
వైస్ చైర్మన్ వర్గీయుల వీరంగం
పంచాయితీకి పిలిచి ఓ యువకుడిని మున్సిపల్ వైస్ చైర్మన్ వైస్ జబివుల్లా వర్గీయులు చితకబాదిన సంఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల మేరకు..
ప్రొద్దుటూరు క్రైం:
పంచాయితీకి పిలిచి ఓ యువకుడిని మున్సిపల్ వైస్ చైర్మన్ వైస్ జబివుల్లా వర్గీయులు చితకబాదిన సంఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల మేరకు.. నడింపల్లెకు చెందిన జాఫర్ హుసేన్ జీవనోపాధి నిమిత్తం సౌదీ అరేబియాకు వెళ్లే ప్రయత్నంలో ఉన్నాడు. ఓ పంచాయితీ విషయమై మాట్లాడాలని వైస్ చైర్మన్ జబివుల్లా అతన్ని కేహెచ్‌ఎం వీధిలోని వాటర్ ప్లాంట్ వద్దకు పిలిపించారు. అతని వెంట మరో 20 మంది దాకా యువకులు రావడంతో వారిని వెళ్లాలని చెప్పడంతో వారు వెళ్లిపోయారు. చేతులు కట్టుకుని నిల్చున్న జాఫర్‌ను అక్కడున్న వైస్ చైర్మన్ వర్గీయులు నానా దుర్భాషలాడారు. చేతులు కట్టుకునే ఉండాలని పక్కకు తీస్తే కొడతామని వారు హెచ్చరించారు. ఈ క్రమంలోనే జబివుల్లా సమక్షంలో సుమారు 20 మంది దాకా జాఫర్ హుసేన్‌పై దాడికి పాల్పడ్డారు. నీ దిక్కున్న చోట చెప్పుకో అంటూ అతన్ని హెచ్చరించారు.
వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో హల్‌చల్
వైస్ చైర్మన్ వర్గీయుల చేతుల్లో దాడికి గురైన జాఫర్ హుసేన్ ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో వన్‌టౌన్‌కు ఫిర్యాదు చేయడానికి వెళ్లాడు. అతనితోపాటు సోదరుడు, తల్లి కూడా స్టేషన్‌కు వెళ్లింది. గతంలో కూడా రెండు సార్లు తనపై దాడికి పాల్పడ్డారని జాఫర్ తెలిపాడు. రంజాన్ మాసంలో ఉపవాసం ఉన్నానని చెప్పినప్పటికీ వదలకుండా నడిరోడ్డుపై చెప్పు కాళ్లతో కొట్టారని అతను అన్నాడు. విషయం తెలుసుకున్న జబివుల్లాతోపాటు అతని వర్గీయులు స్టేషన్‌కు చేరుకున్నారు. ఫిర్యాదు చేయవద్దంటూ జాఫర్ తల్లితో చెప్పగా ఆమె అందుకు అంగీకరించలేదు. ఈ సమయంలోనే కొందరు జాఫర్ హుసేన్‌ను భయపెట్టే ప్రయత్నం చేశారు. కొద్ది సేపు ఇరు వర్గీయులతో
వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ కిటకిటలాడింది. వీళ్లంతా పోలీస్‌స్టేషన్‌లో హల్‌చల్ చేస్తున్నప్పటికీ వారిని అడ్డుకోడానికి పోలీసులు సాహసించలేదు. హాజీబాషా, షేక్షా, బాషాఖాన్‌తోపాటు మరికొందరు తనపై దాడి చేశారని జాఫర్ హుసేన్ ఫిర్యాదు చేశాడు. ఈ విషయమై వన్‌టౌన్ ఎస్‌ఐ చిన్నపెద్దయ్యను వివరణ కోరగా ఓ యువతి విషయమై జరిగిన గొడవలో జాఫర్ హుసేన్ ఫిర్యాదు చేశాడన్నారు. అయితే కోర్టు అనుమతితో కేసు కట్టాల్సి ఉందని ఆయన తెలిపారు.