Coal mining
-
సుప్రీం కోర్టు తీర్పు.. విద్యుత్ రేట్లు పెరుగుతాయా?
భారత అత్యున్నత న్యాయస్థానం ఇటీవల మైనింగ్ రాయల్టీ కేసును విచారించి తీర్పును వెలువరించింది. ఖనిజాలు, గనులు కలిగి ఉన్న భూమిపై పన్నులు విధించే అధికారం రాష్ట్రాలకు ఉందని సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. దాంతో మైనింగ్ కంపెనీలపై దాదాపు రూ.2 లక్షల భారం పడవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. భారతీయ మైనింగ్ రంగం ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అత్యధిక పన్ను రేట్లను ఎదుర్కొంటుందని భారతీయ ఖనిజ పరిశ్రమల సమాఖ్య (ఫిమి) పేర్కొంది. సుప్రీం కోర్టు తీర్పు వల్ల మైనింగ్, ఉక్కు, విద్యుత్, బొగ్గు రంగాల్లోని సంస్థలు గణనీయంగా ప్రభావితం అవుతాయని ఫిమి విచారం వ్యక్తం చేస్తుంది. బొగ్గుపైనే ఆధారపడి విద్యుత్ తయారు చేసుకునే రాష్ట్రాలు ఇతర దేశాల నుంచి బొగ్గు దిగుమతి చేసుకోవాలని యోచిస్తున్నాయి.సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం ఏప్రిల్ 1, 2005 నుంచి మైనింగ్ కంపెనీలు రాష్ట్రాలకు రాయల్టీలు చెల్లించాల్సి ఉంటుంది. ఖనిజాలు, గనులు ఎక్కువగా ఉన్న జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని కంపెనీలు దీనివల్ల ఎక్కువగా ప్రభావితం చెందుతాయి. బొగ్గు ఎక్కువ వెలికితీసి ఇతర రాష్ట్రాలకు సరఫరా చేసేది ఆ రాష్ట్రాలే. అయితే బొగ్గునే ఆధారంగా చేసుకుని విద్యుత్ తయారు చేసుకునే రాష్ట్రాలకు కోర్టు తీర్పుతో నష్టం జరిగే అవకాశం ఉందని కొందరు నిపుణులు భావిస్తున్నారు. రాష్ట్రాలకు రాయల్టీలు చెల్లించాలనే ఉద్దేశంతో కంపెనీలు బొగ్గు ధరను పెంచే ప్రమాదం ఉంది. అందుకు అనుగుణంగా రాష్ట్రాల ట్రాన్స్‌కోలు విద్యుత్ యూనిట్ ధరను పెంచుతాయి. అంతిమంగా సామాన్య ప్రజలపై భారం పడుతుంది. దాంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలపై స్థానిక ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది.ఇదీ చదవండి: రూ.30 వేలకోట్ల ప్రాజెక్ట్‌లకు కేబినెట్ ఆమోదంఇప్పటికే చాలా రాష్ట్రాలు వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల ప్రచారంలో భాగంగా కొన్ని రాష్ట్రాల్లో గృహావరాలకు సైతం ఉచితంగా విద్యుత్‌ను అందిస్తామని పార్టీలు హామీ ఇచ్చాయి. ఆ పార్టీలే అధికారంలోకి రావడంతో విద్యుత్ సరఫరా భారంగా మారుతుంది. దానికితోడు సుప్రీం కోర్టు తీర్పు ప్రభావం చూపబోతుండడంతో విద్యుత్ తయారీకి అవసరమయ్యే బొగ్గును చౌకగా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాలని యోచిస్తున్నాయి. దేశీయ బొగ్గును మండిస్తే బూడిద ఎక్కువగా వెలువడి సామర్థ్యం తగ్గుతుందని గతంలో కొన్ని సర్వేలు వెల్లడించాయి. చైనా వంటి దేశాల్లోని బొగ్గుతో తక్కువ బూడిద వస్తుండడంతో దాన్ని దిగుమతి చేసుకునే అవకాశం ఉంది. ఇదిలాఉండగా, సుప్రీం కోర్టు తీర్పు వల్ల అంతిమ ఉత్పత్తులపై ప్రభావం పడుతుంది. దాంతో ద్రవ్యోల్బణం పెరుగుతుంది. పన్నుల విధానాన్ని స్థిరీకరించేందుకు, మైనింగ్ రంగం వృద్ధికి కేంద్ర ప్రభుత్వం శాసనపరమైన చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. -
Singareni: బొగ్గు ఉత్పత్తిలో వీరే కీలకం..
