ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడు రాజధానులను ఏర్పాటు చేయాలన్న నిర్ణయంపై అనేక అనుమానాలు, ప్రశ్నలు వినిపిస్తూనే ఉన్నాయి. రాజధానిని రెండు, మూడు కేంద్రాలుగా వికేంద్రీకరణ చేయడం సాధ్యమేనా? అందులోనూ హైకోర్టు లాంటి ప్రధాన వ్యవస్థను రాజధాని వెలుపల ఏర్పాటు చేయడం ఏంటి? ఇలాంటి అనేక ప్రశ్నలు ఈ సందర్భంగా ప్రభుత్వానికి ఎదురవుతున్నాయి. కానీ మన దేశంలోనూ, విదేశాల్లోనూ అనేక చోట్ల ఒకటికన్నా ఎక్కువ రాజధానులతో పరిపాలనను సజావుగా నడిపిస్తున్న ఉదంతాలు చాలానే ఉన్నాయి. ఆయా భౌగోళిక పరిస్థితులు, అభివృద్ధిలో ఉన్న అసమానతలు; కొన్ని ప్రాంతాల అస్తిత్వం, ఆత్మగౌరవాలు – ఒకటి కన్నా ఎక్కువ రాజధానుల ఏర్పాటుకు హేతువులయ్యాయి.
భారతదేశంలో ఇప్పటికి దాదాపు ఆరు రాష్ట్రాల్లో రాజధానుల వికేంద్రీకరణ జరిగింది. జమ్మూ–కశ్మీర్ రాష్ట్రంలో అధికారికంగా శ్రీనగర్ వేసవికాల రాజధానిగా, జమ్మూ శీతకాల రాజధానిగా.. వాతావరణ, రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఎన్నో ఏళ్ళుగా కొనసాగుతున్నాయి. వీటి మధ్య దూరం 262 కిలోమీటర్లు ఉంది. ఇటీవల జమ్మూ–కశ్మీర్ నుండి విడదీసి కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చిన లడఖ్‌కి లేహ్, కార్గిల్‌లు వరుసగా వేసవి, శీతకాల రాజధానులుగా అధికారికంగా ఉన్నాయి. ఈ రెండు రాజధానుల మధ్య దూరం 219 కిలోమీటర్లు ఉంది. మహారాష్ట్ర రాజధాని ముంబై కాగా, రెండవ రాజధానిగా నాగపూర్‌ను అధికారికంగా 1988లో ప్రకటించారు. శీతాకాల రాజధానిగా ఉంది. వెనకబడిన విదర్భ తదితర ప్రాంతాల ఆకాంక్షలకు అనుగుణంగా ఇది ఏర్పడింది.
ఈ రెండు పట్టణాల మధ్య దూరం 823 కిలోమీటర్లు. హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్ర రాజధాని సిమ్లా అయినా ధర్మశాలను కూడా రెండో రాజధానిగా 2017లో అధికారికంగా ప్రకటించారు. సాంస్కృతిక పరంగా ప్రాధాన్యంతో ఇది ఉంది. వీటి మధ్య దూరం 223 కిలోమీటర్లు. ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్‌తో పాటు గైర్సేన్ని కూడా 2013లో రెండో రాజధానిగా ప్రకటించారు. వీటి మధ్య 280 కిలోమీటర్ల దూరం ఉంది. పొరుగు రాష్ట్రమైన కర్ణాటకకి బెంగళూరు రాజధాని కాగా, ఉత్తర కర్ణాటక ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బెల్గామ్‌ను 2012లో మరో రాజధానిగా ప్రకటించారు. వీటి మధ్య దూరం 507 కిలోమీటర్లు. తమిళనాడులో మధురై, తెలంగాణలో వరంగల్ ఇలా... అనేక రాష్ట్రాల్లో రెండవ రాజధాని ఉండాలనే డిమాండ్ వినిపిస్తోంది. వచ్చే రోజుల్లో అనేక రాష్ట్రాల్లో రాజధానుల వికేంద్రీకరణ వివిధ కారణాలతో తప్పనిసరి కానుంది. భారతదేశానికి రెండవ రాజధానిగా హైదరాబాదు నగరం ఉండాలని డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ మొదలుకొని ఎందరో ప్రతిపాదించిన సంగతీ ఈ సందర్భంగా గుర్తుంచుకోవాలి. ఆయా రాష్ట్రాల ప్రత్యేక పరిస్థితులు, ప్రజల మనోభావాలు, వెనుకబాటుతనం, సామాజిక, సాంస్కృతిక గుర్తింపు, అభివృద్ధి అవకాశాలు.. ఇలా అనేక కారణాల రీత్యా రాజధానుల వికేంద్రీకరణ ఒక ప్రజాస్వామిక హక్కుగా రాబోతోంది.
