టీడీపీకి గవర్నర్‌?.. రేసులో యనమల, అశోక్‌ గజపతి | Yanamala Ramakrishnudu,ashok Gajapathi Raju Race On Governor Post | Sakshi
Sakshi News home page

టీడీపీకి గవర్నర్‌?.. రేసులో యనమల, అశోక్‌ గజపతి

Published Sat, Jun 15 2024 6:47 PM | Last Updated on Sat, Jun 15 2024 7:32 PM

Yanamala Ramakrishnudu,ashok Gajapathi Raju Race On Governor Post

ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న టిడిపి సీనియర్లు ఎన్డీఎ కోటాలో గవర్నర్ పదవివైపు ఆశగా ఎదురు చూస్తున్నారు...యనమల, అశోక్ గజపతిరాజు లాంటి సీనియర్లు గవర్నర్ పదవి కోసం రేసులో ఉన్నారు...ఎన్డీఎలో టిడిపి అత్యంత కీలకం కావడంతో సీనియర్లలో ఒకరికి గవర్నర్ పదవి వస్తుందనే వార్తలు వస్తున్నాయి...గవర్నర్ రేసులో రేసులో ఎవరున్నారు...

తెలుగుదేశం పార్టీలో గవర్నర్ పదవిపై జోరుగా చర్చ సాగుతోంది..సీనియర్లలో ఒకరికి గవర్నర్ వస్తుందంటూ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. ఎన్డీఎలో కీలక భాగస్వామిగా ఉండటంతో కేంద్రంలో టిడిపి సీనియర్లు కీలక పదవులను ఆశిస్తున్నారు..ముఖ్యంగా కొందరు సీనియర్లైతే గవర్నర్ పదవిపైనే ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. యనమల రామకృష్ణుడు, అశోక్ గజపతి రాజు లాంటి సీనియర్లు అయితే గవర్నర్ పదవిని ఆశిస్తున్నట్లు టిడిపిలో ఊహాగానాలు నడుస్తున్నాయి. ఇప్పటికే యనమల, అశోక్ గజపతి రాజు లాంటి సీనియర్లు ప్రత్యక్ష రాజకీయాలకి దూరమై తమ వారసులను రంగంలోకి దించి విజయం సాధించారు. చంద్రబాబు టిడిపి పగ్గాలు చేపట్టిన నాటి నుంచి కూడా ఈ ఇద్దరూ కూడా అత్యంత సన్నిహితంగా ఉన్నారు.

యాదవ సామాజకి వర్గానికి చెందిన యనమల రామకృష్ణుడు 1983 లో రాజకీయాల్లోకి వచ్చి తొలిసారి తూర్పుగోదావరి జిల్లా తుని నుంచి టిడిపి తరపున పోటీ చేసి గెలుపొందారు. లా పూర్తి చేసిన యనమల తొలి ప్రయత్నంలో ఎన్టీఆర్ ప్రభుత్వంలో మంత్రి పదవి కూడా దక్కించుకున్నారు. అప్పటి నుంచి 2004 వరకు వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలవడమే కాకుండా కీలకమైన మంత్రి పదవులతో పాటు స్పీకర్ పదవి కూడా నిర్వహించారు. స్పీకర్ గా వ్యవహరించిన యనమల 1994 టిడిపి సంక్షోభంలో ఎన్టీఆర్ వైపు కాకుండా చంద్రబాబు వైపు నిలిచి చంద్రబాబుకి దగ్గరయ్యారు. ఆ సమయంలో యనమల తీసుకున్న నిర్ణయమే చంద్రబాబుని ముఖ్యమంత్రి అయ్యేలా చేసింది. అప్పటి నుంచి కూడా చంద్రబాబుకి యనమల అత్యంత సన్నిహితంగా ఉంటూ వచ్చారు.చంద్రబాబు ఎపుడు అధికారంలో ఉన్నా కూడా యనమలకి అత్యంత కీలకమైన ఆర్ధిక శాఖ ఇస్తూ వచ్చారు.

1999 నుంచి 2004 వరకు టిడిపి ప్రభుత్వంలో ఆర్ధిక శాఖ మంత్రిగా వ్యవహరించిన యనమల తొలిసారి వైఎస్సార్ హవాలో 2009 లో తొలిసారి ఓటమి చవి చూశారు.ఆ తర్వాత నుంచి ఆయన ప్రత్యక్ష రాజకీయాలలో పాల్గొనకుండా 2014 లో ఎమ్మెల్సీగా ఎన్నికై మళ్లీ చంద్రబాబు క్యాబినెట్ లో రెండవ సారి ఆర్ధిక మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.ఆ సమయంలోనే ఆయన రాజ్యసభ కోసం ప్రయత్నించారు. ఆ సమయంలో రాజ్యసభ దక్కకపోవడంతో ఆయన నిరాశ పడ్డారు. మళ్లీ ఈ ఎన్నికలలో తుని నియోజకవర్గంలో తన సోదరుడు యనమల కృష్ణుడు బదులు తన కూతురు దివ్యను రంగంలోకి దింపారు. యనమల కృష్ణుడు వైఎస్సార్ సిపిలో చేరినప్పటికీ కూడా యనమల తన కూతురు దివ్యను తుని నియోజకవర్గంలో నెగ్గించుకున్నారు. టిడిపి అధికారంలోకి రావడంతో యనమలకి మళ్లీ క్యాబినెట్ లో కీలక అమాత్య పదవి ఉంటుందని టిడిపి వర్గాలు భావించాయి. అయితే యనమల ఆలోచనలకి తగిన విధంగా కీలకమైన పదవి ఇవ్వడానికే చంద్రబాబు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే యనమలని గవర్నర్ గా ఏదో ఒక రాష్ట్రానికి పంపాలని చంద్రబాబు ఆలోచిస్తున్నట్లు టిడిపిలో చర్చ జరుగుతోంది. కేంద్రంలో ఎన్డీఎలో టిడిపి అత్యంత కీలకమైన పార్టీ కావడంతో ఒక గవర్నర్ పదవి తీసుకోవాలని టిడిపి భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.  యనమల కూడా ఈసారైనా గవర్నర్ పదవి వస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు ఉత్తరాంద్రలో చంద్రబాబుకి అత్యంత సన్నిహితులైన అశోక్ గజపతి రాజు కూడా గవర్నర్ పదవి ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. విజయనగరం పూసపాటి రాజవంశానికి చెందిన అశోక్ గజపతి రాజు 1978లో తొలిసారి రాజకీయాలలోకి అడుగుపెట్టి జనతాపార్టీ అభ్యర్థిగా  విజయనగరం విధాన సభనుంచి గెలుపొందారు. ఆ తర్వాత ఎన్టీఆర్ స్ధాపించిన తెలుగుదేశం పార్టీ లో 1983, 1985, 1989, 1994, 1999, 2009 వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎన్టీఆర్, చంద్రబాబు క్యాబినెట్లో ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, ఆర్థిక, రెవెన్యూ మరియు శాసనసభ వ్యవహారాల మంత్రిగా పనిచేశారు. ఇక 2014 లో విజయనగరం లోక్ సభ నుంచి పోటీ చేసి గెలుపొంది ఎన్డీఎ ప్రభుత్వంలో కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. ఈ సారి ఎన్నికలలో ఆయన నేరుగా పోటీ చేయకుండా తన కుమార్తె ఆదితి గజపతిరాజుని రంగంలోకి దింపి ప్రత్యక్ష రాజకీయాలకి దూరమయ్యారు. తొలిసారి తన వారసురాలిని రంగంలోకి దింపిన అశోక్ గజపతిరాజు విజయనగరం ఎమ్మెల్యేగా గెలుపించుకోగలిగారు. దీంతో ఆయన కూడా కేంద్రంలో కీలక పదవిని ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

చంద్రబాబుకి ఉత్తరాంద్రలో అత్యంత సన్నిహితుడిగా అశోక్ గజపతి రాజు ఉండటంతో గవర్నర్ పదవి రేసులో ఆయన కూడా ఉన్నట్లు చెబుతున్నారు.  అటు యనమల...ఇటు అశోక్ గజపతిరాజులలో ఒకరికి గవర్నర్ పదవి ఖాయమని టిడిపి నేతలు భావిస్తున్నారు. ఒకవేళ అశోక్ గజపతిరాజుకి గవర్నర్ అవకాశం రాకపోతే రాజ్యసభకైనా పంపవచ్చని ప్రచారం జరుగుతోంది. ఇందుకోసం ఇప్పటికే సిఎం చంద్రబాబు ప్రధాని మోదీ వద్ద టిడిపికి ఒక గవర్నర్ పదవి ఇవ్వాలని ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.ఇప్పటికే కేంద్రంలో టిడిపికి రెండు మంత్రి పదవులు దక్కాయి. ఉత్తరాంద్రకి చెందిన రామ్మోహననాయుడికి కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రిగా క్యాబినెట్ పదవి దక్కింది. ఇక తొలిసారి రాజకీయాలలోకి అడుగుపెట్టి గుంటూరు ఎంపిగా గెలుపొందిన డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ కి కూడా కేంద్ర సహాయ మంత్రి పదవి లబించింది. టిడిపి నుంచి 16 మంది ఎంపిలగా గెలుపొందడంతో మూడు పదవులు ఆశించినప్పటికీ కూడా తాజా క్యాబినెట్ లో రెండే పదవులు దక్కాయి. విస్తరణలో మరో కేంద్ర సహాయమంత్రి పదవి వస్తుందని టిడిపి అంచనా వేస్తోంది. అదే సమయంలో పార్టీ కోసం పనిచేసిన సీనియర్ల కోసం ఒక గవర్నర్ పదవి ప్రతిపాధన కూడా మోదీ ముందు ఉంచినట్లు ప్రచారం జరుగుతోంది..మరి టిడిపి సీనియర్ల ఆశలు నెరవేరతాయా...గవర్నర్ దక్కుతుందా...చూడాలి...

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement