‘తెలంగాణ తాగునీటి పథకం’గా వాటర్‌గ్రిడ్
పేరును ఖరారు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్
హైదరాబాద్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టుకు ‘తెలంగాణ తాగు నీటి పథకం’ పేరును ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఖరారు చేశారు. వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టు పనుల పురోగతిపై సంబంధిత శాఖల మంత్రులు, ఉన్నతాధికారులతో మంగళవారం ఆయన సమీక్షించారు. సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ఈ పథకం అమలుకు సంబంధించి ఇప్పటికే ‘తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లయ్ కార్పొరేషన్’ ను ఏర్పాటు చేశామన్నారు. ప్రజలకు అత్యంత అవసరమైన సురక్షిత తాగునీటి పథకాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని, ప్రాజెక్టు పనుల పురోగతిని ప్రతీ వారం క్షేత్రస్థాయిలో సమీక్షించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టును మూడు దశాబ్దాల వరకు మంచినీటిని సరఫరా చేసే వ్యవస్థగా తీర్చిదిద్దాలని, ఇది అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవాలని సీఎం సూచించారు.
పదిళ్లున్నా నీటి సరఫరా: ప్రధాన గ్రామాలతో పాటు గిరిజన తండాలు, ఆదివాసీ గూడేలు, గంగిరెద్దుల, ఎరుకల గుడిసెలు.. ఇలా పదిళ్లున్న ఆవాసాలకు సైతం మంచినీటి ని అందించాలని కేసీఆర్ ఆదేశించారు. ప్రతీ ఇంటికి మంచినీటి పైప్‌లైన్ వేసే బాధ్యతలను గ్రామీణ నీటి సరఫరా (ఆర్‌డబ్ల్యూఎస్) అధికారులే చేపట్టాలని, పైపుల నాణ్యత విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన సంస్థల నుంచే వాటిని కొనుగోలు చేయాలని, ఆయా కంపెనీల గత చరిత్రను కూడా పరిగణనలోకి తీసుకోవాలన్నారు. పైపులు వేయడంతో పాటు వాటి నిర్వహణను కూడా పదేళ్లపాటు ఆయా కంపెనీలే చూసుకునేలా బాధ్యతలను అప్పగించాలన్నారు. ప్రతీ దశలోనూ హైడ్రాలిక్ పరీక్షలు నిర్వహించాలని చెప్పారు. ఇంటేక్‌వెల్ ్స నిర్మాణ ం, ప్రాజెక్టుల నుంచి నీటి కేటాయింపుల విషయంలో సహకారాన్ని నీటి పారుదల శాఖ అధికారులు అందించాలని సీఎం ఆదేశించారు. అటవీ భూములను అభివృద్ధి పనులకు వినియోగించుకునే విషయంలో దేశవ్యాప్తంగా కొత్త విధానం రానుందని, అటవీశాఖ నుంచి లక్ష ఎకరాలు సేకరించి నష్టపరిహారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
రైట్ ఆఫ్ వే కోసం ఆర్డినెన్స్: తెలంగాణ తాగునీటి పథకం ద్వారానే పట్టణ ప్రాంతాలకూ సురక్షితమైన తాగునీరు అందించాలని సీఎం కేసీఆర్ అధికారులకు సూచించారు. పట్టణాల్లోని వివిధ వాడలకు నీటిని తరలిం చేందుకు పైపులైన్లను ఆయా మున్సిపాల్టీలే నిర్మించుకోవాలన్నారు.సక్రమ నీటి సరఫరాకు పట్టణాల సమీపంలోని గుట్టలను విని యోగించుకోవాలన్నారు. పట్టణాల్లోని కాంటూర్ లెవల్స్‌ను కూడా తీసుకొని పైపులైన్ల నిర్మాణం చేపట్టాలని సీఎం సూచించారు. పైపులైన్ నిర్మాణానికి ‘రైట్ ఆఫ్ వే.. రైట్ ఆఫ్ యూజ్’ ఆర్డినెన్స్‌ను తేవాలని సీఎం నిర్ణయించారు.
620 ఇంజనీర్ పోస్టులకు ఓకే
వాటర్‌గ్రిడ్‌లో 620 ఇంజనీర్ పోస్టులకు సీఎం పచ్చజెండా ఊపారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారానే వీటి భర్తీ చేపట్టాలని ఆదేశించారు. గోదావరి న ది నుంచి మంచినీటిని తరలించే క్రమంలో 3 చోట్ల రైల్వే ట్రాక్‌ను దాటాల్సి వస్తోందని అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. వెంటనే ఆయన దక్షిణమధ్యరైల్వే జనరల్ మేనేజర్ శ్రీవాత్సవతో మాట్లాడగా, ఆయన సానుకూలంగా స్పందించారు. సమావేశంలో మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, ప్రభుత్వ సలహాదారు పాపారావు, పార్లమెంటరీ కార్యదర్శి జలగం వెంకట్రావు, వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు రేమండ్ పీటర్, ఎస్‌కే జోషీ, గోపాల్, జనార్దన్‌రెడ్డి, మిశ్రా, ఇంజనీర్ ఇన్ చీఫ్‌లు సురేందర్‌రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, మురళీధర్, మెట్రోవాటర్ వర్క్స్ ఎండీ జగదీశ్వర్ తదితరులున్నారు.