‘ఓటి’ నేతల చేటు రాజకీయం
విశ్లేషణ: రాజ్యాంగం బడుగు, బలహీన, మైనారిటీ వర్గాల అసంఖ్యాక ప్రజలకు హామీ పడిన నిబంధనలు ఆచరణలో అమలులోకి రానంత కాలం వర్గ సమాజంలోని పంచాయతీ వ్యవస్థ సహితం కలవాడి కులగోత్రాల చట్రంలోనే ప్రజల్ని గానుగెద్దుల్లా తిప్పుతుంటుంది. 65 ఏళ్లుగా వర్గ రాజకీయ పక్షాల ప్రభుత్వాలు, నాయకులూ పాటించిన ప్రజాస్వామ్య వ్యతిరేక, ప్రజావ్యతిరేక పంథా ఇది.
ఒక వర్గం వారి ‘ఆడపిల్లలు ప్రత్యర్థి వర్గం జనాభాను పెంచే సంతానోత్పత్తి’ యంత్రాలు కాకూడదట! దీన్ని బట్టి చూస్తే పురుషాధిక్యతా రోగం, బడుగు, బలహీన వర్గాలు మైనారిటీల పట్ల ఏహ్యమైన చిన్నచూపు, దుర్మార్గపు మనస్తత్వం ఎంతగా గూడుకట్టుకుని ఇప్పటికీ ఊళ్లేలుతున్నాయో అర్థమవుతోంది.
ఏ రాజకీయ పక్షానికీ మత వ్యవహారాలతో మతాలతో సంబంధం ఉండరాదని మత సంస్థలకు రాజకీయాలతో ప్రమేయం ఉండరాదని రాజ్యాంగ నిర్ణయసభ తీర్మానం. కానీ పాలక పక్షాలు మత రాజకీయం ద్వారా ఎన్నికలలో ప్రజల్ని సమీకరించడానికి అలవాటు పడ్డాయి.
‘‘మత విశ్వాసం అనేది కేవ లం వ్యక్తిగతం. కనుక ఆ వ్యక్తిగత విశ్వాసాన్ని ప్రతి ఒక్కరూ తన వరకే పరిమితం చేసుకోవటంలో మనం జయప్రదం కాగలిగితే, మన రాజకీయ జీవి తాలు కూడా సుఖప్రదంగా సాగుతాయి. ప్రభుత్వ అధికారులూ, ప్రజలు, పౌరులూ కలిసికట్టుగా సెక్యులర్ దేశాన్నీ ప్రభుత్వాన్నీ నిర్మించుకోవడానికి అవసరమైన నిర్మాణాత్మక కార్యాచరణ బాధ్యతను తలకెత్తుకోగలిగితే - భారతదేశం యావత్తు ప్రపంచానికే తిలకప్రాయమవుతుంది’’.
- మహాత్మాగాంధీ: 1947, ఆగస్టు 23
దేశ విభజన ఫలితంగా ఉత్పన్నమైన సమస్యల అవశేషాల నుంచి భారత పాలకులు నేటికీ బయటపడలేదు. పైగా ఎప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్నా ఓట్ల కోసం, సీట్ల కోసం ప్రజా బాహుళ్యాన్ని మత రాజకీయాలతో కకావికలు చేస్తున్నారు. 1947 నాటి రాజ్యాంగ నిర్ణయ సభ భారత దేశాన్ని సెక్యులర్ వ్యవస్థగా నిర్వచిస్తూ చేసిన స్పష్టమైన తీర్మానాన్ని దేశ పాలకశక్తులు భ్రష్టుపట్టిస్తూ వస్తున్నాయి. ఈ విషయంలో మతాతీత వ్యవస్థకే కట్టుబడి ఉంటానని ప్రతినబూనిన కాంగ్రెస్‌పార్టీ, బీజేపీ ‘తొడుగు’ లోని సంఘ్ పరివార్ ‘హిందూత్వ’ శక్తులు రెండూ ఆ తీర్మానాన్ని పక్కకు పెట్టాయి.
బీజేపీ ఆగడాలను గమనించిన మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ శేషన్ ఆ పదవిలో ఉన్నప్పుడు ఒక సందర్భంలో... బీజేపీ సెక్యులర్ రాజ్యాంగంపై ప్రమాణం చేసి అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నందున, ఆ పార్టీ ఎన్నికల చిహ్నాన్ని ఎందుకు రద్దు చేయకూడదని ప్రశ్నించాల్సివచ్చింది. ఏ రాజకీయ పక్షానికీ మత వ్యవహారాలతో మతాలతో సంబంధం ఉండకూడదు. అలాగే మత సంస్థలకు రాజకీయాలతో ప్రమేయం ఉండరాదన్నది రాజ్యాంగ నిర్ణయసభ ఏకగ్రీవ తీర్మానం. కానీ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పాలక పక్షాలు మత రాజకీయం ద్వారా ఎన్నికలలో ప్రజల్ని సమీకరించడానికి అలవాటు పడ్డాయి.
గత అరవయ్యేళ్లుగానూ మత ఘర్షణలు లేని సంవత్సరాలు చాలా అరుదు. ఇప్పుడు తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లాలో రెండు మతాల మధ్య ప్రేమ బంధాన్ని బలవంతంగా తెంచడానికి జరిగిన ప్రయత్నమే ముజఫర్‌నగర్ దారుణాలకు కారణం. చదివేవి ధర్మశాస్త్రాలు, కూల్చేవి ప్రార్థనాలయాలవుతున్నాయి. ‘‘దేవతలు నాశనం చేయాలనుకున్న వాళ్ల’’కు ముందు ‘పిచ్చి’ పట్టిస్తారట! ముజఫర్‌నగర్ జిల్లాలో జరిగింది కూడా అదే. ఆ ఘటనలకు సంబంధించి కొందరు కాంగ్రెస్, బీజేపీల నాయకులు ఎన్నికల ప్రయోజనాల దృష్ట్యా రకరకాల కథనాలను వ్యాప్తిలోకి తెచ్చారు! కొన్నాళ్ల క్రితం పాకిస్థాన్‌లో జరిగిన దుర్ఘటన తాలూకు వీడియోను సంపాదించి దానిని ముజఫర్‌నగర్ జిల్లాలోని గ్రామంలో జరిగినట్టుగా ‘ఫుటేజి’ అతికి సర్క్యులేషన్‌లో పెట్టడం అందులో ఒకటి! ఈ ‘డ్రామా’ జనంలో గుప్పుమని మంటలు లేపింది! నిజానికి పాకిస్థాన్‌లోని ఆ ఘటనకూ ముజఫర్‌నగర్ ఘటనకూ సంబంధం లేదు.
వాస్తవం ఏమిటి? అంతకు ముందు ఒక మత వర్గానికి చెందిన ఇద్దరు కుర్రాళ్లు మరొక వర్గానికి చెందిన ప్రేమికుడిని చంపేశారు! సెప్టెంబర్ 7 నాటి ఈ ఘటన ఇరు వర్గాల మధ్య సృష్టించిన అల్లర్లలో కొన్ని డజన్ల మంది పౌరులు హతులయ్యారు. కాగా ఒక వర్గానికి చెందిన ఇద్దరు కుర్రాళ్ల హత్యపైన మాత్రమే ‘భారతీయ కిసాన్ యూనియన్’ పేరిట జరిపిన ‘ఖాప్ మహా పంచాయతీ’ సభ అంతకుముందు మరొక మైనారిటీ వర్గానికి చెందిన ప్రేమికుడైన కుర్రవాడిపై జరిగిన హత్యాకాండను మాట మాత్రంగా కూడా ప్రస్తావించలేదు! కొందరు బీజేపీ నాయకులు, ఒక కాంగ్రెస్ నాయకుడూ ఈ సభలో తీర్పరులు! ‘ఖాప్’లో ఆ పార్టీల నాయకులు చేసిన రెచ్చగొట్టే ఉద్రేకపూరిత ప్రసంగాలు, వాళ్లు సర్క్యులేట్ చేసిన దొంగ వీడియోలే ఈ దుర్ఘటనకు కారణమని పోలీసుల నివేదిక వెల్లడించింది. ఇరవై ఏళ్లలో యూపీలో ఇంతస్థాయిలో హింసాయుత మత ఘర్షణలు జరగలేదని స్థానిక ప్రజలు చెప్పారని వార్తలు.
ఈ దుర్ఘటన తాలూకు కేసుల నుంచి, అరెస్టుల నుంచి ఎలా బయటపడాలో ఆలోచనలో పడిన ఉభయ పార్టీల నాయకులు ఇప్పుడు చేస్తున్నది కేసులు ‘మాఫీ’ చేయించుకునే కొత్త కథనాల అల్లిక! తమ వర్గానికి చెందిన కొందరు కుర్రాళ్లను పోగుచేయటం, వారికి ఎదుటి వర్గానికి చెందిన వారి దుస్తులు తొడిగి ‘ఆత్మగౌరవ పోరాటం’ లేదా ‘లవ్ జీహాద్’ అనే కొత్త నినాదాన్ని జనంలోకి ఎక్కించడాన్ని ఒక ‘కళ’గా నేర్పటం ‘వీళ్లు ఎవరు’ అని తెలియకుండా వాళ్లకి ‘సోను’, ‘రాజు’ అని పేర్లు పెట్టారు. జీన్స్, టీ షర్టులు, మొబైల్ ఫోన్లు, మోటార్ బైక్‌లు ఇచ్చారు! వీళ్లు స్కూళ్లు, కాలేజీల ముందు నిలబడి ఉండాలి!
ఒక వర్గం వారి ఆడపిల్లల్ని ‘లవ్’ చేస్తున్నట్టు పోజులివ్వాలట. మెల్లగా ఆ ఆడపిల్లల్ని ‘ప్రేమాయణం’ నాటకంలోకి దించాలి! అది ‘ప్రేమ కోసం పవిత్ర యుద్ధం’ (లవ్ జీహాద్) అట. ప్రేమ వలలోకి లాగటం ‘ప్యార్ సే ఫస్నా’! ఎదుటి వారిని రెచ్చగొట్టి ‘ముగ్గు’లోకి దించడానికి ఆర్‌ఎస్‌ఎస్, సంఘ్ పరివార్ ప్రవేశపెడుతున్న ‘చిట్కా’లని హిందూ మీరట్ ప్రతినిధి ప్రశాంత ఝా (11-9-13) వెల్లడించాడు! అదేమంటే, ఒక వర్గం వారి జనాభా పెరగకుండా ఉండాలంటే, ఆ వర్గం వారి కుర్రాళ్లను ఎదుటి వర్గం వారి ఆడపిల్లలు పెళ్లాడకుండా చేయడం! ఒక వర్గం వారి ‘ఆడపిల్లలు ప్రత్యర్థి వర్గం జనాభాను పెంచే సంతానోత్పత్తి’ యంత్రాలు కాకూడదట!
దీన్ని బట్టి చూస్తే పురుషాధిక్యతా రోగం, బడుగు, బలహీన వర్గాలు మైనారిటీల పట్ల ఏహ్యమైన చిన్నచూపు, దుర్మార్గపు మనస్తత్వం ఎంతగా గూడుకట్టుకుని ఇప్పటికీ ఊళ్లేలుతున్నాయో అర్థమవుతోంది. సమాజంలోని ఏ రెండు వర్గాల మగ-ఆడ పిల్లల మధ్య ప్రేమానురాగాలు మొలకెత్తినా వాటిని మొగ్గలోనే తుంచివేయడానికి కుల, మతాల ప్రాతిపదికపైన సిద్ధమయ్యే ‘ఖాప్ పంచాయతీ’ నిర్ణయాలను సుప్రీంకోర్టు శఠించి, ఆ పంచాయతీలపైన వాటికి ప్రోద్బలమిచ్చిన నాయకులపైన కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. దాన్ని ప్రభుత్వాలు పాటించడం లేదు. అందుకు కారణం - కొన్ని రాజకీయ పక్షాల, ప్రధాన పాలక పక్షాల ఓటు-సీటు రాజకీయాలే! రాజ్యాంగం బడుగు, బలహీన, మైనారిటీ వర్గాల అసంఖ్యాక ప్రజలకు హామీ పడిన నిబంధనలు ఆచరణలో అమలులోకి రానంత కాలం వర్గ సమాజంలోని పంచాయతీ వ్యవస్థ సహితం కలవాడి కులగోత్రాల చట్రంలోనే ప్రజల్ని గానుగెద్దుల్లా తిప్పుతుంటుంది. 65 ఏళ్లుగా వర్గ రాజకీయ పక్షాల ప్రభుత్వాలు, నాయకులూ పాటించిన ప్రజాస్వామ్య వ్యతిరేక, ప్రజావ్యతిరేక పంథా ఇది అని మరచిపోరాదు.
అందుకే గాంధీజీ కూడా చేసేది లేక ఒక లౌకికవాద నైతిక పాఠాన్ని సూక్తిగా చెప్పాడు. ‘‘నదిలో సరదాగా ఈత కొట్టుకోండి గాని, నదిలో మాత్రం మునిగిపోకండి’’ అన్నాడు! అంటే ఇంతకు ముందు చెప్పినట్లు ‘మతం అనేది కేవలం వ్యక్తిగత విశ్వాసం’ కాబట్టి హద్దులు మీరవద్దు అని పరోక్షంగా బోధించాడు. గ్రామీణ వ్యవస్థ అర్థ భూస్వామ్య, పెట్టుబడి చట్రంలో కొనసాగినంత కాలం పంచాయతీల వల్ల కూడా బడుగు, బలహీన వర్గాల ప్రయోజనాలకు కులవ్యవస్థలో రక్షణ ఉండదు కాబట్టే కేవలం ‘గ్రామ స్వరాజ్య’ నినాదం వల్ల పేద, సాదల ప్రయోజనాలు నెరవేరవన్నాడు డాక్టర్ అంబేద్కర్!
కనుకనే వర్గ సమాజంలో మత విషయాల పట్ల జాగరూకతలో గాంధీ ఇలా అన్నారు. ఆది నుంచీ పాఠశాల దశ నుంచీ పాఠ్య ప్రణాళికల్లో ‘‘ఒకరి మతమే గొప్పదనీ, ఇతర ధర్మాలన్నీ పనికిరానివనీ, తప్పుడువనీ అన్న భావాన్ని పిల్లల్లో ఎదగనివ్వరాదు. అలా చేయకపోతే తాము నమ్మిన మతమే నిజమైనదన్న తలంపు వారిలో అలాగే మిగిలిపోతుంది. ఇది ప్రమాదకరం’’! నేటి ‘ఓటి’ నాయకులు ‘ఓటు’ రాజకీయాల్లో మునిగి ఉన్నందున గాంధీ హెచ్చరికలు పనికిమాలినవిగా భావిస్తున్నారు.
- ఏబీకే ప్రసాద్
సీనియర్ సంపాదకులు