ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం లోటుపాట్లపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ విజయవాడలో జరిపిన పాక్షిక రాజకీయ సభ ‘‘నాకు పరీక్షా, నా రాగిచెంబుకు పరీక్షా’’ అన్నట్లుగా ముగిసింది. ‘‘రాష్ట్రాల నిర్మాణంలో/రాష్ట్రాల విభజన సందర్భంలో ఆయా స్థానిక శాసనసభలలో మెజారిటీ తీర్మానం ప్రకారమే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ఉండాలని నిర్దేశించారు. ఆ షరతును కేంద్ర పాలనా వ్యవస్థ రాజకీయ స్వార్థంకోసం ఉల్లంఘించిన నాడే ఫెడరల్ స్ఫూర్తికి పాతర వేయడం జరిగింది. ఈ పరిస్థితుల్లో పార్లమెంట్ ద్వారానే రాష్ట్ర ప్రయోజనాలకు రక్షణ సాధ్యమవుతుందని ఉండవల్లి ఆశించడం ఎంతవరకు సాధ్యం?
‘‘ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ఫలితంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్య తలెత్తిన పెక్కు సమస్యల పరిష్కారం వాయిదా పడింది. ఈ నెల (ఫిబ్రవరి) 1న ఢిల్లీలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన కీలక సమావేశం వాయిదా పడినందున ఈ పరిణామం తలెత్తింది’’ కానీ ఎందుకు వాయిదా పడిందో మాత్రం వివరణ లేదు. (ఫిబ్రవరి 2, 2019 వార్త)
‘‘ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయాన్ని కేంద్రం సరిదిద్దాలి. రాజ్యాంగ విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిందనే విషయాన్ని దేశం మొత్తానికి తెలిసేలా చేయాలి. తద్వారా రాష్ట్ర హక్కులు సాధించుకోవాలి. రాష్ట్ర ప్రయోజనాల సాధన కోసం రాజకీయ వైరుధ్యాలు పక్కనబెట్టి కలసికట్టుగా పనిచేయాలి’’
– మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అధ్యక్షతన విజయవా డలో కొన్ని పార్టీలతో జరిగిన సమావేశం అభిప్రాయం. కానీ ఆ సమావేశం తీర్మానం చేయకుండా ముగిసింది. (జనవరి 29, 2019 వార్త)
గత అయిదేళ్లుగా, ఆంధ్రప్రదేశ్ విభజనానంతరం రాష్ట్ర ప్రయోజనా లకు జరుగుతున్న హానికర పరిణామాలను పరిశీలిస్తుంటే ‘నాంచారమ్మ వంటి నక్షత్ర దర్శనం’ ఒక్కసారే జరిగే అవకాశం లేదన్న తెలుగు సామెత గుర్తుకు రాకమానదు. 2014 నాటికి కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, ఆ తర్వాత అది విడిచిన చెప్పుల్లోనే కాళ్లు పెట్టి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం కానీ ఆకుకు అందకుండా, పోకకు పొందకుండా ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంగా ఇచ్చిన హామీలు ఇప్పటికీ అమలులోకి రాకుండా ‘గాలి కబుర్లు’గా ఇంకా గాలి లోనే ఉండిపోయాయి. విజయవాడ పాక్షిక రాజకీయ సభ చివరికి ‘నాకు పరీక్షా, నా రాగిచెంబుకు పరీక్షా’ అన్నట్లుగా ముగిసింది. నిజానికి ఆ పరీక్ష ఉండవల్లి తదితర ఆంధ్రప్రదేశ్ పార్లమెంటు సభ్యులు 14మందినీ నాటి కాంగ్రెస్ ప్రభుత్వం పార్లమెంటు బయటకు నెట్టేసి తలుపులు మూసి, మైకులు కట్టేయించి బీజేపీ సభ్యుల సహకారంతో కృత్రిమంగా రాష్ట్రాన్ని విభజించడంతోనే మొదలయింది. మీ తర్వాత రేపట్నుంచి అధికారంలోకి వచ్చేది మేమే కాబట్టి, విభజన సందర్భంగా కాంగ్రెస్ పాలకులు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ప్రతిపత్తి తాలూకు ఇచ్చిన హామీలను మేం నెరవేరుస్తాం అని రాజ్యసభ నిండు పేరోలగంలో బీజేపీ నాయ కులు వెంకయ్యనాయుడు, అరుణ్ జైట్లీ, కాంగ్రెస్ పక్షం తాలూకు కపిల్ సిబాల్ ప్రభృతులతో ఆనందంగా చేతులూపుకుంటూ ‘బైబై’ చెబుతున్న వీడియో దృశ్యాలను తెలుగు ప్రజలంతా చూశారు. రాజకీయంలో ఇంత కానరాని కుట్ర పొంచి ఉంటుందా అనుకున్నారు. చివరికి ఏతావాతా ఇప్పటిదాకా ఫలించింది ఉభయ పక్ష కుట్ర రాజకీయమేనని మరిచి పోరాదు.
ఈలోగా అంతర్నాటకంలో భాగంగా జరిగిన పని– కాంగ్రెస్ తాను ఇరుక్కుపోయిన రాష్ట్ర విభజన నాటకాన్ని రక్తి కట్టించడం కోసం ‘మూజువాణీ’గా చేసిన ‘మేజువాణి’ చట్టం రూపంలో లేని అయిదేళ్ల ప్రత్యేక ప్రతిపత్తి అనే నోటిమాట. దాంతో కాంగ్రెస్‌కు తామేమీ తీసిపో లేదన్నట్లుగా మీకెందుకు మేం అధికారంలోకి వస్తున్నాం. పదేళ్ల ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తామని బీజేపీ దండు హామీలు. ఈ తరహా రాజకీయ పోరులో తెలుగు ప్రజలు నానారకాలుగా నలిగిపోయారు. కానీ, ఈలోగా అయిదేళ్లు గడిచిపోయాయి. ఆంధ్రప్రదేశ్‌కు స్థిరమైన రాజధాని గాని, ఇతర రాజ్యాంగ సంబంధమైన పాలనాంగాల నిర్మాణం కానీ పరి పూర్ణ స్థితికి చేరుకోలేదు. పైగా బీజేపీ కేంద్రప్రభుత్వంలో భాగస్వామిగా చేరిన తెలుగుదేశం అధిపతి, సీఎం చంద్రబాబు ప్రత్యేక ప్రతిపత్తి హోదా షరతును కాస్తా కృష్ణలో ముంచేసి ‘హోదా వద్దు ప్యాకేజీయే మాకు ముద్దు’ అని చాటి ప్రధాని మోదీముందు మోకరిల్లారు.
ఇలా చంద్రబాబు ‘పాదాక్రాంత’ రాజకీయాల ఫలితంగా రాష్ట్ర ప్రజలు, వారి ప్రయోజనాలు, వారి ఉనికి, జీవనోపాధి భద్రతలకు, పేద సాదల బతుకుతెరువుకూ పెను ప్రమాదం ఏర్పడింది. ఇన్ని అప రిష్కృత సమస్యల మధ్య రెండు తెలుగు రాష్ట్రాలు ఒకవైపున ఉనికిని నిల బెట్టుకోడానికి నానా ఇబ్బందులు పడుతున్నాయి. మరోవైపున రెండిం టిలో ఒక రాష్ట్రానికి అసలు సమగ్ర రూపు రేఖలే ఇంకా ఏర్పడని పరిస్థితి. రాష్ట్ర కృత్రిమ విభజనకు నాటి కేంద్ర కాంగ్రెస్ ప్రభుత్వం పాల్పడిందని, రాజ్యాంగ విరుద్ధంగా జరిగిన విభజనకు కాంగ్రెస్‌ది మొదటి బాధ్యత అనీ, దాన్ని కొనసాగించిన రెండో బాధ్యత బీజేపీదనీ ఉండవల్లి చెప్పింది వాస్తవమే. ఆ విషయంలో పార్టీగా తన కాంగ్రెస్ ‘వాజమ్మ’ పాత్రను ఖండిస్తూ మొదట బయటపడిన ఎంపీ కూడా ఉండవల్లే, ఆ పిమ్మట రాష్ట్రానికి విభజనవల్ల జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని 18 వ్యాజ్యాలతో (రిట్ పిటిషన్లు) సుప్రీంకోర్టు తలుపులు తట్టిన వారిలో ఉండవల్లి కూడా ఒకరు. అయితే, నిన్న మొన్నటి విజయవాడ సమావే శందాకా ఈ మధ్యకాలంలో తన తొలి ‘రిట్’ చొరవకు కొనసాగింపుగా సుప్రీంను ఆయన కదిపిన ఉదాహరణ ఈ నాలుగున్నర ఏళ్లలోనూ లేదు.
ఆ విరామ సమయంలో రాష్ట్ర వ్యాపితంగా ఉధృత స్థాయిలో ఆంధ్ర ప్రదేశ్ భవిష్యత్తుకు, వృత్తి, విద్య, ఉపాధి శరవేగాన వ్యావసాయక, పారి శ్రామిక రంగాల పురోభివృద్ధికి బాటలు వేయగల ‘ప్రత్యేక హోదా’కు రాజ్యాంగపరంగా పార్లమెంట్ సాక్షిగా చట్టపరంగా హామీని సాధించేం దుకు రాష్ట్ర వ్యాపిత పాదయాత్రల ద్వారా ప్రజలలో నిరంతర చైతన్యం తీసుకువచ్చినవారు మాత్రం వైఎస్సార్ కాంగ్రెస్ నేత, ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి. కానీ ఈ వాస్తవాన్ని మభ్యపెట్టి, అమావాస్యకో, పౌర్ణానికో మేల్కొని పొలికేకలు పెట్టే కొన్ని సంస్థలతో జగన్ కృషిని పోల్చడం సరైంది కాదు. ఒక్క ఉండవల్లి, వేళ్లమీద లెక్కించదగిన ఒకటి రెండు రాజకీయపక్షాలు తప్ప (అవీ అడపాదడపాగా) రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి సాధన కోసం తెలుగునాట నిరంతర పోరాటం అవిశ్రాంతంగా సాగిస్తున్న నాయకుడు వైఎస్ జగన్ మాత్రమే. ఈ సత్యాన్ని అంగీ కరించడానికి నిజాయితీ కావాలి. అందుకే ‘రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి హోదా’కు మద్దతు ఇస్తూ ముందు పత్రాలపై సంతకం పెట్టే వారికే రేపటి వైసీపీ పార్లమెంటు సభ్యుల అండదండలన్న విస్పష్ట్ట ప్రకటనను వైఎ స్సార్‌సీపీ తప్ప మరొక రాజకీయ పక్షం ప్రకటించిన దాఖలా లేదు.
‘రాష్ట్ర విభజన రాజ్యాంగ విరుద్ధంగా జరిగిందన్న’ ఉండవల్లి రాజ్యాంగంలోని అధికరణ(3) చాటున జరిగిన తతంగంపై తొలి రాజ్యాంగ నిర్ణయ సభ చర్చల సందర్భంగా నడిచిన శషబిషలను విజయవాడ సమావేశంలో వివరించి ఉండవలసింది. ఎందుకంటే, ‘3వ అధికరణ’ అసలు ఆశయం లేదా నిర్దేశిత ఉద్దేశం– స్వాతంత్య్రానంతరం స్వతంత్ర భారత యూనియన్‌లో విలీనం కావడానికి తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నాటి రాచరిక సంస్థానాలకు ‘ముగుదాడు’ వేయడమే. కనుకనే దాన్ని (అధికరణ–3) రాజ్యాంగ నిర్ణయసభ 1949లో చేర్చింది. అంతే గాదు, 1955కు ముందున్న రాజ్యాంగ నిబంధనల ప్రకారం రాష్ట్రపతి ఆమోదం నిమిత్తం ఏ బిల్లునైనా సవరణ బిల్లునైనా పార్లమెంట్ ఆయనకు పంపించినప్పుడు ఆ బిల్లువల్ల ‘అధికరణ–3’ కింద రాష్ట్రాలను, వాటి సరిహద్దుల్ని చీల్చి, విడగొట్టడంవల్ల నష్టపోయే రాష్ట్రాల సంబం ధిత శాసనసభల ‘నిశ్చితాభిప్రాయాన్ని’ (ఎసర్టెన్) ఓటింగ్ ద్వారా రాష్ట్రపతి తెలుసుకోవాలన్న నిబంధన ఉంది.
కానీ ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం 1955 డిసెంబర్ 24న గుంపు (బ్రూట్ మెజారిటీ) బలంతో రాజ్యాంగ సవరణ ద్వారా ఆ పదాన్ని తొలగించి దాని స్థానంలో శాసనసభకు రాష్ట్రపతి కేవలం ‘రిఫర్’ (ప్రస్తావన) చేస్తే చాలునని, ఓటింగ్ తీసుకోవలసిన అవసరం లేదనీ శాసించింది. ఇదే– తెలుగుజాతి ఉనికికే తరువాత ప్రమాదకరంగా తయారైంది. 1955 నాటి ఈ నిరంకుశ పరిణామాన్ని భారత సమాఖ్య (ఫెడరల్) స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్ర పాలకుల స్వార్థపూరిత రాజ కీయాలకు పరాకాష్టే 2014 నాటి తెలుగుజాతి కృత్రిమ విభజన. ఈ విషయం తెలిసి కూడా నాటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్, నాటి ప్రతి పక్ష నాయకుడు చంద్రబాబు జతగట్టి విభజనను వ్యతిరేకి స్తున్నట్టు ‘నాటకం’ ఆడి, రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్నట్టు శాసనసభ తీర్మానం చేసినట్లు ప్రకటించారు. నిజానికి ఆ అవకాశం శాసనసభకు 1955 తోనే అడుగంటిపోయిందని తెలిసి కూడా ప్రజలకు కళ్లతుడుపుగా ఆ తీర్మానం చేశారని మరచిపోరాదు. అంతేగాదు, ‘దేశ అత్యున్నత న్యాయస్థానం నిశిత పరిశీలనకు, సమీక్షకు, అదుపుతప్పిన అధికారాల చెలాయింపు నకు పార్లమెంట్ అతీతం కాదు’ అని పొడ్వాల్ కేసులో (1993) సుప్రీం తీర్పు ఇచ్చింది.
అలాగే ‘అధికరణ’ గురించి 1948 నవంబర్ 17న ప్రత్యేక ప్రస్తావన వచ్చింది. అప్పుడు రాజ్యాంగ నిర్మాతగా డాక్టర్ అంబేడ్కర్ మాట్లా డుతూ ‘‘రాష్ట్రాల నిర్మాణంలో/ రాష్ట్రాల విభజన సందర్భంలో ఆయా స్థానిక శాసనసభలలో మెజారిటీ తీర్మానం ప్రకారమే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ఉండాలని నిర్దేశించారు, రాష్ట్ర శాసనసభ నిర్ణయానుసారం మాత్రమే రాష్ట్రపతి వ్యవహరించాలని స్పష్టం చేశారు. ఆ షరతును ఎప్పుడైతే కేంద్ర పాలనా వ్యవస్థ రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం ఉల్లం ఘించడానికి బరితెగించిందో– అప్పుడే ఫెడరల్ (సమాఖ్య) స్ఫూర్తికి పాతర వేయడం జరిగింది. అందువల్ల ఆ పరిస్థితుల్లో పార్ల మెంట్ ద్వారానే ఫెడరల్ స్ఫూర్తికి అనుగుణంగా రాష్ట్ర ప్రయోజనాలకు రక్షణ సాధ్యమవుతుందని కూడా ఉండవల్లి ఆశించడం ఎంతవరకు సాధ్యం? కనుక తెలిసి తెలిసీ ‘నంగనాచులు, తుంగబుర్రలు’గా వ్యవహ రించడం ఎంతవరకు సబబో కూడా ఆలోచించాలి.
ఏబీకే ప్రసాద్
సీనియర్ సంపాదకులు
(abkprasad2006@yahoo.co.in)
Comments
Please login to add a commentAdd a comment