సింగరేణి(కొత్తగూడెం): దక్షిణ భారతదేశానికి తలమానికంగా విరాజిల్లుతున్న సింగరేణి సంస్థ ఆవిర్భవించి నేటికి 134 సంవత్సరాలు కావస్తోంది. ప్రారంభంలో బొగ్గు తవ్వకానికే పరిమితమైన సింగరేణి.. క్రమంగా తెలంగాణ సహా ఏడు రాష్ట్రాల్లో విద్యుత్, సిమెంట్, పేపర్‌తో పాటు మరెన్నో పరిశ్రమలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా పాటు తోడ్పాటునందిస్తోంది. లక్షలాది మంది కుటుంబాలకు ఉపాధి కల్పిస్తోంది. సింగరేణి ఖాళీ స్థలాల్లో 300 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేసి రోజుకు 10 లక్షల యూనిట్లు ఉత్పత్తి చేసి ప్రభుత్వ గ్రిడ్‌కు అందిస్తూ ఏడాదికి రూ.120 కోట్లు ఆర్జిస్తోంది. అంతేకాక అనేక సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ తన వంతు పాత్ర పోషిస్తోంది. నూతన టెక్నాలజీతో ఉత్పత్తి.. 1889లో బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించిన సింగరేణి సుమారు 59 సంవత్సరాల పాటు మ్యాన్ పవర్ ద్వారా బొగ్గు ఉత్పత్తి చేసింది. ఆ తర్వాత 1948లో జాయ్ లోడర్ షటిల్ కార్‌ను, 1950లో క్యాప్ ల్యాంప్‌లు, 1951లో ఎలక్ట్రికల్ కోల్ డ్రిల్స్, 1953లో ఎలక్ట్రిక్ క్యాప్ ల్యాంప్స్, 1954లో ప్లేమ్ ప్రూఫ్ ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్లను వినియోగిస్తూ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచింది. 1975లో ఓపెన్‌కాస్ట్ గనులు, 1961లో రెస్క్యూ టీమ్‌ల ఏర్పాటు, 1979లో సైడ్ డిశ్చార్జ్ లోడర్, 1981లో లోడ్ హ్యాండ్ డంపర్స్ 1983లో లాంగ్ వాల్మైనింగ్, 1986లో వాకింగ్ డ్రాగ్‌లైన్, 1989లో ఫ్రెంచ్ బ్లాస్టింగ్ గ్యాలరీ మెథడ్ ఏర్పాటు చేసుకుంది. గనుల్లో కార్మికుల నడకను తగ్గించేందుకు 1990లో మ్యాన్ రైడింగ్ చైర్ లిఫ్టింగ్ పద్ధతిని కొత్తగూడెం ఏరియాలోని వీకె–7షాఫ్ట్‌లో ఏర్పాటు చేసింది. 1994లో ఇన్పుట్ క్రషింగ్ కన్వేయర్ యంత్రాలను ప్రవేశ పెట్టింది. ఇలా అనేక రకాల నూతన టెక్నాలజీని వినియోగించి కార్మికులకు రక్షణతో పాటు అధిక బొగ్గు ఉత్పత్తికి అడుగులు వేసింది. బొగ్గు ఉత్పత్తిలో వీరే కీలకం.. ►ఫేస్ వర్కర్లు: బొగ్గు తీసే ప్రదేశంలో వీరు కీలక పాత్ర పోషిస్తారు. ఇందులో ఆపరేటర్లు, కోల్ కట్టర్లు, సపోర్ట్మెన్లు ఉంటారు. ► లైన్మెన్లు: ఉత్పత్తిలో ప్రధానమైన ఎస్డీఎల్, సీఎమ్మార్ యంత్రాలు నడిచేందుకు వీలుగా ట్రాక్‌లు వేయడం వీరి ప్రధాన విధి. ► కన్వేయర్ ఆపరేటర్లు: బొగ్గును బయటికి తీసేందుకు అవసరమైన బెల్ట్‌ను నడుపుతారు. ► పంప్ ఆపరేటర్లు: బొగ్గుతీసే క్రమంలో భూమి పొరల నుంచి వచ్చే నీటిని ఎప్పటికప్పుడు బయటకు పంపిస్తారు. ► ఫిట్టర్లు: పని చేస్తున్న క్రమంలో మోటార్లు, యంత్రాలు మరమ్మతులకు గురైతే తక్షణమే రిపేర్ చేసి, పని ఆగకుండా చూస్తారు. ► ఎలక్ట్రీషియన్లు: గనుల్లో 24 గంటలూ విద్యుత్ అంతరాయం లేకుండా చూడడం వీరి ప్రధాన విధి. పంపులకు, మోటార్లకు నిరంతరం విద్యుత్ సరఫరా చేస్తుండాలి. ► టెండాల్స్: బరువైన యంత్రాల విడి భాగాలను గనిలోకి చేర్చి, వాటిని బిగించే సమయంలో ఫిట్టర్లకు సహాయపడుతుంటారు. ► హాలర్ డ్రైవర్లు: బొగ్గు ఉత్పత్తికి, గనిలోని యంత్ర విభాగాలకు అంతరాయం కలగకుండా చూస్తుంటారు. ► జనరల్ మజ్దూర్లు: టెక్నికల్ సిబ్బంది ఎవరైనా విధులకు హాజరు కాకుంటే వారి స్థానంలో పనిచేసే వారికి వీరు తోడుగా ఉంటూ సహకరిస్తుంటారు. ► ఎలక్ట్రికల్, మైనింగ్ సూపర్వైజర్లు: గనిలో ఉత్పత్తికి సంబంధించిన పనులకు కార్మికులను పురమాయించడం, రక్షణ నిబంధనలను కార్మికులకు వివరిస్తూ, ఉత్పత్తికి అవసరమైన మెటీరియల అందిస్తుంటారు. వీరిని జూనియర్ అధికారులు అంటారు. ► సూపర్వైజర్లు, ఎలక్ట్రిక్ మెకానిక్‌లు: గనిలో ఎలక్ట్రికల్, యంత్రాలను నిత్యం పర్యవేక్షిస్తుంటారు. పని సమయంలో అవి ఆగకుండా చూడాల్సిన