APPSC Releases Group 1 Results 2018 - Sakshi
Sakshi News home page

APPSC Group 1 Results: గ్రూప్‌–1 ఫైనల్‌ ఫలితాలు విడుదల

Published Wed, Jul 6 2022 4:33 AM | Last Updated on Sun, Sep 11 2022 12:57 PM

Group-1 final results release Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గ్రూప్‌–1 (2018) తుది ఎంపిక జాబితాను ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) మంగళవారం విడుదల చేసింది. దీంతో నాలుగేళ్లుగా ఈ ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థుల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. న్యాయ వివాదాలు, పలుమార్లు వాయిదాలు, రెండుసార్లు మెయిన్‌ మూల్యాంకనం ఇలా పలు సవాళ్లను అధిగమించి కమిషన్‌ ఆయా పోస్టులకు ఎంపికైన వారి జాబితాను ప్రకటించింది.

2018 గ్రూప్‌–1కు సంబంధించి మొత్తం 167 పోస్టులకు నోటిఫికేషన్‌ ఇవ్వగా.. వాటిలో కోర్టు సూచనలతో 2 స్పోర్ట్స్‌ కోటా పోస్టులు, తగిన అర్హతలు కలిగిన అభ్యర్థులు లేనందున మరో 2 పోస్టులు భర్తీ చేయలేదు. మొత్తం 163 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక పూర్తి చేశారు. వీరిలో 67 మంది మహిళలు కాగా 96 మంది పురుషులున్నారు.

ఏపీపీఎస్సీ చైర్మన్‌ గౌతమ్‌ సవాంగ్‌ కమిషన్‌ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ ఫలితాలను విడుదల చేశారు. ఉన్నత న్యాయస్థానం తుది తీర్పునకు లోబడి పోస్టుల ఎంపిక, నియామకాలు ఉంటాయన్నారు. కోర్టు తుది తీర్పునకు లోబడి ఉంటామని.. ఎంపికైన అభ్యర్థులు ఈ నెల 12లోపు అండర్‌ టేకింగ్‌ (రాతపూర్వక హామీపత్రం) ఇవ్వాలని సవాంగ్‌ స్పష్టం చేశారు. ఆ పత్రం ఇచ్చాకే వారి జాబితాను సంబంధిత ప్రభుత్వ విభాగాలకు ఏపీపీఎస్సీ పంపిస్తుందన్నారు.

అనేక సవాళ్లను అధిగమించి..
అనేక సవాళ్లను అధిగమించి గ్రూప్‌–1 (2018) ఫలితాలను ప్రకటిస్తున్నామని సవాంగ్‌ వివరించారు. ‘2018 డిసెంబర్‌లో మొత్తం 167 పోస్టుల (2 స్పోర్ట్స్‌ కోటాతో కలిపి) నోటిఫికేషన్‌ ఇచ్చాం. 2019 మేలో గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌కు 58,059 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరిలో 9,679 మంది మెయిన్స్‌కు అర్హత సాధించారు. తరువాత కరోనా, ఇతర కారణాల వల్ల మెయిన్స్‌ పరీక్షలు మూడుసార్లు వాయిదా పడ్డాయి.

2020 డిసెంబర్‌లో మెయిన్స్‌ పరీక్షలను ట్యాబ్‌ ఆధారిత ప్రశ్నపత్రాలతో అత్యంత పకడ్బందీగా నిర్వహించాం. తొలిసారిగా గ్రూప్‌–1 సమాధాన పత్రాల మూల్యాంకనాన్ని డిజిటల్‌ విధానంలో చేయించాం. 2021 ఏప్రిల్‌లో వీటి ఫలితాలు విడుదల చేయగా కొంతమంది అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు.

కోర్టు ఇచ్చిన తీర్పుతోమూల్యాంకనాన్ని సంప్రదాయ పద్ధతిలో మ్యాన్యువల్‌గా అత్యంత పారదర్శకంగా చేయించాం. మొత్తం మూల్యాంకన ప్రక్రియను సీసీ కెమెరాల్లో చిత్రీకరించి భద్రపరిచాం. అనంతరం మూడు బోర్డులను ఏర్పాటు చేసి ఇంటర్వ్యూలను పూర్తి చేశాం. బోర్డుల్లో కూడా కమిషన్‌ సభ్యులు ఇద్దరితోపాటు ఇద్దరు ఆలిండియా సర్వీసు సీనియర్‌ అధికారులు, సబ్జెక్టు నిపుణులు ఉన్నారు’ అని సవాంగ్‌ వివరించారు.

ఫలితాల్లో మహిళలదే హవా..
గ్రూప్‌–1 ఇంటర్వ్యూలకు ఎంపికైన 325 మందిలో 156 మంది మహిళలుండడం గొప్ప విషయమని గౌతమ్‌ సవాంగ్‌ చెప్పారు. పోస్టులకు ఎంపికైన మొదటి పది మందిలో ఏడుగురు మహిళలేనని వివరించారు. ఇంటర్వ్యూలకు హాజరైన అభ్యర్థుల్లో ఎక్కువ మంది అత్యున్నత విద్యాసంస్థల్లో చదివినవారేనన్నారు. ఐఐటీ, ఐఐఎంల్లో చదివినవారు 20 మంది ఉన్నారని.. ఐఐఐటీల్లో చదివినవారు 15 మంది ఉన్నారని చెప్పారు. 55 మంది ఎంటెక్‌ పూర్తిచేసినవారు కాగా 18 మంది డాక్టర్లున్నారని వివరించారు. వీరిలో 9 మంది సివిల్‌ సర్వీసు ర్యాంకర్లు కూడా ఉన్నారన్నారు.

వరుసగా రెండు ఉద్యోగాలు..
మాది కాకినాడ జిల్లా పిఠాపురం. తల్లిదండ్రులు.. పద్మప్రియ, శ్రీనివాస్‌. పదో తరగతి వరకు పిఠాపురం లో, ఇంటర్, డిగ్రీ కాకినాడలో, ఎంబీఏ హైదరా బాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో చదివాను. ఎంబీఏలో అప్పటి రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం చేతుల మీదుగా గోల్డ్‌ మెడల్‌ అందుకున్నా. బెంగళూరులో పీహెచ్‌డీ చేశా. బెంగళూరులోనే కాలేజీ ప్రిన్సిపల్‌గా చేస్తుండగా అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా ఉద్యోగం వచ్చింది. ఇంతలో రెండు రోజుల్లోనే ఏపీపీఎస్సీలో టాపర్‌గా నిలిచానన్న వార్త తెలిసింది. నా భర్త రవికాంత్‌ ప్రోత్సాహంతో ఈ విజయం సాధించాను. ఈ విజయం మా తాత పేరి లక్ష్మీనరసింహ శర్మకు అంకితం. 
– రాణి సుస్మిత, డిప్యూటీ కలెక్టర్, గ్రూప్‌–1 ఫస్ట్‌ ర్యాంకర్‌

కష్టపడి చదివినందుకు ఫలితం..
మాది అన్నమయ్య జిల్లా పోతులగుట్టపల్లి. మధ్యతరగతి వ్యవసాయ కుటుంబం మాది. నాన్న రెడ్డయ్య రాజు, తులసమ్మలు వ్యవసాయం చేస్తారు. నా పాఠశాల, ఇంటర్మీడియట్‌ విద్య రాయచోటిలో గడిచింది. కడపలో డిగ్రీ, ఎస్వీ యూనివర్సిటీలో ఎంసీఏ చేశాను. 2017లో సివిల్స్‌ ఇంటర్వ్యూ వరకూ వెళ్లాను. అనంతరం 2018లో గ్రూప్‌–1 రాశాను. కష్టపడి చదివినందుకు ఫలితం దక్కింది. 
– కొండూరు శ్రీనివాసులురాజు, డిప్యూటీ కలెక్టర్, రెండో ర్యాంకర్‌

సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తూనే..
మాది విజయవాడ. బీటెక్‌ చేశా. నాకు వివాహమయ్యాక సీనియర్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తూనే నా భర్త, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో సివిల్స్‌కు సిద్ధమయ్యాను. ఈ క్రమంలో గ్రూప్స్‌ కూడా రాసి తొలి ప్రయత్నంలోనే విజయం సాధించాను. 
– నీలపు రామలక్ష్మి, డిప్యూటీ కలెక్టర్, నాలుగో ర్యాంకర్‌

సివిల్స్‌కు సన్నద్ధమవుతూ..
మాది అన్నమయ్య జిల్లా రాయచోటి. ఐఐటీ బాంబే నుంచి ఏరోస్పేస్‌ ఇంజనీరింగ్‌ చేశా. అమ్మానాన్న సహదేవ రెడ్డి, కళావతి బోధన రంగంలో ఉన్నారు. 2022 సివిల్స్‌ ప్రిలిమ్స్‌లో ఉత్తీర్ణత సాధించా. మెయిన్స్‌ను రాయడానికి సిద్ధమవుతున్నా. డిప్యూటీ కలెక్టర్‌గా ఉద్యోగం రావడం సంతోషంగా ఉంది. 
– నిమ్మనపల్లి మనోజ్‌రెడ్డి, డిప్యూటీ కలెక్టర్, ఆరో ర్యాంకర్‌

డిప్యూటీ కలెక్టర్‌ కావడం పట్ల ఆనందంగా ఉంది..
మాది అనంతపురం జిల్లా. తండ్రి నాగానందం, తల్లి లక్ష్మీదేవి. బీఎస్సీ నర్సింగ్‌ చేశాక 2013లో గ్రూప్‌–4కి ఎంపికయ్యాను. ప్రస్తుతం అనంతపురం కలెక్టరేట్‌లో సీనియర్‌ అసిస్టెంట్‌ పనిచేస్తున్నా. ఇప్పుడు గ్రూప్‌–1 రాసి డిప్యూటీ కలెక్టర్‌ కావడం ఆనందంగా ఉంది. ఎలాగైనా నేను విజయం సాధించాలని మా మామ గుండ్లమడుగు శివయ్య మాట తీసుకున్నారు. ఆయనకు ఇచ్చిన మాట కోసం, నా భర్త, తల్లిదండ్రులు ఇచ్చిన ప్రోత్సాహంతో కష్టపడి చదవాను. 
– కురుబ మధులత, ఏడో ర్యాంకర్‌

ప్రజలకు మరింత మంచి చేస్తా..
మాది విశాఖపట్నం. నేను బీఎస్సీ, ఏయూలో పీజీ చేశాను. నా తల్లిదండ్రులు జగన్నాథరాజు, నిర్మల,  నా భర్త ప్రదీప్‌ ప్రోత్సాహంతోనే ఈ రోజు ఈ స్థాయికి రాగలిగాను. 2009 నుంచి 2018 వరకూ స్కూల్‌ అసిస్టెంట్‌గా పనిచేశాను. ప్రస్తుతం విజయనగరం జిల్లా బీసీ సంక్షేమ అధికారిగా పనిచేస్తున్నా. 
– దాట్ల కీర్తి, డిప్యూటీ కలెక్టర్, 8వ ర్యాంకర్‌

తొలి ప్రయత్నంలోనే డిప్యూటీ కలెక్టర్‌ జాబ్‌
నా తల్లిదండ్రులు మోహన్, సునీత ప్రోత్సాహంతోనే నేను ఇంతవరకు వచ్చాను. 2017లో హెచ్‌సీయూలో ఎంఏ పూర్తి చేశాను. 2019లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. తొలి ప్రయత్నం లోనే డిప్యూటీ కలెక్టర్‌గా అవకాశం దక్కింది. 
– సాయిశ్రీ, డిప్యూటీ కలెక్టర్, పదో ర్యాంకర్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement