* త్వరలోనే రుణ మాఫీ అమలు చేస్తామన్న సీఎం కేసీఆర్
* 39 లక్షల మంది రైతులకు19 వేల కోట్ల రూపాయల లబ్ధి
* దళిత కుటుంబాలకు ఆగస్టు 15న భూ పంపిణీ
* ఫైలుపై సంతకం కూడా చేశా
* తాగునీటి గ్రిడ్ కోసం ఏర్పాట్లు
* నాలుగేళ్ల తర్వాత రాష్ర్టంలో నల్లాలేని ఇల్లుండదు
* మూడున్నర లక్షలైనా డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మిస్తాం
* 19న సెలవు, ఆ రోజున సర్వేలో లేకుంటే జనాభా లెక్కల్లో లేనట్లే
* నిజామాబాద్ జిల్లా పర్యటనలో ముఖ్యమంత్రి వెల్లడి
* అంకాపూర్ గ్రామానికి వరాలు, ఆసియా ఖండానికే ఆదర్శం కావాలని పిలుపు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఇచ్చిన మాట ప్రకారం త్వరలోనే రైతులకు రుణ మాఫీ అమలు చేస్తామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. దీనిపై ఇప్పటికే ఆర్‌బీఐకి తీర్మానం చేసి పంపించామని, 39 లక్షల మందికి రూ. 19 వేల కోట్ల మేర రుణాలు మాఫీ అవుతాయని పేర్కొన్నారు. త్వరలోనే బ్యాంకుల్లో డబ్బులు జమవుతాయని అన్నదాతలకు కే సీఆర్ భరోసా ఇచ్చారు. సీఎంగా అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత గురువారం ఆయన తొలిసారిగా నిజామాబాద్ జిల్లాలో పర్యటించారు.
ఈ సందర్భంగా రుణ మాఫీతో పాటు దళితులకు భూ పంపిణీ, పేదలకు ఇళ్ల నిర్మాణంపై స్పష్టతనిచ్చారు. ఆర్మూరులో రూ. 114.11 కోట్లతో నిర్మించ తలపెట్టిన రక్షిత మంచినీటి పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్మూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడారు. ‘‘ఎన్నికల్లో ప్రకటించిన విధంగా పేద దళితులకు భూ పంపిణీ పథకాన్ని ఆగస్టు 15న ప్రారంభించేందుకు అంతా సిద్ధం చేశాం. మొదటి విడతలో అవకాశమున్న ప్రతిచోటా అర్హులైన దళితులకు పట్టాలు అందజేస్తాం. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను గురువారం ఉదయమే జిల్లా కలెక్టర్లకు అందించాం. భూ పంపిణీ ఫైలుపై కూడా సంతకం చేశాను’’ అని సీఎం వెల్లడించారు.
భూమి లేని దళితులకు మూడెకరాలు, రెండు ఎకరాలు ఉన్నవారికి ఒక ఎకరం, ఎకరం భూమి ఉన్న వారికి రెండెకరాలు అందజేస్తామని వివరించారు. భూమితో పాటు విద్యుత్ సరఫరా, మోటార్, ఒక ఏడాది పంట పెట్టుబడిని కూడా ప్రభుత్వమే అందిస్తుందని కూడా చెప్పారు. ఈ సందర్భంగా తమ ప్రభుత్వం చేపడుతున్న పలు ప్రభుత్వ పథకాలను గుర్తు చేస్తూ.. పలు వర్గాలకు సంక్షేమ వరాలు కురిపిస్తూ కేసీఆర్ ప్రసంగం సాగింది.
నాలుగేళ్లలో ఇంటింటికీ నల్లా
రాష్ట్రంలో నాలుగేళ్ల తర్వాత నల్లా లేని ఇల్లే ఉండదు. శాశ్వతంగా నీటి కొరతను తీర్చేందుకు ‘తెలంగాణ డ్రింకింగ్ వాటర్ గ్రిడ్’కు రూపకల్పన చేశాం. కరీంనగర్ పర్యటన సందర్భంగా ప్రకటించిన ఈ పథకాన్ని అమలు చేసేందుకు రెండు రోజుల్లోనే అంతా సిద్ధం చేశాం. ఇప్పటికే ఆయా జిల్లాల్లో ఉన్న రక్షిత మంచినీటి పథకాలను ఈ గ్రిడ్‌కే అనుసంధానం చేసి రాష్ట్ర ప్రజలందరికీ పెపులైన్ల ద్వారా తాగునీటిని అందిస్తాం. ఇంటిం టికీ నల్లా కనెక్షన్ ఇస్తాం. ఆదివాసీ, దళిత, గిరిజన యువతుల వివాహాలకు ‘కల్యాణలక్ష్మి’ పథకం కింద రూ. 50 వేల సాయం అందిస్తాం.
19న సర్వేకు సహకరించండి
గత ప్రభుత్వాల హయాంలో ఎన్నో అక్రమాలు, అవినీతులు జరిగాయి. ఆ ప్రభుత్వాలను ఇప్పుడు విమర్శించదలచుకోలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ప్రస్తుత తరుణంలో సమగ్ర సర్వే అవసరమైంది. ఈ నెల 19న దీన్ని చేపట్టనున్నాం. దీనికి ప్రతి ఒక్కరూ సహకరించాలి. ఆ రోజు బస్సులు, ప్రైవేట్ వాహనాలు కూడా నడవవు. ఆ రోజు సెలవు దినం. ప్రతి ఒక్కరు ఇళ్లలోనే ఉండాలి. ఎలాంటి కార్యక్రమాలు ఉన్నా రద్దు చేసుకోవాలి. పెళ్లిళ్లు ఉన్నా రద్దు చేసుకోవాలని కోరుతున్నా. ఈ సమగ్ర సర్వే ఎంతో ముఖ్యమైనది. ఆ లెక్కల్లోకి ఎక్కకపోతే జనాభా లెక్కల్లో కూడా లేనట్లే. అధికారులకు ప్రతి ఒక్కరు సహకరించాలి.
స్కూల్ పిల్లలను రోడ్డెక్కించకండి
మంత్రులు, ముఖ్యమంత్రుల సభల కోసం విద్యార్థులను రోడ్లెక్కిస్తే ఇకపై చర్యలు తీసుకుంటాం. ఆర్మూరు పర్యటనలో పిల్లలను సభకు తరలించడం చాలా బాధకు గురి చేసింది. స్కూల్ పిల్లలను ఎండలో నిలబెట్టడం అధికారులు, ప్రజాప్రతినిధులకు మంచిది కాదు. సభలు, కార్యక్రమాలకు వారిని రోడ్ల మీదకు తీసుకురావద్దు. రాష్ట్రవ్యాప్తంగా ఇది వర్తిస్తుంది. ఇలాంటి చర్యలను నిషేధిస్తాను.
దసరా, దీపావళిలోగా కొత్త పింఛన్లు
అన్ని రకాల పెన్షనర్లకు దసరా, దీపావళి మధ్య రూ. వెయ్యి పింఛన్ అందిస్తాం. వికలాంగులకు రూ.1500 ఇస్తాం. సర్వే ముగియగానే బీడీ కార్మికులకు రూ.1000 భృతిని చెల్లిస్తాం. గృహ నిర్మాణంలో ఇదివరకే చాలా అవినీతి జరిగింది. పైరవీకారులే లాభపడ్డారు. దీనిపై సీబీసీఐడీ ద్వారా విచారణ చేపడుతున్నాం.
ఇది పూర్తికాగానే బడుగు, బలహీన వర్గాలకు రెండు పడక గదులతో కూడిన ఇళ్లను నిర్మిస్తాం. ఈ మోడల్ ఇల్లు వ్యయం రూ. 3 లక్షల నుంచి మూడున్నర లక్షలకు పెరిగింది. అయినప్పటికీ నిర్మించి తీరుతాం. ఆర్మూర్‌లోనే తొలి మోడల్ కాలనీని ఏర్పాటు చేస్తాం. వారం రోజుల్లో ఆర్మూరులోని ఎర్రజొన్న రైతుల ఇళ్ల వద్దకే అధికారులు వెళ్లి వారికి రావాల్సిన 11 కోట్ల రూపాయల బకాయిలను అందజేయాలని ఆదేశిస్తున్నా.
మాట తప్పం!
Published Fri, Aug 8 2014 12:54 AM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM
Advertisement
Advertisement