అవినీతికి ‘సుప్రీం’ అంకుశం | Opinion on AP MLAS party shiftings by senior journalist ABK Prasad | Sakshi
Sakshi News home page

అవినీతికి ‘సుప్రీం’ అంకుశం

Published Tue, Apr 5 2016 1:28 AM | Last Updated on Fri, Mar 22 2019 6:25 PM

అవినీతికి ‘సుప్రీం’ అంకుశం - Sakshi

అవినీతికి ‘సుప్రీం’ అంకుశం

రెండో మాట
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీకి బీజేపీ అండ వల్ల ఒక మోస్తరు మెజారిటీ వచ్చింది. కానీ ప్రతిపక్షం వైఎస్‌ఆర్‌సీపీ నుంచి ఆకర్ష్ పథకం ద్వారా ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు. మోదీ ముఖ్యమంత్రిగా ఉండగా గుజరాత్‌లో 2002లో చోటు చేసుకున్న పరిణామాల పట్ల చంద్రబాబు నాడు బాహాటంగానే ఏహ్యభావాన్ని ప్రకటించారు. ఇప్పుడు మాత్రం మోదీ ‘ప్రక్రియ’నే అనుసరిస్తున్నారు. పక్కన ఉన్న తెలుగు రాష్ట్రంలోనూ ఇదే పథకం కింద ప్రతిపక్షాన్ని ఖాళీ చేయించే పని యథేచ్ఛగా సాగుతోంది.

 
 
 ‘పార్లమెంట్ సభ్యులు, శాసనసభల సభ్యులు అవినీతికి పాల్పడినప్పుడు వారిని నేరగాళ్లుగా నిర్ధారించేదాకా వేచి ఉండవలసిన అవసరం లేకుండానే, సభా వ్యవహారాలకు అనర్హుడిని చేసే స్పష్టమైన ఒక చట్టాన్ని రూపొందించాలని సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం అభిప్రాయపడింది.’
 - రాజకీయ అవినీతికి వ్యతిరేకంగా తీసుకోవలసిన చర్యలను గురించి చర్చిస్తున్న సుప్రీంకోర్టు  మూడవరోజు సమావేశాన్ని ప్రారంభిస్తూ చేసిన నిర్ణయం (9-3-2016 నాటి వార్తలు)
 
 నేర విచారణలో ఉన్న లెజిస్లేటర్ మీద కింది కోర్టు (ట్రయల్ కోర్టు) అభియోగాలను నమోదు చేసే దశలోనే శాసనవేదికలకు అతడిని అనర్హుడిగా ప్రకటించవచ్చా? అన్న ప్రశ్నను ముగ్గురు న్యాయమూర్తుల సుప్రీం కోర్టు ధర్మాసనం సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించింది. విచారణ ఎదుర్కొంటున్న అలాంటి సభ్యులకు శిక్ష ఖరారయ్యే వరకు కూడా సభలో వేటు వేయకుండా ఉపేక్షించవలసిందేనా అని త్రిసభ్య ధర్మాసనం ప్రశ్నిం చింది. అవినీతి అంటే కోట్లకు పడగలెత్తడమే కాదు. పార్టీ ఫిరాయింపులు కూడా.  నిజానికి ఈ దేశంలో ఇప్పుడు ఏం జరుగుతోందో తెలుసుకోగోరు తున్నాం అనీ, శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలు కాలానుగుణంగా పరీక్షలు ఎదుర్కొంటూ ఉండగా, న్యాయ వ్యవస్థ మాత్రం రోజూ కఠిన పరీక్షలనే చవి చూడవలసి వస్తున్నదనీ ఇంతకు ముందు రెండు సందర్భాలలో జస్టిస్ చలమేశ్వర్ అధ్యక్షతన సుప్రీం కోర్టు ధర్మాసనం హెచ్చరికగా ప్రశ్నించవలసి వచ్చింది. అంటే పాలకులూ, ప్రజలూ లెజిస్లేటర్లూ, న్యాయవ్యవస్థలూ చేసిన పలు ఉల్లంఘనలకు మూలం ఎక్కడుందో ఆలోచించాలి.
 
ఉపోద్ఘాతం ప్రాధాన్యాన్ని గుర్తించాలి
 అమెరికా రాజ్యాంగం దాదాపు రెండు వందల ఏళ్ల నుంచి అమలులో ఉంది. కానీ దానికి జరిగిన సవరణలు  ముప్పయ్. మన రాజ్యాంగానికి 65 ఏళ్లలోనే -1951 లగాయితూ 2013 వరకు వచ్చిన సవరణలు వందను మించి పోయాయి. అయినా ‘భారత ప్రజలమైన మేము...’ అని ప్రజలు ప్రతిజ్ఞ చేస్తూ పౌరులందరికీ సమాన హోదా, మతాలకు అతీతంగా సోషలిస్ట్, సెక్యులర్, ప్రజాస్వామ్య గణతంత్ర వ్యవస్థను ఏర్పాటు చేసుకునే సంకల్పం తో ఒక కార్యాచరణ సంకల్పంతో ఉపోద్ఘాతం రూపొందించుకున్నాం. తద్వారా భారత ప్రజలకు ఎలాంటి లక్ష్యాలు ఆచరణలో సాధించిపెట్టవలసిన బాధ్యత ఉందో వివరించారు. అవి- పౌరులందరికీ న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, వివక్షలేని సమైక్యతను విధిగా సాధించి పెట్టడం, భావ ప్రకటనా స్వేచ్ఛ, ఆరాధనా స్వేచ్ఛలకు భంగం కలిగించకుండా కాపాడు కోవడం, కుల వ్యవస్థ నిర్మూలన .

అందుకే మొత్తం రాజ్యాంగ  లక్ష్యమంతా ముఖపత్రంలోనే, ఉపోద్ఘాతంలోనే క్లుప్తీకరించడం జరిగింది. ఈ లక్ష్యాలు ఎంతవరకు నెరవేరాయి? నెరవేరకుంటే అందుకు కారకులు ఎవరు? అని అన్ని విభాగాలు, వాటి నిర్వాహకులు ముఖ్యంగా జెండాలకు మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్న పాత కొత్త పాలకులంతా ప్రశ్నించుకుని సమాధానం చెప్పవలసిన సమయం వచ్చింది. విచారణ సంఘాలు, ఎన్నికల కమిషన్‌లు వంటివి ఈ రాజ్యాంగ చట్టాలతోనే తెచ్చుకున్నాం. అలాగే డబ్బు కోసమో, పదవుల కోసమో ఒక పార్టీ నుంచి వేరొక పార్టీలోకి ఫిరాయించే, లేదా అమ్ముడుపోయే లెజిస్టేటర్లను కట్టడి చేసే ఉద్దేశంతో కూడా చట్టాలను రూపొందించుకున్నాం. ఇంకా ఫిరాయింపులను నిషేధిస్తూ, అలాంటి వారిని లెజిస్లేచర్ సభ్యత్వాలకు అనర్హులుగా ప్రకటించగల చట్టాలను కూడా తెచ్చు కున్నాం. ఎన్నికలలో అవినీతికి పాల్పడే వారి మీద కఠిన చర్యలు తీసుకోవా లని సంకల్పించి ఏళ్లూ పూళ్లూ గడచిపోయాయి. రాజకీయులకూ, పోలీసు లకూ, మాఫియా ముఠాలకూ మధ్య విడదీయరాని బంధం ఏర్పడినందున వాటి నిరోధానికి ఉన్నత స్థాయి కమిటీలు ఇచ్చిన నివేదికలనూ చూశాం! పాలనా వ్యవస్థలలో అవినీతి పేరుకుపోయినందున  ఆ అవినీతిలో అంత ర్భాగంగానే ఓట్లు కొనుగోలు చేయడం, ‘ఓటుకు నోటు’ వంటివి యథేచ్ఛగా ముఖ్యమంత్రుల స్థాయిలోనే ఆచరణలో చట్టబద్ధంగా భావించే దౌర్భాగ్య స్థితికి చేరుకున్నాం. చివరకు ఈ పుండు ఎంత లోతుకు తొలచుకుంటూ వెళ్లిందంటే, అధికార పార్టీకి మెజారిటీ ఉన్నా, ‘బెల్లంతో ఈగలని’ ఆకర్షించే అవసరం లేకున్నా ప్రతిపక్షాన్ని మాత్రం బలహీనం చేసేందుకు దాదాపు అన్ని రాష్ట్రాలలోనూ, కేంద్రంలోనూ ఒక సంస్కృతిగా విస్తరిస్తోంది. ఇది కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలోను, బలహీన స్థితిలో పార్లమెంటులోను కూడా జరిగింది. 

