ్‌రోడ్లు, 4 లైన్ల రహదారులు ఏర్పాటు చేస్తాం. అవసరమైతే కొన్ని భవనాలను కూలగొట్టి రోడ్లు విస్తరిస్తాం. లోయర్ మానేర్ డ్యామ్(ఎల్ఎండీ) ప్రాంతాన్ని మైసూర్‌లోని బృందావన్ గార్డెన్‌లా మారుస్తాం. ఇది జీవనది. ఎగువన మిడ్ మానేరు, వరద కాల్వ, ఎస్సారెస్పీ ఉండటంతో ఖాళీ అయిన కొద్దీ నీరు నిండే అవకాశముంది. అందుకే దీన్ని అద్భుతమైన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం. లోయర్ మానేర్ పరిసరాల్లో ఎస్సారెస్పీకి సంబంధించిన 207 ఎకరాల స్థలంలో 107 ఎకరాలను వేరే వాళ్లకు కేటాయించారు. వాటన్నింటినీ రద్దు చేసి మరోచోట కేటాయిస్తాం. అవసరమైతే డ్యామ్ చుట్టూ మరింత స్థలం సేకరిస్తాం. డ్యామ్‌లో బోటింగ్, బోటింగ్ రెస్టారెంట్, డిన్నర్ క్రూజింగ్ బోట్లను ఏర్పాటు చేస్తాం. పర్యాటకులు విడిది చేసేందుకు వీలుగా అందమైన విల్లాలు నిర్మిస్తాం. వేములవాడ, కొండగట్టు ఆలయాలను, ఎలగందుల కోటను ఇదే తీరుగా పర్యాటక క్షేత్రాలుగా అభివృద్ధి చేస్తాం. హనుమాన్ భక్తుల రద్దీ ఉండే కొండగట్టు చుట్టుపక్కలా 300 ఎకరాల ప్రభుత్వ స్థలాలున్నాయి. అక్కడ తిరుపతి స్థాయిలో కాటేజీలు, విల్లాలు నిర్మిస్తాం’ అని కేసీఆర్ ప్రకటించారు. సీఎం చెప్పిన మరిన్ని వివరాలు * సమైక్య రాష్ట్రంలో సింగరేణిని ఎలా వాడుకోవాలో తెలియలేదు. విదేశాల్లో ఉద్యోగాలిచ్చే స్థాయికి సింగరేణిని అభివృద్ధి చేస్తాం. ప్రైవేటు కంపెనీలు అస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలో బొగ్గు గనులను కొనుగోలు చేస్తున్నాయి. కోల్ ఇండియాకే పాఠాలు నేర్పిన సింగరేణి కూడా ఆ స్థాయికి ఎదిగేలా ప్రణాళికలు రూపొందిస్తాం. సింగరేణిలోని 49 శాతం కేంద్ర వాటాను కొనుగోలు చేయాలని కూడా ఆలోచిస్తున్నాం. * కాకతీయ కాలువ సామర్థ్యాన్ని పెంచుతాం. 12 వేల నుంచి 14 వేల క్యూసెక్కుల నీరు అందించే విధంగా ప్రణాళికలు తయారు చేయాలని అధికారులను ఆదేశించాం. చివరి ఆయకట్టు భూములకూ సాగునీటిని అందించేలా వీటి పరిధిలో ఉన్న బ్రాంచ్ కెనాల్, పంట కాల్వలన్నింటినీ ఆధునీకరిస్తాం. పునరుత్పత్తయ్యే జలాలను కూడా ఉపయోగించుకుని అదనంగా లక్ష ఎకరాలకు సాగునీటిని అందించేలా ప్రాజెక్టులు నిర్మిస్తాం. * తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా వచ్చే ఏడాది జరిగే గోదావరి పుష్కరాలకు భారీగా ఏర్పాట్లు చేస్తాం. బాసర, ధర్మపురి, కాళేశ్వరం, భద్రాచలంతో పాటు పుష్కర స్నానాలకు భక్తులు ఎక్కువగా వచ్చే చోట్ల ఘాట్లు ఏర్పాట్లు చేస్తాం. గతంలో మాదిరిగానే నేను ధర్మపురిలో పుష్కర స్నానం చేస్తా. * కరీంనగర్, సింగరేణి ప్రాంతాల్లో వైద్య కళాశాలలు ఏర్పాటు చేసి.. నిమ్స్ తరహాలో ఆసుపత్రులు నిర్మిస్తాం. వాటిలో సీట్ల కేటాయింపులో సింగరేణి ఉద్యోగుల పిల్లలకు ప్రాధాన్యమిస్తాం. రామగుండంలో మైనింగ్ పాలిటెక్నిక్ కాలేజీని ఏర్పాటు చేస్తాం. మిడ్‌మానేరు ప్రాజెక్టు నిర్మాణాన్ని వేగవంతం చేస్తాం. ఇప్పుడున్న కాంట్రాక్టర్ పనులు చేయకపోతే కాంట్రాక్టును రద్దుచేస్తాం. ఎల్లంపల్లి, మిడ్ మానేరు ప్రాజెక్టుల నిర్వాసితులకు పరిహారం సమస్యలున్నాయి. వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించాం. * ఎన్టీపీసీలో మరో 4000 మెగావాట్ల విద్యుత్ ప్లాంటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. బీపీఎల్, సింగరేణిలకు చెందిన స్థలాన్ని ఎన్టీపీసీకి అప్పగిస్తాం. ఇంకా అవసరమైతే ప్రభుత్వమే భూమి ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. * కరీంనగర్ జిల్లాలో నేదునూరు గ్యాస్ ఆధారిత విద్యుత్తు ప్లాంటుకు కేంద్రం నుంచి గ్యాస్ వచ్చే పరిస్థితి లేదు. సమీప భవిష్యత్తులో ఇచ్చే అవకాశాలూ లేవు. అందుకే నేదునూర్‌లో 2 థర్మల్ విద్యుత్తు ప్లాంట్లను నెలకొల్పేందుకు అవకాశముందని జెన్కో ప్రతిపాదనలు అందజేసింది. ఇది రైలు మార్గానికి సమీపంలో ఉండటం, రోడ్డు మార్గం ద్వారా కూడా బొగ్గును సరఫరా చేసే వీలుండటంతో ఈ ప్రతిపాదనలను పరిశీలిస్తున్నాం. * కరెంటు కోతలపై ప్రజలు ఆవేశపడితే లాభం లేదు. అర్థం చేసుకోవాలి. ఎన్నికల ముందు నుంచే కరెంటు కోతలు తప్పవని చెబుతున్నాం. మూడేళ్ల తర్వాత 24 గంటలు విద్యుత్ సరఫరా చేస్తాం. ఈ ఏడాది కరెంట్ కోతలు తప్పవు. వచ్చే ఏడాది పరిస్థితి కొంత మెరుగుపడుతుంది. ఏటేటా సమస్య తగ్గిపోతుంది. ఇప్పుడు కరెంటు కోత ఉందని చెప్పుకోవడానికి సిగ్గుపడాల్సిన పనిలేదు. గత పొరపాట్ల మూలంగా ప్రస్తుత పరిస్థితి తలెత్తింది. ఛత్తీస్‌గఢ్‌లో విద్యుత్ అందుబాటులో ఉంది. కానీ తీసుకునేందుకు లైన్లు వేయాలంటే ఏడాది పడుతుంది. ఏపీ ప్రభుత్వం 710 మెగావాట్ల విద్యుదుత్పత్తిని మరమ్మతుల పేరుతో నిలిపేయడంతో ఈ వారంలో కరెంట్ సమస్య జటిలమైంది. దీనిపై కేంద్రానికి లేఖ రాశాం. * తక్షణం అందుబాటులోకి వచ్చే విద్యుత్తు దృష్ట్యా.. రాష్ట్రంలో వెయ్యి మెగావాట్ల సౌర విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. మహబూబ్‌నగర్‌లో 500 మెగావాట్ల ఉత్పత్తికి పనులు మొదలు పెడుతున్నాం. రానున్న రోజుల్లో ఇంటి పైభాగంలో సోలార్ యూనిట్లు ఏర్పాటు చేసుకుంటేనే భవన నిర్మాణాలకు అనుమతినిచ్చే విధానం అమల్లోకి తెస్తాం. * రైతు రుణమాఫీ అమలుపై చిల్లర మల్లర మాటలు వద్దు. కేబినేట్లో నిర్ణయం తీసుకున్నాం. వ్యవసాయ శాఖ, ఆర్థిక శాఖలు దాన్ని అమలు చేసే పనిలో ఉన్నాయి. ఆర్బీఐ నుంచి చిక్కులున్నాయి. వాటినధిగమిస్తాం. * ఎంసెట్ కౌన్సెలింగ్‌పై ఇంకా సమయం ఉంది. సుప్రీంకోర్టులో ఈ నెల 11న ప్రభుత్వం తరఫున వాదన వినిపిస్తాం. కోర్టు తుది తీర్పును బట్టి నడుచుకుంటాం. * భవిష్యత్తులో రామగుండంలో పోలీస్ కమిషనరేట్ ఏర్పాటు చేస్తాం. జిల్లాలో ఘనస్వాగతం కేసీఆర్‌కు జిల్లా పార్టీ శ్రేణులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. నగర శివార్ల నుంచి భారీ ర్యాలీతో జనం నీరాజనం పట్టారు. దారి పొడవునా బతుకమ్మలు, మంగళ హారతులతో మహిళలు కేసీఆర్‌ను స్వాగతించారు. సిక్వాడీ చౌరస్తాలో సిక్కు సోదరులు ఆయనను సత్కరించి తల్వార్ బహుకరించారు. అక్కడే విద్యుత్తు కోతలకు నిరసనగా ప్లకార్డులతో నిరసన తెలిపిన ఎన్ఎస్యూఐ నాయకులను టీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నాయి. స్వల్ప తోపులాట జరిగింది. అనంతరం కార్పొరేషన్ కార్యాలయం ఆవరణలో అభివృద్ధి పనుల శిలాఫలకాన్ని కేసీఆర్ ఆవిష్కరించారు. మొక్కలు నాటారు. అనంతరం కలెక్టరేట్లో వివిధ అంశాలపై 4 గంటలకు పైగా జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. 19న లేనోడు లెక్కకు రాడు..! ఈ నెల 19న జరగనున్న ఇంటింటి సర్వేలో అందరూ అందుబాటులో ఉండాలని, ఆ రోజు లేనోడు లెక్కకు రాడని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. ఆ రోజు తాను కూడా ఇంట్లోనే అందుబాటులో ఉంటానన్నారు. హైదరాబాద్‌లో బాంబులు పేలుతున్నాయని, ఎవరు పేలుస్తున్నారో తెలియడం లేదని, సర్వేల వల్ల అన్నీ బయటకు వస్తాయని ఆయన వ్యాఖ్యానించారు. ఆ రోజు వివాహాలు, శుభకార్యాలు, ఇతర కార్యక్రమాలు ఉన్నా రద్దు చేసుకోవాలని ప్రజలను కోరారు. 19న బస్సులు, ప్రైవేట్ వాహనాలు కూడా నడవవన్నారు. అందరూ ఇంట్లోనే ఉండి సర్వేకు వచ్చిన సిబ్బందికి పూర్తి వివరాలు చెప్పాలని విజ్ఞప్తి చేశారు. జర్నలిస్టులకు యూనిక్ కార్డులు రాష్ట్రంలోని జర్నలిస్టులకు యూనిక్ కార్డులు జారీ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీనిపై ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణతో ఇప్పటికే మాట్లాడానని చెప్పారు. యూనిక్ కార్డు ఉంటే ఎక్కడైనా బస్‌పాస్ తదితర సదుపాయాలు పొందవచ్చన్నారు. జర్నలిస్టుల్లో అనర్హులకు తెల్లరేషన్ కార్డులుంటే రద్దు చేస్తామని స్పష్టం చేశారు. జర్నలిస్టులకు ఇళ్లు నిర్మిస్తామని తాము ఎక్కడా చెప్పలేదని, ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని పేర్కొన్నారు. కిష్టయ్య కుటుంబానికి పరిహారం తెలంగాణ ఉద్యమంలో అసువులు బాసిన పోలీస్ కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబాన్ని ఆదుకుంటామని కేసీఆర్ పునరుద్ఘాటించారు. కిష్టయ్య భార్య పద్మావతికి కరీంనగర్‌లోని సప్తగిరికాలనీలో రెండు గుంటల ఇంటి స్థలంతో పాటు రూ.10 లక్షల ఆర్థికసాయం అందజేశారు. ఆమెకు రూ. 20 లక్షలతో ఇల్లు నిర్మించి ఇస్తామని కూడా సీఎం ప్రకటించారు. ఇందుకు ప్రభుత్వం తరఫున ఎంత వస్తుందో చూసి మిగిలిన ఖర్చును పార్టీ భరిస్తుందన్నారు.