ఒకే రాష్ట్రంలో, ఒకే భాషా ప్రాంతాల మధ్య ప్రాంతీయ అసమానతలను రూపుమాపగల ఏకైక పరిష్కారం ఏమిటంటే, పరిపాలనా వ్యవస్థ ఆయా ప్రాంతాలకు సామీప్యంలో ఉండటమే! సాక్షాత్తూ మనదేశంలోనే రెండేసి, మూడేసి రాజధానులు, ఆ స్థాయిలోనే ప్రత్యేక కోర్టులూ ఏర్పాటు చేసుకుని ప్రజలకు సన్నిహితంగా పాలన జరుగుతున్న ఉదాహరణలున్నాయి. ఆంధ్రలోనే గతంలో రెండేసి రాజధానులు, రెండేసి ప్రత్యేక న్యాయస్థానాలు కొనసాగించిన దశ కూడా ఉందన్న సంగతి మరచిపోరాదు. ఉదాహరణకు కేవలం 60 కిలోమీటర్ల దూరంలోనే ఆంధ్రలోని మచిలీపట్నంలో ఒక రాజధాని, విజయవాడలో ఒక రాజధాని, రెండేసి ప్రత్యేక కోర్టులు కూడా నడిచాయి. కాబట్టి పలు రాజధానుల ఏర్పాటు ఆంధ్రకు కొత్త కాదన్నది చారిత్రక సత్యం.
ఆంధ్రులకు, తెలుగు భాషకు ఉన్న చారిత్రక నేపథ్యం అతి సుదీర్ఘమైనది. క్రీస్తుపూర్వం 5000–500 ఏళ్ల మధ్యకాలంలో నడిచిన పురాచరిత్ర ఆంధ్రుల, తెలుగు భాషా సంస్కృతులకు అద్దం పడుతూ వచ్చింది. కాగా క్రీస్తుపూర్వం 500 నుంచి క్రీస్తు శకం 624 వరకూ కొనసాగుతూ వచ్చిన వీరి చరిత్రను ప్రాచీన ఆధునిక దశగా చరిత్రకారులు నిర్ధారించారు. అలాగే మధ్యయుగ దశలో వీరి చరిత్రను క్రీస్తుశకం 624–1368 కాలానికి చెందినదిగా పేర్కొన్నారు. ఇక ఆ తర్వాత ముసునూరు నాయకుల కాలాన్ని క్రీ.శ. 1325–1368 దశ గాను, రెడ్డిరాజుల కాలాన్ని క్రీ.శ. 1324–1448 దశ గానూ, విజయనగర రాజుల కాలాన్ని 1336–1660 దశ గానూ, చరిత్రకారులు పేర్కొ న్నారు.
కాగా, ఆధునికాంధ్ర తొలిదశ 1724–1857 గానూ, కోస్తా ఆంధ్ర, రాయలసీమ చారిత్రక దశను క్రీ.శ.1858–1956 గానూ పేర్కొన్నారు. ఇక సమకాలీన ఆంధ్రప్రదేశ్ చారిత్రక దశను 1956– 2000గా పేర్కొన్నారు. ఆంధ్రుల భాషా సంస్కృతుల ప్రాదుర్భావ దశను భారత పురాచరిత్ర పితామహుడైన హెచ్.డి. సంకాలియా విశేషంగా కొనియాడారు. ఈ కోణంలోనే నాటి ఆంధ్రప్రదే శ్‌ను‘యావద్భారత దేశానికే ప్రాచీన చారిత్రక రాజధాని’గా సాధికారి కంగా ఆయన పేర్కొన్నారు! ఆ తర్వాత సంకాలియా దారిలోనే సుప్రసిద్ధ ఆధునిక కవి, సాహితీ చరిత్రకారుడైన ఆరుద్ర.. ఆంధ్రుల చరిత్ర, వారి భాషా సంస్కృతుల చారిత్రక పూర్వ రంగాన్ని క్రీ.శ.12వ శతాబ్ది చాళుక్య యుగం నుంచి ఆధునిక యుగారంభం 1900 దాకా 12 యుగాలుగా 12 సంపుటాలలో వెలువరించారు. ఆంధ్రుల ఈ సుదీర్ఘ చారిత్రక కాలచక్ర గతికి తెలుగు ప్రజల భాషా సంస్కృతులు దోహదపడిన అపూర్వమైన ఆధారాలతో (క్రీ.పూ.5000 నుంచి క్రీ.శ. 2016దాకా) ప్రొఫెసర్ వకుళాభరణం రామకృష్ణ ఒక అద్భుత సంపుటాన్ని తీసుకొచ్చారు.
తెలుగువారైన ఆంధ్రులకు సుదీర్ఘకాలంపాటు సొంత రాజధాని లేకుండా పోయింది. ఎంతో ప్రాచీన భాషా సంస్కృతులతో దీపించిన ఆంధ్రులకు తమిళనాడులో భాగంగా ఉన్నందున ‘మదరాసీల’న్న ముద్రపడింది. దీంతో ఆంధ్రులు ‘రాజధానులు’ లేని రాజ్యంలో కాలం వెళ్లబుచ్చుకోవాల్సి వచ్చింది. క్రమంగా ఈ దుఃస్థితి, చారిత్రక స్పృహ గల ఇద్దరు నాయకుల దూరదృష్టి వల్ల తొలగిపోయింది. వారే పొట్టి శ్రీరాములు, నందమూరి తారకరామారావు. తెలుగు ప్రజలు, విశిష్ట భాషా సంస్కృతులున్న జాతి అన్న స్పృహను వీరిద్దరూ, యావద్భారత దేశానికి చాటి చెప్పడమే కాకుండా కార్యరంగంలోకి దిగి నిరూపించారు.
ఇది ఇలా ఉండగా, ఆంధ్రలోనే రెండేసి రాజధానులు, రెండేసి ప్రత్యేక న్యాయస్థానాలు చెలాయించిన దశ కూడా ఉందన్న సంగతి మరచిపోరాదు. ఉదాహరణకు కేవలం 60 కిలోమీటర్ల దూరంలోనే ఆంధ్రలోని మచిలీపట్నంలో ఒక రాజధాని, విజయవాడలో ఒక రాజధాని, రెండేసి ప్రత్యేక కోర్టులు కూడా నడిచాయన్నది కాదనలేని మరొక సత్యం. అసలు ఒకే భాష మాట్లాడే ప్రజల మధ్య ప్రాంతీయ విభేదాలకు, వేర్పాటు ధోరణులకు కారణం అవకాశవాద రాజకీ యాలు, అధికార రంధి గల రాజకీయ నాయకులే కారణమని ఆనాడే కాదు, ఈనాడూ రుజువవుతోంది. కనుకనే ఒకే రాష్ట్రంలో, ఒకే భాషా ప్రాంతాల మధ్య ప్రాంతీయ అసమానతలను రూపు మాపగల ఏకైక పరిష్కారం ఏమిటంటే, పరిపాలనా వ్యవస్థ ఆయా ప్రాంతాలకు సామీప్యంలో ఉండటమే! ఈ దృష్ట్యానే, సాక్షాత్తూ మనదేశంలోనే రెండేసి, మూడేసి రాజధానులు, ఆ స్థాయిలోనే ప్రత్యేక కోర్టులూ ఏర్పాటు చేసుకుని ప్రజలకు సన్నిహితంగా పాలన జరుగుతున్న ఉదాహరణలున్నాయి.
ఈ వివరాల్ని ‘సాక్షి’ అనేకసార్లు పాఠకుల సౌకర్యార్థం ప్రచురించింది. కానీ నిద్రపోతున్నట్టు నటించేవాళ్లను, ‘పుట్టుగుడ్డివాళ్లు’గా నటిస్తున్న కొన్ని పత్రికలు, వాటి సంపాదకులను నమ్మించలేము! ఇంతకూ బుద్ధుని పేరిట అమరావతిని రాజధానిగా ఎంపిక చేసినట్టు కోతలుకోస్తున్న చంద్రబాబు ఆ బుద్ధుడు బూజు పట్టిపోతున్నా గుడ్లు అప్పగించి చూస్తుండిపోయారే గాని సంరక్షించే చర్యలు తీసుకోలేదు. పైగా రైతుల త్యాగాలతో అమరావతి నిర్మాణం ప్రారంభమైందని అంటూనే అదే రైతుల భూములను అర్ధరాత్రిపూట దొంగచాటుగా ఎందుకు తగలపెట్టించారు? పైగా దానికి కారకు లంటూ ఆరోపణలు మోపి వైసీపీ, కాంగ్రెస్ నాయకులపైన కేసులు పెట్టించారు. రైతాంగాన్ని మోసగించి అమరావతి భూముల్ని టీడీపీ అనుయాయులకు కారు చౌకగా కట్టబెట్టిన వైనం ప్రజలు గ్రహిం చారు. అమరావతి రైతాంగానికి జరిగిన ఈ మోసాన్ని లెక్కలతో సహా నిరూపిస్తూ అప్పటి రాష్ట్ర హైకోర్టులో సుప్రసిద్ధ మాజీ న్యాయ మూర్తులు, ఈ వ్యాసకర్త జమిలిగా రిట్ పిటిషన్‌లు దాఖలు చేశారు.
కాని చంద్రబాబుకు కోర్టుల్ని ‘మేనేజ్’ చేసే లక్షణం వెన్నతోపెట్టిన విద్య కాబట్టే... ఆ రోజుకీ, ఈ రోజుకీ మా రిట్ పిటిషన్ అతీగతీ తేలకుండా అలా మూలుగుతూనే ఉంది! తీరా ముఖ్యమంత్రి పదవి ఊడిపోయిన చంద్రబాబు... ఇప్పుడు మాత్రం ఆంధ్రప్రదేశ్‌కు ఆర్థిక వనరులు సమకూడాలంటే అమరావతి భూముల్ని జగన్ ప్రభుత్వం అమ్ముకుంటే చాలునని, ఉచిత సలహా ఇవ్వడానికి సాహసించారు! పదేళ్ళ దాకా ఉమ్మడి రాష్ట్ర రాజధానిగా హైదరాబాద్ కార్యరంగంగా ఉంటుందని చెప్పినా వినకుండా చంద్రబాబు బిచాణా ఎత్తేశారు. మరోవైపున అమరావతి భూములు కాజేసి తన అనుయాయులకు చేతులు ‘తడిపితే’ గాని తన ముఖ్యమంత్రిత్వం ఆంధ్రలో నిలవదన్న భీతి బాబు గుండెల్లో గూడుకట్టుకుంది. దీని ఫలితం గానే నూతనంగా ఏర్పడనున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రైతాంగానికి ఇన్ని తిప్పలు తప్పలేదు.
ఈ నేపథ్యంలోనే 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీకి ప్రజలు తిరుగులేని మెజారిటీని కట్టబెట్టారు. వైఎస్ జగన్‌కు అధికార పగ్గాలను రాష్ట్ర ప్రజలు కట్టబెట్టింది తాను తలపెట్టిన అఖండ పాదయాత్ర ఫలితమే. నిర్దిష్టమైన కార్యాచరణకు తగిన నవరత్నాలతో ప్రణాళికను రూపొం దించుకుని, పాద యాత్రలో గడించిన అనుభవాల ఆధారంగా మాట తప్పకుండా ప్రభుత్వ పాలనా రథాన్ని వినూత్న పద్ధతులతో వైఎస్ జగన్ నడిపిస్తున్నారు. గ్రామసీమల్లో ఎక్కడికక్కడ ప్రజలకు అందు బాటులో ఉండే గ్రామ సచివాలయాల స్థాపనతోనే వికేంద్రీకృత పాలనకు బలమైన అంకురార్పణ జరిగింది. రాష్ట్రంలోని మూడు ప్రాంతాలకు (ఉత్తర, పశ్చిమ, దక్షిణాంధ్ర ప్రాంతాలు) మూడు రాజధానులు ఏర్పర్చడం ఇప్పుడెంతో అవసరం.
దూరాభారాలతో నిమిత్తం లేని ప్రాంతీయ రాజధానుల ఏర్పాటుతో ప్రాంతాల మధ్య వైషమ్యాలు ప్రబలే అవకాశాలు ఉండవు. ఆ మాటకొస్తే మదరాసు నుంచి విడిపోయిన తర్వాత ప్రత్యేక ఆంధ్ర కాలంలో బెజవాడ, కర్నూలు, గుంటూరు.. ఆ తర్వాత హైదరాబాద్ రాజధానులుగానే వ్యవహరించాయి! కాబట్టే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నది అమరా వతి ఒక్కటే కాదని, అది ఒక వర్గానికి చెందిన రాజధానిగా ఉండ కూడదని ప్రజలు గ్రహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అంటే 13 జిల్లాలకు చెందినదని, రాయలసీమ, ఉత్తరాంధ్రలు వెనుకబడిన ప్రాంతాలని తెలిసికూడా అమరావతిని కొద్దిమంది మోతుబరుల ‘రియల్ ఎస్టేట్’గా మార్చడం తగదన్నది క్రమంగా ప్రజలు అనుభవంలో తెలుసుకున్న సత్యం. ఇది ఇప్పటికీ, ఎప్పటికీ తెలుసుకోవలసిన వాస్తవం. అమరావతి ఆది నుంచి బౌద్ధ విద్యా కేంద్రంగానే వర్ధిల్లింది కానీ, రియల్ ఎస్టేట్‌గా కాదు. నలందాకు నకలే అమరావతి. నాగా ర్జునుడి కేంద్రాలు, నాగార్జున విశ్వవిద్యాలయ స్థాపన వెనక రహ స్యమూ ఇదేనని గుర్తించాలి
-ఏబీకే ప్రసాద్
సీనియర్ సంపాదకులు
abkprasad2006@yahoo.co.in
Comments
Please login to add a commentAdd a comment