ఏపీ: పేదల ముంగిటకు ఉచిత రేషన్‌ | AP govt begins trial of doorstep ration delivery services in Machilipatnam | Sakshi
Sakshi News home page

పేదల ముంగిటకు ఉచిత రేషన్‌

Published Fri, Apr 17 2020 5:17 AM | Last Updated on Fri, Apr 17 2020 8:59 AM

AP govt begins trial of doorstep ration delivery services in Machilipatnam - Sakshi

విజయవాడలో రెడ్‌జోన్‌లో ఉన్న విద్యాధరపురంలో ఇంటికే రేషన్‌ పంపిణీ చేస్తున్న వలంటీర్లు

సాక్షి, అమరావతి: లాక్‌డౌన్‌ నేపథ్యంలో రేషన్‌ దుకాణాల ద్వారా పేదలకు ఉచితంగా రెండో విడత అందిస్తున్న సరుకుల పంపిణీ గురువారం సజావుగా ప్రారంభమైంది. రేషన్‌ దుకాణాల వద్ద రద్దీని నివారించేందుకు టైం స్లాట్‌తో కూడిన కూపన్లు జారీ చేయడంతో నిర్దేశించిన సమయానికి చేరుకుని వేచి చూడాల్సిన పని లేకుండా సరుకులు తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఒక్కో కుటుంబానికి కిలో శనగలు, రేషన్‌ కార్డులో నమోదైన ప్రతి సభ్యుడికి 5 కిలోల చొప్పున బియ్యం ఉచితంగా అందచేశారు. కరోనా వైరస్‌ ప్రభావంతో రెడ్‌ జోన్లుగా ప్రకటించిన ప్రాంతాల్లో ప్రభుత్వం నేరుగా లబ్ధి్దదారుల ఇళ్లకే ఉచిత రేషన్‌ సరుకులను అంద చేసింది. బయోమెట్రిక్‌ లేకుండా భౌతిక దూరాన్ని పాటించేలా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. లాక్‌డౌన్‌ వల్ల పేదలు ఆకలితో వస్తులు ఉండకూడదనే ఉద్దేశంతో సీఎం వైఎస్‌ జగన్‌ ఈ నెలలో మూడు దఫాలు ఉచితంగా రేషన్‌ సరుకులు పంపిణీ చేయాలని ఆదేశించిన విషయం తెలిసిందే. మొదటి విడత సరుకులను గత నెల 29 నుంచి ఈ నెల 15 వరకు పంపిణీ చేశారు.

పంపిణీ ఇలా..
► కొందరు డీలర్లు ఉదయం ఆరు గంటల నుంచే సరుకుల పంపిణీ ప్రారంభించారు. పౌరసరఫరాల శాఖ ఎక్స్‌ అఫీషియో కార్యదర్శి కోన శశిధర్‌ ఉదయం 5 గంటలకే కమాండ్‌ కంట్రోల్‌ రూం నుంచి ఎప్పటికప్పుడు జాయింట్‌ కలెక్టర్లతో పర్యవేక్షించారు.
► రెండో విడత ఉచిత సరుకులను మొదటిరోజు 18,33,245 కుటుంబాలకు పంపిణీ చేశారు.
► పోర్టబిలిటీ ద్వారా 3,51,185 కుటుంబాలు సరుకులు తీసుకున్నాయి. రాష్ట్రంలో అత్యధికంగా కృష్ణా జిల్లాలో 56,659, అత్యల్పంగా శ్రీకాకుళం జిల్లాలో 10 కుటుంబాలు పోర్టబిలిటీని వినియోగించుకున్నాయి.
► రాష్ట్రవ్యాప్తంగా 26,712.441 టన్నుల బియ్యం, 1,714.302 టన్నుల శనగలు తొలిరోజు పంపిణీ చేశారు.
► రేషన్‌ షాపుల వద్ద శానిటైజర్, సబ్బు, నీటిని అందుబాటులో ఉంచారు.

రెడ్‌ జోన్లలో ఇంటికే రేషన్‌
– విశాఖ జిల్లాలో 2,179 రేషన్‌ దుకాణాలతో పాటు 1,817 తాత్కాలిక కౌంటర్ల ద్వారా ఉచిత సరుకుల పంపిణీ చేపట్టారు. తొలిరోజు జిల్లా వ్యాప్తంగా 1,15,014 మందికి సరుకులు అందచేశారు. రెడ్‌జోన్‌ ప్రాంతాలైన పద్మనాభం మండలం రేవిడి వెంకటాపురం, పాయకరావుపేట, నర్సీపట్నం ప్రాంతాల్లో లబిŠాధ్దరులకు ఇంటి వద్దే వలంటీర్లు ఉచిత సరుకులు పంపిణీ చేశారు.
– కరోనా కేసులు అధికంగా నమోదు కావడంతో రెడ్‌ జోన్‌గా ప్రకటించిన ప్రకాశం జిల్లా ఒంగోలులోని ఇస్లాంపేటలో వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్లకే వెళ్లి ఉచిత రేషన్‌ సరుకులు అందజేశారు.

పేదింటిని కాపాడారు..
తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం మండలం జగన్నాయకులపాలేనికి చెందిన భూమాడి సత్తిరాజు చేనేత కార్మికుడు. ఆయన పనిచేసే బట్టల దుకాణం లాక్‌డౌన్‌తో మూత పడటంతో ఆందోళనకు గురయ్యాడు. ప్రభుత్వం ఉచితంగా రేషన్‌ సరుకులు అందించడంతో పాటు రూ.వెయ్యి నగదు సాయం కూడా చేయడంపై పేదింటిని కాపాడిన దేవుడు ముఖ్యమంత్రి జగన్‌ అని కృతజ్ఞతలు తెలిపాడు.

కరోనా ఉన్నా ఆగలేదు..
‘కష్టకాలంలో ప్రభుత్వం ఉచితంగా బియ్యం, పప్పులు అందించి ప్రజలను అదుకుంది. మా గ్రామంలో నలుగురికి కరోనా సోకడంతో వలంటీర్ల ద్వారా రేషన్‌ సరుకులు ఉచితంగా ఇంటివద్దే అందచేశారు. గ్రామంలో పారిశుధ్య నిర్వహణ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టారు’
– ఎం.నాగరాజు, వెంకటాపురం, పద్మనాభం మండలం, విశాఖ జిల్లా

గుడివాడలో డోర్‌ టు డోర్‌ పంపిణీ
గుడివాడ: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా త్వరలో ప్రారంభించనున్న డోర్‌ టు డోర్‌ రేషన్‌ సరుకుల పంపిణీలో లోటుపాట్లను గుర్తించేందుకు కృష్ణా జిల్లాలోని గుడివాడతోపాటు కొన్ని ప్రాంతాల్లో ట్రయల్‌ రన్‌ నిర్వహిస్తున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) ఒక ప్రకటనలో తెలిపారు. కార్డుదారుల ఎదురుగానే తూకం వేసి వలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు రేషన్‌ సరుకులు అందిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో 56 లక్షల టన్నుల ధాన్యం పండిందని, దీనిలో 33 లక్షల టన్నులు పౌరసరఫరాల శాఖ ద్వారా కొనుగోలు చేయాల్సి ఉందన్నారు. ధాన్యం విక్రయించదలచిన రైతులు గ్రామ సచివాలయాల్లో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.

కొడాలి నాని

ఇంటికే వచ్చింది

 ప్రకాశం జిల్లా ఒంగోలు ఇస్లాంపేటలో ఇంటింటికి వెళ్లి ఉచిత రేషన్‌ సరుకులు డోర్‌ డెలివరీ చేస్తున్న వలంటీర్లు


తూర్పుగోదావరి జిల్లా వీఆర్‌ పురం మండలం ఉమ్మిడివరంలో తన ఇంటివద్ద వలంటీర్‌ రామకృష్ణ అందిస్తున్న బియ్యాన్ని తీసుకుంటున్న పాయం రాధ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement