ఏపీలో అరాచక, ఆటవిక పాలన.. గవర్నర్‌తో భేటీలో వైఎస్‌ జగన్‌ | YS Jagan Will Meet AP Governor Abdul Nazeer | Sakshi
Sakshi News home page

ఏపీలో అరాచక, ఆటవిక పాలన.. గవర్నర్‌తో భేటీలో వైఎస్‌ జగన్‌

Published Sun, Jul 21 2024 11:52 AM | Last Updated on Sun, Jul 21 2024 9:04 PM

YS Jagan Will Meet AP Governor Abdul Nazeer

ఎన్నికల తరవాత అంతులేని దారుణాలు కేంద్ర సంస్థలతో విచారణ జరిపించండి

రాజ్‌భవన్‌లో గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ను కలిసిన వైఎస్‌ జగన్‌

రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి

యథేచ్ఛగా హత్యలు, దాడులు, ఆస్తుల విధ్వంసం

హత్యలు, దాడులు, అకృత్యాల ప్రోత్సాహం

ఆ దిశలోనే ఇన్ని రోజుల టీడీపీ కూటమి పాలన

సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరవాత సాగుతున్న అరాచక పాలన, పూర్తిగా క్షీణించిన శాంతి భద్రతలపై, వైఎస్సార్‌సీపీ లక్ష్యంగా చేస్తున్న హత్యలు, దాడులు, ఆస్తుల విధ్వంసంపై వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సాక్ష్యాలతో సహా వినతిపత్రాన్ని ఏపీ గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌కు సమర్పించారు. ఈ క్రమంలో గవర్నర్‌ అబ్ధుల్‌ నజీర్‌తో వైఎస్‌ జగన్‌ భేటీ అయ్యారు.  

ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ గవర్నర్‌కు అందజేసిన వినతిపత్రంలోని విషయాలు ఇలా ఉన్నాయి.. 
‘‘ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రంలో నెలకొన్న అత్యంత దారుణమైన పరిస్థితులను, క్షీణించిన శాంతి భద్రతల అంశాన్ని మీ దృష్టికి తీసుకువస్తున్నాను. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. రాజ్యాంగ వ్యవస్థలు కూప్పకూలిపోయాయి. యంత్రాంగం నిస్తేజంగా మారిపోయింది. ప్రజల మాన, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. అధికార పార్టీకి చెందిన నాయకులు, వారి కార్యకర్తలు స్వైరవిహారం చేస్తున్నారు. రాష్ట్రంలో అత్యంత భయానక వాతావరణం నెలకొంది.

రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి, ఆ వెంటనే.. ఈ ఎన్నికల్లో తమకు ఓటు వేయని వారిని లక్ష్యంగా చేసుకుంది. ముఖ్యంగా మా పార్టీ.. వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులను వేధించడమే పనిగా పెట్టుకుంది. వారిని కొట్టడం, చంపడం, దారుణంగా వేధించి భయానక పరిస్థితులు సృష్టించడం వంటివన్నీ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆస్తులు విధ్వంసం చేస్తున్నారు. ఇళ్లు, భవనాలు కూల్చేస్తున్నారు. వ్యాపార సంస్థలపైనా దాడులు చేస్తున్నారు. చివరకు వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులంటూ.. రోడ్డు పక్కనే చిరు వ్యాపారం చేసుకుంటున్న వారినీ వదలడం లేదు. వారిపై దాడులు చేసి, ఉపాధిని దెబ్బ కొడుతున్నారు.

కేవలం మా పార్టీ నాయకులు, కార్యకర్తల ఇళ్లు, ఆస్తులు, వ్యాపార సంస్థలపై మాత్రమే కాకుండా.. చివరకు ప్రభుత్వ ఆస్తులపైనా వారి దాడులు, దౌర్జన్యాలు కొనసాగుతున్నాయి. అలా ప్రభుత్వ ఆస్తులనూ వారు విధ్వంసం చేస్తున్నారు. అధికార వికేంద్రీకరణలో భాగంగా ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయాలతో పాటు, ఆర్బీకేలు, విలేజ్‌ క్లినిక్‌లను సైతం టీడీపీ శ్రేణులు వదిలి పెట్టడం లేదు. అవన్నీ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్న కక్షతోనే, అధికార పక్షం ఈ పని చేస్తోంది. చివరకు రాష్ట్రంలో చాలా చోట్ల దివంగత మహానేత వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి విగ్రహాలను కూడా యథేచ్ఛగా ధ్వంసం చేస్తున్నారు.

తాజాగా, ఈనెల 17న, పల్నాడు జిల్లా వినుకొండలో మా పార్టీ కార్యకర్త రషీద్‌ను దారుణంగా హత్య చేశారు. నడిరోడ్డు మీద ప్రజలందరూ తిరుగుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ దారుణ హత్య రాష్ట్ర ప్రజానీకాన్ని తీవ్ర కలవరపాటుకు గురి చేసింది. టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో చాలా జరిగాయి.

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ తరఫున పార్లమెంటుకు ఎన్నికైన వారు, శాసనసభకు ఎన్నికైన వారు, ఆయా స్థానాల్లో పోటీ చేసిన అభ్యర్థులకూ రక్షణ కూడా లేకుండా పోయింది. గత గురువారం చిత్తూరు జిల్లా పుంగనూరులో మాజీ ఎంపీ రెడ్డప్పగారిని పరామర్శించడానికి వెళ్లిన మా పార్టీ లోక్‌సభ పక్ష నాయకుడు, ఎంపీ మిథున్‌రెడ్డిపై టీడీపీ మూకలు హత్యాయత్నం చేశాయి. పోలీసుల సమక్షంలోనే ఈదాడి జరిగింది. రాష్ట్రంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు, వారు అధికార పార్టీకి కొమ్ము కాస్తున్న విధానం వీటన్నింటితో అందరికీ అర్ధమవుతోంది.

రాష్ట్రంలో ఎక్కడా ప్రజాస్వామ్య వ్యవస్థ అనేది కనిపించడం లేదు. రాజ్యాంగం, చట్టం, పోలీసు వ్యవస్థ.. అన్నీ నిర్వీర్యమయ్యాయి. నామమాత్రంగా మిగిలాయి. అన్నింటికీ భిన్నంగా, చట్ట విరుద్ధంగా అధికార పక్షం ఏర్పాటు చేసుకున్న తమ సొంత రాజ్యాంగ వ్యవస్థ ‘రెడ్‌ బుక్‌’ రాజ్యాంగం గత 45 రోజులుగా ఇక్కడ పని చేస్తోంది. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన రోజు నుంచే ఇక్కడ సంఘ విద్రోహ శక్తులు పేట్రేగిపోతున్నాయి.

గడచిన ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌లో అంటే మంచి విద్య, మంచి వైద్యం, రైతుకు భరోసా, అక్కచెల్లెమ్మలకు సాధికారిత, పటిష్టమైన లా అండ్‌ ఆర్డర్‌. సుస్థిర, సమగ్రమైన అభివృద్ధి కొనసాగింది. వాటన్నింటిలో ఆనాడు ఈ రాష్ట్రం పేరు గొప్పగా చెప్పుకుంటే.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ అంటే హత్యలు, అత్యాచారాలు, రాజకీయ కక్షలతో చేస్తున్న దాడులు, విధ్వంసాలకు చిరునామాగా మారిపోయింది. రాష్ట్రంలో అరాచకాలు తప్ప, పరిపాలన అనేది ఎక్కడా కనిపించడం లేదు.

ప్రభుత్వం ఏర్పాటైన నెలన్నర వ్యవధిలోనే 36 మంది హత్యకు గురయ్యారు. 300 మందిపై హత్యాయత్నం జరిగింది. టీడీపీ వాళ్ల వేధింపులు భరించ లేక 35 మంది ఆత్మహత్య చేసుకున్నారు. 560 చోట్ల ప్రైవేటు ఆస్తులను, 490 చోట్ల ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. వీళ్ల అరాచకాలు భరించలేక దాదాపు 2,700 కుటుంబాలు గ్రామాలు విడిచి వెళ్లిపోయాయి. ఇవన్నీ కాక, 1,050కి పైగా దౌర్జన్యాలు, దాడులు జరిగాయి.

ఈ ఘటనలన్నీ అనుకోకుండానో లేక యాదృఛ్చికంగానో జరిగిన ఘటనలు కావు. ఒక పథకం ప్రకారం ఒక మోడస్‌ ఆపరండీతో వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని అణగదొక్కడానికి చేస్తున్న దుర్మార్గాలు ఇవన్నీ. రాష్ట్రంలో అసలు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఉండకూడదన్న ఏకైక లక్ష్యంతో ఇవన్నీ చేస్తున్నారు. ఆ మేరకు ప్రభుత్వంలో ఉన్నవారు.. పైస్థాయి అధికారులు మొదలు కింది స్థాయి వరకూ సిగ్నల్‌ పంపారు. ఏకంగా ఈ రాష్ట్రంలో ఒక మంత్రి రెడ్‌బుక్‌ పేరిట హోర్డింగులు పెట్టి, నేరుగా దాడులు చేయమని కేడర్‌కు చెప్పకనే చెప్పాడు. వాటిని అడ్డుకోవద్దని అధికారులనూ నిర్దేశించాడు. దీంతో ఎక్కడికక్కడ టీడీపీ గూండాలు రెచ్చిపోయి దారుణాలకు పాల్పడుతున్నారు.

ఎలాంటి వివక్ష లేకుండా ప్రజలందరి ప్రయోజనాలను రక్షించడానికి ప్రభుత్వ యంత్రాంగాన్ని వినియోగించాల్సింది పోయి.. ప్రభుత్వ యంత్రాంగాన్ని పూర్తిగా రాజకీయమయం చేశారు. హత్యలను, దాడులను, అకృత్యాలను ప్రోత్సహించే ఉద్దేశంతోనే ఇవన్నీ చేస్తున్నారు. దాదాపు 27 మంది ఐఏఎస్, 24 మంది ఐపీఎస్‌ అధికారులకు పోస్టింగులు ఇవ్వకుండా చేశారంటే.. చంద్రబాబు లక్ష్యాలు, ఉద్దేశాలు కళ్ల ముందే కనిపిస్తున్నాయి.

మొత్తంగా చూస్తే రాష్ట్రంలో శాంతి భద్రతలు కుప్పకూలిపోయాయి. తక్షణం శాంతిస్థాపన జరగాల్సిన అవసరం ఉంది. సాధారణ పరిస్థితులు నెలకొనాల్సి ఉంది. అందుకే రాష్ట్రంలో ఎన్నికల తర్వాత చోటు చేసుకున్న ఘటనలన్నింటిపైనా కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలతో విచారణ జరపాలని కోరుతున్నాను. ఈ వినతిపత్రంతో పాటు, పై అంశాలన్నింటికి సంబంధించిన ఫోటోలు, వీడియో సాక్ష్యాలను కూడా మీకు అందజేస్తున్నాను’’ అని వైఎస్‌ జగన్‌ వినతిపత్రంలో పేర్కొన్నారు.
 

సంబంధిత వార్త: యావత్‌ దేశం దృష్టికి 'ఆటవిక పాలన': వైఎస్‌ జగన్‌

 

 

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement