20 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణ
ఆ తర్వాత యథేచ్ఛగా విక్రయంఆపైన చెరువుల తవ్వకానికి శ్రీకారం కన్నెత్తి చూడని రెవెన్యూ అధికారులు 20 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణ
మచిలీపట్నం : బందరు మండలంలో అధికార పార్టీ నాయకుల కబ్జా పరంపర కొనసాగుతూనే ఉంది. కరగ్రహారం పంచాయతీ పరిధిలో క్యాంప్‌బెల్‌పేట సమీపంలో 20 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమి ఉంది. ఏడెనిమిది సంవత్సరాల కిందట ఈ భూమిలో ఉప్పు పండించేవారు. కాలక్రమంలో ఉప్పు పండించడాన్ని నిలిపివేయడంతో ఖాళీగా ఉంటోంది. దీనిపై కన్నేసిన తెలుగుదేశం పార్టీకి చెందిన స్థానిక ప్రజాప్రతినిధి ఒకరు ఈ భూమి తనదేనని ప్రచారం చేసుకుంటూ వచ్చాడు. 15 రోజుల క్రితం ఈ భూమిని ఎకరం రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు కరగ్రహారం గ్రామానికి చెందిన మరో వ్యక్తికి, ఆ తర్వాత మరో ఇద్దరికి విక్రయించేశాడు. ఈ భూమిని చెరువుగా తవ్వుకునేందుకు తాను అండదండగా ఉంటానని వారికి భరోసా ఇచ్చాడు. అనుకున్నదే తడవుగా మంగళవారం ఈ భూమిని రొయ్యల చెరువుగా మార్చేందుకు మార్కింగ్ ఇచ్చారు.
ప్రభుత్వ భూమిని యథేచ్ఛగా ఆక్రమించి చెరువులుగా తవ్వేందుకు ప్రయత్నిస్తున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడంపై స్థానిక అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన భూసేకరణ నోటిఫికేషన్‌లో సర్వే నంబరు 248లో ఈ భూమిని కూడా చేర్చారని స్థానికులు చెబుతున్నారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించుకోవటమే కాక విక్రయించి చెరువులుగా తవ్వేందుకు స్థానిక ప్రజాప్రతినిధి ప్రయత్నాలు ప్రారంభించారని, దీన్ని అడ్డుకుంటామని క్యాంప్‌బెల్‌పేట మత్స్యకారులు అంటున్నారు. అవసరమైతే ఈ విషయంపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. ఇటీవల భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేసిన సమయంలో ప్రజాప్రతినిధి ఆక్రమించుకున్న భూమి ప్రభుత్వానికి చెందినదని పంచాయతీ కార్యాలయం వద్ద నోటీసు బోర్డులోనూ ఉంచారని
గ్రామస్తులు పేర్కొన్నారు.