బాధ్యత వీరిదే. ► మైనింగ్ సర్దార్, ఓవర్మెన్లు: బొగ్గు పొరల్లో డ్రిల్లింగ్ వేసి, వాటిలో పేలుడు పదార్థాలతో బ్లాస్టింగ్ చేస్తేనే బొగ్గు వస్తుంది. ఆ తరువాత రూఫ్ సురక్షితంగా ఉందా లేదా అని పరిశీలించే బాధ్యత వీరిదే. అక్కడ పనిచేసే కార్మికులకు సైతం వీరే విధులు కేటాయిస్తుంటారు. ► అసిస్టెంట్ మేనేజర్లు: గనిలో అవసరమైన పనులను పర్యవేక్షించేవారు. ► ఇంజనీర్లు: యంత్రాల పర్యవేక్షణ, పనితీరు, రక్షణ చర్యలు, పనుల పర్యవేక్షణ, పనులకు సంబంధించిన రిపోర్టును ఉన్నతాధికారులకు అందించేవారు. ► రక్షణాధికారి : గనుల్లో కార్మికులు, ఉద్యోగుల రక్షణ వీరి విధి. ఎవరికైనా ప్రమాదం జరిగితే తక్షణమే వారికి అవసరమైన సహాయక చర్యలు చేపడతారు. ► వెంటిలేషన్ ఆఫీసర్: గనుల్లో గాలి, వెలుతురు, తాగునీటి సదుపాయం ఏర్పాటు చేయడం, ప్రమాదాలు జరుగకుండా చూడడం వీరి బాధ్యత. ► సర్వేయర్: గనిని ప్రణాళిక ప్రకారం నడిపించి, బొగ్గు నిక్షేపాల గుర్తింపు, వాటిని ఏవిధంగా తీస్తే కంపెనీకి ఉపయోగకరంగా ఉంటుందో గమనించి అధికారులకు వివరించడం, కార్మికులకు పనులు పురమాయించడం వీరి విధి. ► ఆన్ షెట్టర్: గనిలోకి కార్మికులు, అధికారులను సిస్టమ్ ప్రకారం లోనికి పంపే యంత్రాన్ని(కేజీ) ఆపరేట్ చేస్తుంటారు. ► వైండింగ్ ఇంజన్ ఆపరేటర్: గనిలో అత్యంత ముఖ్యమైన వారు వైండింగ్ ఇంజన్ ఆపరేటర్లు. కేజీ గనిలోకి వెళ్లాలన్నా.. లోనికి వెళ్లిన కేజీ బయటకు రావాలన్నా వీరే కీలకం. ► గని మేనేజర్: గని మొత్తం ఈ అధికారి ఆధీనంలో ఉంటుంది. గనికి కావాల్సిన ప్రతి మెటీరియల్‌ను ఏరియా స్టోర్స్ నుంచి తెప్పించడం, వాటి కేటాయింపు బాధ్యతలను పర్యవేక్షించడం, కార్మికులకు విధులు కేటాయించడంతో పాటు గని పర్యవేక్షణంతా ఈ అధికారిదే. గుండెకాయలా కార్పొరేట్ సింగరేణి సంస్థకు కార్పొరేట్ కార్యాలయం గుండెకాయలా పనిచేస్తోంది. ఇందులో ప్రధానంగా ఐదుగురు డైరెక్టర్లు, 53 మంది జీఎంలు విధులు నిర్వహిస్తుంటారు. సింగరేణి వ్యాప్తంగా ఉన్న గనులు, డిపార్ట్మెంట్లను మానిటరింగ్ చేస్తుంటారు. మొత్తంగా చూస్తే సంస్థలో 43 వేల మంది కార్మికులు, 2,400 మంది అధికారులు పని చేస్తున్నారు. మరో 10 లక్షల కుటుంబాలకు ఈ సంస్థ పరోక్షంగా ఉపాధి కల్పిస్తోంది. (క్లిక్ చేయండి: అక్షరదీపాలు.. నల్లసూరీళ్లు) -
NTPC: భారతావనికి వెలుగు దివ్వె.. ఎన్టీపీసీ
పెద్దపల్లి/జ్యోతినగర్: భారతావనికి వెలుగు ది వ్వెగా విరాజిల్లుతున్న నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్(ఎన్టీపీసీ) లిమిటెడ్ నేటితో 47 వసంతా లు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం సంస్థ దేశంలో 77 విద్యుత్ కేంద్రాల ద్వారా 70,254 మెగావాట్ల వి ద్యుత్ ఉత్పత్తి చేస్తోంది. 2032 నాటికి 1,28,000 మెగావాట్ల లక్ష్యంతో నూతన ప్రాజెక్టులకు అంకురార్పణ చేస్తూ ముందుకు సాగుతోంది. 1975 నవంబర్ 7న నామకరణం స్వాతంత్య్రం అనంతరం దేశంలో తీవ్ర విద్యుత్ కొరత ఏర్పడింది. దీంతో కేంద్ర పరిధిలో ఒక విద్యుత్ కేంద్రం ఉండాలని అప్పటి ప్రభుత్వం భావించింది. విద్యుత్ ప్రాజెక్టు పంపిణీ విధానం తమ ఆధీనంలో ఉండాలనుకుంది. విద్యుత్ కేంద్రం ఉన్న రాష్ట్రానికి ఎక్కువ శాతం కేటాయించి. మిగతా విద్యుత్‌ను ప్రాంతాల వారీగా పంపిణీ చే యాలని తీర్మానం చేశారు. అప్పటికప్పుడు విద్యుత్ కేంద్రం నిర్మించాలంటే సమయం పడుతుందని ఢిల్లీ ఎలక్ట్రిసిటీ బోర్డుకు చెందిన బదర్పూర్ థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని టేకోవర్ చేసింది. 