నెలాఖరులోగా పైప్‌లైన్ టెండర్లు | నెలాఖరులోగా పైప్‌లైన్ టెండర్లు | Sakshi
Sakshi News home page

నెలాఖరులోగా పైప్‌లైన్ టెండర్లు

Published Wed, Jun 17 2015 12:29 AM | Last Updated on Sat, Aug 11 2018 6:34 PM

నెలాఖరులోగా పైప్‌లైన్ టెండర్లు - Sakshi

నెలాఖరులోగా పైప్‌లైన్ టెండర్లు

సేఫ్ స్టేజ్‌కి ఇన్‌టేక్‌వెల్స్ నిర్మాణం
 ఐదు డీపీఆర్‌లకు వ్యాప్కోస్ పచ్చజెండా
 ప్రాజెక్టు పనుల పురోగతిపై
 మంత్రి కేటీఆర్ సమీక్ష

 
 సాక్షి, హైదరాబాద్: తెలంగాణ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ (వాటర్‌గ్రిడ్)కు సంబంధించి ప్రధాన పైప్‌లైన్ ఏర్పాటుకు నెలాఖరులోగా టెండర్లు పిలవాలని గ్రామీణ  నీటిసరఫరా విభాగం నిర్ణయించింది. ప్రాజెక్ట్‌కు సంబంధించి సెగ్మెంట్ల వారీగా అధికారులు రూపొందించిన సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక (డీపీఆర్)లకు వ్యాప్కోస్ నుంచి ఆమోదం లభించిన వెంటనే టెండర్లు పిలిచేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. వాటర్‌గ్రిడ్ ప్రాజెక్ట్ పనుల పురోగతిపై మంగళవారం జరిగిన సమీక్షలో పంచాయతీరాజ్ శాఖ  మంత్రి కె.తారక రామారావు పైప్‌లైన్ టెండర్ల అంశంపై అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు.
 
  ఆర్‌డబ్ల్యూఎస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. వివిధ ప్రాంతాల్లో చేపట్టిన ఇన్‌టేక్‌వెల్స్ అన్నీ దాదాపుగా సేఫ్‌స్టేజ్‌కి వచ్చాయని, దీంతో వాటర్‌గ్రిడ్ పనులను సకాలంలో పూర్తి చేయగలమన్న నమ్మకం ఏర్పడిందన్నారు. ప్రాజెక్ట్ పనులు పూర్తి అయిన వెంటనే ఆయా ప్రాంతాల్లో రక్షిత మంచినీటి సరఫరా జరిగేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించారు. తొలిదశలోనే ఫ్లోరైడ్ బాధిత ప్రాంతమైన నల్లగొండ, కరువు ప్రాంతమైన మహబూబ్‌నగర్ జిల్లాలకు నీళ్లిస్తామని చెప్పారు. గ్రామాల్లో అంతర్గత పైపులైన్ నెట్‌వర్క్, నీటి ట్యాంకుల నిర్మాణం కోసం ప్రత్యేకంగా సర్వే చేయించాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
 
 ఐదు డీపీఆర్‌లకు పచ్చజెండా..
 సెగ్మెంట్ల వారీగా రూపొందించిన డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు (డీపీఆర్)లను వ్యాప్కోస్ పరిశీలన చేస్తోందని, మొత్తం 26 డీపీఆర్‌లలో ఇప్పటికే ఐదింటికి ఆమోదం తెలిపిందన్నారు. వారం రోజుల్లోగా డీపీఆర్‌ల పరిశీలన పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అలాగే.. వాటర్‌గ్రిడ్ ప్రాజెక్ట్ పర్యవేక్షణ నిమిత్తం ఔట్ సోర్సింగ్ పద్ధతిన వర్క్ ఇన్ స్పెక్టర్లు, సీనియర్ అసిస్టెంట్ల నియామకాన్ని వెంటనే చేపట్టాలని కోరారు. వాటర్‌గ్రిడ్ పైప్‌లైన్‌తో పాటు ఫైబర్ ఆప్టిక్ కేబుల్ ఏర్పాటుపై ఐటీశాఖ అధికారులతో త్వరలో సమావేశమవుతున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు.
 
  సమావేశంలో పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి రేమండ్ పీటర్, ఆర్‌డబ్ల్యూఎస్ ఈఎన్‌సీ సురేందర్‌రెడ్డి, సలహాదారు జ్ఞానేశ్వర్ తదితరులున్నారు. ఇదిలా ఉంటే.. పంచాయతీరాజ్ విభాగంలో తెలంగాణకు చెందిన సిబ్బందిని ఆంధ్రప్రదేశ్ కు కేటాయించడంపై ఆగ్రహంతో ఉన్న విషయాన్ని ఉద్యోగులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఉన్నతాధికారులతో చర్చించి తగిన న్యాయం చేస్తామని కేటీఆర్ హామీ ఇవ్వడంతో పరిస్థితి సద్దుమణిగింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement