నల్లగొండ: నల్లగొండ జిల్లా బీబీ నగర్ సమీపంలో పైపులైన్ల నుంచి డీజిల్ చోరీ చేస్తున్న ముఠాను పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వెళ్లే హెచ్‌పీసీఎల్, ఐఓసీ కంపెనీల పైపులైన్లకు బీబీ నగర్ సమీపంలోని పడమటి సోమవారం దగ్గర కన్నంపెట్టి రోజూ మూడు నుంచి నాలుగు ట్యాంకర్ల మేర కొల్లగొడుతున్నారు. ఈ డీజిల్‌ను నగరంలోని పెట్రోల్ బంకుల్లో అక్రమంగా విక్రయిస్తున్నారు. డీజిల్ చోరీపై అనుమానంతో చమురు కంపెనీల ప్రతినిధులు పోలీసులతో కలసి సోమవారం దాడి చేయగా ముఠా వ్యవహారం రట్టయింది. ముంబైకి చెందిన ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి చోరీకి ఉపయోగించే పనిముట్లను స్వాధీనం చేసుకున్నారు.