ఏ విలువలకీ ప్రస్థానం?
త్రికాలమ్: ఫిరాయింపు విద్యలో చంద్రబాబునాయుడి అనుభవం ఎక్కువ. రాజకీయ ప్రవేశంతోనే ఆయన ఇందులో అభ్యాసం ప్రారంభించారు. అనైతికమైన పనులు అడ్డంగా చేసిన వెంటనే తనకంటే నీతిమంతులు ఎవ్వరూ లేరంటూ దబాయించడం చంద్రబాబు మార్కు రాజకీయం. అయిదుగురు ప్రతిపక్ష శాసనసభ్యులను బుట్టలో వేసుకున్న వెంటనే కేరెక్టరే తన బలం అంటూ నిస్సంకోచంగా, నిర్ద్వంద్వంగా ప్రకటించడం ఆయన ప్రత్యేకత. కొంతమంది శాసనసభ్యులు అధికార పార్టీలో చేరినంత మాత్రాన ప్రతిపక్షం బలహీనపడుతుందా? ఎన్‌టీఆర్ నుంచి అధికారం లాక్కున్న నాదెండ్ల భాస్కరరావు ప్రాబల్యం పెరిగిందా?
తెలుగు రాష్ట్రాలు కొత్త రాజకీయ సంస్కృతికి శ్రీకారం చుడుతున్నాయి. దీనికి కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తోంది. ప్రజలు ఉపేక్షిస్తున్నారు. రాజ్యాంగం, రాజ్యాంగానికి మొన్నటి వరకూ చేసుకున్న వందకుపైగా సవరణలూ వెల వెలపోతున్నాయి. ప్రజాప్రాతినిధ్య చట్టం విలవిలలాడుతోంది. ఫిరాయింపు లను ప్రోత్సహిస్తున్నది అభివృద్ధి కోసమేనంటున్నారు నేతలు. ఫిరాయింపు తంత్రం, అభివృద్ధి మంత్రం.
అరుణాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్ సర్కార్ అకస్మాత్తుగా బీజేపీ ప్రభుత్వంగా మారిపోయింది. తెలంగాణలో తెలుగుదేశం (తెదేపా) టిక్కెట్టుపైన అసెంబ్లీ ఎన్నికలలో గెలిచిన సనత్‌నగర్ శాసనసభ్యుడు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ప్రభుత్వంలో చేరి దర్జాగా కొనసాగుతున్నారు. వైఎస్‌ఆర్‌సీపీ సభ్యులతో మాసాల తరబడి బేరసారాలు సాగించి లొంగిపోయినవారికి పచ్చ కండువా కప్పుతున్నారు చంద్రబాబునాయుడు. ఫిరాయింపుల చట్టాన్ని ఎడాపెడా ఉల్లం ఘిస్తూ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నప్పటికీ గవర్నర్లు కానీ, రాష్ట్రపతి కానీ, ఇంగ్లీషు టీవీ న్యూస్ చానళ్ళు కానీ ఆక్షేపించడం లేదు.
అరుణాచల్‌ప్రదేశ్ గవర్నర్ జెపీ రాజ్‌ఖోవా తన పేరు మీద నడుస్తున్న ప్రభుత్వం నడ్డి విరిచారు. ముఖ్యమంత్రి నబామ్ టుకీ, స్పీకర్ నబామ్ రబియాలను సంభ్ర మాశ్చర్యాలకు గురిచేశారు. ఫిరాయించిన డిప్యూటీ స్పీకర్ నాయకత్వంలో జరిగిన పోటీ సభలో స్పీకర్‌ను బర్తరఫ్ చేసినట్టు తీర్మానించారు. అరవై మంది సభ్యులున్న అరుణాచల్‌ప్రదేశ్ అసెంబ్లీకి 2011 నవంబర్‌లో జరిగిన ఎన్నికలలో 47 స్థానాలు గెలుచుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి సజావుగా పరిపాలిస్తున్న టుకీని అస్థిరపరిచేందుకు గవర్నర్ ఒక అస్త్రంగా పనిచేశారు. రాజీవ్‌గాంధీ ప్రభుత్వం 1995లో చేసిన ఫిరాయింపుల నిరోధక చట్టాన్నీ, ఆ చట్టానికి 2003లో వాజపేయి ప్రభుత్వం చేసిన సవరణనూ బుట్టదాఖలు చేశారు. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌ని పాతరేశారు.
ఫిరాయింపులు కొత్త కాదు
‘నాకు కేరెక్టర్ చాలా ముఖ్యం. అదే నా బలం’ అంటూ చంద్రబాబునాయుడు గురువారంనాడు ఏలూరులో ప్రకటించారు. ఇటువంటి ప్రకటన చేయడం ఇదే ప్రథమం కాదు. 1982లో ఎన్‌టి రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించిన సమ యంలో పార్టీ అధిష్ఠానం ఆదేశిస్తే పిల్లనిచ్చిన మామ ఎన్‌టీఆర్‌కి వ్యతిరేకంగా ఎన్నికల బరితో దిగుతానంటూ తొడగొట్టిన యువ కాంగ్రెస్ మంత్రి ఆయన. ఎన్‌టీఆర్ ప్రభంజనంలో చిత్తుగా ఓడిపోయిన చంద్రబాబునాయుడు కాం గ్రెస్‌కు గుడ్‌బై చెప్పి ఎన్‌టీఆర్ పంచన చేరడానికి ఎంతో కాలం పట్టలేదు. శాసన సభ్యత్వం లేకపోయినా, మంత్రి కాకపోయినా కర్షక పరిషత్తు అధ్యక్షుడిగా మంత్రులకంటే అధికంగా అధికారం చెలాయించారు.
క్రమంగా తన కంటూ ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. 1995 ఆగస్టులో వైస్రాయ్ హోటల్ సాక్షిగా తెదేపా ఎంఎల్‌ఏల చేత మూకుమ్మడి ఫిరాయింపు చేయించి పార్టీని చీల్చి తనదే అసలైన తెదేపా అని ప్రకటించుకున్నారు. అది ఫిరాయింపులకు పరాకాష్ఠ. ఎన్‌టీఆర్ మరణం తర్వాత ఆయననే దేవుడంటూ కొలవటం కౌటిల్యం. అప్పుడే చంద్రబాబునాయుడి కేరెక్టర్ ఏమిటో తెలుగువారికి తెలిసిపోయింది. 1978లో రోశయ్య నాయకత్వంలో రెడ్డి కాంగ్రెస్ శాసనసభ్యులూ, శాసనమండలి సభ్యులూ మర్రి చెన్నారెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ (ఐ)లోకి వలస వెళ్ళిన ప్పుడూ, రోశయ్య మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడూ ఫిరాయింపుల నిరోధక చట్టం లేదు. ఆ తర్వాత వచ్చింది.
ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని సవరించిన అనంతరం కూడా కొనసాగిన ముఖ్యమైన లొసుగు ఏమిటంటే ఫిరాయింపు దారులను అనర్హులుగా ప్రకటించాలా లేదా అని నిర్ణయించే హక్కు సభాపతికి ఉండటం, సభాపతి నిర్ణయాన్ని ప్రశ్నించే హక్కు అత్యున్నత న్యాయస్థానానికి సైతం లేకపోవడం. చట్టసభల అధికారాన్ని న్యాయవ్యవస్థ ప్రశ్నించరాదనే ఉద్దేశంలో ఈ నిబంధన చేర్చారు. సభాపతులు ఏ పార్టీ నుంచి ఎన్నికైనప్పటికీ పార్టీ ప్రయోజనాలకు అతీతంగా, స్వతంత్రంగా, చట్టబద్ధంగా వ్యవహరిస్తారనే విశ్వాసంతో ఆ పనిచేశారు. కానీ స్వతంత్రంగా వ్యవహరించే సభాపతులు లేరు.
లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ అధ్య క్షుడు ఏమైనా సంకోచిస్తారేమో కానీ శాసనసభాపతులూ, శాసనమండలి అధ్య క్షులూ ముఖ్యమంత్రుల అభీష్టానికి అనుగుణంగా నదురూబెదురూ లేకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారు లేదా నిర్ణయాలు తీసుకోకుండా నాన్చుతున్నారు. ఈ బలహీనతను వినియోగించుకొని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో విచ్చ లవిడిగా శాసనసభ్యులను ప్రలోభాలకు గురి చేసి పార్టీ ఫిరాయింపులను ప్రోత్స హించారు. వారిపైన అనర్హత వేటు పడకుండా కొమ్ముకాస్తున్నారు. పార్టీ ఫిరా యించిన పార్లమెంటు సభ్యులపైనా, శాసనసభ్యులపైనా అనర్హులుగా ప్రకటించ కుండా అధికార పార్టీ ప్రయోజనాలు పరిరక్షిస్తున్న సభాపతులపైన ఏ చర్య ఎవరు తీసుకోవాలో పార్లమెంటు నిర్ణయించాలి. ఇందుకు అవసరమైన రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంటులో సత్వరం ప్రవేశపెట్టాలి. లేకపోతే ప్రజాస్వామ్యం అపహస్యంపాలు కాకతప్పదు.
ఎన్నికలెందుకు?
రాజ్యాంగం గురించీ, రాజకీయ విలువల గురించీ విజయవాడ శాసనసభ్యుడు బోండా ఉమకు ఉన్నంత పరిజ్ఞానమే పెద్ద పదవులలో ఉన్న నాయకులూ ప్రదర్శించడం శోచనీయం. ‘అభివృద్ధికోసం పార్టీ మారితే ఉపఎన్నికలు ఎందుకు? రాజీనామా చేయవలసిన అవసరం ఏముంది?’ అంటూ బోండా ఉమ అనడం అప్రజాస్వామికమనీ, తప్పు అనీ తెదేపా నాయకులు కానీ, బీజేపీ నాయకులు కానీ అనకపోవడం నైతిక విలువలకు ఏ మాత్రం విలువ ఇస్తున్నామో సూచిస్తున్నది. గురువారంనాడు ఎర్రబెల్లి దయాకరరావుకు గులాబీ కండువా కప్పుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు (కేసీఆర్) కూడా తెలంగాణ అభివృద్ధికోసం రాజకీయ శక్తుల పునరేకీకరణలో భాగమే తెదేపా శాసనసభ్యుడు తెరాసలో చేరడం అని సూత్రీకరించారు. ఏ విలువలకీ ప్రస్థానం?
భారత ప్రజాస్వామ్య వ్యవస్థ భవిష్యత్తు ఎట్లా ఉండబోతోందో ఊహించు కోవచ్చు. ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికలలో వివిధ పార్టీల టికెట్లపై అభ్యర్థులు పోటీ చేస్తారు. ఒక పార్టీకి మెజారిటీ వస్తుంది. లేదా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుంది. ప్రతిపక్ష సభ్యులకు ఎలాగైనా సరే మంత్రులు కావాలనే ఆశలుంటాయి. ఎన్నికలలో ఖర్చు చేసిన డబ్బు తిరిగి రాబట్టుకోవాలనే ఆరాటం ఉంటుంది. తీర్చవలసిన అప్పులు వేధిస్తుంటాయి. అక్రమాలకు సంబంధించిన కేసులు ఉంటాయి. వాటి నుంచి ఏదో ఒక విధంగా బయటపడాలనే తాప త్రయం ఉంటుంది. చంద్రబాబునాయుడు వంటి ముఖ్యమంత్రి ప్రతిపక్ష సభ్యుల ఆశలూ, కేసులూ, ఇబ్బందుల వివరాలు తెలుసుకుంటారు. ఆశలు తీరుస్తామనీ, కేసులు ఎత్తేస్తామనీ మాట ఇస్తారు. మూటలు పంపుతారు.
ఆకలిమీద ఉన్న ప్రతిపక్ష సభ్యులు కొందరు ప్రలోభాలకు లొంగిపోతారు. తమది ఫిరాయింపు కాదనీ, అభివృద్ధి సాధించేందుకు అధికార పార్టీతో భుజం కలుపుతున్నామనీ కోరస్ వినిపిస్తారు. చట్టాలతో ప్రమేయం లేకుండా, నైతిక విలువలతో నిమిత్తం లేకుండా గెలిచిన శాసనసభ్యులందరూ అధికార పార్టీలో చేరి అధికారం పంచుకుంటూ అభివృద్ధి కోసం కృషి చేయవచ్చుననే కొత్త సిద్ధాంతం చేసినందుకూ ఫిరాయింపుదారులకూ, సూత్రధారులకూ సమయం సందర్భం వచ్చినప్పుడు ప్రజలు సముచితమైన బహుమతి ఇస్తారు.
అధినేతలదే అంతిమ నిర్ణయం
ప్రాంతీయ పార్టీలలో అధినేతలదే అంతిమ నిర్ణయం. తెదేపా కానీ తెరాస కానీ ఇందుకు భిన్నం కాదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కానీ, తెలంగాణ సర్కార్‌లో కానీ ముఖ్యమంత్రుల మాట కాదనే మంత్రులు ఎవ్వరూ లేరు. నైతికత లేదా రాజ్యాంగ నిబద్ధత గురించి ప్రశ్నించే సాహసం ఎవ్వరికీ లేదు. దాదాపు ఇదే స్థాయిలో ప్రధాని నరేంద్రమోదీ ఉన్నారు. ఆయనకు ఎదురు చెప్పే గుండెలు ఎవ్వరికీ లేవు. ఈ ముగ్గురూ ఫిరాయింపుల నిరోధక చట్టానికి తూట్లు పొడిచారు.
మోదీ, కేసీఆర్ కంటే ఫిరాయింపు విద్యలో చంద్రబాబునాయుడి అను భవం ఎక్కువ. రాజకీయ ప్రవేశంతోనే ఆయన ఇందులో అభ్యాసం ప్రారంభిం చారు. అనైతికమైన పనులు అడ్డంగా చేసిన వెంటనే తనకంటే నీతిమంతులు ఎవ్వరూ లేరంటూ దబాయించడం చంద్రబాబునాయుడు మార్కు రాజకీయం. అయిదుగురు ప్రతిపక్ష శాసనసభ్యులను బుట్టలో వేసుకున్న వెంటనే కేరెక్టరే తన బలం అంటూ నిస్సంకోచంగా, నిర్ద్వంద్వంగా ప్రకటించడం ఆయన ప్రత్యేకత.
కొంతమంది శాసనసభ్యులు అధికారపార్టీలో చేరినంత మాత్రాన ప్రతి పక్షం బలహీనపడుతుందా? ఎన్‌టీఆర్ నుంచి అధికారం లాక్కున్న నాదెండ్ల భాస్కరరావు ప్రాబల్యం ముఖ్యమంత్రిగా వ్యవహరించిన నెల రోజులలో పెరి గిందా? 1985లో జరిగిన ఎన్నికలలో ఆయన బలపరచిన వారికి ఎన్ని స్థానాలు దక్కాయి? 1996 నాటి పార్లమెంటు ఎన్నికల వరకూ ఎన్‌టీఆర్ బతికి ఉన్నట్ల యితే చంద్రబాబునాయుడు నాయకత్వంలోని తెదేపా చిత్తుగా ఓడేది కాదా? జనాదరణ కలిగిన రాజకీయ నాయకుల ప్రాబల్యం శాసనసభ్యుల సంఖ్యపైన ఆధారపడదు. 1978 శాసనసభ ఎన్నికల సమయంలో జలగం వెంగళరావు ముఖ్యమంత్రి. సమర్థ పాలకుడిగా పేరుంది.
మంత్రులూ, శాసనసభ్యులూ, డీసీసీ అధ్యక్షులూ అందరూ జలగం వైపే. కాంగ్రెస్(ఐ) జాతీయ అధ్యక్షురాలు ఇందిరాగాంధీ, ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు మర్రి చెన్నారెడ్డి ఇద్దరూ అభ్యర్థుల కోసం రాజగోపాలనాయుడి వంటి పాతతరం నాయకులపైన ఆధారపడిన రోజులు అవి. ఆ విధంగా రాజగోపాలనాయుడు సిఫార్సు చేస్తేనే చంద్ర బాబునాయుడికి చంద్రగిరిలో పోటీ చేసేందుకు కాంగ్రెస్ (ఐ) టికెట్ వచ్చింది. ఇందిరాగాంధీకి ప్రజలలో ప్రాబల్యం ఉన్నది కనుక ఆమె పార్టీ ఘనవిజయం సాధించింది. శాసనసభ్యులూ, కార్యకర్తలూ రాజకీయ పార్టీలకు అవసరమే. అధి నేతకు ప్రజలలో ప్రాబల్యం లేకపోతే ఎన్నికల సమయంలో ఎంతమంది శాసన సభ్యులున్నా ప్రయోజనంలేదు. టంగుటూరి ప్రకాశం పంతులు, ఎన్.టి.రామా రావు, వైఎస్ రాజశేఖరరెడ్డి వంటి ప్రజానాయకులతో ప్రజలు అనుబంధం పెంచుకుంటారు. 2014లో నరేంద్ర మోదీకి బీజేపీ నాయకులూ, కార్యకర్తలూ లేని చోట్ల కూడా ఓట్లు రావడానికి ఇదే కారణం.
టీవీ చానళ్ళ ద్వారా ఆయన దేశ ప్రజలతో నేరుగా మాట్లాడారు. వారికి తన నాయకత్వం పట్ల విశ్వాసం కలి గించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వాగ్దానాలు అమలు చేయలేక, అవినీతి ఆరో పణలకు సమాధానం చెప్పలేక, ప్రతిపక్ష శాసనసభ్యులను సంతలో పశువులను కొన్నట్టు (సనత్‌నగర్ శాసనసభ్యుడు తలసాని శ్రీనివాసయాదవ్ తెదేపా నుంచి తెరాసలోకి వలస పోవడాన్ని ఆక్షేపిస్తూ చంద్రబాబునాయుడు అన్నమాటలే) కొని తన బలం పెరుగుతోందనీ, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహనరెడ్డి బలం క్షీణిస్తోందనీ భావించినట్లయితే అంతకుమించిన భ్రమ మరొకటి ఉండదు.
ఇరవై మాసాల కిందట తెదేపాను ఆదరించిన కొన్ని వర్గాలు ఇప్పటికే ఆ పార్టీకి దూరమైనాయి. రోజులు గడుస్తున్న కొద్దీ ప్రభుత్వ వ్యతిరేకత పెరుగు తుందే కానీ తగ్గదు. నాయకుడు చేసిన వాగ్దానాలకూ, కార్యాచరణకూ మధ్య ఉన్న అంతరం ఆయన కేరెక్టర్‌ను నిర్ణయిస్తుంది. తనకు తాను ఇచ్చుకున్న కేరెక్టర్ సర్టిఫికెట్‌కు విలువలేదు. సర్టిఫికెట్ ఇవ్వవలసింది ప్రజలు. ఎప్పుడు ఎన్నికలు జరిగితే అప్పుడు ఎటువంటి సర్టిఫికెట్ ఇవ్వాలో ప్రజలే నిర్ణయిస్తారు.
- కె. రామచంద్రమూర్తి
(వ్యాసకర్త: సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్)