సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి బొగ్గు గనుల్లో పని చేయడమంటే కత్తి మీద సామేనని చెప్పాలి. ప్రకృతికి విరుద్ధంగా గాలి, వెలుతురు లేక విధులు నిర్వర్తించాల్సిన పరిస్థితి. దీంతో వయస్సు పెరిగే కొద్ది కార్మికులు అవస్థ పడుతుంటారు. తద్వారా సంస్థ లక్ష్యసాధనలో ఆటంకాలు ఎదురవుతున్నాయని గుర్తించారు. దీనిని సరిదిద్దేందుకు సింగరేణి కార్మికుల కుటుంబాల్లో యువతను తీసుకుంటే సంస్థ లక్ష్యాలు చేరడమే కాకుండా యువతకు ఉపాధి లభిస్తుందని భావించారు.
ఈమేరకు తెలంగాణ ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో పలు దఫాలుగా వారసత్వ(కారుణ్య) ఉద్యోగాలకు అవకాశం కల్పించారు. ఇందులో భాగంగా 82 మార్లు నిర్వహించిన మెడికల్ బోర్డు పరీక్షలకు 13,727 మంది హాజరుకాగా 9వేల మంది కార్మికుల పిల్లలకు సింగరేణి వ్యాప్తంగా ఉద్యోగాలు ఇచ్చారు. అయితే, వారసత్వ ఉద్యోగాలు పొందిన వారి పనితీరు సరిగ్గా లేక సంస్థ ఆశించిన ప్రయోజనాలు నెరవేరడం లేదు.
గైర్హాజరుతో తలనొప్పి
వారసత్వ ఉద్యోగాలు పొందిన వారితో సంస్థ అభివృద్ధి విషయం పక్కన పెడితే వారు ఉద్యోగాన్ని నిలుపుకునే పరిస్థితులు కూడా లేవని చెబుతున్నారు అధికారులు. సింగరేణి వ్యాప్తంగా సుమారు 4వేల కార్మికులు గైర్హాజరవుతుండుగా, ఇందులో అధిక శాతం కొత్తగా కారుణ్య నియామకాల ద్వారా వచ్చిన వారేనని అధికారిక సమాచారం. సింగరేణి వ్యాప్తంగా 11 ఏరియాల్లోని 25 భూగర్భ గనులు, 20 ఓపెన్‌కాస్ట్ గనుల్లో సుమారు 43 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు.
వీరిలో 28 వేల మంది కార్మికులు గనుల్లో, మిగతా వారు ఓసీలతో పాటు ఇతర విభాగాల్లో పనిచేస్తున్నారు. ఇందులో సుమారు 4వేల మంది బదిలీ వర్కర్లుగా విధులు నిర్వర్తిస్తుండగా... నెలకు కనీసం 10 మస్టర్లు(ఒక రోజు విధులకు హాజరైతే ఒక మస్టర్‌గా పరిగణిస్తారు) కూడా చేయకపోవడం గమనార్హం.
కొత్తగూడెం ఏరియాలోనూ ఇదే పరిస్థితి
కొత్తగూడెం ఏరియాలోని అన్ని గనుల్లో కలిపి 3,200 మంది కార్మికులు పనిచేస్తుండగా, ఏరియాలోని పీవీకే – 5షాప్ట్ గనిలో 765 మందికి 100 మంది డిప్యూటేషన్ల పేరుతో వివిధ డిపార్ట్‌మెంట్లలో పనిచేస్తున్నారు. మిగిలిన 665 మందిలో కనీసం 300 మంది గైర్హాజరవుతున్నారు. ఒకవేళ హాజరైనా సుమారు 100 మస్టర్లు కూడా నమోదు కావడం లేదు. అయితే సింగరేణి నిబంధనల ప్రకారం అండర్ గ్రౌండ్‌లో పనిచేసే కార్మికుడు సంవత్సరంలో కనీసం 100 మస్టర్లు పనిచేయాలి.
అదేవిధంగా సర్పేస్ విభాగంలో పనిచేసే కార్మికుడు 190 మస్టర్లు పనిచేయాల్సి ఉంది. లేనిపక్షంలో వీరిని విధుల నుండి తొలగించే హక్కు సంస్థకు ఉంటుంది. ఇలా గత 20 ఏళ్లలో సుమారు 10 వేల మందిని ఉద్యోగాల నుంచి తీసేశారు కూడా. ఇక ప్రస్తుత పరిస్థితిని సరిదిద్దేందుకు యాజమాన్యం.. గుర్తింపు సంఘం సహకారంతో గతనెల 30న ఆయా కార్మిక కుటుంబాలకు కౌన్సెలింగ్ నిర్వహించింది.
అయినప్పటికీ కార్మికుల కుటుంబాల్లో ఉద్యోగం పోతుందనే బాధ లేకపోగా.. గైర్హాజరు అలాగే నమోదవుతుండడం గమనార్హం. ప్రస్తుతం సింగరేణి సంస్థలో 50 – 60 సంవత్సరాల వారు సుమారు 30శాతం మంది పనిచేస్తున్నారు. వీరందరూ రానున్న ఐదారేళ్లలో ఉద్యోగ విరమణ చేస్తే సింగరేణి పరిస్థితి ఏమిటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
తీరు మారడం లేదు...
గతంలో వారసత్వ నియమకాలు చేపట్టినా తర్వాత తీసేశారు. దీంతో కార్మికులకు పిల్లలకు ఉద్యోగాలు లేక కూలీనాలీ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కేసీఆర్ సీఎం అయ్యాక వారసత్వ ఉద్యోగాలను పునరుద్ధరించారు. అయితే ఉద్యోగం పొందిన కొందరు చక్కగా పని చేస్తుండగా.. మరికొందరు మాత్రం లేనిపోని కారణాలతో గైర్హాజరవుతున్నారు. యూనియన్ ఆధ్వర్యాన వీరికి కౌన్సెలింగ్ ఇచ్చినా ఫలితం లేదు.
– చిలక రాజయ్య, గని ఫిట్ సెక్రటరీ, గుర్తింపు సంఘం
ఎరక్షన్ చేయడమే వారికి కష్టమవుతోంది...
పీవీకే – ›5షాప్ట్‌లో ప్రస్తుతం గెయిన్‌వేర్ కంపెనీ వారే బొగ్గు ఉత్పత్తి చేసి 138 లెవల్, 35 డిప్ వద్ద పోస్తున్నారు. ఈ బొగ్గును బయటికి పంపేందుకు ఎరక్షన్ పని మాత్రమే బదిలీ వర్కర్లు చేయాలి. ఇది కూడా ఆరుగురు కలిసి చేయొచ్చు. అయితే, ఈ పని యువతకు కష్టమై విధులకు గైర్హాజరవుతున్నారు. వయసు ఉన్నప్పుడు కష్టపడాలని చెప్పినా ప్రయోజనం లేదు. ఈ పని చేస్తూనే ఇంటర్నల్ పరీక్షలు రాసి పదోన్నతి పొందే అవకాశం ఉన్నా పట్టించుకోవడం లేదు.
– పాలడుగు శ్రీనివాస్, గని మేనేజర్
అండర్ గ్రౌండ్ వాతావరణం పడడం లేదు
డిపెండెంట్ ఉద్యోగాల్లో చేరిన వారు ఉన్నత చదువులు చదివిన వారే. వీరికి గనుల్లో వాతావరణం పడక.. దుబ్బ, బురదలో నడవలేక విధులకు రెగ్యులర్‌గా రాలేకపోతున్నారు. అంతేకాకుండా వీరితో అపాయింట్‌మెంట్ అయిన వారిలో కొందరు పలుకుబడితో డిప్యూటేషన్ పేరిట లైట్ జాబ్‌లకు వెళ్లారు. దీంతో ఉన్న వారిపై పనిభారం పడుతోంది. నిబంధనలు అందరికీ ఒకేలా అమలు చేయలేని యాజమాన్యం ఈ విషయాన్ని కప్పిపుచ్చుతోంది.
– విజయగిరి శ్రీనివాస్, బ్రాంచ్ కార్యదర్శి, సీఐటీయూ
Comments
Please login to add a commentAdd a comment