పార్లమెంటులో తనకున్న బ్రూట్ మెజారిటీ మూలంగా బీజేపీ ఈ క్షణానికి ఇతర పార్టీల నుంచి వచ్చే ఫిరాయింపుదారులకు చోటు కల్పించకపోవచ్చు. కానీ రేపటి అవసరం ఏ రూపంలో ఉంటుందో తెలియదు. ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్ తదితర రాష్ట్రాల శాసనసభలలో జరుగుతున్న తాజా పరిణామాలూ రాష్ట్రపతి పాలన విధింపులూ బీజేపీ పాలకుల కొత్త తరహా సోషల్ ఇంజనీరింగ్ ప్రక్రియ. దేశంలోని ఇతర రాష్ట్రాలలో ప్రాపకం కోసం ఈ ప్రక్రియ ముందుకు వెళ్లడం ఖాయం. అంటే బొమ్మైకేసు తీర్పు నుంచి కూడా మోదీ పాలన పాఠం నేర్చుకోలేదు.


 మోదీ ప్రక్రియకు దాసోహం
 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జరుగుతున్న పరిణామాలు కూడా ఆ సోషల్ ఇంజనీరింగ్ ప్రక్రియ ఫలితమే. ఈ అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీకి బీజేపీ అండ వల్ల ఒక మోస్తరు మెజారిటీ వచ్చింది. కానీ ప్రతిపక్షం వైఎస్‌ఆర్‌సీపీ నుంచి ఆకర్ష్ పథకం ద్వారా ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు. మోదీ ముఖ్యమంత్రిగా ఉండగా గుజరాత్‌లో 2002లో చోటు చేసుకున్న పరిణామాల పట్ల చంద్రబాబు నాడు బాహాటంగానే ఏహ్యభావాన్ని ప్రకటించారు. ఇప్పుడు మాత్రం మోదీ ‘ప్రక్రియ’నే అనుసరిస్తున్నారు. పక్కన ఉన్న తెలుగు రాష్ట్రంలోనూ ఇదే పథకం కింద ప్రతిపక్షాన్ని ఖాళీ చేయించే పని యథేచ్ఛగా సాగుతోంది. ఈ క్రమంలో న్యాయస్థానాలను కూడా తమకు అనుకూలంగా ప్రభావితం చేయడానికి గతంలో పాలక పక్షాలు ప్రయత్నించిన సంగతిని విస్మరించలేం.

అవినీతి రాజకీయాలకు అలవాటు పడిన అన్ని బ్రాండ్ల పాలకులూ న్యాయవ్యవస్థను కంట్రోల్ చేయడం కోసం రాజ్యాంగంలో శాసనాలపైనా, పాలకుల చేష్టలపైనా లెజిస్లేచర్ స్పీకర్ల నిర్ణయాలపైన భాష్యం చెప్పేందుకు జ్యుడీషియరీకి  కల్పించిన విశిష్టాధికారాన్ని కూడా ప్రశ్నించడానికి సాహసిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సభ్యురాలు ఆర్‌కె రోజా మీద శాసనసభ నిబంధనలకు విరుద్ధంగా సస్పెన్షన్ ఉత్తర్వును ఏడాది పాటు అమలులోకి వచ్చేటట్టు స్పీకర్ తీసుకున్న నిర్ణయం ఈ సందర్భంగా కోర్టులో ప్రశ్నార్థకం కావలసి వచ్చింది. ఫలితంగా సింగిల్ జడ్జి బెంచ్ ఆ ఉత్తర్వును నిలిపివేయవలసి వచ్చింది. దాని మీద చంద్రబాబు ప్రభుత్వం ఆ స్టే (నిలుపుదల) ఉత్తర్వును రద్దు చేయించుకుంది. రోజా సుప్రీంకోర్టును ఆశ్రయించిన తరువాతే సింగిల్ జడ్జి బెంచ్ ఏర్పడక తప్పలేదు.

‘‘అసలు హైకోర్టులో ఏం జరుగుతోందో, స్పీకర్ కార్యాలయంలో ఏం జరుగుతోందో తెలుసుకోగోరుతున్నాం’ అని సుప్రీం కోర్టు ప్రశ్నించే వరకు సభా వ్యవహారాలు సాగుతూ వచ్చాయి. కానీ ఇక్కడ మరచిపోరాని విషయం- శాసనబద్ధంగా తనకు లభించిన భావ ప్రకటనా స్వేచ్ఛకు ఎదురైన సమస్యను సభలో వివరించడానికి రోజాకు అవకాశం ఇవ్వకపోవడం. ఏడాది పాటు (సభ్యుల సస్పెన్షన్ కాల పరిమితి ఏ దశలో అయినా గరిష్టంగా ఆ సమావేశాల వరకేనని నిబంధనలు నిర్దేశిస్తున్నా) ఆ సభ్యురాలి ప్రవేశాన్ని అడ్డుకుంటూ తీర్మానించడమూ, ప్రజలలోనూ కోర్టులలోనూ ఇంటా బయటా అల్లరైపోవడంతో చంద్రబాబు ప్రభుత్వం తాజాగా ప్లేటు ఫిరాయించింది. దాంతో సభా వ్యవహారాల సంఘం ముందు ఈ నెల 6న (రేపు) హాజరు కావలసిందిగా రోజాను తాజాగా ఆహ్వానించవలసి రావడం ఆలస్యంగా జరిగినా ఆహ్వానించదగినదే.
 
ఇది ప్రజావిజయం
ఈ కొత్త పరిణామం ప్రజాభిప్రాయానికీ, చట్టానికీ విజయమే. అటు రోజా తాజా పిటిషన్ మీద సుప్రీంకోర్టు  రేపో మాపో తీర్పును ఇవ్వబోతున్నది. దీనితో అసెంబ్లీలో రోజా అంశం ప్రకంపనలు సృష్టించబోవడం సభా హక్కుల సంఘం తాజా నిర్ణయానికి ప్రధాన కారణమై ఉండవచ్చు. ‘స్పీకర్ నిర్ణయం మేరకు సభ్యురాలిని సస్పెండ్ చేసే అధికారం సభకు ఉంది’ అన్న సమర్థన కోసమే పంటి బిగువుతో టీడీపీ కొత్త ప్రచారం మొదలు పెట్టింది. అయితే స్పీకర్ నిర్ణయం సైతం సభా నిబంధనలకు, రాజ్యాంగం లోని 194వ అధికరణాంశాలకు బద్ధమయి ఉండాలన్న సంగతి విస్మరించ రాదు. అలాగే విపక్షం నుంచి అధికార పక్షం వైపుగా గోడ దూకుడుకు అలవాటు పడిన లెజిస్లేటర్లను బర్తరఫ్ చేయాలని రాజ్యాంగంలోని 10వ షెడ్యూలు  నిబంధనను స్పీకర్లు పాటించి తీరవలసిందేనని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వెంకటాచలయ్య ధర్మాసనం 1994లోనే స్పష్టం (ఎస్. రవినాయక్ వర్సెస్ ప్రభుత్వం కేసు)చేసింది. అలాగే కిహోటో వర్సెస్ జాచిలూ కేసులో (1992) ఇలా శాసించవలసి వచ్చింది:

‘స్పీకర్ గానీ, కౌన్సిల్ అధ్యక్షుడు గానీ 10వ షెడ్యూలు కింద బాధ్యతలు, అధికారాలు నిర్వహించేటప్పుడు లెజిస్లేచర్ సభ్యుల హక్కులను, కర్తవ్యాలను నిర్ధారించే ఒక సాధికార ట్రిబ్యునల్‌గా మాత్రమే వ్యవహరించాలి గానీ, అన్యధా కాదు. అయితే స్పీకర్/ చైర్మన్ నిర్ణయాలు మాత్రం న్యాయస్థానాల సమీక్షకు బద్ధమై ఉండాల్సిందే’. అసలు మాట్లాడే హక్కునే దేశద్రోహంగా పరిగణించే పాలక వర్గాలు ఉన్న వాతావరణమిది. ఇంకో అడుగు ముందుకు వేసి అవి న్యాయస్థానాల హక్కులను కూడా హరించే యత్నం చేస్తున్నాయి.

(వ్యాసకర్త : ఏబీకే ప్రసాద్, సీనియర్ సంపాదకులు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement