సాక్షి, అమరావతి: కరోనా వైరస్‌ను ఎదుర్కోవడానికి లాక్‌డౌన్ ప్రకటించిన నేపథ్యంలో పేదలు ఇబ్బంది పడకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వచ్చే నెల (ఏప్రిల్)లో ఇవ్వాల్సిన ఉచిత రేషన్ సరుకుల పంపిణీని మూడు రోజుల ముందుగానే చేపట్టి పేదల ఆకలి తీర్చుతోంది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం ఉదయం ఆరు గంటలకే 29,620 రేషన్ షాపులను తెరిచి ఉచిత రేషన్ సరుకులను అందించింది. ఇందులో భాగంగా మొదటి రోజు 17.12 లక్షల కుటుంబాలు ఉచిత సరుకులు తీసుకున్నాయి. ఇందులో 3.17 లక్షల కుటుంబాలు పోర్టబిలిటీని సద్వినియోగం చేసుకున్నాయి. ఇందులో వలస కూలీల కుటుంబాలే అధికంగా ఉన్నాయి. రేషన్ కార్డుల్లో నమోదై ఉన్న పేర్లలో ప్రతి ఒక్కరికీ ఐదు కిలోల చొప్పున బియ్యం, కిలో కందిపప్పు అందించారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా.. ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటిస్తూ క్యూ లైన్లో నిలబడి సరుకులు తీసుకున్నారు. ఆయా జిల్లాల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు సరుకుల పంపిణీని ప్రారంభించి పర్యవేక్షించారు.
పేదల ఆకలి తీర్చడానికే..
లాక్‌డౌన్ నేపథ్యంలో పూట గడవటం ఎలా అనే ఆలోచన పేదలకు లేకుండా వచ్చే నెల సరుకులను మూడు రోజులు ముందుగానే ఉచితంగా పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. మార్చి 29 నుంచి ఏప్రిల్ చివరిలోగా మూడుసార్లు ఉచిత రేషన్ సరుకులు ఇవ్వాలని నిర్ణయించారు. పేదలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రతి ఒక్కరికీ సరుకులు అందాలనే ఉద్దేశంతో ఏప్రిల్ 15 వరకు పంపిణీ చేయనున్నారు. దీంతో పేదలు ప్రభుత్వ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. తొలి రోజు ఆదివారం రాష్ట్రంలో పశ్చిమ గోదావరి జిల్లాలో అత్యధికంగా 2.05 లక్షల కుటుంబాలు, అనంతపురం జిల్లాలో అత్యల్పంగా 70,895 కుటుంబాలు ఉచిత సరుకులు తీసుకున్నాయి.
సామాజిక దూరం పాటిస్తూ..
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రతి రేషన్ షాపు వద్ద ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ మేరకు అధికారులు ప్రతి రేషన్ షాపు వద్ద ప్రతి మీటర్ దూరానికి ప్రత్యేకంగా మార్కింగ్ వేశారు. లబ్ధిదారుల వేలిముద్రలు తీసుకోకుండా వీఆర్వో, గ్రామ సచివాలయ ఉద్యోగుల బయోమెట్రిక్ ద్వారా సరుకులు పంపిణీ చేశారు. చేతులు శుభ్రం చేసుకునేందుకు సబ్బు, నీళ్లు, శానిటైజర్‌లు అందుబాటులో ఉంచారు. గ్రామ వలంటీర్లు, ఇతర సిబ్బంది కార్డుదారులకు సహాయమందించారు. కొన్ని రేషన్ దుకాణాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తగా అధికారులు వెంటనే పరిష్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment