Ration commodities
-
కొండ గూటికి పండుగొచ్చింది
(వంతాడ నుంచి సాక్షి ప్రతినిధి యిర్రింకి ఉమామహేశ్వరరావు): వంతాడ.. తూర్పు గోదావరి జిల్లా గోకవరం పంచాయతీ పరిధిలోని గిరిజన గూడెం. ఎత్తయిన కొండలు.. ఎటు చూసినా అడవి.. గూడెంలోని గిరిజనులకు ఏ కష్టమొచ్చినా.. ఏ అవసరమొచ్చినా సమీపంలోని పల్లెకు పోవాలంటే దాదాపు 8 నుంచి 10 కిలోమీటర్ల పైగా కొండలు, గుట్టలు దాటుతూ అడవి మార్గంలో కాలినడకన వెళ్లాల్సిందే. మంచినీళ్లు కావాలన్నా.. రేషన్ బియ్యం తెచ్చుకోవాలన్నా.. పింఛను డబ్బులు తీసుకోవాలన్నా కొండల దిగువన గల గోకవరం పోవాల్సిందే. వైద్యం పొందాలన్నా.. అత్యవసరమైన పని వచ్చినా కొండలను దాటుకుంటూ ఏలేశ్వరం వెళ్లాల్సి వచ్చేది. ఇదంతా గతం. ఇప్పుడా పరిస్థితులు మారాయి. ఇంటికే రేషన్ సరుకులు వస్తున్నాయి. ప్రతినెలా ఒకటో తేదీన కోడి కూయక ముందే తలుపు తట్టి మరీ పింఛను సొమ్ములిస్తున్నారు. ‘సాక్షి’ ప్రతినిధి ఆ గ్రామాన్ని సందర్శించగా.. గత సర్కారు హయాంలో తీరని కష్టాలు.. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో తీరుతున్న సమస్యలను అక్కడి గిరిజనులు సంబరంతో చెప్పుకొచ్చారు. సంక్షేమ కార్యక్రమాలు తమ గుండె తలుపుల్ని తడుతున్నాయని వివరించారు. సహపంక్తి భోజనాలతో పెద్దఎత్తున సంబరం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గిరిజనుల గడప ముంగిట చేరుస్తూ ఆ గూడెంలో ఇప్పుడు ఉల్లి లక్ష్మీ పార్వతి, ఎం.లోవకుమారి అనే వలంటీర్లు సేవలందిస్తున్నారు. ప్రభుత్వం ఇంటింటికీ రేషన్ బియ్యం పంపిణీని ప్రారంభించడంతో కొండ పైకి వ్యాన్ వచ్చే దారిలేకపోయినా.. మోటార్ సైకిల్‌పై రేషన్ సరుకులను తీసుకెళ్లి వలంటీర్లే గిరిజనులకు అందిస్తున్నారు. గతంలో రేషన్ సరుకులు తెచ్చుకోవాలంటే కొండల మధ్య కిలోమీటర్ల కొద్దీ కాళ్లీడ్చుకుంటూ గోకవరం వెళ్లాల్సి వచ్చేది. అది రేషన్ డీలర్ అక్కడ అందుబాటులో ఉంటేనే సరుకులు అందేవి. లేదంటే మరోసారి వెళ్లాల్సి వచ్చేది. ఇలా రేషన్ సరుకుల్ని మోసుకుంటూ ఇళ్లకు చేరేసరికి ప్రాణాలు పోయినంత పనయ్యేది. రేషన్ సరుకులు తెచ్చుకునే క్రమంలోను, పింఛన్ల కోసం వెళ్లి వచ్చే సందర్భాల్లోను పలువురు ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు కూడా గతంలో చోటుచేసుకున్నాయి. ఇప్పుడు రేషన్ సరుకులే కాకుండా ప్రతినెలా 1వ తేదీన తెల్లవారుజామునే పింఛను సొమ్ములు అందిస్తున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో చైతన్యవంతమవుతున్న గిరిజనులు ఆస్పత్రులు, ఇతర అత్యవసర పనులపై వెళ్లేందుకు తాజాగా ఓ ఆటోను కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు అత్యవసర పరిస్థితుల్లో ఫోన్ చేస్తే వంతాడకు అంబులెన్స్ వస్తోంది. ఇటీవల ఈ ప్రాంతంలో ప్రభుత్వ నిధులతో మంచినీటి కోసం బోరు వేయడంతో.. గూడెం ప్రజలంతా సహపంక్తి భోజనాలు పెట్టుకుని పెద్ద ఎత్తున సంబరం చేసుకున్నారంటే నీటి కోసం వాళ్లు పడ్డ అవస్థలు ఏపాటివో అవగతమవుతోంది. జీడి తోటలకు కాపలా.. బొగ్గుల అమ్మకంతో జీవనం పచ్చని ప్రకృతి ఒడిలో అలరారుతున్న వంతాడ గిరిజనులు జీడి తోటలకు కాపలా ఉంటూ.. కట్టెల్ని కాల్చగా వచ్చే బొగ్గుల్ని విక్రయించడం ద్వారా వచ్చే డబ్బులతో జీవనం సాగిస్తున్నారు. ప్రతి ఇంటివద్ద ఒక జీలుగ చెట్టు (జీలుగ కల్లు అమ్ముతారు), మేకలు, ఆవుల పెంపకం ఉంటుంది. గుడి (రామాలయం, గంగానమ్మ ఆలయాలు), బడి, అంగన్వాడీ, ఆశా వర్కర్‌తో గిరిజనులు మెరుగైన జీవనం వైపు అడుగులు వేస్తున్నారు. గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు ఉన్నాయి. సంక్షేమ కార్యక్రమాలు ఇలా.. ► గతంలో 24 మంది పింఛనుదారులుంటే.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక అదనంగా మరో 15 మందికి కలిపి ప్రస్తుతం 39 మందికి అందిస్తున్నారు. 125 కుటుంబాలకు నెలనెలా క్రమం తప్పకుండా బైక్‌లపై రేషన్ సరుకులు తీసుకెళ్లి అందిస్తున్నారు. ► అంగన్వాడీ కేంద్రంలో 24 మంది పిల్లలకు పౌష్టికాహారం ఇస్తున్నారు. ► 62 కుటుంబాలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు స్థల సేకరణ కొలిక్కి వచ్చింది. తాత ముత్తాతల నుంచి సాగు చేసుకుంటున్న సుమారు 250 ఎకరాలకు పైగా పోడు భూములపై గిరిజనులకు రైతువారీ హక్కు పట్టాలిచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. గత పాలకులు పట్టించుకోలేదు ఎన్నికలప్పుడు మా గూడెంలోని రావిచెట్టు రచ్చబండ వద్దకు నాయకులొచ్చి ఎన్నో హామీలు ఇచ్చేవారు. ఎన్నికలు అయిపోగానే మర్చిపోయేవారు. దశాబ్దాల తరబడి కనీసం మంచినీటి సౌకర్యం కూడా గత పాలకులు కల్పించలేదు. వైఎస్ జగన్ ప్రభుత్వం 320 అడుగులకు పైగా లోతున బోరు వేసి మంచినీరు అందించి పుణ్యం కట్టుకుంటోంది. మంచినీటి కష్టాలు తీరడంతో గ్రామ దేవత వద్ద సంబరం చేసుకున్నాం. – మాతే ప్రసాద్, గూడెం వాసి, వంతాడ గిరిజన జీవితాల్లో కొత్త వెలుగులు అభివృద్ధి, సంక్షేమం 2 కళ్లుగా భావించి.. రాష్ట్రంలోని గిరిజన జీవితాల్లో కొత్త వెలుగులు నింపేలా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. గిరిజనులకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ సీఎం వైఎస్ జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు ఏజెన్సీ ప్రాంతాల రూపురేఖల్ని మారుస్తున్నాయి. గడచిన రెండేళ్లలో గిరిజనుల సంక్షేమానికి రూ.6,646 కోట్ల వ్యక్తిగత లబ్ధిని చేకూర్చడంతోపాటు రూ.8,012 కోట్ల ఉప ప్రణాళిక నిధులతో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాం. – పాముల పుష్పశ్రీవాణి, ఉప ముఖ్యమంత్రి -
ఊరూరా ఉచిత రేషన్
-
సరుకులు వచ్చాయ్ ఉచిత రేషన్ పంపిణీ
సాక్షి, అమరావతి: కరోనా వైరస్‌ను ఎదుర్కోవడానికి లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో పేదలు ఇబ్బంది పడకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వచ్చే నెల (ఏప్రిల్)లో ఇవ్వాల్సిన ఉచిత రేషన్ సరుకుల పంపిణీని మూడు రోజుల ముందుగానే చేపట్టి పేదల ఆకలి తీర్చుతోంది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం ఉదయం ఆరు గంటలకే 29,620 రేషన్ షాపులను తెరిచి ఉచిత రేషన్ సరుకులను అందించింది. ఇందులో భాగంగా మొదటి రోజు 17.12 లక్షల కుటుంబాలు ఉచిత సరుకులు తీసుకున్నాయి. ఇందులో 3.17 లక్షల కుటుంబాలు పోర్టబిలిటీని సద్వినియోగం చేసుకున్నాయి. ఇందులో వలస కూలీల కుటుంబాలే అధికంగా ఉన్నాయి. రేషన్ కార్డుల్లో నమోదై ఉన్న పేర్లలో ప్రతి ఒక్కరికీ ఐదు కిలోల చొప్పున బియ్యం, కిలో కందిపప్పు అందించారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా.. ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటిస్తూ క్యూ లైన్లో నిలబడి సరుకులు తీసుకున్నారు. ఆయా జిల్లాల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు సరుకుల పంపిణీని ప్రారంభించి పర్యవేక్షించారు. పేదల ఆకలి తీర్చడానికే.. లాక్డౌన్ నేపథ్యంలో పూట గడవటం ఎలా అనే ఆలోచన పేదలకు లేకుండా వచ్చే నెల సరుకులను మూడు రోజులు ముందుగానే ఉచితంగా పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. మార్చి 29 నుంచి ఏప్రిల్ చివరిలోగా మూడుసార్లు ఉచిత రేషన్ సరుకులు ఇవ్వాలని నిర్ణయించారు. పేదలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రతి ఒక్కరికీ సరుకులు అందాలనే ఉద్దేశంతో ఏప్రిల్ 15 వరకు పంపిణీ చేయనున్నారు. దీంతో పేదలు ప్రభుత్వ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. తొలి రోజు ఆదివారం రాష్ట్రంలో పశ్చిమ గోదావరి జిల్లాలో అత్యధికంగా 2.05 లక్షల కుటుంబాలు, అనంతపురం జిల్లాలో అత్యల్పంగా 70,895 కుటుంబాలు ఉచిత సరుకులు తీసుకున్నాయి. సామాజిక దూరం పాటిస్తూ.. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రతి రేషన్ షాపు వద్ద ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ మేరకు అధికారులు ప్రతి రేషన్ షాపు వద్ద ప్రతి మీటర్ దూరానికి ప్రత్యేకంగా మార్కింగ్ వేశారు. లబ్ధిదారుల వేలిముద్రలు తీసుకోకుండా వీఆర్వో, గ్రామ సచివాలయ ఉద్యోగుల బయోమెట్రిక్ ద్వారా సరుకులు పంపిణీ చేశారు. చేతులు శుభ్రం చేసుకునేందుకు సబ్బు, నీళ్లు, శానిటైజర్లు అందుబాటులో ఉంచారు. గ్రామ వలంటీర్లు, ఇతర సిబ్బంది కార్డుదారులకు సహాయమందించారు. కొన్ని రేషన్ దుకాణాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తగా అధికారులు వెంటనే పరిష్కరించారు. -
లబ్ధిదారులకు బయోమెట్రిక్ లేదు
సాక్షి, అమరావతి: కరోనా వ్యాప్తి చెందకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం రేషన్ దుకాణాల వద్ద ప్రజలు గుమిగూడకుండా సరుకుల పంపిణీ సమయంలో నలుగురు చొప్పున మాత్రమే లబ్ధిదారులను అనుమతించాలని నిర్ణయించింది. కరోనా నివారణ చర్యల్లో భాగంగా ఏప్రిల్ నెల రేషన్ సరుకులను వీఆర్వో బయోమెట్రిక్ ద్వారా లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నట్లు పౌరసరఫరాల శాఖ ఎక్స్ అఫీషియో కార్యదర్శి కోన శశిధర్ బుధవారం ‘సాక్షి’ ప్రతినిధికి తెలిపారు. గతంలో ఈ–పాస్ ద్వారా లబ్ధిదారుడి వేలిముద్రలు తీసుకొని సరుకులు పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. కరోనా నేపథ్యంలో లబ్ధిదారులకు బయోమెట్రిక్ రద్దు చేసినట్లు చెప్పారు. - రేషన్ డీలర్లు తప్పని సరిగా మాస్కులు ధరించాలి. చేతులు శుభ్రం చేసుకునేందుకు రేషన్ షాపుల వద్ద సబ్బు/శానిటైజర్, నీళ్లు అందుబాటులో ఉంచాలి. - సబ్సిడీ సరుకుల కోసం వచ్చే కార్డుదారులు కూడా తప్పనిసరిగా మాస్కులు ధరించాలి. లేదా ముఖానికి టవల్ కట్టుకోవాలి. - సరుకుల కోసం లబ్ధిదారులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈనెల 29వ తేదీ నుండి వచ్చే నెల 15వ తేదీ వరకు ఏప్రిల్ నెల కోటా సరుకులు పంపిణీ చేస్తాం. అయితే ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రేషన్ షాపుల వద్ద నలుగురు చొప్పున లబ్ధిదారులను విడతలవారీగా అనుమతిస్తాం. - కార్డుదారులకు బియ్యం, కిలో కందిపప్పు ఉచితంగా పంపిణీ చేస్తాం. - మార్చి 29 నుంచి ఏప్రిల్ 15 వరకు సరుకుల పంపిణీ కోసం రేషన్ షాపులు తప్పనిసరిగా తెరిచి ఉంచాలి. - రేషన్ షాపుల వద్ద అత్యవసర వైద్య సేవల నంబర్లు ప్రదర్శించాలి. - ఏప్రిల్ 4వ తేదీన వలంటీర్లు ద్వారా లబ్ధిదారులకు ఇళ్ల వద్దే రూ. 1,000 చొప్పున నగదు సాయం అందజేస్తాం. - ఈసారి వీఆర్వో బయోమెట్రిక్ ద్వారా సరుకులు పంపిణీ చేస్తాం. వీఆర్వోలు రేషన్ షాపుల వద్ద తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని ఇప్పటికే ఆదేశించాం. -
వలస కుటుంబాలకు ఊరట
సాక్షి, అమరావతి: రేషన్ బియ్యం కార్డులున్న పేదలు దేశంలోని ఏ ప్రాంతంలోనైనా సబ్సిడీపై ఇచ్చే సరుకులు తీసుకునే వెసులుబాటు లభించింది. ముఖ్యంగా వలస కార్మికులు దీని వల్ల బాగా లబ్దిపొందుతున్నారు. ఈ విధానాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పకడ్బందీగా అమలు చేస్తున్నాయి. ఎక్కడి నుంచైనా రేషన్ తీసుకునే విధానం (పోర్టబిలిటీ) ఇటీవలి వరకు కేవలం రాష్ట్ర పరిధిలో మాత్రమే ఎక్కడైనా తీసుకోవచ్చనే నిబంధన ఉండేది. అయితే వలస కూలీలను దృష్టిలో ఉంచుకొని ఏ రాష్ట్రంలోనైనా సరుకులు తీసుకోవచ్చనే విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ఇటీవల అమల్లోకి తెచ్చింది. వ్యయప్రయాసలు తప్పాయి... రాష్ట్రం నుండి ఎక్కువగా కర్ణాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ట్రలకు పనుల కోసం వలసలు వెళ్తుంటారు. ఇలాంటి కూలీలకు ఎంతో ప్రయోజనం కలగుతోంది. ఇప్పటి వరకూ ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లిన కూలీల కుటుంబాల్లో ఒకరు అనేక వ్యయప్రయాసలతో సొంత రాష్ట్రానికి వచ్చి సరుకులు తీసుకెళ్లేవారు. గత కొద్ది నెలలనుంచీ ఆయా రాష్ట్రాల్లో కూడా తీసుకునే వెసులుబాటు అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు తెలంగాణలోనూ, తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారు ఆంధ్రప్రదేశ్‌లో పోర్టబిలిటీ విధానాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇదే తరహాలో ఇతర రాష్ట్రాల్లో కూడా సరుకులు తీసుకోవచ్చని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో 1.47 కోట్ల రేషన్ కార్డులు ఉంటే డిసెంబర్ నెలలో రాష్ట్రం పరిధిలోని వివిధ జిల్లాల్లో 31.48 లక్షల మంది పోర్టబిలిటీని వినియోగించుకున్నారు. రాష్ట్రంలో ఉన్న మొత్తం కార్డులు, ఇతర జిల్లాల్లో సరుకులు తీసుకున్న వారి వివరాలిలా ఉన్నాయి. -
ఇచ్చినట్లే ఇచ్చి.. లాక్కుంటున్నారు..
వందశాతం వసూళ్ల కోసం అడ్డదారులు వెదిరలో పింఛన్ డబ్బులనుంచి ఇంటిపన్ను వసూలు అధికారుల తీరుపై గ్రామస్తుల ఆగ్రహం ఈవోపీఆర్డీపై ఫిర్యాదు రామడుగు : పేరుకే పింఛన్ల పంపిణీ.. ఒక చేతితో ఇచ్చి.. మరో చేతితో లాక్కున్నట్లుంది అధికారుల నిర్వాకం. గ్రామపంచాయతీల్లో వందశాతం పన్నుల వసూలు కోసం వృద్ధులు, వికలాంగుల పింఛన్లకు ఎసరు పెడుతున్నారు. ఉన్నతాధికారుల మౌఖిక ఆదేశాలతో ముక్కుపిండి వసూలు చేసే కార్యక్రమానికి సిబ్బంది రంగంలోకి దిగారు. దీంతో అధికారుల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నారు గ్రామపంచాయతీల్లో వందశాతం పన్నులు వసూలు చేయాలని జిల్లా స్థారుు అధికారులు ఆదేశాలు జారీ చేశారని గ్రామాల్లో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం పేదలకు ప్రతినెల పింఛన్ ఇస్తుంటే అధికారులు మాత్రం వాటిని పంచాయతీ బిల్లుల కింద జమచేసుకోవడంపై మండలంలోని వెదిర గ్రామస్తులు బుధవారం ఆగ్రహం వ్యక్తంచేశారు. వృద్ధులకు ఇవ్వాల్సిన మొత్తాన్ని తీసుకోవడంపై నిరసన వ్యక్తమైంది. 60మంది వద్ద వసూలు.. వెదిర గ్రామ పంచాయతీలో వృద్ధులకు, వితంతువులు, గీత, చేనేత కార్మికులకు 111 మందికి పింఛన్లు బుధవారం పంపిణీచేశారు. ఇందులో 60 మంది నుంచి సుమారు రూ.50వేలను ఇంటి పన్ను కింద వసూలు చేశారు. బకారుు మొత్తం చెల్లించకుంటే వచ్చేనెల నుంచి పింఛన్ ఇవ్వబోమని ఈవోపీఆర్డీ శశికళ హెచ్చరించడంతో పింఛనుదారులు భయపడి పన్నుచెల్లించారు. విషయం తెలుసుకున్న యువకులు వెళ్లి అధికారులను నిలదీశారు. జిల్లా అధికారుల మౌఖిక ఆదేశాల మేరకే వసూలు చేస్తున్నామని ఈవోపీఆర్డీ చెప్పారు. గ్రామస్తులు, యువకులు నిలదీయడంతో మిగతా మొత్తాన్ని పంపిణీచేయకుండా ఆమె వెనుదిరిగారు. పింఛన్ డబ్బుల నుంచి ఇంటిపన్నులు వసూలు చేసిన ఈవోపీఆర్డీపై గ్రామస్తులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. కాగా.. పింఛన్ డబ్బుల నుంచి ఇంటి పన్నులు వసూలు చేయకూడదని ఎంపీడీవో రాధారాణి తెలిపారు. అధికారులు ఇంటింటా తిరిగి పన్నులు వసూలు చేయాలని మాత్రమే ఆదేశించామని చెప్పారు. పన్ను చెల్లిస్తేనే రేషన్‌సరుకులు..! శంకరపట్నం: వందశాతం ఇంటి పన్ను వసూళ్లకు రేషన్‌సరుకులను ముడిపెడు బోతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆసరా పింఛన్దారులనుంచి ఇంటి పన్ను, నల్లా పన్నుల పేరిట పంచాయతీ కార్యదర్శులు వసూలు చేస్తున్నారు. మార్చి నెలాఖరులోపు వందశాతం పన్నులు వసూలు చేయాలని అధికారులు స్పెషల్‌డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ప్రతినెల గ్రామాల్లో పంపిణీ చేస్తున్న రేషన్ సరుకుల కోసం వచ్చే కార్డుదారుల నుంచి ఇంటి పన్ను బకాయిలు చెల్లిస్తేనే సరుకులు అందించాలని డీలర్లకు ఆదేశాలు ఇవ్వనున్నట్లు సమచారం. గతంలో మరుగుదొడ్ల నిర్మాణం చేపేట్టేందుకు స్థానికంగా రేషన్ సరుకులను ముడిపెట్టడంతో నిర్మాణాలు జరిగాయి. ప్రస్తుతం పన్నుల వసూళ్లకు అదే విధానాన్ని అవలంబించనున్నారు. అన్ని బకారుులు రావాలంటే రేషన్‌సరుకులను ముడిపెట్టాలని కొందరు ఎంపీడీవోలు కలెక్టర్‌ను కోరినట్లు సమాచారం. ఇంటి పన్నుల కోసం రేషన్‌సరుకుల నిలిపివేయాలన్న ఆదేశాలురాలేదని తహశీల్దార్ సంపత్ చెప్పారు. ఇదెక్కడి న్యాయం..? వెయ్యి రూపాయలు పింఛన్ ఇచ్చి ఇంటిపన్ను కింద రూ.800లు తీసుకుండ్రు..మందులకు డబ్బులు లేకుండా చేసిండ్రు. గవర్నమెంట్ డబ్బులు మాకు ఇబ్బంది ఉందని ఇస్తుంటే.. ఇలా ఇంటిపన్ను పేర తీసుకోవడం న్యాయమా..? - బుచ్చమ్మ, పింఛన్‌దారు, వెదిర మొత్తం తీసుకున్నరు.. నాకు వె య్యి రూపాయలు పింఛన్ వస్తే ఇంటి పన్ను కిందనే మొత్తం తీసుకున్నరు. నాకు నెల ఖర్చుల కిందకు అవుతాయనుకుంటే ఇలా ఇంటిపన్ను కింద తీసుకుంటే కష్టంగా ఉంటుంది.. - దుద్యాల కిష్టయ్య, వెదిర -
మళ్లీ మొదటికి!
విజయనగరం కంటోన్మెంట్: రేషన్ సరుకుల పంపిణీకి నిర్ణీత గడువు విధించినా క్షేత్రస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు. ప్రతి నెలా పదో తేదీనాటికి సరుకుల పంపిణీ పూర్తి చేయాలని జిల్లా స్థాయిలో ఆదేశాలున్నాయి. అయితే సాంకేతిక సమస్యలతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీని వల్ల జిల్లాలో రేషన్ సరుకుల పంపిణీ దాదాపు 40 శాతం నిలిచిపోయింది. కొత్త సర్వర్ ఏర్పాటు, మెషీన్ల మరమ్మతులు, నెట్వర్క్ అందుబాటులో లేకపోవడం, ఇంటర్నెట్ పనిచేయకపోవడం తదితర కారణాలతో పంపిణీలో జాప్యం చోటుచేసుకుంటోంది. జిల్లా వ్యాప్తంగా దాదాపు ఏడు లక్షల తెల్ల కార్డులున్నాయి. మొత్తం 1,388 రేషన్ డిపోలకు 15 ఎంఎల్ఎస్ పాయింట్ల ద్వారా రేషన్ సరుకులను ఈవెయింగ్ ద్వారా అందజేస్తున్నారు. అక్కడి నుంచి ఈ-పాస్ మెషీన్ల ద్వారా గ్రామాలు, వార్డుల్లోని రేషన్ షాపుల నుంచి లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నారు. జిల్లాలో ఈ నెల నుంచి ఎన్ఐసీకి సంబంధించిన నెట్‌వర్క్‌లో సర్వర్‌ను అనుసంధానం చేశారు. సరుకుల పంపిణీకి గడువు విధించిన అధికారులు.. అవాంతరాలను ఎలా ఎదుర్కోవాలో స్పష్టంగా చెప్పలేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొత్త సర్వర్‌కు ఇంకా అలవాటు పడని మెషీన్లతో సమస్యలు ఏర్పడుతున్నాయి. అన్ని రేషన్ షాపుల్లో ఈ నెల 10 నాటికి రేషన్ సరుకులు పంపిణీని పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. మరో పక్క ఈ నెల 15తో సర్వర్‌ను కూడా నిలిపివేసేందుకు సివిల్‌సప్లయ్ ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఈలోగా జిల్లాలో పూర్తిస్థాయిలో రేషన్ సరుకులు వినియోగదారులకు అందే పరిస్థితి లేనట్టుగా కనిపిస్తోంది. ఉన్నతాధికారులతో చర్చించాలిగా.. జిల్లా అధికారులకు లక్ష్యాలిచ్చి వదిలేయడంతో ఈ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు కనపడుతోంది. కలెక్టర్, జేసీ స్థాయిలోని వారే సంబంధిత కమిషన ర్ తదితరులతో మాట్లాడి మెషీన్ల మరమ్మతులు, నెట్వర్క్ సమస్యలను పరిష్కరిస్తే ఇబ్బందులు తొలగే పరిస్థితి ఉంది. లేకుంటే ఎన్నాళ్లయినా ఈ-పాస్‌తో సమస్యలు తప్పేలా లేవు. శనివారం ఉదయం డీఎస్ఓ నాగేశ్వరరావు, ఏఎస్ఓ శంకరపట్నాయక్ తదితరులు.. పాత, కొత్త ఏజెన్సీల సాంకేతిక సిబ్బందితో సహా ఏయే రేషన్ షాపుల్లో పంపిణీ నిలిచిపోయిందో వారికి అదనపు మెషీన్లు ఇవ్వడం, మరమ్మతులు చేయించడం, లాగిన్ అయ్యాయా లేదానన్న విషయాలపై సమీక్షించారు. కానీ ఈ పరిస్థితిలో పెద్దగా మార్పు లేదు. మళ్లీ సర్వర్ నిలిచిపోయేనాటికి ఇవ్వాల్సిన సరుకులు ఓపెనింగ్ బ్యాలెన్స్‌లోకి వెళ్లిపోవడం ఖాయం! ఇకనయినా ఉన్నతాధికారులు చొరవ చూపిస్తేనే సమస్యకు శాశ్వత పరిష్కారం కలిగే అవకాశం ఉంది.