1975 నవంబర్ 7న ఎన్టీపీసీ రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్‌గా నమోదు చేసి, జాతీయ థర్మల్ విద్యుత్ కేంద్రంగా నామకరణం చేసి, ఎన్టీపీసీగా గుర్తించారు. దినదినాభివృద్ధి చెందుతూ.. ఎన్టీపీసీ దేశంలో బొగ్గు గనులు, గ్యాస్, నీరు, స్థలం అనుకూలంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి, విద్యుత్ ప్రాజెక్టులను నెలకొల్పుతూ దినదినాభివృద్ది చెందుతూ అతిపెద్ద విద్యుత్ కేంద్రంగా ఎదిగింది. ప్రపంచస్థాయి విద్యుత్ సంస్థలతో పోటీ పడుతూ దేశంలో ప్రభుత్వ రంగ సంస్థల్లో పవర్ ప్లాంట్ సామర్థ్యం, పీఎల్ఎఫ్, మెయింటెనెన్స్, విధానాలు, రక్షణ, విద్యుత్ పొదుపు, పర్యావరణ సమతుల్యం, మేనేజ్మెంట్ విధానాలతో ప్రథమ స్థానంలో నిలిచింది. ఎన్టీపీసీ సంస్థ విద్యుదుత్పత్తిలో అగ్రభాగాన నిలుస్తూ నవరత్న కంపెనీగా ఉన్న ఎన్టీపీసీ 2010లో మహారత్న కంపెనీగా రూపాంతరం చెందింది. ఎన్టీపీసీ విద్యుదుత్పత్తి కేంద్రాలు.. ఎన్టీపీసీ సొంతంగా బొగ్గు, గ్యాస్, హైడ్రో, సోలార్, ఫ్లోటింగ్ సోలార్, జాయింట్ వెంచర్స్తోపాటు మొత్తంగా 77 విద్యుదుత్పత్తి కేంద్రాలను కలిగి ఉంది. ప్రస్తుతం సూపర్ క్రిటికల్ మెగా ప్రాజెక్టులను నెలకొల్పుతోంది. ఎన్టీపీసీ తన ప్రధాన వ్యాపారాన్ని బలోపేతం చేయడానికి కన్సల్టెన్సీ, పవర్ ట్రేడింగ్, విద్యుత్ నిపుణుల శిక్షణ, బొగ్గు తవ్వకాల రంగాల్లో ముందుకు సాగుతోంది. మైనింగ్ రంగంలో వేగవంతమైన ప్రగతి నమోదు చేసింది. ఇతర సంస్థలతో కలిసి వ్యాపారం.. ఒకప్పుడు కేవలం విద్యుదుత్పత్తి మాత్రమే చేసిన ఎన్టీపీసీ ప్రస్తుతం ఉత్పత్తి, పంపిణీ, విద్యుత్ కొనుగోలు, అమ్మకాలు, సొంత బొగ్గు గనుల ఏర్పాటు, జాయింట్ వెంచర్లు తదితర ఎన్నో రంగాల్లో ఇతర సంస్థలతో కలిసి వ్యాపారాలు చేస్తూ దేశంలోనే అతిపెద్ద సంస్థగా ఎదిగింది. జాయింట్ వెంచర్లతో బంగ్లాదేశ్, భూటాన్, శ్రీలంక దేశాల్లో విద్యుత్ ప్రాజెక్టులు నిర్మిస్తోంది. 2032 నాటికి, శిలాజ ఇంధనం ఆధారిత ఉత్పత్తి సామర్థ్యం ఎన్టీపీసీ యొక్క పోర్ట్‌ఫోలియోలో దాదాపు 30% ఉంటుంది. ఈ సంస్థ జాతీయ సామర్థ్యంలో 16.78% కలిగి ఉంది. ఎకనామిక్ టైమ్స్ సర్వే ప్రకారం దేశంలోనే అత్యుత్తమ 50 కంపెనీల్లో గుర్తింపు పొందింది. -
కేటీకే 8వ గనిలో ప్రమాదం నలుగురు కార్మికులకు గాయాలు
భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి ఏరియాలోని కేటీకే 8వ గనిలో గురువారం కోల్ కట్టింగ్‌లో భాగంగా బ్లాస్టింగ్ చేస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో నలుగురు కార్మికులకు గాయాలయ్యాయి. కార్మికులు, అధికారుల కథనం ప్రకారం.. గనిలోని 3వ సీమ్ 21వ లెవల్లో ఉదయం మొదటి షిఫ్ట్‌లో కోల్‌కట్టింగ్ కార్మికులు సీహెచ్ రామకృష్ణ, బండి రాజశేఖర్, ఈర్ల శ్రీనివాస్‌తోపాటు భూక్య గంగ్య అనే యాక్టింట్ కోల్ కట్టర్.. బొగ్గును తొలిచేందుకు పేలుడు పదార్థాలతో బ్లాస్టింగ్ చేశారు. రెండోసారి కూడా బ్లాస్టింగ్ చేసేందుకు డ్రిల్స్ చేస్తున్నారు. ముందు పెట్టిన పేలుడు మందు ఒక చోట పేలకుండా ఉండిపోయింది. దీనిని గమనించకుండా డ్రిల్స్ చేస్తుండగా ఆ పేలుడు పదార్థానికి డ్రిల్లింగ్ మెషీన్ బలంగా తగలడంతో ఒక్కసారిగా పేలింది. దీంతో రామకృష్ణ, రాజశేఖర్, శ్రీనివాస్‌లకు తీవ్రగాయాలయ్యాయి. స్వల్పంగా గాయపడ్డ గంగ్య భయంతో స్పృహతప్పి పడిపోయాడు. వెంటనే ఆ నలుగురిని సింగరేణి ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. తీవ్రంగా గాయపడిన ముగ్గురిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. -
రాష్ట్రంలో ఇక బొగ్గు తవ్వకాలు
సాక్షి ప్రతినిధి, ఏలూరు: రాష్ట్రంలో అత్యధికంగా బొగ్గు నిల్వలున్న చింతలపూడి సెక్టార్–1, కృష్ణా జిల్లాలోని సోమవరం వెస్ట్ బ్లాక్‌లో తవ్వకాలకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు తాజాగా కేంద్ర బొగ్గు గనుల శాఖ.. సెక్టార్–1, సోమవరం వెస్ట్ బ్లాక్‌లను వేలం వేసేందుకు వీలుగా బిడ్లను ఆహ్వానించింది. దేశవ్యాప్తంగా 99 బొగ్గు బ్లాక్‌ల వేలానికి బిడ్లు ఆహ్వానించగా వాటిలో ఏపీకి చెందిన ఈ రెండు ఉన్నాయి. విభజనతో ఏపీ కోల్పోయిన సింగరేణి బొగ్గు లోటును చింతలపూడి తీర్చనుంది. అత్యంత నాణ్యమైన బొగ్గు నిల్వలు ఈ ప్రాంతంలో ఉన్నట్టు సర్వేల్లో స్పష్టమైంది. రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి, కృష్ణా బేసిన్లో అపారమైన బొగ్గు గనులు విస్తరించి ఉన్నాయి. రాష్ట్రంలో బొగ్గు నిల్వల కోసం సుదీర్ఘకాలం సర్వేలు, పరిశోధనలు జరిగాయి. 1964 నుంచి 2006 వరకు పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడితో పాటు.. జంగారెడ్డిగూడెం, కామవరపుకోట, తడికలపూడి ప్రాంతాల్లో బొగ్గు నిక్షేపాలున్నట్టు గుర్తించారు. ఆ తర్వాత 1996–2001 మధ్య కాలంలో ఖనిజాన్వేషణ సంస్థ సర్వే నిర్వహించి కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో బొగ్గు నిల్వలున్నట్టు నిర్ధారించింది. తక్కువ లోతులో.. కృష్ణా జిల్లా చాట్రాయి మండలం సోమవరం గ్రామం నుంచి పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి వరకు సుమారు 3,000 మిలియన్ టన్నుల నాణ్యమైన డీ, ఎఫ్ గ్రేడ్ బొగ్గు నిల్వలున్నట్టు ప్రభుత్వం గుర్తించింది. అది కూడా భూ ఉపరితలానికి 200 నుంచి 500 మీటర్ల లోతులోనే ఉన్నట్టు తేల్చింది. చింతలపూడిలో 300 మిలియన్ టన్నులు, రాఘవాపురంలో 997 మిలియన్ టన్నులు, సోమవరంలో 746 మిలియన్ టన్నులున్నట్టు నిర్ధారించింది. చింతలపూడి ప్రధాన కేంద్రంగా 30 కిలోమీటర్ల వ్యాసార్థంలో పుష్కలంగా బొగ్గు నిల్వలున్నాయి. చింతలపూడి మండలం గురుభట్లగూడెం, రాఘవాపురం చుట్టు పక్కల గ్రామాల్లో 400 అడుగుల లోతు నుంచి 1,400 అడుగుల లోతులో సుమారు 1,000 అడుగుల మందంలో, వెంకటాపురం, నామవరం, సుబ్బారాయుడుగూడెం గ్రామాల్లో 70 అడుగుల లోతులో నాణ్యమైన బొగ్గు నిల్వలున్నాయి. చింతలపూడి సెక్టార్–1.. పట్టాయిగూడెం, నామవరం, వెంకటాద్రిగూడెం, లక్ష్మీనారాయణపురం తదితర గ్రామాల్లో సుమారు 12.4 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది. అలాగే సోమవరం వెస్ట్ కోల్ బ్లాక్.. చాట్రాయి మండలం సూర్యాపల్లి, చెక్కపల్లి, అక్కిరెడ్డిగూడెం, రమణక్కపేట పరిధిలో 15.11 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. వేలానికి బ్లాక్‌లు ఈ ఏడాది ప్రారంభం నుంచి దేశంలోని వివిధ బొగ్గు బ్లాక్‌లను కేంద్ర ప్రభుత్వం విడతల వారీగా వేలం వేస్తోంది. దీని కోసం బిడ్లను ఆహ్వానిస్తోంది. అయితే ఈ ఏడాది ద్వితీయార్థంలో కృష్ణా జిల్లా సోమవరం బ్లాక్‌ను కూడా వేలం వేస్తున్నట్టు ప్రకటించింది. బిడ్లు దాఖలు కాకపోవడంతో సోమవరం బ్లాక్ కేటాయింపులు జరగలేదు. ఈ క్రమంలో మళ్లీ కేంద్ర బొగ్గు గనుల శాఖ ఈ నెల 16న దేశంలోని 99 బొగ్గు బ్లాక్‌లను వేలం వేస్తున్నట్టు ప్రకటించింది. వాటిలో చింతలపూడి సెక్టార్–1తో పాటు సోమవరం వెస్ట్ బ్లాక్‌ను కూడా చేర్చింది. బొగ్గు మైనింగ్‌పై వచ్చే రెవెన్యూలో వాటా ఆధారంగా వేలం ప్రక్రియను రెండు దశల్లో పూర్తి చేస్తారు. -
వారసత్వం... నిర్లక్ష్యం
సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి బొగ్గు గనుల్లో పని చేయడమంటే కత్తి మీద సామేనని చెప్పాలి. ప్రకృతికి విరుద్ధంగా గాలి, వెలుతురు లేక విధులు నిర్వర్తించాల్సిన పరిస్థితి. దీంతో వయస్సు పెరిగే కొద్ది కార్మికులు అవస్థ పడుతుంటారు. తద్వారా సంస్థ లక్ష్యసాధనలో ఆటంకాలు ఎదురవుతున్నాయని గుర్తించారు. దీనిని సరిదిద్దేందుకు సింగరేణి కార్మికుల కుటుంబాల్లో యువతను తీసుకుంటే సంస్థ లక్ష్యాలు చేరడమే కాకుండా యువతకు ఉపాధి లభిస్తుందని భావించారు. ఈమేరకు తెలంగాణ ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో పలు దఫాలుగా వారసత్వ(కారుణ్య) ఉద్యోగాలకు అవకాశం కల్పించారు. ఇందులో భాగంగా 82 మార్లు నిర్వహించిన మెడికల్ బోర్డు పరీక్షలకు 13,727 మంది హాజరుకాగా 9వేల మంది కార్మికుల పిల్లలకు సింగరేణి వ్యాప్తంగా ఉద్యోగాలు ఇచ్చారు. అయితే, వారసత్వ ఉద్యోగాలు పొందిన వారి పనితీరు సరిగ్గా లేక సంస్థ ఆశించిన ప్రయోజనాలు నెరవేరడం లేదు. గైర్హాజరుతో తలనొప్పి వారసత్వ ఉద్యోగాలు పొందిన వారితో సంస్థ అభివృద్ధి విషయం పక్కన పెడితే వారు ఉద్యోగాన్ని నిలుపుకునే పరిస్థితులు కూడా లేవని చెబుతున్నారు అధికారులు. సింగరేణి వ్యాప్తంగా సుమారు 4వేల కార్మికులు గైర్హాజరవుతుండుగా, ఇందులో అధిక శాతం కొత్తగా కారుణ్య నియామకాల ద్వారా వచ్చిన వారేనని అధికారిక సమాచారం. సింగరేణి వ్యాప్తంగా 11 ఏరియాల్లోని 25 భూగర్భ గనులు, 20 ఓపెన్‌కాస్ట్ గనుల్లో సుమారు 43 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీరిలో 28 వేల మంది కార్మికులు గనుల్లో, మిగతా వారు ఓసీలతో పాటు ఇతర విభాగాల్లో పనిచేస్తున్నారు. ఇందులో సుమారు 4వేల మంది బదిలీ వర్కర్లుగా విధులు నిర్వర్తిస్తుండగా... నెలకు కనీసం 10 మస్టర్లు(ఒక రోజు విధులకు హాజరైతే ఒక మస్టర్‌గా పరిగణిస్తారు) కూడా చేయకపోవడం గమనార్హం. కొత్తగూడెం ఏరియాలోనూ ఇదే పరిస్థితి కొత్తగూడెం ఏరియాలోని అన్ని గనుల్లో కలిపి 3,200 మంది కార్మికులు పనిచేస్తుండగా, ఏరియాలోని పీవీకే – 5షాప్ట్ గనిలో 765 మందికి 100 మంది డిప్యూటేషన్ల పేరుతో వివిధ డిపార్ట్మెంట్లలో పనిచేస్తున్నారు. మిగిలిన 665 మందిలో కనీసం 300 మంది గైర్హాజరవుతున్నారు. ఒకవేళ హాజరైనా సుమారు 100 మస్టర్లు కూడా నమోదు కావడం లేదు. అయితే సింగరేణి నిబంధనల ప్రకారం అండర్ గ్రౌండ్లో పనిచేసే కార్మికుడు సంవత్సరంలో కనీసం 100 మస్టర్లు పనిచేయాలి. అదేవిధంగా సర్పేస్ విభాగంలో పనిచేసే కార్మికుడు 190 మస్టర్లు పనిచేయాల్సి ఉంది. లేనిపక్షంలో వీరిని విధుల నుండి తొలగించే హక్కు సంస్థకు ఉంటుంది. ఇలా గత 20 ఏళ్లలో సుమారు 10 వేల మందిని ఉద్యోగాల నుంచి తీసేశారు కూడా. ఇక ప్రస్తుత పరిస్థితిని సరిదిద్దేందుకు యాజమాన్యం.. గుర్తింపు సంఘం సహకారంతో గతనెల 30న ఆయా కార్మిక కుటుంబాలకు కౌన్సెలింగ్ నిర్వహించింది. అయినప్పటికీ కార్మికుల కుటుంబాల్లో ఉద్యోగం పోతుందనే బాధ లేకపోగా.. గైర్హాజరు అలాగే నమోదవుతుండడం గమనార్హం. ప్రస్తుతం సింగరేణి సంస్థలో 50 – 60 సంవత్సరాల వారు సుమారు 30శాతం మంది పనిచేస్తున్నారు. వీరందరూ రానున్న ఐదారేళ్లలో ఉద్యోగ విరమణ చేస్తే సింగరేణి పరిస్థితి ఏమిటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. తీరు మారడం లేదు... గతంలో వారసత్వ నియమకాలు చేపట్టినా తర్వాత తీసేశారు. దీంతో కార్మికులకు పిల్లలకు ఉద్యోగాలు లేక కూలీనాలీ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కేసీఆర్ సీఎం అయ్యాక వారసత్వ ఉద్యోగాలను పునరుద్ధరించారు. అయితే ఉద్యోగం పొందిన కొందరు చక్కగా పని చేస్తుండగా.. మరికొందరు మాత్రం లేనిపోని కారణాలతో గైర్హాజరవుతున్నారు. యూనియన్ ఆధ్వర్యాన వీరికి కౌన్సెలింగ్ ఇచ్చినా ఫలితం లేదు. – చిలక రాజయ్య, గని ఫిట్ సెక్రటరీ, గుర్తింపు సంఘం ఎరక్షన్ చేయడమే వారికి కష్టమవుతోంది... పీవీకే – ›5షాప్ట్‌లో ప్రస్తుతం గెయిన్వేర్ కంపెనీ వారే బొగ్గు ఉత్పత్తి చేసి 138 లెవల్, 35 డిప్ వద్ద పోస్తున్నారు. ఈ బొగ్గును బయటికి పంపేందుకు ఎరక్షన్ పని మాత్రమే బదిలీ వర్కర్లు చేయాలి. ఇది కూడా ఆరుగురు కలిసి చేయొచ్చు. అయితే, ఈ పని యువతకు కష్టమై విధులకు గైర్హాజరవుతున్నారు. వయసు ఉన్నప్పుడు కష్టపడాలని చెప్పినా ప్రయోజనం లేదు. ఈ పని చేస్తూనే ఇంటర్నల్ పరీక్షలు రాసి పదోన్నతి పొందే అవకాశం ఉన్నా పట్టించుకోవడం లేదు. – పాలడుగు శ్రీనివాస్, గని మేనేజర్ అండర్ గ్రౌండ్ వాతావరణం పడడం లేదు డిపెండెంట్ ఉద్యోగాల్లో చేరిన వారు ఉన్నత చదువులు చదివిన వారే. వీరికి గనుల్లో వాతావరణం పడక.. దుబ్బ, బురదలో నడవలేక విధులకు రెగ్యులర్‌గా రాలేకపోతున్నారు. అంతేకాకుండా వీరితో అపాయింట్మెంట్ అయిన వారిలో కొందరు పలుకుబడితో డిప్యూటేషన్ పేరిట లైట్ జాబ్లకు వెళ్లారు. దీంతో ఉన్న వారిపై పనిభారం పడుతోంది. నిబంధనలు అందరికీ ఒకేలా అమలు చేయలేని యాజమాన్యం ఈ విషయాన్ని కప్పిపుచ్చుతోంది. – విజయగిరి శ్రీనివాస్, బ్రాంచ్ కార్యదర్శి, సీఐటీయూ -
బొగ్గు మైనింగ్‌లో కీలక ఘట్టం
సాక్షి, అమరావతి: సొంతంగా బొగ్గు తవ్వకాలు చేయడం ద్వారా ఆదాయం పెంచుకునే క్రమంలో ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) కీలకమైన ముందడుగు వేసింది. మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలి జిల్లా సుల్యారీ బొగ్గు గనిలోని 1,298 హెక్టార్ల భూమిలో మైనింగ్ కార్యక్రమాలకు సోమవారం భూమి పూజ నిర్వహించింది. ఈ వారంలోనే అక్కడ తవ్వకం పనులు ప్రారంభం కానున్నాయి. నెల రోజుల్లో ఉత్పత్తి మొదలవనుంది. మొదటగా దాదాపు రూ. 2 వేల కోట్ల పెట్టుబడితో ప్రతి ఏటా 5 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయాలని ఏపీఎండీసీ లక్ష్యంగా పెట్టుకుంది. సుల్యారీ గనుల్లో మొత్తం 107 మిలియన్ టన్నుల బొగ్గును లీజు సమయం ఉన్న 22 ఏళ్ల పాటు వెలికితీసేందుకు అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. బొగ్గు తవ్వకం వల్ల ఆ ప్రాంతంలో నిర్వాసితులవుతున్న 1,250 కుటుంబాలకు పునరావాసం కల్పిస్తున్నారు. ఈ గనుల ద్వారా వెలికితీసే మొత్తం బొగ్గు ఉత్పత్తిలో 25 శాతం సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రిజర్వు చేయాలని నిర్ణయించారు. మైనింగ్ చేయాల్సిన ప్రాంతాన్ని పరిశీలిస్తున్న అధికారులు రాష్ట్ర పురోభివృద్ధి దిశగా సీఎం నిర్ణయాలు.. అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని పారిశ్రామిక అభివృద్ధి, రాష్ట్ర ఆర్థిక పరిపుష్టి కోసం సీఎం జగన్ పరితపిస్తున్నారు. రాష్ట్రంలో ఖనిజాభివృద్ధికి ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. సుల్యారీలో బొగ్గు తవ్వకాలు మొదలు కావడానికి సీఎం దూరదృష్టే కారణం. రాష్ట్ర పురోభివృద్ధి లక్ష్యంగా వివిధ ప్రాజెక్టులను సత్వరం వినియోగంలోకి తీసుకువచ్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. సుల్యారీ ప్రాజెక్టును త్వరితగతిన అమల్లోకి తీసుకువచ్చిన ఏపీఎండీసీ అధికారులను అభినందిస్తున్నా. ఖనిజాభివృద్ధి సంస్థ ద్వారా మైనింగ్ అవకాశాలపై ఎప్పటికప్పుడు సమీక్షలు జరుపుతున్నాం. – పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గనులు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి బొగ్గు తవ్వకాలతో సంస్థ పరిధిని విస్తరిస్తాం బెరైటీస్ మైనింగ్‌లో అంతర్జాతీయ మార్కెట్‌ను సృష్టించుకున్న ఏపీఎండీసీ.. ఇతర రాష్ట్రాల్లో మైనింగ్ కార్యకలాపాలకు ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకుంటుంది. సుల్యారీలో బొగ్గు తవ్వకాల ద్వారా సంస్థ పరిధిని మరింతగా విస్తరిస్తున్నాం. ఛత్తీస్‌గఢ్‌లోని మదన్‌పూర్ సౌత్ బ్లాక్, జార్ఖండ్‌లోని బ్రహ్మదియా కోల్ బ్లాక్‌లను ఏపీఎండీసీ దక్కించుకుంది. ఈ ఏడాదిలోనే అక్కడ కూడా ఉత్పత్తిని సాధించే దిశగా చర్యలు తీసుకుంటున్నాం. గ్రానైట్, సిలికాశాండ్ ఖనిజాల వెలికితీత, మార్కెటింగ్‌పై కూడా దృష్టి పెట్టాం. ప్రస్తుతం ఖనిజాభివృద్ధి సంస్థ ద్వారా ఆర్జిస్తున్న ఆదాయాన్ని ఐదు రెట్లు పెంచాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. – వీజీ వెంకటరెడ్డి, ఏపీఎండీసీ వీసీ అండ్ ఎండీ -
ఊపిరాడక కాంట్రాక్ట్ కార్మికుడి మృతి
