సాక్షి, కొత్తగూడెం: నాగార్జున సాగర్ ఆయకట్టు పరిధిలో ఏటా కష్టాల సాగే. ఖరీఫ్‌లో వేసిన వరి అకాల వర్షాలతో రైతుల చేతికందకుండా పోయింది. అయితే రబీలో కూడా వరి పంట ముమ్మరంగా సాగు చేస్తున్నా.. వార బందీ విధానంతో ఈసారైనా చేతికి వచ్చేనా..? అని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఆరుతడులకే సాగర్ నీరు ఇస్తుండడంతో జిల్లాలోని చి‘వరి’ ఆయకట్టుకు నీరందడం కష్టమేనని అంటున్నారు.
రబీ సీజన్‌లో సాగర్ ఆయకట్టు పరిధిలో జిల్లాలో 70,394 ఎకరాల్లో వరి సాగవుతోంది. ముదిగొండ, ఖమ్మం రూరల్, రఘునాధపాలెం(ఖమ్మం అర్బన్), కొణిజర్ల, నేలకొండపల్లి, వైరా, బోనకల్లు, కూసుమంచి, పెనుబల్లి, కల్లూరు, చింతకాని మండలాల్లో జోరుగా వరి నాట్లు వేస్తున్నారు. రబీలో వరి కాకుండా ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని సంబంధిత అధికారులు పలుమార్లు ప్రకటించినా.. సాగర్‌లో సరిపడా నీరు ఉండడంతో రైతులు వరి పంటకే మొగ్గు చూపారు.
నాగార్జున సాగర్ ఆధునికీకరణ పేరుతో గత రెండేళ్లుగా రబీలో జిల్లా ఆయకట్టుకు నీరు విడుదల చేయడం లేదు. దీంతో రైతులు పంటలు కోల్పోయారు. ఖరీఫ్‌లో నీరు విడుదల చేసినా పంట చేతికి అందే సమయానికి వచ్చిన వర్షాలతో.. ధాన్యం కల్లాల్లోనే తడవడం, వరి పనలు పూర్తిగా నీటిలో మునగడంతో తీవ్రంగా నష్టపోయారు. ఈ పరిస్థితుల్లో ఈ రబీపైనే వారు గంపెడాశలు పెట్టుకున్నారు. అప్పుచేసి మరీ.. వరి నాట్లు వేస్తున్నారు.
అయితే సాగర్ ఆయకట్టుకు ఆరుతడులకు మాత్రమే నీరు ఇస్తున్నట్లు ఎన్నెస్పీ అధికారులు ప్రకటించడంతో ఇప్పుడు వారిలో ఆందోళన మొదలైంది. రబీ వరికి అంతరాయం లేకుండా కనీసం మూడు నెలలకు పైగా నీరు విడుదల చేస్తేనే పంట చేతికి వస్తుంది. అయితే ఆరుతడుల ప్రకారం రెండు నెలలు మాత్రమే నీరు అందనుంది.
వార బందీతో చిక్కులే..
నాట్లు మొదలుకొని చేతికి వచ్చే వరకు వరి పంటకు అంతరాయం లేకుండా నీరు ఉండాలి. ఆరుతడులతో కలుపు పెరగడమే కాకుండా పంట ఎదుగుదల ఉండదు. ప్రస్తుతం ఆరుతళ్ల ప్రకారం ఫిబ్రవరి 3 వరకు, మళ్లీ ఫిబ్రవరి 9 నుంచి 18 వరకు, 24 నుంచి మార్చి 5 వరకు, 11 నుంచి 20 వరకు, 26 నుంచి ఏప్రిల్ 4 వరకు నీరు విడుదల చేస్తారు.
మధ్య మధ్యలో ఐదు నుంచి వారం రోజుల వరకు విడుదలకు బ్రేక్ పడుతుంది. ఇలా నీరు విడుదల చేస్తే వరి పంట చేతికి రావడం కష్టమేనని రైతులు ఆందోళన చెందుతున్నారు. వార బందీతో గతంలో బోనకల్, ఎర్రుపాలెం, మధిర, కల్లూరు, చింతకాని మండలాల్లో చివరి ఆయకట్టుకు నీరందక సాగు చేసిన వరి నిలువునా ఎండిపోయింది. దీంతో ఆ పంట పశువుల మేతకు మాత్రమే ఉపయోగపడింది. ఇలా నష్టపోయిన రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. ఇప్పుడు కూడా ఇదే పరిస్థితి రానుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారబందీతో ఎర్రుపాలెం మండలంలో నీటి కోసం రైతులు ఘర్షణ పడిన ఘటనలు సైతం ఉన్నాయి.
అధికారుల అనాలోచిత నిర్ణయం...
సాగర్‌లో రబీ సాగుకు సరిపడా నీరున్నా సంబంధిత అధికారులు మాత్రం వరి సాగుకు అంతరాయం లేకుండా విడుదల చేయడానికి మీనమేషాలు లెక్కిస్తున్నారు. వరి కాకుండా ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని సూచిస్తూ చేతులు దులుపుకుంటున్నారు.
గత పరిస్థితుల నేపథ్యంలో రైతులు వరి సాగుకే సిద ్ధమైనా నీటి విడుదలకు కొర్రీలు పెడుతుండడం గమనార్హం. ప్రస్తుతం ఆధునికీకరణ పనులు జరగడం లేదు. రబీ సాగు పూర్తయిన తర్వాతే ఈ పనులు మళ్లీ ప్రారంభం కానున్నాయి. ఈ సీజన్‌లో ఆరు తడులు కాకుండా సరిపడా నీరు ఇస్తేనే వరి పంట చేతికి అందే అవకాశం ఉన్నా.. అధికారులు ఇదేమీ పట్టించుకోవడం లేదు.
వచ్చేనెల 15 వరకు వరినాట్లు జరగనున్నాయి. కానీ ఈ మధ్యలో మరో ఐదు రోజులు నీటి విడుదల నిలిపివేస్తుండడంతో వరి నాటు వేయడానికి కష్టమైతే, నాటు వేసిన పొలాలకు వెంటనే నీరందక తొలి దశలోనే ఎండిపోయే ప్రమాదం ఉంది.
రబీ.. వార‘బందీ’.. చి‘వరి’కి కష్టమే..!
Published Mon, Jan 20 2014 4:03 AM | Last Updated on Fri, Oct 19 2018 7:19 PM
Advertisement