అధైర్య పడొద్దు | CM YS Jaganmohan Reddy Comments On Covid-19 Prevention | Sakshi
Sakshi News home page

అధైర్య పడొద్దు

Published Thu, Apr 2 2020 3:05 AM | Last Updated on Thu, Apr 2 2020 5:12 AM

CM YS Jaganmohan Reddy Comments On Covid-19 Prevention - Sakshi

కరోనా సోకిన వారిని వేరుగా చూడకండి. మంచిగా చూసుకోండి. వారిపై ఇంకా ఎక్కువ మానవత్వం చూపాలి. వివక్ష చూపొద్దు. వారు మన నుంచి ఆశించేది కాస్త ఆప్యాయత, ప్రేమ మాత్రమే. ప్రైవేట్‌ ఆసుపత్రులు, వైద్య కళాశాలలకు చెందిన వారు, వైద్యులు, నర్సులు, పారా మెడికల్‌ సిబ్బంది.. అందరూ కూడా కరోనా కట్టడి కార్యక్రమంలో భాగస్వాములై క్రియాశీల పాత్ర పోషించాలి.

కరోనా వైరస్‌ (కోవిడ్‌–19) ఒక జ్వరం వంటిదే. మందులు వేసుకుని,14 రోజుల పాటు జాగ్రత్తగా స్వీయ నిర్బంధంలో ఉంటే తప్పనిసరిగా నయం అవుతుంది. ఎవరిలోనైనా వైరస్‌ లక్షణాలు కనిపిస్తే 104కు ఫోన్‌ చేస్తే వైద్యులు వచ్చి, చికిత్స చేస్తారు. అవసరమైతే ఆసుపత్రికి తరలిస్తారు. భయాందోళనకు గురికావద్దు.
– సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

సాక్షి, అమరావతి: కరోనా వ్యాధి విస్తరణ చూసి అధైర్య పడవద్దని, వైరస్‌ నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందని సీఎం వైఎస్‌ జగన్‌ ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు భరోసా ఇచ్చారు. వైరస్‌ను కట్టడి చేయడానికి చేపడుతున్న చర్యలకు ఎలాంటి ఆటంకం కలుగకుండా ఏర్పాట్లు చేశామని చెప్పారు. కోవిడ్‌–19 నివారణ, నియంత్రణ చర్యల్లో భాగంగా కొనసాగుతున్న లాక్‌ డౌన్‌ నేపథ్యంలో బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. వైరస్‌ లక్షణాలు ఉన్న వారిని గుర్తించడంతో పాటు, వారికి వెంటనే చికిత్స అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతమైన విధానాన్ని అవలంబిస్తోందన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ ఇంకా ఏమన్నారంటే..

వారందరికీ వైద్య పరీక్షలు..
► ఇప్పటి వరకు రాష్ట్రంలో 87 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో దాదాపు 70 మంది ఢిల్లీకి వెళ్లి వచ్చిన వారే. రాష్ట్రం నుంచి 1,085 మంది ఢిల్లీకి వెళ్లి వచ్చారు. వారిలో 585 మందిని పరీక్ష చేయగా 70 కేసులు పాజిటివ్‌ వచ్చాయి. మిగతా వారి ఫలితాలు రావాల్సి ఉంది. (సీఎం మాట్లాడే సమయానికి తెలిసిన వివరాలివి)
► ఇంకా 21 మంది జాడ తెలియడం లేదు. కాబట్టి వారు గానీ, వారి కుటుంబ సభ్యులు కానీ, వారితో కాంటాక్ట్‌లో ఉన్న వారు కానీ తమంతట తాముగా ముందుకు వచ్చి 104కు ఫోన్‌ చేసి పరీక్ష చేయించుకోవాలి.
► వలంటీర్లు, ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు, రిసోర్స్‌ పర్సన్లు ప్రతి ఇంటికి వచ్చి సర్వే చేస్తున్నారు కాబట్టి ఎవరికి ఆరోగ్యం బాగా లేకున్నా, జ్వరంగా ఉన్నా, శ్వాసకోశ సంబంధ సమస్యలున్నా ఏ మాత్రం సంకోచం లేకుండా చెప్పండి. వెంటనే మీకు వైద్యం అందుతుంది. 
► కరోనా వైరస్‌ సోకిన వారిలో 81 శాతం మంది ఇళ్లలోనే ఉండి వైద్యం చేయించుకుని బాగయ్యారు. వైద్యం చేయించుకుంటూ 14 రోజుల పాటు స్వీయ నిర్భంధంలో ఉంటే చాలు. ఏ సమస్యా ఉండదు. 14 శాతం మంది మాత్రమే ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. వారిలో కేవలం 4 నుంచి 5 శాతం మాత్రమే ఐసీయులో చికిత్స పొందుతున్నారు. 
 
ఆదాయం తగ్గింది.. ఖర్చు పెరిగింది
► రాష్ట్రంలో కరోనా దాడి వల్ల ఆదాయం పూర్తిగా మందగించిన పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకు తోడ్పాటు అందించడంలో ఖర్చులు విపరీతంగా పెరిగాయి. అనుకోని విధంగా ఖజానాపై ఆర్థిక భారం చాలా పడింది.
► ఈ తరుణంలో వేతనాలను వాయిదా వేసుకోవడానికి సహకరించిన ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు, కాంట్రాక్ట్, ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బంది, పెన్షనర్లకు ధన్యవాదాలు. మీకు కష్టమనిపించినా సహకరించినందుకు హృదయ పూర్వక కృతజ్ఞతలు.
► వ్యవసాయం చేసుకుంటున్న రైతులు, రైతు కూలీలు, ఆక్వా రంగంలో ఉన్న రైతులు, రైతు కూలీలు మధ్యాహ్నం 1 గంట వరకు పనులు చేసుకోండి. ఏ ఇబ్బందీ లేదు. వ్యవసాయం, రైతులు, రైతు కూలీలు బతకాలి కాబట్టి ప్రభుత్వం ఎవరినీ ఆక్షేపించడం లేదు. కానీ, ఒక సూచన. మీరు పనులు చేసుకునేటప్పుడు  ఒక్కొక్కరి మధ్య కనీసం మీటరు దూరం ఉండేలా చూసుకోండి. 
– ఆక్వా రంగంలోని ప్రాసెసింగ్‌ యూనిట్లు, వ్యవసాయ రంగానికి చెందిన ఆయిల్, పప్పు, రైస్‌ మిల్లులు, యూనిట్లలో ఎవరి పని వారు చేసుకోవచ్చు. 

ఏదో అయిపోతుందని అనుకోవద్దు
► రెండు రోజులుగా రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య గణనీయంగా పెరగడం బాధ కలిగిస్తోంది. ఢిల్లీలో జరిగిన సదస్సుకు ఇక్కడి నుంచి వెళ్లి వచ్చిన వారికి వైరస్‌ సోకింది. అందుకే ఢిల్లీకి వెళ్లిన వారిని, వారితో ప్రయాణించిన వారిని, వారితో కలిసిన (కాంటాక్ట్‌లో ఉన్న) ప్రతి ఒక్కరిని గుర్తించేందుకు ప్రభుత్వం గట్టి ప్రయత్నం చేస్తోంది. వారికి వైరస్‌ సోకిందనే విషయం ఇక్కడికి వచ్చేదాకా తెలియదు.
► ఈ వైరస్‌ ఒక స్టిగ్మా మాదిరి.. అది వస్తే ఏదేదో జరిగిపోతుందని ఎవరూ అనుకోవద్దు. ఈ వైరస్‌ కూడా దాదాపు ఒక జ్వరం, ఫ్లూ వంటిదే. కాకపోతే వయో వృద్ధులు, అనారోగ్యంతో బాధ పడుతున్న వారిపై ఇది కాస్త ఎక్కువ ప్రభావం చూపుతుంది. కాబట్టి ఎవరూ అధైర్యపడొద్దు.
► కరోనా ఒకరి నుంచి ఒకరికి వ్యాపించే వైరస్‌ మాత్రమే. దేశ ప్రధానులు, వారి కుటుంబ సభ్యులకు కూడా కరోనా వైరస్‌ సోకడం, ఆ తర్వాత వారు చికిత్స పొంది ఆరోగ్యవంతులు కావడం చూశాం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement