తూర్పుగోదావరి జిల్లాలోని అడవి ప్రాంతంలో వంతాడ గిరిజనగూడెం
(వంతాడ నుంచి సాక్షి ప్రతినిధి యిర్రింకి ఉమామహేశ్వరరావు): వంతాడ.. తూర్పు గోదావరి జిల్లా గోకవరం పంచాయతీ పరిధిలోని గిరిజన గూడెం. ఎత్తయిన కొండలు.. ఎటు చూసినా అడవి.. గూడెంలోని గిరిజనులకు ఏ కష్టమొచ్చినా.. ఏ అవసరమొచ్చినా సమీపంలోని పల్లెకు పోవాలంటే దాదాపు 8 నుంచి 10 కిలోమీటర్ల పైగా కొండలు, గుట్టలు దాటుతూ అడవి మార్గంలో కాలినడకన వెళ్లాల్సిందే. మంచినీళ్లు కావాలన్నా.. రేషన్ బియ్యం తెచ్చుకోవాలన్నా.. పింఛను డబ్బులు తీసుకోవాలన్నా కొండల దిగువన గల గోకవరం పోవాల్సిందే. వైద్యం పొందాలన్నా.. అత్యవసరమైన పని వచ్చినా కొండలను దాటుకుంటూ ఏలేశ్వరం వెళ్లాల్సి వచ్చేది. ఇదంతా గతం. ఇప్పుడా పరిస్థితులు మారాయి. ఇంటికే రేషన్ సరుకులు వస్తున్నాయి. ప్రతినెలా ఒకటో తేదీన కోడి కూయక ముందే తలుపు తట్టి మరీ పింఛను సొమ్ములిస్తున్నారు. ‘సాక్షి’ ప్రతినిధి ఆ గ్రామాన్ని సందర్శించగా.. గత సర్కారు హయాంలో తీరని కష్టాలు.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో తీరుతున్న సమస్యలను అక్కడి గిరిజనులు సంబరంతో చెప్పుకొచ్చారు. సంక్షేమ కార్యక్రమాలు తమ గుండె తలుపుల్ని తడుతున్నాయని వివరించారు.
సహపంక్తి భోజనాలతో పెద్దఎత్తున సంబరం
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గిరిజనుల గడప ముంగిట చేరుస్తూ ఆ గూడెంలో ఇప్పుడు ఉల్లి లక్ష్మీ పార్వతి, ఎం.లోవకుమారి అనే వలంటీర్లు సేవలందిస్తున్నారు. ప్రభుత్వం ఇంటింటికీ రేషన్ బియ్యం పంపిణీని ప్రారంభించడంతో కొండ పైకి వ్యాన్ వచ్చే దారిలేకపోయినా.. మోటార్ సైకిల్‌పై రేషన్ సరుకులను తీసుకెళ్లి వలంటీర్లే గిరిజనులకు అందిస్తున్నారు. గతంలో రేషన్ సరుకులు తెచ్చుకోవాలంటే కొండల మధ్య కిలోమీటర్ల కొద్దీ కాళ్లీడ్చుకుంటూ గోకవరం వెళ్లాల్సి వచ్చేది. అది రేషన్ డీలర్ అక్కడ అందుబాటులో ఉంటేనే సరుకులు అందేవి. లేదంటే మరోసారి వెళ్లాల్సి వచ్చేది. ఇలా రేషన్ సరుకుల్ని మోసుకుంటూ ఇళ్లకు చేరేసరికి ప్రాణాలు పోయినంత పనయ్యేది.
రేషన్ సరుకులు తెచ్చుకునే క్రమంలోను, పింఛన్ల కోసం వెళ్లి వచ్చే సందర్భాల్లోను పలువురు ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు కూడా గతంలో చోటుచేసుకున్నాయి. ఇప్పుడు రేషన్ సరుకులే కాకుండా ప్రతినెలా 1వ తేదీన తెల్లవారుజామునే పింఛను సొమ్ములు అందిస్తున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో చైతన్యవంతమవుతున్న గిరిజనులు ఆస్పత్రులు, ఇతర అత్యవసర పనులపై వెళ్లేందుకు తాజాగా ఓ ఆటోను కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు అత్యవసర పరిస్థితుల్లో ఫోన్ చేస్తే వంతాడకు అంబులెన్స్ వస్తోంది. ఇటీవల ఈ ప్రాంతంలో ప్రభుత్వ నిధులతో మంచినీటి కోసం బోరు వేయడంతో.. గూడెం ప్రజలంతా సహపంక్తి భోజనాలు పెట్టుకుని పెద్ద ఎత్తున సంబరం చేసుకున్నారంటే నీటి కోసం వాళ్లు పడ్డ అవస్థలు ఏపాటివో అవగతమవుతోంది.
జీడి తోటలకు కాపలా.. బొగ్గుల అమ్మకంతో జీవనం
పచ్చని ప్రకృతి ఒడిలో అలరారుతున్న వంతాడ గిరిజనులు జీడి తోటలకు కాపలా ఉంటూ.. కట్టెల్ని కాల్చగా వచ్చే బొగ్గుల్ని విక్రయించడం ద్వారా వచ్చే డబ్బులతో జీవనం సాగిస్తున్నారు. ప్రతి ఇంటివద్ద ఒక జీలుగ చెట్టు (జీలుగ కల్లు అమ్ముతారు), మేకలు, ఆవుల పెంపకం ఉంటుంది. గుడి (రామాలయం, గంగానమ్మ ఆలయాలు), బడి, అంగన్‌వాడీ, ఆశా వర్కర్‌తో గిరిజనులు మెరుగైన జీవనం వైపు అడుగులు వేస్తున్నారు. గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్‌వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు ఉన్నాయి.
సంక్షేమ కార్యక్రమాలు ఇలా..
► గతంలో 24 మంది పింఛనుదారులుంటే.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక అదనంగా మరో 15 మందికి కలిపి ప్రస్తుతం 39 మందికి అందిస్తున్నారు. 125 కుటుంబాలకు నెలనెలా క్రమం తప్పకుండా బైక్‌లపై రేషన్ సరుకులు తీసుకెళ్లి అందిస్తున్నారు.
► అంగన్‌వాడీ కేంద్రంలో 24 మంది పిల్లలకు పౌష్టికాహారం ఇస్తున్నారు.
► 62 కుటుంబాలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు స్థల సేకరణ కొలిక్కి వచ్చింది. తాత ముత్తాతల నుంచి సాగు చేసుకుంటున్న సుమారు 250 ఎకరాలకు పైగా పోడు భూములపై గిరిజనులకు రైతువారీ హక్కు పట్టాలిచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి.
గత పాలకులు పట్టించుకోలేదు
ఎన్నికలప్పుడు మా గూడెంలోని రావిచెట్టు రచ్చబండ వద్దకు నాయకులొచ్చి ఎన్నో హామీలు ఇచ్చేవారు. ఎన్నికలు అయిపోగానే మర్చిపోయేవారు. దశాబ్దాల తరబడి కనీసం మంచినీటి సౌకర్యం కూడా గత పాలకులు కల్పించలేదు. వైఎస్ జగన్ ప్రభుత్వం 320 అడుగులకు పైగా లోతున బోరు వేసి మంచినీరు అందించి పుణ్యం కట్టుకుంటోంది. మంచినీటి కష్టాలు తీరడంతో గ్రామ దేవత వద్ద సంబరం చేసుకున్నాం.
– మాతే ప్రసాద్, గూడెం వాసి, వంతాడ
గిరిజన జీవితాల్లో కొత్త వెలుగులు
అభివృద్ధి, సంక్షేమం 2 కళ్లుగా భావించి.. రాష్ట్రంలోని గిరిజన జీవితాల్లో కొత్త వెలుగులు నింపేలా సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. గిరిజనులకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ సీఎం వైఎస్ జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు ఏజెన్సీ ప్రాంతాల రూపురేఖల్ని మారుస్తున్నాయి. గడచిన రెండేళ్లలో గిరిజనుల సంక్షేమానికి రూ.6,646 కోట్ల వ్యక్తిగత లబ్ధిని చేకూర్చడంతోపాటు రూ.8,012 కోట్ల ఉప ప్రణాళిక నిధులతో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాం.
– పాముల పుష్పశ్రీవాణి, ఉప ముఖ్యమంత్రి
Comments
Please login to add a commentAdd a comment