సాక్షి, కొత్తగూడెం: రైల్వేమంత్రి బుధవారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌లో జిల్లాకు మొండి‘చేయి’ చూపించారు. గతంలో ప్రకటించిన ప్రాజెక్టులకు నిధులు విడుదల చేయకపోగా జిల్లాకు ప్రయోజనకరమయ్యే పలు ప్రతిపాదనలను పక్కన పెట్టారు. కనీసం భద్రాచలంరోడ్డు- కొవ్వూరు రైల్వే లైన్ సర్వేకు కూడా నిధులు విదల్చలేదు. జిల్లావాసులను ఈ బడ్జెట్ తీవ్ర నిరాశ పరిచింది.
ఈ ప్రభుత్వం మధ్యంతర రైల్వే బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం, త్వరలో ఎన్నికలు రానుండడంతో జిల్లా ప్రజలు పెండింగ్ ప్రాజెక్టులపై ఆశలు పెట్టుకున్నారు. కానీ వారి ఆశలపై రైల్వేశాఖ మంత్రి మల్లికార్జునఖర్గే నీళ్లుచల్లారు. ఈ బడ్జెట్‌లో కొంతైనా జిల్లాకు వాటా దక్కలేదు. దక్షిణ అయోధ్యగా పేరొందిన భద్రాచలానికి దేశవ్యాప్తంగా ప్రాచుర్యం కల్పించడంలో రైల్వేశాఖ మీనమేషాలు లెక్కిస్తోంది. భద్రాద్రికి చేరువయ్యే... పాండురంగాపురం నుంచి సారపాక వరకు రైల్వేలైన్ పొడిగింపు ప్రతిపాదన ఏళ్లుగా పెండింగ్‌లోనే ఉంటోంది.
ఈ లైన్ మంజూరుకు ఏటా ఏలికలు ఇస్తున్న హామీలు నీటిమూటలే అయ్యాయి. ఈ బడ్జెట్‌లోనూ రిక్తహస్తమే చూపారు. కొత్తగూడెం-కొవ్వూరు రైల్వే లైన్ ఐదు దశాబ్దాలుగా ముందుకు నడవడంలేదు. ప్రతి బడ్జెట్‌లో ఈ లైన్ సర్వేకే పరిమితమైంది. రూ. 950 కోట్ల ఈ ప్రాజెక్టుకు రూ.100 కోట్లు కేటాయించినా ఇప్పటి వరకు వీటిని మంజూరు చేయకపోవడంతో పనులు ప్రారంభం కాలేదు. ఈ రైల్వేలైన్ కోసం జిల్లా ప్రజలు ఆందోళనలు చేసినా ఫలితం లేకుండా పోయింది.
భద్రాచలం రోడ్డు నుంచి సత్తుపల్లి వరకు 56 కిలోమీటర్ల రైల్వేలైన్‌కు మొత్తం రూ. 337 కోట్లు అవసరం ఉంది. గత రెండు బడ్జెట్లలో రూ.5.10 కోట్లు మాత్రమే కేటాయించారు. ఈసారి అసలు నిధుల ఊసే లేకపోవడంతో ఇప్పట్లో ఈ ప్రాజెక్టు పనులు పూర్తయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. జిల్లాలోని పలు ఆర్వోబీల నిర్మాణంపై కూడా ఈ రైల్వేబడ్జెట్‌లో ప్రస్తావన లేదు.
డోర్నకల్-మిర్యాలగూడ రైల్వేలైన్ నిర్మాణానికి ప్రతిపాదన ఉన్నా.. దీన్ని కేంద్రం పట్టించుకోలేదు. కాజీపేట మీదుగా విజయవాడ సికింద్రాబాద్- విశాఖ (ఏసీ) ఎక్స్‌ప్రెస్ రైలు కొత్తగా జిల్లాలోని ఖమ్మం స్టేషన్ మీదుగా వెళ్లడం ప్రయాణికులకు కొంత ఊరట కలిగిస్తోంది. ఇది కూడా వారంలో ఒక రోజు మాత్రమే వస్తుంది.
కాగా, జిల్లాకు ఏమాత్రం ఆశాజనకంగా లేని ఈ బడ్జెట్‌పై ప్రజానీకం పెదవివిరుస్తున్నారు. ఈసారి జిల్లాలో రైల్వేలైన్ల సర్వేకు నిధులు మంజూరు చేయిస్తామని ఎంపీలు పలుమార్లు ఇచ్చిన హామీలు గాలిలో కలిసిపోయాయని విమర్శిస్తున్నారు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న రైల్వే లైన్లకు నిధులు తీసుకురావడంలో ఎంపీలు విఫలమయ్యారని జిల్లా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మళ్లీ నిరాశే..
Published Thu, Feb 13 2014 2:23 AM | Last Updated on Mon, Oct 8 2018 9:17 PM
Advertisement
Advertisement