రెండో మాట
కాబట్టి– కాంగ్రెస్, బీజేపీ, తెలుగుదేశం– ఈ మూడు పార్టీలు రాష్ట్ర ప్రజల మూల్గులు పీల్చేశాయి. ఇందుకు ఉదాహరణ: ఈ మూడు దుష్ట శక్తులు కలసి నాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ‘దుర్మరణం’ నుంచి (ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పతనం వెనుక రహస్యం ఇప్పటికీ చర్చనీయాంశమే) జాతీయ స్థాయిలో కాంగ్రెస్ సహా, బీజేపీ, తెలుగుదేశం తమ తమ కోణాల నుంచి లబ్ధి పొందాలని చూశాయి. ఈ వెంపర్లాటలోనే చంద్రబాబు వర్గం బీజేపీ పంచన చేరింది.
‘ప్రభుత్వాలు పేదవర్గాలకు న్యాయం జరక్కుండా అడ్డుకుంటున్నాయి. తద్వారా తమకు తామై ప్రజలే ఓటమిని అంగీకరించి, పడి ఉండేటట్టు చేసి, వారికి అందవలసిన న్యాయాన్ని అందకుండా ప్రభుత్వాలు గాడి తప్పిస్తున్నాయి.’ – సుప్రీంకోర్టు వ్యాఖ్య (28–5–16 ఇచ్చిన తీర్పులో)
దేశ ప్రజల అందరి తరఫున పార్లమెంట్ తన వాణిని వినిపిస్తుందన్న ఊహ ప్రచారంలో ఉంది. కానీ ఆ పార్లమెంట్ ప్రాంగణంలోకి ప్రవేశించగలుగుతున్నామన్న భావన ప్రజలకు కలగడం లేదన్ని వాస్తవాన్ని గుర్తించాలి. ఎందుకంటే రాజ్యాంగాన్ని సవరించగల అధికారాన్ని ఆ రాజ్యాంగం కింద ఏర్పరిచిన సంస్థకు దఖలు పరిచినదానికన్నా ప్రజలకే దఖలు పరచడం మరింత గొప్పదీ, విస్తృతాధికారమూ అవుతున్నది. పార్లమెంట్ ఉభయ సభలలోని మొత్తం సభ్యులలో మూడింట రెండొంతుల మంది నేడు మన మెజారిటీ ప్రజలందరికీ ప్రతినిధులు కాజాలరు. ఎందుకని? మన ఎన్నికల వ్యవస్థే అలా ఉంది. ఓటర్లలో మైనారిటీ ఓటర్లు పార్లమెంట్ ఉభయ సభలలో మూడింట రెండొంతులకు మించిన సభ్యులను ఎంపిక చేయవచ్చు– ఇదీ తంతు. కనుకనే దేశంలోని యావన్మంది ప్రజల తరఫున ఉభయ సభలలోని మూడింట రెండొంతుల సభ్యులే ఈ దేశ ప్రజలందరి తరఫున మాట్లాడడానికి అర్హులని ముద్ర వేయాలన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భావనే ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు.’
– జస్టిస్ హెగ్డే, జస్టిస్ గ్రోవర్ (సుప్రీంకోర్టు) (1973లో లేవనెత్తిన ప్రశ్న)
అంటే–ప్రజాబాహుళ్యం అలా చూస్తూ ఉంటే, ప్రభుత్వాలూ పాలక వర్గాలూ యథేచ్ఛగా అలా మేస్తూ పోతున్నాయని గత యాభయ్ ఏళ్ల కాలపు అనుభవం. కేంద్రంలో కాంగ్రెస్, బీజేపీ పాలనలలోను, రాష్ట్రాల పాలన తంతులోను ప్రజల అనుభవం ఇదే. కానీ ఇందుకు సంబంధించిన చర్చను గానీ ప్రజా బాహుళ్యానికి చెందిన విశాల ప్రయోజనాలను రక్షించే ప్రతిపాదనలను గానీ ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం, మెజారిటీ రాజ్యాంగ ధర్మాసనాలు ఎందుకు ముందుకు తీసుకుపోలేక విఫలమవుతున్నాయో అనూహ్యం. ఈ పూర్వరంగంతో చూసినప్పుడు ఇటీవల కాలంలో వివిధ రాజకీయ పార్టీల అవకాశవాద ధోరణులు, ప్రకటనలు, వాటి నాయకుల బరితెగింపులు ఒక భావనకు వచ్చేటట్టు చేస్తాయి.
అదే– రాజ్యాంగ సెక్యులర్, ప్రజాస్వామిక, గణతంత్ర ప్రజా వ్యవస్థ మూలాలనే పెకలించివేసి నియంతృత్వ వ్యవస్థ వైపుగా మన రాజకీయ పార్టీలు పావులు కదుపుతున్నాయని భావించక తప్పని పరిస్థితి ఏర్పడింది. వ్యూహాలు, ఎత్తుగడలు భిన్నంగా కనిపించవచ్చు. కానీ అలాంటి నిరంకుశ వ్యవస్థను ఆశ్రయించే ధోరణిని కొన్ని పార్టీలు ప్రత్యక్షంగాను, ఇంకొన్ని పార్టీలు పరోక్షంగాను వ్యాప్తి చేయడానికి ఒకే తీరులో వ్యవహరిస్తున్నాయి. 2013–2014 నాటి పరిణామం చూడండి. ఆంధ్రప్రదేశ్‌ను విచ్ఛిన్నం చేయడానికి తెలుగు ప్రజలను చీల్చారు. ప్రధాన రాజకీయ పక్షాలన్నింటికీ ఇందులో భాగస్వామ్యం ఉంది. లోక్‌సభలో ఏం జరుగుతున్నదో దేశ ప్రజానీకానికి తెలియనివ్వకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. సభ తలుపులు మూసేశారు. మైక్‌లు పనిచేయకుండా చేసి, ప్రసంగాలు జనానికి చేరకుండా చేశారు. అప్రజాస్వామికంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ విచ్ఛిత్తికి తీర్మానం ఆమోదించింది.
మోసమే వాటి నైజం
కాంగ్రెస్ పార్టీ తరువాత బీజేపీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్‌ను అన్ని విధాలా విమర్శించే బీజేపీ చేస్తున్నదేమిటి? కాంగ్రెస్ విడిచిన చెప్పుల్లోనే కాళ్లు పెట్టడానికి తహ తహలాడిపోతోంది. విభజన చట్టంలోని హామీలను అమలు జరపడానికి మాత్రం ఆ పార్టీ ప్రభుత్వానికి మనసు రావడం లేదు. హామీలను అమలు జరపకుండా పార్లమెంట్‌ను, దేశాన్ని, ఆంధ్రప్రదేశ్ ప్రజలను పరోక్షంగా మోసగించేందుకు ఆ పార్టీ సిద్ధమైంది. తెలుగుదేశం పార్టీ సంగతేమిటి? ఒక్క ఎన్టీఆర్ పాలనలో తప్ప, ఆ పార్టీ మిగిలిన చరిత్ర యావత్తు అవకాశవాదమే. ఎన్టీఆర్ నిర్మించిన ఆ పార్టీనీ, కార్యకర్తలనూ తన స్వార్థ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేసి, వెన్నుపోటు రాజకీయాలకు తెర లేపిన వారు చంద్రబాబునాయుడు. ఇందులో ఆయన మంత్రి వర్గ సహచరులు కూడా భాగస్వాములే. కాబట్టి– కాంగ్రెస్, బీజేపీ, తెలుగుదేశం– ఈ మూడు పార్టీలు రాష్ట్ర ప్రజల మూల్గులు పీల్చేశాయి. ఇందుకు ఉదాహరణ: ఈ మూడు దుష్ట శక్తులు కలసి నాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ‘దుర్మరణం’ నుంచి (ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పతనం వెనుక రహస్యం ఇప్పటికీ చర్చనీయాంశమే) జాతీయ స్థాయిలో కాంగ్రెస్ సహా, బీజేపీ, తెలుగుదేశం తమ తమ కోణాల నుంచి లబ్ధి పొందాలని చూశాయి. ఈ వెంపర్లాటలోనే చంద్రబాబు వర్గం బీజేపీ పంచన చేరింది. తరువాత పరిణామాలు కీలకమైనవి.
ఓదార్పు పట్ల అసహనం
వైఎస్ మరణంతో ఆయన ప్రారంభించిన ప్రజాహిత, ఆచరణాత్మక పథకాలు ఇక అమలు కావేమోనన్న బెంగతో కునారిల్లిన కుటుంబాలను, నేత మరణంతో విచలితులై అకాల మరణం చెందిన వారి కుటుంబాలను ఆయన కుమారుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించాలని భావించారు. ఈ ఎజెండాతో జగన్ ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆదరాభిమానాలకు నోచుకుంటారన్న భయంతోనే అధికార కాంగ్రెస్, అధికారం పోయిన చంద్రబాబు జంటగా కుట్ర పన్నారు. ‘జగన్ దూసుకు రాకుండా’ అడ్డుకట్ట వేయడమే దాని సారాంశం. ఆపై చంద్రబాబు ‘ఆబ’ గురించి తెలిసిన కాంగ్రెస్ అధిష్టానం నిస్సంకోచంగా పన్నిన ‘సీరియల్ కుట్ర’ తెలుగు ప్రజల విభజన. విభజనకు జరిగిన కుట్రలో తొలి అంకం– బాబును దగ్గరకు లాగడమే. ఆ తర్వాత అడుగు– కాంగ్రెస్, టీడీపీలు కలసి కేంద్రంలో సీబీఐ డైరెక్టర్‌గా పనిచేసి, తర్వాత అవిభక్త రాష్ట్ర మంత్రివర్గంలో చేరిన విజయ రామారావు అండదండలతో జగన్‌పై ‘ఆర్థిక నేరాల చిట్టా’ తెరవడం, ఆయన దగ్గర జాయింట్ డైరెక్టర్‌గా (సీబీఐలో) పనిచేసిన లక్ష్మీనారాయణను, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ను దించడం.
టీడీపీతో కలసి కాంగ్రెస్ కుట్ర చేసినప్పటికీ మాతృసంస్థ మీద జగన్‌కు గౌరవం పోలేదు. అందుకే తనది ‘వైఎస్సార్ కాంగ్రెస్’అని ప్రకటిం చారు. ఆ పార్టీ అధికార కాంగ్రెస్‌కు సవాలుగా అవతరించడం కాంగ్రెస్‌కు ‘పుండుపైన కారం’ రాసినట్టయింది. ఫలితం– జగన్ కేసుల గొడవ మరింత ముదిరింది. సాక్ష్యాధారాలు దొరకని కాంగ్రెస్, దొంగ సాక్ష్యాలతో ‘దేశం’ పార్టీ కలసి సివిల్ క్రిమినల్ కేసుల పర్వం తెరిచాయి. సీబీఐ కోర్టు, హైకోర్టుల ఆధారంగా కాంగ్రెస్– ‘దేశం’ పార్టీలు జంటగానూ, విడివిడిగానూ కేసుల గొడవను ఉధృతం చేశాయి. కానీ ఒక్కటి కూడా రుజువుకు నిలబడలేదు. ఫలానా కంపెనీల ద్వారా రహస్యంగా వ్యాపారాలు నిర్వహించి దొంగ డబ్బుతో జగన్ పార్టీ వ్యవహారాలు నిర్వహిస్తున్నాడని కేసులు నడిపాయి రెండు పార్టీలు. రుజువులు లేక జగన్ వ్యాపార భాగస్వాములు దాదాపు డజనుమంది బెయిళ్లతో విడుదలయ్యారు. కానీ కాంగ్రెస్ పాలకుల, చంద్రబాబు ఆర్థిక వ్యవహారాలు ఎన్నింటి గుట్టు రట్టు అయినా, అవినీతి బహిర్గతమవుతున్నా కోర్టులు, సీబీఐ ఆ వైపు కన్నెత్తి కూడా చూడలేదు.
న్యాయ వ్యవస్థనూ వదల్లేదు
న్యాయవ్యవస్థను తనకు అనుకూలంగా మలుచుకునే అలవాటు చంద్రబాబుది. ఆయన సీఎంగా తొలి 9 ఏళ్లలో నాటి హైకోర్టులో తాను చేర్చిన ఒక లాయర్ ద్వారా పరిస్థితులు, తీర్పులు తనవైపు ఉండేలా ఎలా జాగ్రత్తపడుతూ వచ్చారో ‘ప్రపంచ బ్యాంకు’అనుబంధ ఫండింగ్ సంస్థ డి.ఎఫ్.ఇ.డి. జరిపిన ప్రత్యేక సర్వేక్షణలో బాహాటంగానే వెల్లడైంది. ఆ నివేదికతో ఖంగుతిన్న బాబు వరల్డ్ బ్యాంకును బతిమాలుకుని ఆ నివేదిక ‘సర్క్యులేట్’ కాకుండా ఎలా జాగ్రత్తపడిందీ లోకానికి కొంతమేరకైనా తెలిసింది. ఆ సర్వే (2001–2002) బాహాటంగా ఒక ప్రకటన కూడా చేసింది: ‘ఇండియాలో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరపాల్సి వచ్చినప్పుడు ఫండింగ్ సంస్థలు ఆయా సంస్థలతోనే ప్రధానంగా చర్చిస్తాయి. కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఒక్క వ్యక్తితో ఒక్క ముఖ్యమంత్రితో మాత్రమే చర్చలు జరపాల్సి వచ్చింది.
ఇది ఇతర రాష్ట్రాలకు భిన్నమైన ప్రవర్తన. ప్రభుత్వంలో యాజ మాన్య బాధ్యత అనేది దాదాపు పూజ్యం... ఇంతకన్నా ఘోరమైన విషయం ప్రభుత్వ కాంట్రాక్టులు పొందాలంటే బాబు ప్రభుత్వానికి భారీ మొత్తంలో లంచాలు (కిక్‌బాక్స్) చెల్లించుకోవడం అనివార్యం. వందలాది కేసులలో ఇది జరిగింది. ఈ భూ ప్రపంచంలో ఏ పార్లమెంటరీ వ్యవస్థలోనైనా ప్రభుత్వాన్ని శాసనకర్తలు (లెజిస్లేటర్లు) ప్రభావితం చేయడమనేది అరుదుగా ఉంటోంది. ఈ లోటును నివారించాలంటే రాష్ట్ర శాసనసభలో బలమైన శాసనసభా కమిటీలకు తగిన తనిఖీ అధికారాలను దఖలు పరచాలి. ఏ సంస్థలనైతే తాను ప్రభావితం చేయలేడో పెత్తనం చేయలేడో ఆయా సందర్భాల్లో తన పార్టీ పాక్షిక ప్రయోజనాల వైపుగా ఆయన దృష్టి మళ్లిస్తుంటాడు’. అంటే ఈ 17 సంవత్సరాల్లోనూ బాబు ప్రవర్తనలోగానీ, ‘దేశం’ పార్టీ నడతలోగానీ కుట్ర లలో తప్ప మరే కోశాన మార్పు ఉన్నట్టు ప్రజలు భావించడం లేదు, భావిం చరు కూడా. ఎందుకంటే ‘పుట్టుకతో పుట్టిన బుద్ధులు పుడకలతోగానీ పోవు’.
జగన్ రంగంలోకి దిగేసరికి కాంగ్రెస్–బీజేపీ, ‘దేశం’పార్టీలలో ఎందుకింత కంగారు, కలవరం కలుగుతున్నాయి? ఈ మూడు పార్టీలు, వారి నాయకులు రాష్ట్ర కృత్రిమ విభజనను అడ్డుకోలేదు. అందుకు ప్రజాభిప్రాయాన్ని తెలుసుకోలేదు. కానీ ఇప్పుడు మాత్రం శరవేగాన దూసుకువస్తున్న వైఎస్సార్ పార్టీని, దాని నాయకుడిని నిరోధించడమే ఎజెండాగా పెట్టుకున్నారు. ఇది రాజకీయం కాదు, అరాజకీయం, కేవలం అరాచకం.
అసలు విభజన పత్రంపైన కాంగ్రెస్ పత్రంపైన బాబు ఎందుకు సంతకం పెట్టారో చెప్పాలి. ఆ తరువాత రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని నోటిమాటగా, ఆచరణ విరుద్ధమైన ప్రక్రియతో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగింది. ఇక విభజనకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో సుమారు 25 పిటిషన్లు దాఖలయ్యాయి. నాటికీ, నేటికీ వాటి గురించి ప్రభుత్వంగానీ, కోర్టుగానీ సమాధానం చెప్పకుండా ఎందుకు మౌనం వహిస్తున్నట్టు? బాబు ఎన్డీఎ నుంచి విడిపోవడం ఒక నాటకం, దాన్ని అంగీకరించినట్టు బీజేపీ చెప్పడమూ నాటకమే. లోపాయికారీగా ఉభయులూ కలుసుకోవడమూ, కాంగ్రెస్–దేశం ‘ఎన్నికల పొత్తు’మాత్రం నిజం. దీనితో తెలుగు ప్రజలు ఈ ముగ్గురు మాయల మరాఠీలను మట్టుపెట్టడమూ ఖాయం.
ఏబీకే ప్రసాద్
సీనియర్ సంపాదకులు
abkprasad2006@yahoo.co.in
Comments
Please login to add a commentAdd a comment