అమెరికా ఎన్నికలు.. ఆంధ్రా రాజకీయం! | Danny Article On Amaravati Politics And America Elections | Sakshi
Sakshi News home page

అమెరికా ఎన్నికలు.. ఆంధ్రా రాజకీయం!

Published Fri, Nov 20 2020 8:14 AM | Last Updated on Fri, Nov 20 2020 9:11 AM

Danny Article On Amaravati Politics And America Elections - Sakshi

తను ఓడిపోతే అమెరికాలో అరాచక శక్తులు రాజ్యం చేస్తాయనీ, శ్వేతజాతీయులకు భద్రత కరువవుతుందని ట్రంప్‌ గట్టిగా ప్రచారం చేసినా.. అమెరికా ఓటర్లు ట్రంప్‌నే పక్కన పడేశారు. అలాగే తనకు ఓటేయకపోతే రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టులు ఆగిపోతాయని, అరాచక శక్తులు రాజ్యం చేస్తాయనీ చంద్రబాబు కూడ గత ఎన్నికల్లో ఉధృతంగా ప్రచారం చేశారు. కానీ ఆంధ్రప్రదేశ్‌ ఓటర్లు ఆయన్నే అధికారం నుండి తొలగించారు. రాజధానిని మూడు విభాగాలుగా చేసి మూడు ప్రాంతాలకు పంచుతూ కొత్త ప్రభుత్వం తెచ్చిన ఆంధ్రప్రదేశ్‌ వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ది బిల్‌ వెనుక ‘వైవిధ్యం, భాగస్వామ్యం, అందర్నీ కలుపుకునిపోవడం’ అనే సూత్రం ఉంది. దీన్ని పట్టించుకోకుండా ప్రజల ఆకాంక్షలను వమ్ముచేసి.. భద్రలోకం కోసం మాత్రమే పనిచేసే ప్రభుత్వాలకు అమెరికాలో అయినా, ఆంధ్రప్రదేశ్‌లో అయినా ప్రజలు ఒకేలా బుద్ధి చెబుతారు. అభద్రలోకం కోసం పనిచేసే ప్రభుత్వాలకు ప్రజలు పట్టం కడతారు.

అమెరికాలో మార్క్సిస్టుల ప్రభావంతో  ‘బ్లాక్‌ లైవ్స్‌ మేటర్‌’ అంటూ మొదలయిన ఉద్యమంలో ఫాసిస్టు వ్యతిరేక బృందాలు (యాంటిఫా), ముస్లింలు, శ్వేతజాతీయుల్లోని ఉదారవాదులు, డెమోక్రాట్స్‌ తదితరులు కలవడంతో అది ‘‘ఆల్‌ లైవ్స్‌ మేటర్‌’’ ఉద్యమంగా మారింది. ట్రంపిజాన్ని మొత్తంగా ఓడించకపోయినా దాన్ని అధిగమించి అధికార పీఠాన్ని మార్చగల శక్తిగా ఆవిర్భవించింది. అమెరికా ఉద్యమం  ముందుకు తెచ్చిన ‘వైవిధ్యం, భాగస్వామ్యం, అందర్నీ కలుపుకునిపోవడం’ అనే విలువలకు వర్తమాన ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో ఒక  ప్రాసంగికత వుంది. గత ప్రభుత్వాధినేత చంద్రబాబు తన బ్రాండ్‌ ఇమేజ్‌గా ప్రచారం చేసుకున్న పోలవరం, అమరావతి ప్రాజెక్టుల్లో ఈ సంబంధాన్ని మరింత స్పష్టంగా చూడవచ్చు. 

పోలవరం బహుళార్ధ సాధక ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం – 2014లో జాతీయ హోదా కల్పించారు. ఇందులో ఇరిగేషన్, హైడల్‌ పవర్‌ అనే రెండు కాంపోనెంట్లు వున్నాయి. హైడల్‌ పవర్‌ యూనిట్‌ను కేంద్ర ప్రభుత్వానికి అప్పగించకూడదనుకున్న రాష్ట్ర ప్రభుత్వం దాన్ని తానే స్వయంగా నిర్మించాలనుకుంది. ఇక ఇరిగేషన్‌ కాంపోనెంట్‌ వరకు ఎంత ఖర్చయితే అంత నూటికి నూరు శాతం నిధుల్ని కేటాయించాల్సిన  బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది. ఈ చట్టబద్ధ బాధ్యత నుండి కేంద్ర ప్రభుత్వం తప్పించుకోజాలదు. ఇరిగేషన్‌ కాంపోనెంట్లో మళ్ళీ రెండు విభాగాలున్నాయి. మొదటిది ఆర్‌ఆర్‌ ప్యాకేజీ, రెండోది డ్యామ్‌ నిర్మాణం.  2019 ఫిబ్రవరి 18 నాటికి ఈ రెండు విభాగాల నిర్మాణ  వ్యయం 55,548.87 కోట్ల రూపాయలుగా అంచనా వేశారు. ఇందులో, ఆర్‌–ఆర్‌ ప్యాకేజీ, డ్యామ్‌ నిర్మాణ వ్యయాలు దాదాపు 60 శాతం, 40 శాతంగా వుంటాయి.

పోలవరం నిర్వాసితుల్లో అత్యధికులు ఆదివాసులు. 2013లో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన భూసేకరణ చట్టం ప్రకారం నిర్వాసితులకు ప్రాజెక్టు ఆయకట్టులోనే  పునరావాసం ఏర్పాటు చేయాలి. సహాయక, పునరావాస (ఆర్‌–ఆర్‌) ప్యాకేజీని సంపూర్ణంగా అమలు పరిచాకే ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలి. కేంద్ర జలవనరుల శాఖకు చెందిన  పోలవరం ప్రాజెక్టు అ«థారిటీ (పీపీఏ) నుండి నిర్మాణ బాధ్యతల్ని తీసుకున్న చంద్రబాబు ప్రభుత్వం ఆర్‌–ఆర్‌ ప్యాకేజీని పక్కన పెట్టి ఇరిగేషన్‌ కాంపోనెంట్‌ మీద దృష్టిని సారించింది. ఆ విభాగంలో దాదాపు 16 వేల కోట్ల రూపాయల ఖర్చుతో దాదాపు 70 శాతం పనులు పూర్తి చేసినట్లు చెప్పుకుంది. అయితే ఆర్‌–ఆర్‌ ప్యాకేజీ విభాగంలో ఇప్పటివరకు నాలుగో వంతు కూడా ఖర్చుపెట్టలేదు.

దాదాపు ఈ కాలంలోనే రాజధాని ప్రాంత అభివృద్ధి సాధికార సంస్థ (సీఆర్‌డీఏ) ద్వారా రాజధాని అమరావతి ప్రాజెక్టును చంద్రబాబు ప్రభుత్వం చేపట్టింది. ఆంధ్రప్రదేశ్‌ రాజధాని నిర్మాణానికి చారిత్రకంగా కొన్ని ఒప్పందాలున్నాయి.  1937 నవంబర్‌ 16 నాటి శ్రీభాగ్‌ ఒప్పందంలో ‘వైవిధ్యం, భాగస్వామ్యం, అందర్నీ కలుపుకుని పోవడం’ అనే ప్రాతిపదికన రాయలసీమ, మధ్య ఆంధ్రా, ఉత్తరాంధ్రాలకు రాజధాని, హైకోర్టు, యూనివర్శిటీలను పంచుకున్నారు. ఆ ప్రకారం 1953 అక్టోబర్‌ 1న ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది. 1956లో మరో పెద్దమనుషుల ఒప్పందం ప్రకారం హైదరాబాద్‌ స్టేట్‌లోని తెలంగాణ ప్రాంతం, ఆంధ్రరాష్ట్రం కలిసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఏర్పడ్డాయి. 2014 లో మళ్ళీ పునర్‌ వ్యవస్థీకరణ జరిగి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుండి అలనాటి ఆంధ్రరాష్ట్రం విడిపోయింది. అంటే శ్రీభాగ్‌ ఒప్పందం మళ్ళీ అమల్లోకి రావాలి. కానీ, అలా జరగలేదు.

రాజధాని విభాగాల మీద రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు హక్కులు లేకుండా శాసన, పరిపాలన, న్యాయ వ్యవస్థలన్నింటినీ అమరావతిలోనే నెలకొల్పే ప్రయత్నాలు సాగాయి. ఇవి అత్యంత సహజంగానే రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో నిరసనలకు దారి తీశాయి. వారు తమదైన రోజు కోసం ఎదురు చూశారు. ఆ ప్రాంతాల ‘విద్యావంతుల వేదికలు’, ‘డెవలప్‌మెంట్‌ ఫోరం’ల నినాదాల సారాంశం కూడా ‘వైవిధ్యం, భాగస్వామ్యం, అందర్నీ కలుపుకునిపోవడం’. గత ప్రభుత్వం పోలవరం, అమరావతుల్లో అనుసరించిన అభివృద్ధి నమూనాలను గమనిస్తే అడవి, మైదానాల మధ్య వివక్ష ఏ స్థాయిలో సాగిందో అర్థం అవుతుంది. అమరావతి ప్రాజెక్టులో సెల్ఫ్‌ ఫైనాన్సింగ్‌  ప్రాజెక్ట్‌ అంటూ భూ సమీకరణ పథకాన్ని ప్రవేశపెట్టారు. వ్యవసాయ భూముల్ని పారిశ్రామిక, వాణిజ్య, నివాస భూములుగా మార్చి స్థానిక భూ యజమానుల సంపదను పెంచే పథకాలను రచించారు.

పోలవరంలో ల్యాండ్‌ పూలింగ్‌ స్కీమూ లేదు; భూసేకరణ పథకాన్ని అమలుచేసే నిజాయితీ లేదు. స్థానికుల సంపదను పెంచే ఊసే లేదు. ఫలితంగా, పోలవరం ముంపు మండలాల్లో ‘వైవిధ్యం, భాగస్వామ్యం, అందర్నీ కలుపుకునిపోవడం’ వంటి నినాదాలు ముందుకు వచ్చాయి.  తను ఓడిపోతే అమెరికా కమ్యూనిస్టుల పాలవుతుందని, అరాచక శక్తులు రాజ్యం చేస్తాయనీ, శ్వేతజాతీయులకు భద్రత కరువవుతుం దని ఈసారి ఎన్నికల్లో ట్రంప్‌ గట్టిగా ప్రచారం చేశారు. కానీ అమెరికా ఓటర్లు ట్రంప్‌నే పక్కన పడేశారు. దాదాపు ట్రంప్‌ పద్ధతుల్లోనే తనకు ఓటేయకపోతే రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టులు ఆగిపోతాయని, అరాచక శక్తులు రాజ్యం చేస్తాయనీ  చంద్రబాబు కూడా గత ఎన్నికల్లో ఉధృతంగా ప్రచారం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ ఓటర్లు వారినే అధికారం నుండి తొలగించారు. 

ఆ ప్రాంతాల్లోని 87 శాతం అసెంబ్లీ సీట్లలో గత అధికార పార్టీ ఓడి పోయింది. ఎన్నికల్ని ప్రజాభీష్టానికి భారమితిగా భావిస్తే, అమరావతి పోలవరం ప్రాజెక్టుల గురించి బాబు చేసిన ప్రచారంపై ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు ఆసక్తి లేదని తేలిపోయింది. యాదృచ్ఛి కమే కావచ్చుగానీ, రాజధానిని మూడు విభాగాలుగా చేసి మూడు ప్రాంతాలకు పంచుతూ కొత్త ప్రభుత్వం తెచ్చినది ఆంధ్రప్రదేశ్‌ డీసెం ట్రలైజేషన్‌ అండ్‌ ఇంక్లూజివ్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ ఆల్‌ రీజియన్స్‌ బిల్‌ వెనుక ‘వైవిధ్యం, భాగస్వామ్యం, అందర్నీ కలుపుకునిపోవడం’ అనే సూత్రం వుంది. ఆంధ్రప్రదేశ్‌లోని అధికశాతం రాజకీయ పార్టీలకు విజయవాడ, గుంటూరుల్లో ఆర్థిక పునాదులున్నాయి. అవి విజయవాడ, గుంటూరు రంగు కళ్ళద్దాల నుండి రాష్ట్రాన్ని చూడడం మొదలెట్టాయి. రాష్ట్రంలో మరో 11 జిల్లాలున్నాయని గత ఎన్నికల్లో ప్రజలు గుర్తు చేసినా ఆ పార్టీలకు అర్థం కాలేదు. రాజధానికి చెందిన రెండు విభాగాలను అమరావతి నుండి తరలించడాన్ని నిలిపివేయాలంటూ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు ఇటీవల హైకోర్టులో కౌంటర్‌ దాఖలు చేశారు.

అంతటి స్థిర నిర్ణయాన్ని వారు పోలవరం ప్రాజెక్టు పునరావాస ప్యాకేజీ విషయంలో ప్రదర్శించలేకపోయారు. ఏమిటీ దీని అర్థం? పెట్టుబడిదారీ వ్యవస్థ పుంజుకుంటున్న దశలో ప్రాజెక్టులకు గొప్ప గౌరవం వుండేది. ఆధునిక దేవాలయాలు అని కొనియాడేవారు. అదొక దశ. సరళీకృత అర్థిక విధానం విజృంభించాక ప్రాజెక్టుల లోపల దాగున్న చీకటి కోణాలు వెలుగులోనికి రావడం మొదలయింది. ప్రాజెక్టులు భౌగోళికంగా ధనిక, పేద వర్గాల మధ్య ఒక విభజన రేఖను గీస్తాయి. పోలవరం ప్రాజెక్టు ఆయకట్టులోని భూ యజ మానులకు నిస్సందేహంగా వరమే; కానీ రిజర్వాయర్‌ ముంపు ప్రాంత నివాసులకు అది శాపం. నీటిపారుదల ప్రాజెక్టులు వ్యవసాయ భూములున్నవారి సంపదను పెంచడమేగాక భూమిలేనివాళ్ళ కష్టాలనూ పెంచుతాయి. అమరావతి ప్రాజెక్టు వల్ల విజయవాడ గుంటూరు నగరాల్లో భూముల ధరలు, ఇళ్ళ అద్దెలు భారీగా పెరిగిన మాట వాస్తవం.

కానీ, స్వంత భూమిలేక అద్దె ఇళ్లలో వుండేవాళ్ళ పరిస్థితి ఏమిటీ? అంచేత, ఆధునికానంతర కాలంలో ప్రాజెక్టుల మీద పునరాలోచనలు మొదలయ్యాయి. ప్రాజెక్టులవల్ల లబ్ధిపొందని సామాజిక వర్గాలకు నగదు బదిలీ చేయాలనే ప్రతిపాదనలు ఈ నేపథ్యంలోనే వచ్చాయి. ఈ సందర్భంలో  ప్రస్ఫుటంగా కనిపించే అమానుషం ఏమంటే ప్రాజెక్టులవల్ల లబ్ధిపొందిన వర్గాలు నగదు బదిలీ పథకాలని ‘పప్పుబెల్లాలు’ అంటూ హేళన చేస్తాయి. ‘పప్పుబెల్లాల’ పంపిణీలవల్ల రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిపోతున్నదని పెద్ద గోల చేస్తాయి. ఇది ఆర్థిక అహంకారం. వాళ్ళ దృష్టిలో అభివృద్ధి అంటే భద్రలోకం సంపదను మరింతగా పెంచడం మాత్రమే. ఇది అసలు సిసలు ఆర్థిక అహం కారం. భద్రలోకం కోసం పనిచేసే ప్రభుత్వాలకు అమెరికాలో అయినా, ఆంధ్రప్రదేశ్‌లో అయినా ప్రజలు ఒకేలా బుద్ధి చెపుతారు. అభద్రలోకం కోసం పనిచేసే ప్రభుత్వాలకు ప్రజలు పట్టం కడతారు.

 డానీ
 రచయిత సీనియర్‌ పాత్రికేయులు, సమాజ విశ్లేషకులు
 మొబైల్‌ : 90107 57776

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement