‘గ్రూప్స్‌’ నోటిఫికేషన్లు విడుదల | Group-1 posts was 78 | Sakshi
Sakshi News home page

‘గ్రూప్స్‌’ నోటిఫికేషన్లు విడుదల

Published Sun, Jan 1 2017 1:00 AM | Last Updated on Thu, Mar 28 2019 5:39 PM

‘గ్రూప్స్‌’ నోటిఫికేషన్లు విడుదల - Sakshi

‘గ్రూప్స్‌’ నోటిఫికేషన్లు విడుదల

గ్రూప్‌–1 పోస్టులు 78

- గ్రూప్‌–3లో 1055 పంచాయతీ కార్యదర్శుల పోస్టులు
- హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్ల పోస్టులు 100
- మొత్తం 1317 పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో గ్రూప్‌–1, గ్రూప్‌–3 సహా 1317 పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ శనివారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొత్తం 9 నోటిఫికేషన్లను కమిషన్‌ చైర్మన్‌ ప్రొఫెసర్‌ పి.ఉదయభాస్కర్‌ మీడియా సమావేశంలో విడుదల చేశారు. 2017లో ఈ పోస్టులన్నిటికీ రాత పరీక్షలు, అభ్యర్థుల ఎంపిక పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. గ్రూప్‌–1లో 78 పోస్టులు ఉన్నాయి. ఇందులో డిప్యుటీ కలెక్టర్లు, కమర్షియల్‌ టాక్స్‌ ఆఫీసర్లు, డిస్ట్రిక్ట్‌ రిజిస్ట్రార్లు, డిప్యుటీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీసు, అసిస్టెంట్‌ ఎక్సయిజ్‌ సూపరింటెండెంట్, జిల్లా బీసీ సంక్షేమాధికారులు, గ్రేడ్‌–2 మున్సిపల్‌ కమిషనర్లు, లేబర్‌ అసిస్టెంట్‌ కమిషనర్ల పోస్టులున్నాయి. గ్రూప్‌–3లో 1055 పంచాయతీ కార్యదర్శుల పోస్టులు భర్తీ చేయనున్నారు.

వీటితో పాటు టౌన్‌ ప్లానింగ్‌ అసిస్టెంట్లు– 5, అగ్రికల్చర్‌ ఆఫీసర్లు–30, టౌన్, కంట్రీప్లానింగ్‌ అసిస్టెంట్‌ డైరెక్లర్లు–5, మైనింగ్‌ రాయల్టీ ఇన్‌స్పెక్టర్లు–5, ఫిషరీస్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్లు–10, అసిస్టెంట్‌ సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్లు–13, అసిస్టెంట్‌ బీసీ వెల్ఫేర్‌ ఆఫీసర్లు–10, అసిస్టెంట్‌ ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్లు–6, హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్లు–100 పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 1317 పోస్టులకు సంబంధించి 9 నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ఆయా నోటిఫికేషన్ల పోస్టులకు దరఖాస్తు చేసే ముందు అభ్యర్థులు తమ అర్హతలు, ఇతర సమాచారానికి సంబంధించి వన్‌టైమ్‌ ప్రొఫైల్‌ రిజిస్ట్రేషన్‌ (ఓటీపీఆర్‌)ను పూర్తి చేయాల్సి ఉంటుందని కమిషన్‌ వివరించింది. ఈ పోస్టులకు 1:50 చొప్పునే మెయిన్స్‌కు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. స్క్రీనింగ్‌ టెస్టులను ఆఫ్‌లైన్‌ మోడ్‌లో ఓఎమ్మార్‌ సమాధానాలతో నిర్వహించనున్నారు. కాగా, ఏపీపీఎస్సీ  కార్యాలయాన్ని విజయవాడ, లేదా గుంటూరులలో ఏర్పాటుచేయడానికి అద్దెభవనాలను అన్వేషిస్తున్నామని  ఉదయభాస్కర్‌ తెలిపారు.

గ్రూప్‌–1 దరఖాస్తుల గడువు జనవరి 30
గ్రూప్‌–1 పోస్టులకు ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ శనివారం నుంచే ప్రారంభమైంది. జనవరి 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. స్క్రీనింగ్‌ టెస్ట్‌/ ప్రిలిమనరీ పరీక్ష మే 7వ తేదీన ఉంటుంది. దీనికి నెగిటివ్‌ మార్కుల విధానం అమలు చేయనున్నారు. ప్రిలిమనరీ పరీక్షను రాష్ట్రంలోని 13 జిల్లా కేంద్రాల్లో నిర్వహించనున్నారు. మెయిన్‌ పరీక్షను విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, అనంతపురం కేంద్రాల్లో ఆగస్టు 17 నుంచి 27వ తేదీ వరకు నిర్వహిస్తారు. గ్రూప్‌–1లో స్క్రీనింగ్‌ టెస్ట్‌ 150 మార్కులకు ఉంటుంది. జనరల్‌ స్టడీస్, మెంటల్‌ ఎబిలిటీపై ఈ పరీక్ష ఉంటుంది. మెయిన్స్‌ పరీక్షలో జనరల్‌ ఇంగ్లిషుతో పాటు ఐదు పేపర్లలో పరీక్షలు నిర్వహిస్తారు.

గ్రూప్‌–3 దరఖాస్తుల గడువు జనవరి 30
గ్రూప్‌–3 కింద భర్తీ చేయనున్న 1055 పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీకి సంబంధించి ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ శనివారం నుంచే ప్రారంభమైంది. ఆన్‌లైన్‌ దరఖాస్తును కమిషన్‌ అధికారిక వెబ్‌సైట్లో పొందుపరిచారు. జనవరి 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసే వారు కమిషన్‌ అధికారిక వెబ్‌సైట్‌ ‘పీఎస్‌సీ.ఏపీ.జీఓవీ.ఇన్‌’ నుంచి సంబంధిత కరస్పాండింగ్‌ లింకులోకి వెళ్లాల్సి ఉంటుంది. లేదా ‘హెచ్‌టీటీపీ:ఏపీపీఎస్‌సీఏపీపీఎల్‌ఐసీఏటీఐఓఎన్‌ఎస్‌17.ఏపీపీఎస్‌సీ.జీఓవీ.ఐఎన్‌’ ద్వారా నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రూప్‌–3  పోస్టులకు స్క్రీనింగ్‌ టెస్ట్‌ ఏప్రిల్‌ 23న నిర్వహిస్తారు. మెయిన్‌ పరీక్షను జులై 16న ఆన్‌లైన్లో కంప్యూటరాధారితంగా చేపడతారు. ఈ పోస్టులకు స్క్రీనింగ్‌ టెస్ట్‌ను 150 మార్కులకు నిర్వహిస్తారు. ఇది డిగ్రీ స్టాండర్డ్‌లో ఉంటుంది. దీనికి నెగిటివ్‌ మార్కుల పద్దతిని అనుసరిస్తారు. మెయిన్‌ పరీక్ష 300 మార్కులకు 2 పేపర్లుగా ఉంటుంది. పేపర్‌1లో జనరల్‌ స్టడీస్, మెంటల్‌ ఎబిలిటీస్‌పై ప్రశ్నలుంటాయి. రెండో పేపర్లో రూరల్‌ డెవలప్‌మెంట్, గ్రామీణ ప్రాంతంలో సమస్యల (ఆంధ్రప్రదేశ్‌ ప్రాధాన్యతగా)పై ప్రశ్నలుంటాయి.

► టౌన్‌ప్లానింగ్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్ల పోస్టులకు శనివారం నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం కాగా జనవరి 30వరకు స్వీకరించనున్నారు. దరఖాస్తులు 25 వేలు దాటితే స్క్రీనింగ్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు. ఎప్పుడు నిర్వహించేది తర్వాత ప్రకటించనున్నారు. మెయిన్‌ పరీక్షను ఏప్రిల్‌ 5, 6వ తేదీల్లో కంప్యూటరాధారితంగా చేపట్టనున్నారు. ఈ పరీక్షను విజయవాడ, గుంటూరులలో నిర్వహిస్తారు. మెయిన్‌ పరీక్ష 150 చొప్పున మూడు పేపర్లలో 450 మార్కులకు ఉంటుంది.

► అసిస్టెంటు టౌన్‌ప్లానర్‌ పోస్టులకు కూడా జనవరి 30వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువుగా నిర్ణయించారు. 25వేలకు మించి దరఖాస్తులు వస్తే స్క్రీనింగ్‌ టెస్ట్‌ తేదీని తరువాత ప్రకటిస్తారు. మెయిన్‌ పరీక్షను ఏప్రిల్‌ 4, 5 తేదీల్లో నిర్వహిస్తారు. మెయిన్‌ పరీక్ష 150 చొప్పున మూడు పేపర్లలో 450 మార్కులకు ఉంటుంది.
► అగ్రికల్చరల్‌ ఆఫీసర్‌ పోస్టులకు దరఖాస్తు గడువు జనవరి 30తో ముగుస్తుంది. స్క్రీనింగ్‌ టెస్ట్‌ అవసరమైతే తేదీని తర్వాత ప్రకటిస్తారు. మెయిన్‌ పరీక్షను ఏప్రిల్‌4న 450 మార్కులకు రెండు పేపర్లలో నిర్వహిస్తారు.
► అసిస్టెంట్‌ బీసీ వెల్ఫేర్, సోషల్‌ వెల్ఫేర్, ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ పోస్టులకు దరఖాస్తు గడువు జనవరి 30. స్క్రీనింగ్‌ టెస్ట్‌ను జూన్‌ 18న నిర్వహిస్తారు. మెయిన్‌ పరీక్షను సెప్టెం బర్‌ 21, 22 తేదీల్లో నిర్వహించనున్నారు.
► మైనింగ్‌ రాయల్టీ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులకు అవసరమైతే స్క్రీనింగ్‌ టెస్ట్‌ ఉంటుంది. మెయిన్‌ పరీక్షను ఏప్రిల్‌ 5న నిర్వహిస్తారు.
► హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ పోస్టులకు దరఖాస్తు గడువు జనవరి 30. ఈ పోస్టులకు జూన్‌11న స్క్రీనింగ్‌ టెస్ట్, సెప్టెంబర్‌ 21న మెయిన్‌ పరీక్ష నిర్వహిస్తారు.
► అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఫిషరీస్‌ పోస్టులకు దరఖాస్తు గడువు జనవరి 30. ఈ పోస్టులకు స్క్రీనింగ్‌ టెస్ట్‌ అవసరమైతే ఎప్పడు నిర్వహించేది తర్వాత ప్రకటిస్తారు. మెయిన్‌ పరీక్ష మే 4, 5 తేదీల్లో జరుగుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement