పైలాన్ చేరని వాటర్‌గ్రిడ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన వాటర్‌గ్రిడ్ పథకం ఒకడుగు ముందుకు.. మూడడుగులు వెనక్కి అన్నట్లు సాగుతోంది. ప్రణాళికా లోపం, నిధుల కొరతతో ఇంటింటికీ రక్షిత మంచినీటిని అందించే పథకం ఆరంభానికి ముందే ఎదురీదుతోంది. టెండర్లకు ముందే ఆరోపణలు.. పునాది రాయి అయినా వేయక ముందే విపక్షాలు చేస్తున్న విమర్శలు వాటర్‌గ్రిడ్‌ను ముసురుకున్నాయి. తొమ్మిది జిల్లాల్లో 25 వేల ఆవాసప్రాంతాలకు, 69 పట్టణాలకు నల్లాల ద్వారా ఇంటింటికీ రక్షిత మంచినీటిని అందించడం ఈ ప్రాజెక్టు ద్వారా తలపెట్టిన బృహత్తర లక్ష్యం. కానీ ఈ ప్రాజెక్టు పనులన్నీ నత్త కంటే మెల్లగా సాగుతున్నాయి.
పైపులైన్ల టెండర్లకు ఒత్తిళ్లు: వాటర్ గ్రిడ్‌కు రూ.35 వేల కోట్లకుపైగా ఖర్చు అవుతుంది. ఇందులో కీలకమైన పైపుల తయారీ.. కొనుగోలు.. లైనింగ్ ప్రక్రియపై బడా కంపెనీలన్నీ కన్నేశాయి. తెలంగాణ, ఏపీ కంపెనీలతో పాటు జిందాల్, కొరియన్ వాటర్ కంపెనీ ఇప్పటికే తమవంతు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఐసీఐసీఐ, ఎల్‌ఐసీతో కన్సార్టియంగా ఏర్పడి పెట్టుబడులు పెట్టడంతో పాటు.. ఈ పైపులైన్ కాంట్రాక్టును దక్కించుకునేందుకు జిందాల్ పావులు కదుపుతోంది. కొరియన్ వాటర్ కంపెనీ సైతం రూ.10 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేం దుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. బడా కంపెనీలన్నీ రాష్ట్ర సర్కారుపై రాజ కీయ ఒత్తిళ్లు తీసుకొస్తున్న ప్రచారం జోరందుకుం ది. అయితే పైపులకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ ఇప్పటికీ మొదలు కాలేదు.
ఈలోగా కొన్ని కంపెనీలు తమకు అనుకూలంగా టెండర్ల నిబంధనలుండేలా పైరవీలు చేస్తుండటంతో సర్కారు తల పట్టుకుంది. నిధు ల సమీకరణకు వీలు గా రాష్ట్ర సర్కారు జనవరిలోనే తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లై కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. కానీ.. కార్పొరేషన్‌కు సంబంధిం చిన పాలకవర్గం నియామకాలు కాలేదు. నల్లగొండ జిల్లా చౌటుప్పల్‌లో నిర్మిస్తున్న పైలాన్ తుదిదశలో ఉంది. ఇప్పటికీ కార్యక్రమానికి పునాది రాయి పడలేదు. ఈలోగానే విపక్షాలు సర్కారుపై విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇంటేక్ వెల్స్‌కు సంబంధించిన ప్యాకేజీల కుదింపు, టెండర్లవ్యవధి తగ్గింపు.. టెండరు మార్గదర్శకాలను కొన్ని కంపెనీలకు అనుకూలంగా మార్చినట్లు విమర్శలు సర్కారును చుట్టుముట్టాయి. దీంతో పనుల వేగానికి కళ్లెం వేసినట్లు స్పష్టమవుతోంది.
సర్వేకే ఆరు నెలలు
వాటర్‌గ్రిడ్ తొలిదశ లైన్ సర్వే ఇటీవలే పూర్తయింది. నెల రోజుల్లో పూర్తవుతుందనుకున్న సర్వే కు ఆరు నెలలు పట్టింది. లైన్‌సర్వేకు లైటింగ్ డిటెక్షన్ రేంజింగ్(లైడార్) వంటి ఆధునిక సాంకేతికత పరిజ్ఞానాన్ని విని యోగిస్తామని చెప్పిన ప్రభుత్వం అది ఖరీదైన ప్రక్రియ కావటంతో వెనకడుగు వేసింది.