కొత్తగూడెం మండలంలోని హౌజింగ్ బోర్డు వద్ద ఉన్న మహానేత వైఎస్ విగ్రహానికి ఆదివారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు డీజిల్ చల్లి నిప్పంటించారు.
కొత్తగూడెంలో వైఎస్ విగ్రహానికి నిప్పు
Published Mon, Sep 9 2013 2:44 AM | Last Updated on Sat, Jul 7 2018 3:19 PM
కొత్తగూడెం రూరల్, న్యూస్‌లైన్:కొత్తగూడెం మండలంలోని హౌజింగ్ బోర్డు వద్ద ఉన్న మహానేత వైఎస్ విగ్రహానికి ఆదివారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు డీజిల్ చల్లి నిప్పంటించారు. ఈ ఘటనలో వైఎస్ విగ్రహం కొంత మేర కాలి మసిబారింది. ఈ విషయం తెలుసుకున్న వన్‌టౌన్ పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. అనంతరం వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వకర్త, సీఈసీ సభ్యులు ఎడవల్లి కృష్ణ ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్ సీపీ విగ్రహం వద్దకు చేరుకున్నారు. విగ్రహానికి ఉన్న డీజిల్‌ను తొలగిం చారు. అనంతరం ఎడవల్లి కృష్ణ ఆధ్వర్యంలో వైఎస్ విగ్రహానికి క్షీరాభిషేకం చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎడవల్లి కృష్ణ మాట్లాడుతూ మహానేత విగ్రహాలకు నిప్పు పెట్టడం పిరికిపంద చర్య అని అన్నారు. తెలంగాణ ముసుగులో కొందరు దుండగులు వైఎస్ విగ్రహాలకు నిప్పు పెడుతున్నారని ఆరోపించారు. పేదల సంక్షేమం కోసం మహానేత అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని ఆయన గుర్తు చేశారు. అటువంటి మహానుభావుడి విగ్రహానికి నిప్పుపెట్టడం ఎంతవరకు సమంజసమని అన్నారు. వైఎస్సార్‌సీపీ తెలంగాణకు వ్యతిరేకం కాదని అన్నారు. మేము తెలంగాణ బిడ్డలమేనని, వైఎస్సార్‌సీపీ తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం ఎస్టీ సెల్ జిల్లా కన్వీనర్ భూక్యా దళ్‌సింగ్ మాట్లాడుతూ వైఎస్సార్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం సరైంది కాదని అన్నారు. ఇటువంటి చర్యలకు పాల్పడితే వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని అన్నారు.
అనంతరం ఎడవల్లి కృష్ణ ఆధ్వర్యంలో పోస్టాఫీస్ సెంటర్ నుంచి వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ వరకు ప్రదర్శనగా వెళ్లి సీఐ నరేష్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. సీఐ మాట్లాడుతూ త్వరగా విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ పట్టణ కన్వీనర్ భీమా శ్రీధర్, మండల కన్వీనర్ తాళ్లూరి శ్రీనివాస్, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు యర్రంశెట్టి ముత్తయ్య, పీక కృష్ణ, రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యులు జక్కం సీతయ్య, రాష్ట్ర లీగల్ సెల్ నాయకులు సాధిక్ షాషా, వైఎస్సార్ సీపీ నాయకులు తాండ్ర నాగబాబు, నాగుల శేఖర్, కందుల సుధాకర్‌రెడ్డి, బాలరెడ్డి లింగం సత్యనారాయణ రెడ్డి, తీట్ల భాస్కర్, ఎర్పుల సుధాకర్‌రావు, ఏలూరి రాజేష్, వీరభద్రం, భాస్కర్‌రావు, రాములు, జామ్లా నాయక్, ఫ్రాన్సిస్, నాగరాజు, శ్రీను పాల్గొన్నారు.
Advertisement
Advertisement