నల్లగొండ : జిల్లాలో నిర్మించతలపెట్టిన తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లయ్ (టీడీడబ్ల్యూపీ) ప్రాజెక్టు నిర్మాణం అతీగతీ లేకుండా పోతోంది. ప్రభుత్వం తీసుకుంటున్న తొందరపాటు చర్యల వల్ల ప్రాజెక్టు ప్రతిపాదనలు ఓ కొలిక్కి రావడం లేదు. ఇప్పటికే ప్రాజెక్టు డిజైన్ రెండు సార్లు మార్చిన ప్రభుత్వం తాజాగా మూడోసారి డిజైన్ మార్చాలని నిర్ణయించింది. రాష్ట్ర మంత్రులు జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు వాటర్ గ్రిడ్ గురించి ఒక్కోరకంగా ప్రకటనలు చేయడం ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలో మార్పులు చేయడం పరిపాటిగా మారింది. వాటర్ గ్రిడ్ పనులు త్వరితగతిన ప్రారంభించాలని చౌటుప్పల్ వద్ద రూ.1.90 కోట్లతో చేపడుతున్న గ్రిడ్ పైలాన్ పనులు కూడా చివరి దశకు చేరుకున్నాయి. పైప్‌లైన్ సర్వే పనులు కూడా జరుగుతున్నాయి. వీటికోసం ప్రభుత్వం రూ. 2కోట్లు విడుదల చేసింది. పనులు ప్రారంభించేందుకు టెండర్లకు సిద్ధమవుతున్న తరుణంలో ముచ్చటగా మూడోసారీ ప్రతిపాదనలు మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. అది కూడా జిల్లా ప్రజలు, ప్రజాప్రతినిధులు మొదటి నుంచి తీ వ్రంగా వ్యతిరేకిస్తున్న పాత ప్రతిపాదనలకే ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. దీంతో అసలు జిల్లాలో వాటర్‌గ్రిడ్ ఎప్పటికి ప్రారంభమవుతుందో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది.
అంచనా వ్యయం పెరిగినందుకే...
తొలుత ప్రతిపాదించిన దాని కంటే రెండోసారి రూపొందించిన ప్రతిపాదనల అంచనా వ్యయం రెట్టింపు స్థాయిలో ఉంది. అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, సాగర్ ఎడమ కాల్వల, ఉదయసముద్రం, పాలేరు రిజర్వాయర్లను కేంద్రంగా చేసుకుని జిల్లాలో నాలుగుచోట్ల గ్రిడ్‌లు నిర్మిచేందుకు తొలుత ప్రతిపాదించారు. దీనికి గాను అంచనా వ్యయం రూ.3,082 కోట్లు. అయితే ఏకేబీఆర్ నుంచి గ్రిడ్ నిర్మాణం చేపట్టాలనే ప్రతిపాదనను జిల్లా ప్రజలు, విపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. దీంతో పునరాలోచనలో పడిన ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకుంది. శ్రీశైలం బ్యాక్ వాటర్‌నుంచి పైప్‌లైన్ ద్వారా జిల్లాకు కృష్ణా జలాలు సరఫరా చేయాలని ప్రతిపాదించారు. శ్రీశైలం నుంచి డిండి వరకు 50 కి.మీ మేర పైప్‌లైను నిర్మించి కృష్ణాజలాలు తీసుకురావాలనుకున్నారు.
డిండి నుంచి మన జిల్లాలోకి పైప్‌లైన్ తీసుకొచ్చి చింతపల్లి మండలం గొడకొండ్ల వద్ద ప్రతిపాదించిన ట్రీట్‌మెంట్ ప్లాంట్‌లోకి నీరు పంపింగ్ చేయాలని నిర్ణయించారు. ఈ పైప్‌లైన్ ద్వారా భువనగిరి, సూర్యాపేట మండలం ఉండ్రుకొండ, మనగాల మండలం బరాఖత్‌గూడెం వద్ద ప్రతిపాదించిన వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌లు నీటిని తరలించాలని ప్రతిపాదనలు సిద్దం చేశారు. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.5,800 కోట్లు. పాత ప్రాజెక్టుతో పోలిస్తే రూ.2718 కోట్లు అంచనా వ్యయం ఎక్కువ. దాదాపు రెట్టింపు స్థాయిలో ప్రాజెక్టు అంచనా వ్యయం ఎక్కువగా ఉండటంతోపాటు, పైప్‌లైన్ కంపెనీలకు లబ్ధిచేకూర్చేందుకే ప్రభుత్వం శ్రీశైలం బ్యాక్ వాటర్ ప్రతిపాదన తెర మీదకు తీసుకొచ్చిందని ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోశాయి. దీంతో ప్రభుత్వానికి మరో గత్యంతరం లేక ఏకేబీఆర్ నుంచే గ్రిడ్ పనులు చేపట్టాలనే పాత ప్రతిపాదనలకే మొగ్గు చూపింది.
ఏకేబీఆర్ నుంచి సాధ్యమయ్యేనా...!
ఏకేబీఆర్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 1.5 టీఎంసీలు, పుట్టంగండి నీటి సామర్థ్యం 0.4 టీఎ ంసీలు. నాగార్జునసాగర్‌లో పూర్తిస్థాయి నీటి నిల్వలు ఉన్నప్పుడు మాత్రమే ఏకేబీఆర్‌లో రిజర్వాయర్‌లో నీరు పుష్కలంగా ఉంటుంది. ఈ మొత్తం నీటినిల్వలను కేవలం సాగునీటి అవసరాలకు కాకుండా కే వలం తాగునీటి అవసరాలకు మాత్రమే వాడుకుంటే 4 5 రోజుల సరిపోతాయి. అదీగాక హైదరాబాద్ జంటనగరాలకు తాగునీటి అవసరాలకు ఏడాదికి 11 టీఎంసీలు సరఫరా చే స్తున్నారు. ఇక ఏకేబీఆర్ నుంచి ఉదయసముద్రానికి నీటిని తరలించే క్రమంలో తాగునీటితోపాటు, సాగునీటి అవసరాలకు చెరువులు కూడా నింపుతున్నారు. సాగర్‌లో నీటి నిల్వలు సమృద్ధిగా ఉన్నప్పుడు మాత్రమే ఇదంతా సాధ్యమవుతోంది. అయితే ప్రస్తుతం ప్రభుత్వం జిల్లాలో నిర్మించాలనుకుంటున్న నాలుగు గ్రిడ్‌లల్లో మూడు గ్రిడ్‌లు ఏకేబీఆర్ నీటి నిల్వల ఆధారంగా చేసుకునే నిర్మించాల్సి ఉంది. ఈ మూడు గ్రిడ్‌లకు 3.24 టీఎంసీలు నీరు అవసరమవుతాయని అధికారులు ప్రతిపాదించారు. ఐకేబీ ఆర్ నుంచి ప్రస్తుత అవసరాలకు నీరు సరఫరా చేయడం కష్టసాధ్యమవుతోందని..అలాంటి పరిస్థితుల్లో మూడు గ్రిడ్‌లకు ఏకేబీఆర్ నుంచి నీటిని తరలించాల్సిన పరిస్థితే వస్తే ఏమ్మార్పీ పరిధిలో ఆయకట్టు ఎడారిగా మారే ప్రమాదం ఉందని ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి. తొలుత ఏకేబీఆర్ ప్రతిపాదనను విరమించుకున్న ప్రభుత్వం మళ్లీ దానినే తెరమీదకు తీసుకురావడం పట్ల విమర్శలు వెల్లువెత్తే అవకాశం లేకపోలేదు.
ముచ్చటగా..మూడోసారీ!
Published Wed, Mar 11 2015 12:38 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM
Advertisement