ఆయా రాష్ట్రాల పరిస్థితుల బట్టి రాజధానుల, పాలన వికేంద్రీకరణ చేసుకొనే అవకాశం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందనేది సత్యం.హైకోర్టు అనేది కార్యనిర్వాహక, శాసనవ్యవస్థల కన్నా భిన్నమైంది. ఎంతో స్వయం ప్రతిపత్తి ఉండేది. నిజానికి హైకోర్టు దైనందిన కార్యక్రమాలకు, పై రెండు వ్యవస్థలకూ పెద్దగా సంబంధం కూడా ఉండదు. హైకోర్టు కూడా రాజధానిలోనే కచ్చితంగా ఉండాలనడం అశాస్త్రీయం.
దేశంలో ప్రస్తుతం 25 హైకోర్టులు ఉన్నాయి. వీటిలో దాదాపు 9 చోట్ల రాజధాని కేంద్రంలో కాకుండా ఇతర నగరాలలో ఉన్నాయి. అస్సాం రాష్ట్రంలో గౌహతి, ఛత్తీస్‌గఢ్‌లో బిలాస్‌పూర్, గుజరాత్‌లో అహ్మదాబాద్, కేరళలో ఎర్నాకుళం, మధ్యప్రదేశ్‌లో జబల్పూర్, ఒడిస్సాలో కటక్, రాజస్థాన్‌లో జో«ద్‌పూర్, ఉత్తరప్రదేశ్‌లో ప్రయాగరాజ్, ఉత్తరాఖండ్‌లో నైనిటాల్... ఇలా రాష్ట్ర రాజధానితో సంబంధం లేకుండా పక్క ప్రాంతాలలో హైకోర్టులు ఉన్నాయి. ఆయా హైకోర్టుల బెంచ్‌లు 15 వరకు రాజధానేతర నగరాలలో ఉన్నాయి.
విభజన చట్టం 31 సెక్షన్, 2 సబ్‌సెక్షన్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన స్థానం రాష్ట్రపతి నోటిఫై చేసిన చోట ఉంటుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన మేరకు అది సహజంగా జరగాలి. 3వ సబ్‌సెక్షన్ ప్రకారం పై 2వ సబ్‌సెక్షన్‌తో నిమిత్తం లేకుండా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులు, ద్విసభ్య ధర్మాసనాలు ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌తో ప్రధాన న్యాయమూర్తి నిర్ణయించిన చోట లేదా ప్రాంతాల్లో న్యాయ విచారణ చేయవచ్చు అని ఉంది.
సాధారణంగా గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయం మేరకు అనుసరించడం ఆనవాయితీ. ఇంత సహజంగా హైకోర్టు విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకొనే అవకాశం చట్టం కల్పించింది. ఈ నేపథ్యంలో శ్రీబాగ్ ఒప్పందం స్ఫూర్తితో కర్నూలులో హైకోర్టును రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. తొమ్మిది రాష్ట్రాల్లో హైకోర్టులు రాజధానిలో కాకుండా బయట ఉండగా, ఆంధ్రప్రదేశ్‌లో అందుకు భిన్నంగా హైకోర్టు కర్నూలులో ఏర్పాటు చేయకూడదని అశాస్త్రీయంగా చర్చ సాగుతోంది. ముందు ఈ వితండ వాదాన్ని ఆపి సానుకూల దృక్పథంతో ఆలోచించడం ప్రారంభించాలి. కర్ణాటక, మహారాష్ట్ర తదితర పొరుగు రాష్ట్రాల స్ఫూర్తితో వికేంద్రీకరణను స్వాగతించాలి. రాజధాని విషయంలోనే కాకుండా సాగునీళ్ళు, ఉపాధి అవకాశాలు, పెట్టుబడులు, అభివృద్ధి తదితర అనేక అంశాలలో భవిష్యత్తులో వికేంద్రీకరణ స్ఫూర్తిని చాటి, ఆధునిక భారతదేశానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆదర్శంగా నిలవాలి.
-డా. అప్పిరెడ్డి హరినాథరెడ్డి
వ్యాసకర్త కేంద్ర సాహిత్య అకాడమీ యువపురస్కార గ్రహీత, అనంతపురం ‘ 99639 171187
Comments
Please login to add a commentAdd a comment