ఇచ్చినట్లే ఇచ్చి.. లాక్కుంటున్నారు.. | Taxespaid to ration commodities ..! | Sakshi
Sakshi News home page

ఇచ్చినట్లే ఇచ్చి.. లాక్కుంటున్నారు..

Published Thu, Mar 3 2016 2:12 AM | Last Updated on Sun, Sep 3 2017 6:51 PM

ఇచ్చినట్లే ఇచ్చి.. లాక్కుంటున్నారు..

ఇచ్చినట్లే ఇచ్చి.. లాక్కుంటున్నారు..

వందశాతం వసూళ్ల కోసం అడ్డదారులు
వెదిరలో పింఛన్  డబ్బులనుంచి  ఇంటిపన్ను వసూలు
అధికారుల తీరుపై గ్రామస్తుల ఆగ్రహం
ఈవోపీఆర్‌డీపై ఫిర్యాదు
 

 
 రామడుగు :  పేరుకే పింఛన్ల పంపిణీ.. ఒక చేతితో ఇచ్చి.. మరో చేతితో లాక్కున్నట్లుంది అధికారుల నిర్వాకం. గ్రామపంచాయతీల్లో వందశాతం పన్నుల వసూలు కోసం వృద్ధులు, వికలాంగుల పింఛన్లకు ఎసరు పెడుతున్నారు. ఉన్నతాధికారుల మౌఖిక ఆదేశాలతో ముక్కుపిండి వసూలు చేసే కార్యక్రమానికి సిబ్బంది రంగంలోకి దిగారు. దీంతో అధికారుల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నారు గ్రామపంచాయతీల్లో వందశాతం పన్నులు వసూలు చేయాలని జిల్లా స్థారుు అధికారులు ఆదేశాలు జారీ చేశారని గ్రామాల్లో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం పేదలకు ప్రతినెల పింఛన్ ఇస్తుంటే అధికారులు మాత్రం వాటిని పంచాయతీ బిల్లుల కింద జమచేసుకోవడంపై మండలంలోని వెదిర గ్రామస్తులు బుధవారం ఆగ్రహం వ్యక్తంచేశారు. వృద్ధులకు ఇవ్వాల్సిన మొత్తాన్ని తీసుకోవడంపై నిరసన వ్యక్తమైంది.


60మంది వద్ద వసూలు..
వెదిర గ్రామ పంచాయతీలో వృద్ధులకు, వితంతువులు, గీత, చేనేత కార్మికులకు 111 మందికి పింఛన్లు బుధవారం పంపిణీచేశారు. ఇందులో 60 మంది నుంచి సుమారు రూ.50వేలను ఇంటి పన్ను కింద వసూలు చేశారు. బకారుు మొత్తం చెల్లించకుంటే వచ్చేనెల నుంచి పింఛన్ ఇవ్వబోమని ఈవోపీఆర్డీ శశికళ హెచ్చరించడంతో పింఛనుదారులు భయపడి పన్నుచెల్లించారు. విషయం తెలుసుకున్న యువకులు వెళ్లి అధికారులను నిలదీశారు. జిల్లా అధికారుల మౌఖిక ఆదేశాల మేరకే వసూలు చేస్తున్నామని ఈవోపీఆర్‌డీ  చెప్పారు.

గ్రామస్తులు, యువకులు నిలదీయడంతో మిగతా మొత్తాన్ని పంపిణీచేయకుండా ఆమె వెనుదిరిగారు. పింఛన్ డబ్బుల నుంచి ఇంటిపన్నులు వసూలు చేసిన ఈవోపీఆర్‌డీపై గ్రామస్తులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. కాగా.. పింఛన్ డబ్బుల నుంచి ఇంటి పన్నులు వసూలు చేయకూడదని ఎంపీడీవో రాధారాణి తెలిపారు. అధికారులు ఇంటింటా తిరిగి పన్నులు వసూలు చేయాలని మాత్రమే ఆదేశించామని చెప్పారు.
 
 
 పన్ను చెల్లిస్తేనే రేషన్‌సరుకులు..!
శంకరపట్నం: వందశాతం ఇంటి పన్ను వసూళ్లకు రేషన్‌సరుకులను ముడిపెడు బోతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆసరా పింఛన్‌దారులనుంచి ఇంటి పన్ను, నల్లా పన్నుల పేరిట పంచాయతీ కార్యదర్శులు వసూలు చేస్తున్నారు. మార్చి నెలాఖరులోపు వందశాతం పన్నులు వసూలు చేయాలని అధికారులు స్పెషల్‌డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ప్రతినెల గ్రామాల్లో పంపిణీ చేస్తున్న రేషన్ సరుకుల కోసం వచ్చే కార్డుదారుల నుంచి ఇంటి పన్ను బకాయిలు చెల్లిస్తేనే సరుకులు అందించాలని  డీలర్లకు ఆదేశాలు ఇవ్వనున్నట్లు సమచారం. గతంలో మరుగుదొడ్ల నిర్మాణం చేపేట్టేందుకు స్థానికంగా రేషన్ సరుకులను ముడిపెట్టడంతో నిర్మాణాలు జరిగాయి. ప్రస్తుతం పన్నుల వసూళ్లకు అదే విధానాన్ని అవలంబించనున్నారు. అన్ని బకారుులు రావాలంటే రేషన్‌సరుకులను ముడిపెట్టాలని కొందరు ఎంపీడీవోలు కలెక్టర్‌ను కోరినట్లు సమాచారం. ఇంటి పన్నుల కోసం రేషన్‌సరుకుల నిలిపివేయాలన్న ఆదేశాలురాలేదని తహశీల్దార్ సంపత్ చెప్పారు.
 
 
 ఇదెక్కడి న్యాయం..?
వెయ్యి రూపాయలు పింఛన్ ఇచ్చి ఇంటిపన్ను కింద రూ.800లు తీసుకుండ్రు..మందులకు డబ్బులు లేకుండా చేసిండ్రు. గవర్నమెంట్ డబ్బులు మాకు ఇబ్బంది ఉందని ఇస్తుంటే.. ఇలా ఇంటిపన్ను పేర తీసుకోవడం న్యాయమా..?  - బుచ్చమ్మ, పింఛన్‌దారు, వెదిర
 
 మొత్తం తీసుకున్నరు..
 నాకు వె య్యి రూపాయలు పింఛన్ వస్తే ఇంటి పన్ను కిందనే మొత్తం తీసుకున్నరు. నాకు నెల ఖర్చుల కిందకు అవుతాయనుకుంటే ఇలా ఇంటిపన్ను కింద తీసుకుంటే కష్టంగా ఉంటుంది.. - దుద్యాల కిష్టయ్య, వెదిర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement