వ్యవసాయ మార్కెట్లు వెలవెల | no facilities agricultural markets | Sakshi
Sakshi News home page

వ్యవసాయ మార్కెట్లు వెలవెల

Published Sun, Dec 15 2013 3:25 AM | Last Updated on Fri, Aug 17 2018 5:24 PM

no facilities agricultural markets

సాక్షి, కొత్తగూడెం:  రైతులకు అన్నిచోట్ల కష్టాలే... ఆటుపోట్లను ఎదుర్కొని పండిచిన పంటను విక్రయించే చోట కూడా రైతును సమస్యలు వెంటాడుతున్నాయి. కనీసం తాగడానికి మంచినీళ్లు కూడా లేని స్థితిలో జిల్లాలో వ్యవసాయ మార్కెట్లు ఉన్నాయి. రైతు విశ్రాంతి భవనాలు, పంట ఉత్పత్తులు పోసే ప్లాట్‌ఫాంలు శిథిలావస్థకు చేరుకున్నా...ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో పట్టించుకునే దిక్కులేదు.  జిల్లా వ్యాప్తంగా అన్ని మార్కెట్లలో ఇదే పరిస్థితి నెలకొంది.
 జిల్లాలో 13 వ్యవసాయ మార్కెట్‌లున్నాయి. ఖమ్మం, నేలకొండపల్లి, మధిర, వైరా, ఇల్లెందు, ఏన్కూరు, కొత్తగూడెం, బూర్గంపాడు, భద్రాచలం, చర్ల, కల్లూరు, సత్తుపల్లి, దమ్మపేటలో ఈ మార్కెట్‌లున్నాయి. వివిధ కేటగిరీల్లో ఈ మార్కెట్లలో మొత్తం 130 పోస్టులకుగాను 58 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఖమ్మం, వైరా, నేలకొండపల్లి, దమ్మపేట వ్యవసాయ మార్కెట్లకు పాలక వర్గాలు ఉండగా, మిగిలిన మార్కెట్‌లకు లేవు. ఖమ్మం, నేలకొండపల్లి మార్కెట్లకు పూర్తి స్థాయి అధికారులుండగా మిగతా మార్కెట్లు ఇన్‌చార్జిల పాలనలోనే సాగుతున్నాయి. జిల్లాలో వ్యవసాయ మార్కెట్లు ఏర్పాటు చేసి ఏళ్లు గడుస్తున్నా ఏ మార్కెట్‌లోనూ పూర్తి స్థాయిలో రైతులకు కావాల్సిన సౌకర్యాలు లేకపోవడం గమనార్హం. విశ్రాంతి భవనాలు, తాగునీటి వసతి, భోజన హోటళ్లు వంటి సౌకర్యాలు లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
 ఈ మార్కెట్లకు రైతులు ప్రధానంగా పత్తి, మిర్చి, అపరాలు, మొక్కజొన్న పంట ఉత్పత్తులను అమ్మకానికి తీసుకురావాలి. కానీ కొన్ని మార్కెట్లలో వసతులు లేకపోవడంతో అసలు కొనుగోళ్లే జరపడం లేదు. రైతులు కూడా మార్కెట్‌కు వెళ్తే గిట్టుబాటు ధర అందదని, సౌకర్యాలు ఉండవన్న కారణంతో అటువైపు అడుగుపెట్టడం లేదు. పత్తి కొనుగోళ్లకు సంబంధించి ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్లు లేకపోవడంతో రైతులు మార్కెట్లలో నిలువునా మోసపోతున్నారు.
     జిల్లా కేంద్రమైన ఖమ్మంలోనే వ్యవసాయ మార్కెట్ పరిస్థితి దారుణంగా ఉంది.   ఇక్కడ రైతు విశ్రాంతి భవనం మరమ్మతులకు నోచుకోకపోవడంతో  శిథిలావస్థకు చేరుకుంది. మంచినీటి వసతి లేక రైతులు అవస్థలు అన్నీఇన్నీ కాదు. ఉన్న ట్యాంకుకు మరమ్మతులు చేయలేదు. మార్కెట్ యార్డుల్లో ఉన్న పంపులకు ట్యాప్‌లు పనిచేయడం లేదు. మార్కెట్ నిండా చెత్తా చెదారం పేరుకుపోయింది. యార్డుల్లో ఉన్న మూత్రశాలలు కంపుకొడుతున్నాయి. మార్కెట్‌లో అనుకోని పరిస్థితుల్లో అగ్నిప్రమాదాలు జరిగితే మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక కేంద్రాన్ని నిర్మించారు. అయితే ఇక్కడ ఇంకా ఫైరింజన్‌ను ఏర్పాటు చేయలేదు. ఎలక్ట్రానిక్ బిడ్డింగ్ ఏర్పాటు చేసినప్పటికీ అధికారికంగా ప్రారంభించలేదు.
     దమ్మపేట మార్కెట్‌యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రం లేకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఈ మార్కెట్ పరిధిలో ములకలపల్లిలో గోదాం ఉన్నప్పటికి నిర్వహణ లేక అది నిరుపయోగంగా ఉంది. చండ్రుగొండలో గోదాం ఉన్నా అసలు విద్యుత్ సౌకర్యమే లేదు.  
     వైరాలో మార్కెట్ యార్డును అన్ని సదుపాయాలతో నిర్మించినప్పటికీ అక్కడ ధాన్యం, పత్తి కొనుగోళ్లు చేపట్టడం లేదు. రైతులు ధాన్యం నిల్వ చేసుకునేందుకు  ఏడాది క్రితం రూ.13 కోట్లతో నిర్మించిన గోదాంలు నిరుపయోగంగా మారాయి. అంతేకాకుండా ఇక్కడి వేబ్రిడ్జి మూలన పడింది. పంటల ధరలు, తదితర అంశాలపై అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన రైతు సలహా కేంద్రంలో ఒక్క రోజు కూడా అధికార్లు కనిపించిన పాపాన పోలేదు. మూత్రశాలలు  పిచ్చిమొక్కలతో దర్శనమిస్తున్నాయి.
     ఏన్కూరు మార్కెట్ యార్డులో కేవలం ప్లాట్‌ఫాంలు మాత్రమే నిర్మించారు. గోదాంల  నిర్మాణం ఇంకా చేపట్టలేదు. రైతులు విశ్రాంతి తీసుకునేందుకు భవనం లేదు. తాగునీరు, మరుగుదొడ్డి సౌకర్యం లేదు. నిర్వహణ లేక ఇక్కడ ఉన్న వేబ్రిడ్జి శిథిలావస్థకు చేరింది. మార్కెట్‌లో సీసీ రోడ్లు నిర్మించకపోవడంతో మార్కెట్ అంతా గుంతలమయంగా మారింది.
     నేలకొండపల్లి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌లో పత్తి, ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇక్కడికి వచ్చే రైతులు విశ్రాంతి తీసుకునేందుకు భవనం ఉన్నప్పటికీ వసతులు లేక అది నిరుపయోగంగా ఉంది. రైతులు ధాన్యం నిల్వ చేసేందుకు నిర్మించిన గోదాంలను స్టోర్‌రూం గా ఉపయోగిస్తున్నారు. మార్కెట్‌లో ఉన్న యంత్రాలు తుప్పుపడుతున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. మార్కెట్‌లో విద్యుత్ సరఫరా చేసే స్తంభాలకు తీగలు వేలాడి ప్రమాదకరంగా మారాయి.
     బూర్గంపాడులోని వ్యవసాయ మార్కెట్ పరిధిలో మణుగూరు, పినపాక, గుండాల అశ్వాపురం మండల కేంద్రాల్లో గోదాంలు నిర్మించారు. అయితే ఇక్కడ సరైన వసతులు లేకపోవడంతో కొనుగోళ్లు జరగడం లేదు. ఈ గోదాంలను గ్యాస్‌గోదాంలు, చౌకధరల దుకాణాల నిల్వలకు ఉపయోగిస్తున్నారు.
     ఇల్లెందు మార్కెట్ యార్డులో దళారులు ఇష్టారాజ్యంగా తక్కువ ధరకు పంట ఉత్పత్తులు కొనుగోలు చేస్తుండడంతో రైతులు ఈ మార్కెట్‌కు ఎక్కువగా రావడం లేదు. ఈ విషయంలో అధికారులు స్పందించకపోవడంతో యార్డులోని గోదాంలు, ఫ్లాట్ ఫాంలు శిథిలావస్థకు చేరుతున్నాయి. ఈ యార్డు పరిధిలో టేకులపల్లిలో గోదాం ఉన్నా అది కూడా నిరుపయోగంగా మారింది.
     సత్తుపల్లి మార్కెట్‌యార్డుకి ఏటా రూ. కోటికి పైగా, కల్లూరు మార్కెట్‌కు రూ. కోటిన్నరకు పైగా సెస్ రూపంలో ఆదాయం వస్తోంది. మార్కెట్‌కు తీసుకొచ్చిన పంటలకు సరైన ధర కల్పించకపోవడంతో ప్రస్తుతం ఇక్కడి రైతులు అమ్మకానికి పంటలను ఎక్కువగా తీసుకురావడం లేదు. దీంతో రైతు విశ్రాంతి భవనాలు నిరుపయోగంగా మారాయి. గతేడాది రూ. లక్షలు ఖర్చుపెట్టి నిర్మించిన ప్లాట్‌ఫాంలు పిచ్చిమొక్కలతో నిండాయి.      
     మధిర వ్యవసాయ మార్కెట్‌యార్డులో  పత్తి మార్కెటింగ్ భవనం, వేబ్రిడ్జి నిరుపయోగంగా ఉన్నాయి. అప్పుడప్పుడు మిర్చి కొనుగోళ్లు జరుగుతున్నప్పటికీ రైతులకు తాగునీటి సౌకర్యంలేదు. మూత్రశాలలు, మరుగుదొడ్లు, రైతుసేవాకేంద్రం రైతులకు అందుబాటులో లేవు.
     కొత్తగూడెం మార్కెట్‌యార్డులో రైతులకు విశ్రాంతిగదులు లేవు.., తాగునీటి సౌకర్యం లేదు. మరుగుదొడ్లు, మూత్రశాలలు లేకపోవడంతో రైతులు అనేక అవస్థలు పడుతున్నారు. రైతులు పండించిన అపారాలు, ధాన్యం, మొక్కజొన్నల నిల్వచేసేందుకు గోదాంలు ఉన్నాయి.. కానీ వాటిలో రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసిన ఉత్పత్తులను వ్యాపారులే  నిల్వ చేసుకుంటున్నారు.
     భద్రాచలం మార్కెట్ యార్డులో రైతులకు తాగునీటి సౌకర్యం లేదు. అసలు ఇక్కడ విశ్రాంతి భవనమే లేదు. చర్లలో మార్కెట్ కమిటీ యార్డు దూరంగా ఉండడంతో రైతులు ఇక్కడికి ధాన్యాన్ని తీసుకురావడం లేదు. దీన్ని గిరిజన సహకార సంస్థకు అద్దెకు ఇచ్చారు. దీంతో మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో కొనుగోళ్లే జరగడం లేదు. ఐకేపీ, ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement