పంచాయతీ కార్యదర్శుల మధ్య పోస్టింగ్‌ల వివాదం తారా స్థాయికి చేరింది. వర్గాలుగా విడిపోయి ఒకరిపై మరొకరు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసుకునే వరకు వెళ్లింది.
జిల్లా పంచాయతీ, పంచాయతీ రాజ్ శాఖలో పని చేస్తున్న కొందరు జూనియర్ అసిస్టెంట్లు, ఇప్పటికే గ్రేడ్-3 గ్రామ పంచాయతీ కార్యదర్శులుగా పని చేస్తున్న 22 మందికి ఇటీవల గ్రేడ్-2 కార్యదర్శులుగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పదోన్నతి పొందిన వారిలో కొంత మంది ప్రస్తుతం ఖాళీగా వున్న గ్రేడ్-1 పంచాయతీల్లో నియమించాలని కోరడంతో పంచాయతీ అధికారులు ఆ మేరకు నియామకాలు చేపట్టేందుకు రంగం సిద్ధం చేశారు.
అందుకు గ్రేడ్-1 గ్రామ పంచాయతీ కార్యదర్శులు అభ్యంతరం వ్యక్తం వ్యక్తం చేయడంతో వర్గాలుగా విడిపోయారు. రూ.5 లక్షల పైబడి ఆదాయం ఉన్న 61 గ్రామ పంచాయతీలను గుర్తించి గ్రేడ్-1 క్లస్టర్లుగా, రూ.2 నుంచి 3 లక్షల లోపు ఆదాయం ఉన్న 39 పంచాయతీలను గ్రేడ్-2 క్లస్టర్లుగా, రూ.లక్ష నుంచి 2 లక్షల లోపు ఆదాయం ఉన్న 231 పంచాయతీలను గ్రేడ్-3 క్లస్టర్లుగా, లక్ష రూపాయల లోపు ఆదాయం ఉన్న 661 గ్రామ పంచాయతీలను గ్రేడ్-4 క్లస్టర్లుగా గుర్తించారు.
అయితే ప్రస్తుతం గ్రేడ్-2 కార్యదర్శులుగా పదోన్నతి పొందిన వారిలో 17 మందిని గ్రేడ్-1 క్లస్టర్‌గా గుర్తించిన గ్రామాలకు కార్యదర్శులుగా నియమించేందుకు జిల్లా పంచాయతీ అధికారులు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. అయితే గ్రేడ్-2 కార్యదర్శులను గ్రేడ్-1 కింద ఎంపిక చేసిన గ్రామాల్లో నియమిస్తే భవిష్యత్తులో తమకు అన్యాయం జరిగే అవకాశం ఉందని ఈ విషయంలో పునరాలోచించుకోవాలని జిల్లా పంచాయతీ అధికారులను కలిసి విజ్ఞప్తి చేస్తున్నా.. అక్కడి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో.. అక్రమ నియామకాలకు అడ్డుకట్ట వేసి తమకు న్యాయం చేయాలని కోరుతూ కొంతమంది గ్రేడ్-1 కార్యదర్శులు జిల్లా పరిషత్ సీఈఓ విజయేందిరని కలిసి విన్నవించినట్లు తెలిసింది.