ఇడుపులపాయలో దివంగత సీఎం డా. వైఎస్ రాజశేఖరరెడ్డి ఘాట్ వద్ద నివాళులర్పిస్తున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, విజయమ్మ, భారతి తదితరులు
ఇడుపులపాయలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక ప్రార్థనలు
కష్టాలు కొద్దికాలమే... దేవుడి దయతో ధైర్యంగా ఎదిరిద్దాం
75వ జయంతి వేడుకలకు రాష్ట్రవ్యాప్తంగా పోటెత్తిన అభిమానులు, కార్యకర్తలు
సాక్షి కడప: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 75వ జయంతిని పురస్కరించుకుని సోమవారం వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయకు జనవాహిని పోటెత్తింది. రాష్ట్రవ్యాప్తంగా తరలి వచ్చిన అభిమానులు వైఎస్సార్ ఘాట్ వద్ద ఘన నివాళులర్పించారు. ముందుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన మాతృమూర్తి వైఎస్ విజయమ్మ, సతీమణి వైఎస్ భారతీరెడ్డి, మేనత్త వైఎస్ విమలమ్మ, చిన్నాన్న వైఎస్ సుధీకర్‌రెడ్డి, అత్తమ్మ ఈసీ సుగుణమ్మ, కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డితో కలసి ఇడుపులపాయలో వైఎస్సార్‌కు నివాళులర్పించారు. సమాధి ఘాట్‌కు పూలమాలలు వేసి నివాళులర్పించిన వైఎస్ జగన్ కాసేపు అక్కడే మోకాళ్లపై కూర్చొని తండ్రిని స్మరించుకున్నారు. నివాళులర్పించే సమయంలో వైఎస్ విజయమ్మ భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు.
ప్రత్యేక ప్రార్థనలు..
సమాధి ఘాట్ వద్ద వైఎస్ జగన్, వైఎస్సార్ కుటుంబ సభ్యులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. రానున్న కాలంలో కొన్ని సమస్యలు ఎదురైనా రాజశేఖరరెడ్డి స్ఫూర్తితో జగన్ ధైర్యంగా ఎదుర్కొనేలా దేవుడు ఆశీర్వదించాలని మేనత్త విమలమ్మ ప్రార్థన చేశారు. కష్టాలు తాత్కాలికమేనని, ఎన్ని ఇబ్బందులు వచ్చినా దేవుడి మీద భారం వేసి ముందుకు వెళ్లడం ద్వారా ఎదిరించే శక్తిని ప్రసాదిస్తాడని చెప్పారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు వైఎస్సార్, వైఎస్ జగన్ చేసిన మంచిని ప్రస్తావించారు. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా పలమనేరుకు చెందిన రమేష్, హేమ దంపతులు వైఎస్ జగన్‌ను కలిసి తమ మూడు నెలల చిన్నారికి పేరు పెట్టాలని కోరగా విజయశ్రీగా నామకరణం చేశారు.
వైఎస్సార్ విగ్రçహం వద్ద నివాళులు..
ఇడుపులపాయలోని ఘాట్ ప్రాంగణంలో వైఎస్సార్ విగ్రహానికి వైఎస్ జగన్ పూలమాల వేసి నివాళులర్పించారు. కొద్దిసేపు అక్కడే నిలబడి వైఎస్సార్‌ను స్మరించుకున్నారు. వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతిరెడ్డి, విమలమ్మ, వైఎస్ సుధీకర్‌రెడ్డి తదితరులు పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, అరకు, తిరుపతి ఎంపీలు తనూజారాణి, గురుమూర్తి, వైఎస్సార్, అన్నమయ్య జిల్లాల పార్టీల అధ్యక్షులు కె.సురేష్‌బాబు, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ఆకేపాటి అమర్‌నాథరెడ్డి, డాక్టర్ సుధ, టి.చంద్రశేఖర్, ఎమ్మెల్సీలు రమేష్ యాదవ్, రామచంద్రారెడ్డి, గోవిందరెడ్డి, మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్, మాజీ ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, పోచిమరెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి, రఘురామిరెడ్డి, రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీలు ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి, ఆర్టీసీ మాజీ చైర్మన్ అబ్బిరెడ్డి మల్లికార్జునరెడ్డి, రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, సంబటూరు ప్రసాద్‌రెడ్డి, జడ్పీ చైర్మన్ శారదాదేవి, పులివెందుల మాజీ మున్సిపల్ చైర్మన్ వైఎస్ ప్రమీలమ్మ, వైఎస్ మ«ధురెడ్డి సతీమణి వైఎస్ మాధవి, వైఎస్సార్‌సీపీ నాయకులు యువరాజ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పురుషోత్తమరెడ్డి కుమారుడు థామస్‌రెడ్డి, స్టాన్లీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అందరికీ అభివాదం.. అభిమానులతో సెల్ఫీ
ఇడుపులపాయలో వైఎస్సార్ సమాధి ఘాట్ ప్రాంగణానికి తరలి వచ్చిన జనవాహినికి వైఎస్ జగన్ అభివాదం చేశారు. వైఎస్సార్ అమర్‌రహే, వైఎస్ జగన్ నాయకత్వం వర్థిల్లాలి అంటూ నినాదాలతో ఘాట్ ప్రాంగణం హోరెత్తింది. పలువురి వద్దకు స్వయంగా వెళ్లి పలుకరించిన వైఎస్ జగన్ అడిగిన వారందరితో సెల్ఫీ దిగారు. భారీగా వచ్చిన ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. మూడు రోజుల జిల్లా పర్యటన ముగించుకుని అనంతరం అక్కడి నుంచి ఉదయం 11.10 గంటలకు గన్నవరం చేరుకున్న వైఎస్ జగన్‌కు విమానాశ్రయంలో పలువురు పార్టీ నేతలు ఘనస్వాగతం పలికారు.
మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కాపు కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ అడపా శేషు, గౌడ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ మాదు శివరామకృష్ణ గన్నవరం ఎయిర్‌పోర్టుకు వచ్చారు. గొల్లపూడి మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ కొమ్మ కోటేశ్వరరావు(కోట్లు), జడ్పీ కోఆప్షన్ సభ్యుడు ఎండీ గౌసాని, విజయవాడ రూరల్ ఎంపీపీ చెన్ను ప్రసన్నకుమారి, జడ్పీటీసీ కాకర్లమూడి సువర్ణరాజు, నిడమానూరు సర్పంచి శీలం రంగారావు, పార్టీ నాయకులు దేవభక్తుని చక్రవర్తి, అశోక్, మేచినేని బాబు, కాట్రు శేషు, రామిశెట్టి వెంకటేశ్వరరావు, సమ్మెట సాంబశివరావు, నిడమర్తి రామారావు, పలువురు విజయవాడ కార్పొరేటర్లు, కార్యకర్తలు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. వారందరినీ ఆప్యాయంగా పలకరించిన వైఎస్ జగన్ రోడ్డు మార్గంలో తాడేపల్లికి బయలుదేరారు.
Comments
Please login to add a commentAdd a comment