* తెలంగాణ తాగునీటి గ్రిడ్ ఏర్పాటు: సీఎం కేసీఆర్
* రూ. 30 వేల కోట్ల భారీ ప్రాజెక్టు
* నాలుగేళ్లలో అమలు చేస్తాం
* గుజరాత్ మోడల్‌లో బృహత్తర పథకం
* నల్లగొండ జిల్లా నుంచి ప్రారంభం
* అన్ని పథకాలూ గ్రిడ్‌తోనే అనుసంధానం
* ప్రధాన పట్టణాలకు అంతర్జాతీయ శోభ
* లండన్, న్యూయార్క్‌లా కరీంనగర్
* విదేశాల్లో ఉద్యోగాలిచ్చే స్థాయికి సింగరేణి
* తిరుపతి స్థాయిలో కొండగట్టు అభివృద్ధి
* కరీంనగర్, సింగరేణిల్లో వైద్య కళాశాలలు
* 19న సర్వేకు సహకరించండి, పెళ్లిళ్లున్నా రద్దు చేసుకోండి
* కరీంనగర్ జిల్లా పర్యటనలో కేసీఆర్
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: తెలంగాణలో తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి రాష్ర్ట ప్రభుత్వం నడుం బిగించింది. నాలుగేళ్లలో రాష్ట్రంలోని అన్ని నగరాలు, పట్టణాలతో పాటు ప్రతి మారుమూల పల్లెకూ తాగునీటిని అందిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ఇందుకోసం ప్రస్తుతమున్న తాగునీటి పథకాల నిర్వహణ వ్యవస్థలను రద్దు చేసి వాటి స్థానంలో ‘తెలంగాణ తాగునీటి గ్రిడ్’ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. అధికారంలోకి వచ్చాక తొలిసారి చేపట్టిన జిల్లాల పర్యటనలో భాగంగా కేసీఆర్ మంగళవారం కరీంనగర్‌కు వచ్చారు. ఈ సందర్భంగా జిల్లాతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ.. రాష్ర్ట తాగునీటి అవసరాలను తీర్చేందుకు ప్రత్యేక గ్రిడ్‌ను ప్రకటించారు.
‘ఇది నిజంగానే సవాల్‌తో కూడుకున్నది. ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా చేపడతాం. ప్రతి మారుమూల గ్రామానికి తాగునీటిని అందించాలంటే 160 టీఎంసీల నీరు అవసరం. 80 టీఎంసీల నీటిని కృష్ణా నుంచి.. మరో 80 టీఎంసీలను గోదావరి నుంచి తీసుకుంటాం. ఈ భారీ ప్రాజెక్టుకు రూ. 25 వేల నుంచి రూ. 30 వేల కోట్లు ఖర్చవుతుంది. దాదాపు లక్ష కిలోమీటర్ల నిడివితో పైపులైన్లు వేయాల్సి ఉంటుంది. సమగ్ర ప్రతిపాదనలు తయారు చేయిస్తున్నాం. ఇప్పుడు పురోగతిలో ఉన్న సీపీడబ్ల్యూ పథకాలు, ఇతర స్కీములన్నింటినీ ఈ గ్రిడ్‌తోనే అనుసంధానం చేస్తాం. గుజరాత్‌లో ఇలాంటి పథకాన్ని చేపట్టారు. దాన్ని అధ్యయనం చేసేందుకు త్వరలోనే ఎమ్మెల్యేలు, అధికారుల బృందాన్ని అక్కడకు పంపిస్తాం. అవసరమైతే నేనే స్వయంగా వెళ్లాలనుకుంటున్నా. అక్కడి విధానంలో ఏమైనా లోపాలుంటే సవరించి ఇక్కడ అమలు చేస్తాం’ అని కేసీఆర్ వివరించారు.
ఫ్లోరైడ్ సమస్య తీవ్రంగా ఉన్న నల్లగొండ జిల్లాతో పాటు కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో తనతో పాటు ఇద్దరు డిప్యూటీ సీఎంలు, ఆర్థిక మంత్రి ఒకేసారి ఈ ప్రాజెక్టు పనులను ప్రారంభిస్తారని చెప్పారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులతో పాటు కొత్తగా చేపట్టే ప్రాజెక్టులన్నింటిలోనూ పది శాతం జలాలను తాగునీటి అవసరాలకు, మరో పది శాతాన్ని పారిశ్రామిక అవసరాలకు కేటాయిస్తామన్నారు. దీనిపై విధాన నిర్ణయం తీసుకుని అమలు చేస్తామన్నారు.
ఆ నాలుగింటిని తీర్చిదిద్దుతాం
హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని నాలుగు ప్రధాన పట్టణాలను అధునాతనంగా అభివృద్ధి చేస్తామని సీఎం వివరించారు. ‘కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, ఖమ్మం పట్టణాలను అంతర్జాతీయ ్రపమాణాలతో తీర్చిదిద్దుతాం. కరీంనగర్‌ను అద్దం తునకలా తయారు చేస్తాం. ప్రజలు ఊహించని విధంగా లండన్, న్యూయార్క్ తరహాలో అభివృద్ధి చేస్తాం. రింగ్‌రోడ్లు, 4 లైన్ల రహదారులు ఏర్పాటు చేస్తాం. అవసరమైతే కొన్ని భవనాలను కూలగొట్టి రోడ్లు విస్తరిస్తాం. లోయర్ మానేర్ డ్యామ్(ఎల్‌ఎండీ) ప్రాంతాన్ని మైసూర్‌లోని బృందావన్ గార్డెన్‌లా మారుస్తాం. ఇది జీవనది. ఎగువన మిడ్ మానేరు, వరద కాల్వ, ఎస్సారెస్పీ ఉండటంతో ఖాళీ అయిన కొద్దీ నీరు నిండే అవకాశముంది. అందుకే దీన్ని అద్భుతమైన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం. లోయర్ మానేర్ పరిసరాల్లో ఎస్సారెస్పీకి సంబంధించిన 207 ఎకరాల స్థలంలో 107 ఎకరాలను వేరే వాళ్లకు కేటాయించారు. వాటన్నింటినీ రద్దు చేసి మరోచోట కేటాయిస్తాం. అవసరమైతే డ్యామ్ చుట్టూ మరింత స్థలం సేకరిస్తాం. డ్యామ్‌లో బోటింగ్, బోటింగ్ రెస్టారెంట్, డిన్నర్ క్రూజింగ్ బోట్‌లను ఏర్పాటు చేస్తాం. పర్యాటకులు విడిది చేసేందుకు వీలుగా అందమైన విల్లాలు నిర్మిస్తాం. వేములవాడ, కొండగట్టు ఆలయాలను, ఎలగందుల కోటను ఇదే తీరుగా పర్యాటక క్షేత్రాలుగా అభివృద్ధి చేస్తాం. హనుమాన్ భక్తుల రద్దీ ఉండే కొండగట్టు చుట్టుపక్కలా 300 ఎకరాల ప్రభుత్వ స్థలాలున్నాయి. అక్కడ తిరుపతి స్థాయిలో కాటేజీలు, విల్లాలు నిర్మిస్తాం’ అని కేసీఆర్ ప్రకటించారు.
సీఎం చెప్పిన మరిన్ని వివరాలు
* సమైక్య రాష్ట్రంలో సింగరేణిని ఎలా వాడుకోవాలో తెలియలేదు. విదేశాల్లో ఉద్యోగాలిచ్చే స్థాయికి సింగరేణిని అభివృద్ధి చేస్తాం. ప్రైవేటు కంపెనీలు అస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలో బొగ్గు గనులను కొనుగోలు చేస్తున్నాయి. కోల్ ఇండియాకే పాఠాలు నేర్పిన సింగరేణి కూడా ఆ స్థాయికి ఎదిగేలా ప్రణాళికలు రూపొందిస్తాం. సింగరేణిలోని 49 శాతం కేంద్ర వాటాను కొనుగోలు చేయాలని కూడా ఆలోచిస్తున్నాం.
* కాకతీయ కాలువ సామర్థ్యాన్ని పెంచుతాం. 12 వేల నుంచి 14 వేల క్యూసెక్కుల నీరు అందించే విధంగా ప్రణాళికలు తయారు చేయాలని అధికారులను ఆదేశించాం. చివరి ఆయకట్టు భూములకూ సాగునీటిని అందించేలా వీటి పరిధిలో ఉన్న బ్రాంచ్ కెనాల్, పంట కాల్వలన్నింటినీ ఆధునీకరిస్తాం. పునరుత్పత్తయ్యే జలాలను కూడా ఉపయోగించుకుని అదనంగా లక్ష ఎకరాలకు సాగునీటిని అందించేలా ప్రాజెక్టులు నిర్మిస్తాం.
* తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా వచ్చే ఏడాది జరిగే గోదావరి పుష్కరాలకు భారీగా ఏర్పాట్లు చేస్తాం. బాసర, ధర్మపురి, కాళేశ్వరం, భద్రాచలంతో పాటు పుష్కర స్నానాలకు భక్తులు ఎక్కువగా వచ్చే చోట్ల ఘాట్లు ఏర్పాట్లు చేస్తాం. గతంలో మాదిరిగానే నేను ధర్మపురిలో పుష్కర స్నానం చేస్తా.
* కరీంనగర్, సింగరేణి ప్రాంతాల్లో వైద్య కళాశాలలు ఏర్పాటు చేసి.. నిమ్స్ తరహాలో ఆసుపత్రులు నిర్మిస్తాం. వాటిలో సీట్ల కేటాయింపులో సింగరేణి ఉద్యోగుల పిల్లలకు ప్రాధాన్యమిస్తాం. రామగుండంలో మైనింగ్ పాలిటెక్నిక్ కాలేజీని ఏర్పాటు చేస్తాం. మిడ్‌మానేరు ప్రాజెక్టు నిర్మాణాన్ని వేగవంతం చేస్తాం. ఇప్పుడున్న కాంట్రాక్టర్ పనులు చేయకపోతే కాంట్రాక్టును రద్దుచేస్తాం. ఎల్లంపల్లి, మిడ్ మానేరు ప్రాజెక్టుల నిర్వాసితులకు పరిహారం సమస్యలున్నాయి. వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించాం.
* ఎన్‌టీపీసీలో మరో 4000 మెగావాట్ల విద్యుత్ ప్లాంటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. బీపీఎల్, సింగరేణిలకు చెందిన స్థలాన్ని ఎన్‌టీపీసీకి అప్పగిస్తాం. ఇంకా అవసరమైతే ప్రభుత్వమే భూమి ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది.
* కరీంనగర్ జిల్లాలో నేదునూరు గ్యాస్ ఆధారిత విద్యుత్తు ప్లాంటుకు కేంద్రం నుంచి గ్యాస్ వచ్చే పరిస్థితి లేదు. సమీప భవిష్యత్తులో ఇచ్చే అవకాశాలూ లేవు. అందుకే నేదునూర్‌లో 2 థర్మల్ విద్యుత్తు ప్లాంట్లను నెలకొల్పేందుకు అవకాశముందని జెన్‌కో ప్రతిపాదనలు అందజేసింది. ఇది రైలు మార్గానికి సమీపంలో ఉండటం, రోడ్డు మార్గం ద్వారా కూడా బొగ్గును సరఫరా చేసే వీలుండటంతో ఈ ప్రతిపాదనలను పరిశీలిస్తున్నాం.
* కరెంటు కోతలపై ప్రజలు ఆవేశపడితే లాభం లేదు. అర్థం చేసుకోవాలి. ఎన్నికల ముందు నుంచే కరెంటు కోతలు తప్పవని చెబుతున్నాం. మూడేళ్ల తర్వాత 24 గంటలు విద్యుత్ సరఫరా చేస్తాం. ఈ ఏడాది కరెంట్ కోతలు తప్పవు. వచ్చే ఏడాది పరిస్థితి కొంత మెరుగుపడుతుంది. ఏటేటా సమస్య తగ్గిపోతుంది. ఇప్పుడు కరెంటు కోత ఉందని చెప్పుకోవడానికి సిగ్గుపడాల్సిన పనిలేదు. గత పొరపాట్ల మూలంగా ప్రస్తుత పరిస్థితి తలెత్తింది. ఛత్తీస్‌గఢ్‌లో విద్యుత్ అందుబాటులో ఉంది. కానీ తీసుకునేందుకు లైన్లు వేయాలంటే ఏడాది పడుతుంది. ఏపీ ప్రభుత్వం 710 మెగావాట్ల విద్యుదుత్పత్తిని మరమ్మతుల పేరుతో నిలిపేయడంతో ఈ వారంలో కరెంట్ సమస్య జటిలమైంది. దీనిపై కేంద్రానికి లేఖ రాశాం.
* తక్షణం అందుబాటులోకి వచ్చే విద్యుత్తు దృష్ట్యా.. రాష్ట్రంలో వెయ్యి మెగావాట్ల సౌర విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. మహబూబ్‌నగర్‌లో 500 మెగావాట్ల ఉత్పత్తికి పనులు మొదలు పెడుతున్నాం. రానున్న రోజుల్లో ఇంటి పైభాగంలో సోలార్ యూనిట్లు ఏర్పాటు చేసుకుంటేనే భవన నిర్మాణాలకు అనుమతినిచ్చే విధానం అమల్లోకి తెస్తాం.
* రైతు రుణమాఫీ అమలుపై చిల్లర మల్లర మాటలు వద్దు. కేబినేట్‌లో నిర్ణయం తీసుకున్నాం. వ్యవసాయ శాఖ, ఆర్థిక శాఖలు దాన్ని అమలు చేసే పనిలో ఉన్నాయి. ఆర్‌బీఐ నుంచి చిక్కులున్నాయి. వాటినధిగమిస్తాం.
* ఎంసెట్ కౌన్సెలింగ్‌పై ఇంకా సమయం ఉంది. సుప్రీంకోర్టులో ఈ నెల 11న ప్రభుత్వం తరఫున వాదన వినిపిస్తాం. కోర్టు తుది తీర్పును బట్టి నడుచుకుంటాం.
* భవిష్యత్తులో రామగుండంలో పోలీస్ కమిషనరేట్ ఏర్పాటు చేస్తాం.
జిల్లాలో ఘనస్వాగతం
కేసీఆర్‌కు జిల్లా పార్టీ శ్రేణులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. నగర శివార్ల నుంచి భారీ ర్యాలీతో జనం నీరాజనం పట్టారు. దారి పొడవునా బతుకమ్మలు, మంగళ హారతులతో మహిళలు కేసీఆర్‌ను స్వాగతించారు. సిక్‌వాడీ చౌరస్తాలో సిక్కు సోదరులు ఆయనను సత్కరించి తల్వార్ బహుకరించారు. అక్కడే విద్యుత్తు కోతలకు నిరసనగా ప్లకార్డులతో నిరసన తెలిపిన ఎన్‌ఎస్‌యూఐ నాయకులను టీఆర్‌ఎస్ శ్రేణులు అడ్డుకున్నాయి. స్వల్ప తోపులాట జరిగింది. అనంతరం కార్పొరేషన్ కార్యాలయం ఆవరణలో అభివృద్ధి పనుల శిలాఫలకాన్ని కేసీఆర్ ఆవిష్కరించారు. మొక్కలు నాటారు. అనంతరం కలెక్టరేట్‌లో వివిధ అంశాలపై 4 గంటలకు పైగా జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు.
19న లేనోడు లెక్కకు రాడు..!
ఈ నెల 19న జరగనున్న ఇంటింటి సర్వేలో అందరూ అందుబాటులో ఉండాలని, ఆ రోజు లేనోడు లెక్కకు రాడని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. ఆ రోజు తాను కూడా ఇంట్లోనే అందుబాటులో ఉంటానన్నారు. హైదరాబాద్‌లో బాంబులు పేలుతున్నాయని, ఎవరు పేలుస్తున్నారో తెలియడం లేదని, సర్వేల వల్ల అన్నీ బయటకు వస్తాయని ఆయన వ్యాఖ్యానించారు. ఆ రోజు వివాహాలు, శుభకార్యాలు, ఇతర కార్యక్రమాలు ఉన్నా రద్దు చేసుకోవాలని ప్రజలను కోరారు. 19న బస్సులు, ప్రైవేట్ వాహనాలు కూడా నడవవన్నారు. అందరూ ఇంట్లోనే ఉండి సర్వేకు వచ్చిన సిబ్బందికి పూర్తి వివరాలు చెప్పాలని విజ్ఞప్తి చేశారు.
జర్నలిస్టులకు యూనిక్ కార్డులు
రాష్ట్రంలోని జర్నలిస్టులకు యూనిక్ కార్డులు జారీ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీనిపై ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణతో ఇప్పటికే మాట్లాడానని చెప్పారు. యూనిక్ కార్డు ఉంటే ఎక్కడైనా బస్‌పాస్ తదితర సదుపాయాలు పొందవచ్చన్నారు. జర్నలిస్టుల్లో అనర్హులకు తెల్లరేషన్ కార్డులుంటే రద్దు చేస్తామని స్పష్టం చేశారు. జర్నలిస్టులకు ఇళ్లు నిర్మిస్తామని తాము ఎక్కడా చెప్పలేదని, ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని పేర్కొన్నారు.
కిష్టయ్య కుటుంబానికి పరిహారం
తెలంగాణ ఉద్యమంలో అసువులు బాసిన పోలీస్ కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబాన్ని ఆదుకుంటామని కేసీఆర్ పునరుద్ఘాటించారు. కిష్టయ్య భార్య పద్మావతికి కరీంనగర్‌లోని సప్తగిరికాలనీలో రెండు గుంటల ఇంటి స్థలంతో పాటు రూ.10 లక్షల ఆర్థికసాయం అందజేశారు. ఆమెకు రూ. 20 లక్షలతో ఇల్లు నిర్మించి ఇస్తామని కూడా సీఎం ప్రకటించారు. ఇందుకు ప్రభుత్వం తరఫున ఎంత వస్తుందో చూసి మిగిలిన ఖర్చును పార్టీ భరిస్తుందన్నారు.