తలుపులు ధ్వంసం చేసి ఇంట్లోకి వెళ్లి మరీ దాడి
వ్యక్తికి తీవ్ర గాయాలు
ఉప్పల్: రామంతాపూర్‌లో గంజాయి బ్యాచ్ హల్‌చల్ చేసింది. ఏకంగా ఇంట్లోకి చొరబడి ఓ యువకుడిని చితక బాదడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పొలీసులు, బాధితులు తెలిపిన మేరకు..రామంతాపూర్ లక్ష్మీ శ్రీకాంత్‌నగర్ కాలనీలో నివాసముంటున్న బాల నర్సింహ కుమారుడు భరత్ కుమార్(30) ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు.
శుక్రవారం సాయంత్రం తన ఆటోను ఇంటి ముందు పార్క్‌చేసి లోపలకు వెళ్లాడు. అదే సమయంలో నలుగురు వ్యక్తులు వచ్చి ఆటోలో కూర్చుని గంజాయి తాగుతున్నారు. ఇది గమనించిన భరత్ వారిని మందలించడంతో వారు మరికొందరిని పిలిపించారు. దీంతో భరత్ భయపడి ఇంట్లోకి వెళ్లాడు. రెచ్చి పోయిన అల్లరి మూక తలుపులు పగుల గొట్టి ఇంట్లోకి చొరబడి భరత్‌ను విచక్షణా రహితంగా చితక బాదారు.
ఈ దాడిని చూసిన స్థానికులు అక్కడకు వెళ్లడంతో వారు పరారయ్యారు. భరత్‌ను చికిత్స నిమిత్తం ప్రైవేటు అసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయులో ఉంచినట్లు డాక్టర్లు తెలిపారు. దీంతో కాలనీ వాసులంతా ఉప్పల్ పోలీస్‌స్టేషన్ వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కొంత మంది పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment