ఆకలి అంతర్జాతీయ దుర్నీతి | abk prasad opinion on central government policy about poor conditions in country | Sakshi
Sakshi News home page

ఆకలి అంతర్జాతీయ దుర్నీతి

Published Tue, May 24 2016 12:42 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM

ఆకలి అంతర్జాతీయ దుర్నీతి - Sakshi

ఆకలి అంతర్జాతీయ దుర్నీతి

రెండో మాట
‘‘కేంద్ర ప్రభుత్వమూ, రాష్ట్ర ప్రభుత్వాలు కరవు పరిస్థితుల్ని పరిష్కరిం చడంలో విఫలమయ్యాయి. దేశ ప్రజల్ని కరవుకాటకాల నుంచి రక్షించే సంకల్పం ప్రభుత్వాలకు కొరవడి, ప్రజల్ని ఆకలిదప్పులకు, ఆత్మహత్యలకు, వలసలకు గురిచేస్తున్నాయి. దేశంలో నాల్గింట ఒక వంతు రాష్ట్రాలు కరవు కోరల్లో ఉన్నాయి. ఇది జాతీయ విపత్తు. ఇంతటి విపత్కర పరిస్థితి విషయంలో కేంద్రం తనకేమీ పట్టనట్టు చేతులు దులిపేసుకుంటోంది. పైగా ఈ పరిస్థితిని చక్కబరచుకునే బాధ్యతను రాష్ట్రాలపైకి నెట్టి, తాను ఆర్థిక సహాయాన్ని అందించడానికి మాత్రమే పరిమితమవడానికి ప్రయత్నిస్తోంది. ఇందుకు కేంద్రం ఫెడరలిజం చాటున (రాష్ట్రాలే చూసుకోవాలని) దాగజూస్తోంది’’.
 - దేశంలోని తీవ్ర కరువు పరిస్థితులపై సుప్రీం కోర్టు (11-5-2016) విమర్శ.
 
కరవుకు ‘గ్రహణాలు’ ఎక్కువని సామెత! కారణం లేని కార్యం ఉండదు, అలాగే కారణం లేని కరవులూ ఉండవు. కాని ఆధునిక కాలంలో కరవులకు కేంద్రం నుంచి రాష్ట్రాలదాకా ప్రజా వ్యతిరేక, పెట్టుబడిదారీ భూస్వామ్య వర్గ అనుకూల పాలక శక్తుల విధానాలే అసలైన ‘గ్రహణాలు’. అందువల్లనే కరవు కోరల్లో చిక్కుపడిన 33 కోట్లమంది భారతీయుల పట్ల ఆందోళనతో అత్యు న్నత న్యాయస్థానం చేసిన హెచ్చరిక ఇది.

2014 జనరల్ ఎన్నికల సందర్భంగా దేశ వ్యాపితంగా అన్ని రాష్ట్రాలకూ ‘ప్రగతి బాట’, ‘ఆదర్శ’మనీ  బీజేపీ-ఆరెస్సెస్ నాయకత్వం దండోరా వేసిన గుజరాత్ కూడా ఆ 12 రాష్ట్రాలలోని కరవుపై వేసిన ‘పిల్’లోనూ, సుప్రీంకోర్టు పేర్కొన్న రాష్ట్రాల లోనూ ఉండటం విశేషం! తమ రాష్ట్రాలు కరవు కోరల్లో ఉన్నట్టు ఒప్పుకోడానికి ముందుకురానివిగా గుజరాత్, బిహార్, హరియాణా తదితర రాష్ట్రాలను సుప్రీం విమర్శించింది.  కరవు వాతబడిన రాష్ట్రాన్ని అలా ప్రకటిం చకుండా దాచడం పేద ప్రజాబాహుళ్యం హక్కును కాలరాయడమేనని కూడా సుప్రీం హెచ్చరించాల్సి వచ్చింది. 2005 నాటి దుర్భిక్ష నివారణ చట్టాన్ని (సెక్షన్ 2-డి) అమలుచేసే ప్రయత్నం కూడా చేయనందుకు న్యాయస్థానం పాలకులను శఠించవలసి వచ్చింది!
 
పాలకుల నిర్లక్ష్యానికి అసలు కారణం!
ప్రజా ప్రయోజనాలపట్ల పాలనా వ్యవస్థలో నెలకొన్న ఈ అనాసక్త ధోరణి, చైతన్య రాహిత్యం... 1999 కాంగ్రెస్ ప్రభుత్వంతో ప్రారంభమై బీజేపీ (ఎన్డీఏ), కాంగ్రెస్ (యూపీఏ) ప్రభుత్వాలు అమెరికా ఆధ్వర్యంలోని ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థల ప్రజా వ్యతిరేక ‘సంస్కరణ’లను బేషరతుగా ఆమోదించడంతోనే ప్రారంభమైంది. ఆసియా-ఆఫ్రికా ఖండాల బడుగు దేశాల ఈతి బాధల్ని, వలస పెత్తందారీ విధానాలు సృష్టించిన కరవు కాటకాల్ని కాచి వడపోసి, అధ్యయనం చేసిన పరిశోధకుడు ఫ్రాంజ్ ఫానన్ వర్ణించినట్టు ప్రగతి నిరోధక శక్తులు తమ దేశాల ప్రజలకు అందించగలిగినవి ఆహార పదార్థాలను కాదు, నినాద భూయిష్టమైన కేవల జాతీయవాదాన్ని మాత్రమే (‘‘రెచెడ్ ఆఫ్ ది ఎర్త్’’). ప్రపంచ బ్యాంకు ప్రజా వ్యతిరేక సంస్కర ణల అమలుతో కాంగ్రెస్, బీజేపీల హయాంలో వ్యవసాయ పారిశ్రామిక, విద్యా, వస్తూత్పత్తి రంగాలు, చేతివృత్తులూ కునారిల్లుతున్నాయి.

విదేశీ గుత్త పెట్టుబడి సంస్థలు, బడా విదేశీ కంపెనీలు, పెట్టుబడుల దోపిడీకి భారత ఆర్థిక వ్యవస్థ గురవుతూ వస్తోంది. చివరికి దేశీయ పెట్టుబడి వర్గాలు కూడా ‘విదేశీ గుత్త కంపెనీలకు కల్పించిన రాయితీలను మాకూ ప్రసాదించమని’ దేబిరించాల్సిన పరిస్థితులు ఎదురయ్యాయి. ఈ జమిలి దోపిడీ ఫలితమే అంతవరకూ 18-20 శాతం కేంద్ర ప్రభుత్వ పరపతి సౌకర్యానికి నోచుకున్న   వ్యవసాయ రంగానికి ఆ పరపతి అందకపోగా, సబ్సిడీలు సైతం క్రమంగా అందకుండా పోతుండటంతో రైతులు, వ్యవసాయ కార్మికులూ, వీరిని అంటిపెట్టుకున్న వ్యవసాయాధారిత చేతివృత్తులూ దెబ్బతిని పోయాయి. ‘‘వ్యవసాయం దండుగమారిది, వాణిజ్య పంటలు పండుగ మాదిరి’ అనే నినాదాన్ని మన నాయకులు ‘లంకించు’కున్నారు!

ప్రపంచ బ్యాంకు దుర్నీతి విధించిన శాపం
ప్రపంచ బ్యాంక్‌కి తోడు క్రమేపీ దాని అనుబంధ సంస్థ ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) కలిసి మన దేశంలాంటి దేశాలు పారిశ్రామిక, వ్యవసాయ రంగాల ఉత్పత్తిని సజావుగా జరగనీయకుండా విదేశీ ఉత్పత్తు లను, దిగుమతులను ధారాళంగా పెంచేందుకు వ్యూహం పన్నాయి. ఆంగ్లో- అమెరికన్, ప్రపంచ సామ్రాజ్య పెట్టుబడి కూటాలు ఈ ప్రగతి నిరోధక వ్యూహాన్ని మనకన్నా ముందు పలు ఆఫ్రికా, లాటిన్ అమెరికా ఆర్థిక వ్యవస్థ లలో అమలుచేశాయి. ఇండియాలాంటి వర్ధమాన దేశాల జాతీయ ఆర్థిక వ్యవస్థలను చుట్టబెడుతున్న ప్రపంచబ్యాంకు ‘ప్రపంచీకరణ’ మంత్రం చెడు ఫలితాలను గురించి శ్వేత విప్లవ పితామహుడు కురియన్ ముందే హెచ్చరించాడు.

బ్యాంకు ప్రజా వ్యతిరేక సంస్కరణలవల్ల స్థానిక జీవనాధార వ్యవస్థలను కాపాడుకోవడం కష్టమని కూడా హెచ్చరించాడు. కాంగ్రెస్, బీజేపీల హయాంలో (మన్మోహన్, వాజ్‌పేయి) భారత వ్యవసాయిక, మన పారిశ్రామిక రంగాలు ఉత్పత్తి చేసుకోగల 2000 సరుకులను విదేశాల నుంచి దిగుమతి చేసుకునే దుస్థితి ఏర్పడింది. ఫలితంగా రకరకాల సరుకులను ఎగుమతి చేసి, విదేశీ మారకద్రవ్యాన్ని ఇబ్బడిముబ్బడిగా సమకూర్చగల దేశవాళీ సంస్థల సామర్థ్యం దిగజారి, దేశం దిగుమతులపై ఆధారపడినదిగా దిగజారడానికి ఈ రెండు ప్రభుత్వాలూ ప్రధాన కారణం.
 
కాంగ్రెస్-బీజేపీ పాలకుల నిర్వాకం
ప్రపంచ మార్కెట్‌ను ఆంగ్లో-అమెరికన్ కూటమి ప్రయోజనాలకు రక్షణ కల్పించేదిగా చేయడం కోసం డబ్ల్యూటీవో ద్వారా దాదాపు 10 విదేశీ గుత్త కంపెనీలు (ఎంఎన్‌సీలు) నేడు వ్యవసాయోత్పత్తుల వాణిజ్యాన్ని తమ అదుపాజ్ఞల్లో పెట్టుకున్నాయి. గోధుమల వర్తకంలో 85-90%, చక్కెర వ్యాపారంలో 60%, కాఫీ ఎగుమతుల్లో 90%, బియ్యం 75%, కోకో బీన్స్‌లో 85%, టీ ఎగుమతుల్లో 80%, అరటిపళ్ల వ్యాపారంలో 75%, కలప ఎగుమ తుల్లో 90%, ప్రపంచ జనపనార ఉత్పత్తుల్లో 70-75% వర్తకాన్ని ఈ గుత్త సంస్థలు శాసిస్తున్నాయి.

కాంట్రాక్టు వ్యవసాయం, కంపెనీ వ్యవసాయం, బహుళజాతి గుత్త సంస్థలతో మిలాఖత్ దోపిడీలో భాగస్వాములయిన దేశీయ బడా కంపెనీలకు విచ్చలవిడిగా సాగుభూముల్ని దఖలుపర్చడం ఇత్యాది ‘‘సంస్కరణల’’ను యథేచ్చగా ఈ రెండు రాజకీయ పక్షాల పాలన లోనూ అమలు జరుగుతూ వస్తున్నాయి! అందుకే హరిత విప్లవ ప్రముఖుడు, ప్రసిద్ధ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ ‘‘ఆకలితో అలమటిస్తున్న ప్రజలు ఏ సహేతుక కారణం గురించీ వినరు, న్యాయాన్యాయాల విచక్షణనూ పట్టించుకోరు, ప్రార్థనలకూ లొంగిపోరు. నేడు మన దేశంలో ఆకలిదప్పుల సమస్య నెలకొన్నది మార్కెట్‌లో ఆహార లభ్యత కొరవడినందు వల్ల కాదు. ప్రజల కొనుగోలు శక్తి తగినంతగా లేనందువల్ల జీవనాధారాన్ని నిలుపుకోగల అవకాశాలు కొరవడినందువల్లనే అసలు సమస్యంతా. లక్షలకొద్దీ టన్నుల ఆహార ధాన్యాలు పుష్కలంగా ఉండడమే ఆహార భద్రతకు రక్షణ’’ అన్నారు.
 
పైగా వాజ్‌పేయి ప్రధానిగా బాధ్యతలను స్వీకరించిన ఏడాదే (2000) ప్రపంచబ్యాంకు ‘‘లాభసాటి కాని పంటలను తగ్గించేయండి; ఎగుమ తులకు వీలైన పంటల్ని మాత్రమే పెంచాలి, ఆహార ధాన్యాల దిగుమతుల్ని స్వేచ్ఛగా అనుమతించాలి. ఎరువులపైన, నీరు, విత్తనాలు, రుణాల కేటా యింపులపైన ప్రభుత్వ సబ్సిడీలను కోత పెట్టాలి; క్రమంగా వీటన్నింటి పైన సబ్సిడీలను పూర్తిగా ఎత్తివేయాలి. దేశీయ వ్యవసాయోత్పత్తుల ఎగుమతుల పైన ఆంక్షలు విధించాలి.

ఆహారధాన్యాల కొనుగోళ్లు, గోధుమ, బియ్యం వగైరా ధాన్యాదుల రవాణా బాధ్యతలనుంచి కేంద్ర ఆహార సంస్థను తప్పించాలి! ఇలాంటి ఆంక్షల ద్వారానే ప్రపంచ బ్యాంకు ఆఫ్రికా, లాటిన్ అమెరికాల ఆర్థిక వ్యవస్థల్ని దిగజార్చివేసింది. ఆఫ్రికా ధాన్యాగారాలుగా, పచ్చని సారవంతమైన భూములుగా ప్రసిద్ధికెక్కి, ఇరవై ఏళ్ల పాటు ఫ్రాన్స్‌కు ఆహారం సరఫరా చేసిన ఇథియోపియా, మొరాకో దేశాలను ప్రపంచ బ్యాంకు సంస్కరణలు అడుక్కుతినే దేశాలుగా దిగజార్చాయి! తాము ఉత్పత్తి చేసే సరుకును అవి ఉపయోగించుకోలేని దుస్థితి, ఉత్పత్తి చేయని సరుకును దిగుమతి చేసుకోమని బ్యాంక్ ఒత్తిడి. ‘నాజూకుగా కన్పించాలంటే అమెరికా గోధుమనే వాడండి’’ అనే హోర్డింగ్‌లు! ఇదేనా మనం కోరుకునే ‘‘జాతీయత, సంస్కృతీ’’?!
వ్యాసకర్త: ఏబీకే ప్రసాద్
సీనియర్ సంపాదకులు
abkprasad2006@yahoo.co.in

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement