కొయ్యలగూడెం/జంగారెడ్డిగూడెం : యువగళం పాదయాత్ర సందర్భంగా గురువారం సీతంపేట వద్ద నారా లోకేశ్ ఆవిష్కరించిన పైలాన్ కార్యక్రమం వివాదాస్పదంగా మారింది. పాదయాత్ర 200వ రోజుకు చేరిన నేపథ్యంలో సీతంపేటలో పైలాన్ నిర్మించారు.
ఈ సందర్భంగా 35 అడుగుల ఎత్తులో లోకేశ్ ఫొటోతో కూడిన మెటల్ పైలాన్‌ను ఏర్పాటుచేశారు. చిత్రపటంలోని లోకేశ్ కాళ్ల వద్ద పూర్ణకుంభాన్ని ఉంచి పూజలు నిర్వహించి పైలాన్‌ని ప్రారంభించడం వివాదాస్పదమైంది. ఈ క్రమంలో ప్రజలు తమ మనోభావాలను దెబ్బతీసేలా కార్యక్రమం నిర్వహించారంటూ ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఈ కార్యక్రమం రసాభాసగా మారింది.
అంబులెన్స్‌కు దారి ఇవ్వని తమ్ముళ్లు
యువగళం పాదయాత్ర పేరిట లోకేశ్ గురువారం చేపట్టిన కార్యక్రమం ఏలూరు జిల్లా నరసన్నపాలెం వై.జంక్షన్ నుంచి పొంగుటూరు వరకు కొనసాగింది. పాదయాత్ర కొనసాగుతుండగా అంబులెన్స్ వాహనాలకు తెలుగు తమ్ముళ్లు దారి ఇవ్వకపోవడంతో స్థానిక ప్రజలు పోలీసుల సహాయంతో మార్గం సుగమం చేశారు. అలాగే, పాదయాత్రలో లోకేశ్‌తోపాటు తల్లి భువనేశ్వరి విక్టరీ సింబల్ కాకుండా కామ్రేడ్స్ మాదిరిగా పిడికిలి బిగించి అభివాదం చేస్తుండడం చర్చనీయాంశంగా మారింది.
బూచోడిలా లోకేశ్..
పాదయాత్రలో ఓ ఆసక్తికర ఘటన కూడా చోటుచేసుకుంది. బయ్యనగూడెం సమీపంలో రామకోనేరు వద్ద ఓ మహిళ తన చిన్నారితో నిలబడి ఉండగా.. లోకేశ్ వారి వద్దకు వెళ్లి బూచోడు మాదిరిగా హావభావాలు ప్రదర్శించారు. దీంతో ఆ చిన్నారి ఒక్కసారిగా ఏడుపు అందుకుంది. ఆ తర్వాత స్థానికులు వైఎస్ జగన్ చిన్నారులపట్ల చూపించే ఆప్యాయత గురించి చర్చించుకుంటూ లోకేశ్‌పై ఛలోక్తులు విసరడం కనిపించింది.
మరోవైపు.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజుపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ శ్రేణులు సీతంపేటలో లోకేశ్ దిష్టిబొమ్మను దగ్థం చేశారు. అలాగే, ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు లోకేశ్ దిష్టిబొమ్మను గాడిదపై ఊరేగించి దగ్థంచేశారు.
Comments
Please login to add a commentAdd a comment