సాక్షి, మల్కాపురం (విశాఖ పశ్చిమ): బొగ్గుపొడి పడడంతో ఊపిరాడక ఓ కాంట్రాక్టు కార్మికుడు చనిపోయాడు. ఈ దుర్ఘటన ఆలూ ఫ్లోరైడ్ సంస్థలో జరిగింది. గాజువాక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... జీవీఎంసీ 59వ వార్డు పరిధి హిమచల్‌నగర్ కొండ ప్రాంతంలో బమ్మిడి వాసు (50) తన భార్య, కుమారుడు నాగరాజు, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి నివసిస్తున్నారు. 58వ వార్డు పరిధి ములగాడ విలేజ్ ప్రాంతంలోని ఆలూ ఫ్లోరైడ్ సంస్థలో నాగరాజు కాంట్రాక్ట్ పనులు చేస్తున్నాడు. అతని వద్ద హెల్పర్‌గా వాసు పని చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో విధుల్లో భాగంగా శనివారం ఉదయం 5 గంటలకు వాసు సంస్థ ఆవరణలో హాట్ ఎయిర్ జనరేటర్ డిపార్టమెంట్ సమీపంలోని స్టాగ్ వద్ద పని చేస్తున్నాడు. ఆ సమయంలో స్టాగ్‌లో బొగ్గుపొడి కొలిచే (అల్యూమినియం మరిగించేందుకు వాడే బొగ్గు పొడి) తూనిక స్కేల్ (ఇనుప రాడ్) స్టాగ్ రంధ్రంలో పడిపొయింది. ఆ రాడ్డును తీసేందుకు వాసు ఉదయం 7 గంటల సమయంలో అందులోకి దిగాడు. ఆ సమయంలో బొగ్గుపొడి భారీగా అతనిపై పడిపోవడంతో ఊపిరి ఆడక మృతిచెందాడు. తండ్రిని ఆ యూనిట్ నుంచి వెలుపలకు తీసేందుకు సమీపంలో ఉన్న కుమారుడు నాగరాజు యత్నించినా ప్రయోజనం లేకపోయింది. విషయం తెలుసుకున్న గాజువాక పోలీసులు వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు. మరోవైపు వైఎస్సార్సీపీ వార్డు అధ్యక్షుడు గులిగిందల కృష్ణ, ములగాడ గ్రామం అధ్యక్షుడు ధర్మాల వేణుగోపాలరెడ్డి జరిగిన ప్రమాదాన్ని వైఎస్సార్సీపీ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త మళ్ల విజయప్రసాద్‌కు తెలియజేశారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని కోరారు. దీంతో ఆలూ ఫ్లోరైడ్ సంస్థ యాజమాన్యంతో మళ్ల విజయప్రసాద్ మాట్లాడి మృతుని కుటుంబానికి రూ.21 లక్షల పరిహారం ఇప్పించేలా ఒప్పించారు. విషయం తెలుసుకున్న ములగాడ తహసీల్దార్ బీవీ రమణి, జీవీఎంసీ 59, 60వ వార్డుల వైఎస్సార్సీపీ కార్పొరేటర్ అభ్యర్థులు పుర్రె సురేష్‌యాదవ్, పీవీ సురేష్ ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. కొడుకు కాంట్రాక్టు పనులు చేస్తుండడంతో తోడుగా ఉందామని పనికెళ్లిన తండ్రి మృతితో హిమాచల్నగర్లో విషాదం నెలకొంది. -
అరుదైన బొగ్గు క్షేత్రం ఏపీఎండీసీ కైవసం
సాక్షి, అమరావతి: జార్ఖండ్ రాష్ట్రంలోని అరుదైన కుకింగ్ కోల్ బ్లాక్ (బ్రహ్మదిహ)ను ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) కైవసం చేసుకుంది. బిడ్డింగ్‌లో ఏపీఎండీసీ ఎల్1గా నిలవడంతో ఆ బొగ్గు క్షేత్రాన్ని ఏపీఎండీసీకి అప్పగించారు. ఈ మేరకు సోమవారం ఢిల్లీలో కేంద్ర బొగ్గుగనుల మంత్రిత్వశాఖ – ఏపీఎండీసీ మధ్య ఒప్పందం కుదిరింది. కేంద్ర ప్రభుత్వం తరఫున కేంద్ర బొగ్గు గనుల శాఖ అదనపు కార్యదర్శి ఎం.నాగరాజు, ఏపీఎండీసీ తరఫున రాష్ట్ర భూగర్భ గనుల శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బొగ్గుగనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిల సమక్షంలో కేంద్ర బొగ్గుగనుల శాఖ అధికారులు ఒప్పంద పత్రాలను గోపాలకృష్ణ ద్వివేదికి అందజేశారు. ఇది అత్యంత నాణ్యమైన, అరుదైన బొగ్గు జార్ఖండ్‌లోని గిరిడీ కోల్ ఫీల్డ్స్‌లో అత్యంత నాణ్యమైన, అరుదైన ఎస్1 రకం కుకింగ్ కోల్ ఉంది. అధికార వర్గాల సమాచారం ప్రకారం.. దేశంలో వినియోగమయ్యే ఈ రకం బొగ్గులో 1.5 శాతం మాత్రమే ఇక్కడ ఉత్పత్తి అవుతోంది. మిగిలిన 98.5 శాతం విదేశాల నుంచి దిగుమతి అవుతోంది. అందువల్ల దీనికి మంచి డిమాండ్ ఉంది. ఉక్కు కర్మాగారాల్లో బ్లాస్ట్ ఫర్నేస్ (ఉక్కును కరిగించడం) కోసం దీనిని వినియోగిస్తారు. ఏపీఎండీసీకి లభించిన గనిలో 25 లక్షల టన్నుల బొగ్గు నిక్షేపాలున్నట్లు అంచనా. ’బ్రహ్మదిహ’ క్షేత్రంలో తవ్వే బొగ్గు అమ్మకం ధరలో 41.75 శాతం జార్ఖండ్ రాష్ట్రానికి ఇవ్వాల్సి ఉంటుంది. మిగతా 48.25 శాతం ఏపీఎండీసీదన్నమాట. ఈ బొగ్గు గనిని పొందడంవల్ల ఏపీఎండీసీకి రూ.250 నుంచి రూ.350 కోట్ల వరకు నికర రాబడి వస్తుందని అధికారుల అంచనా. -
తరగని నిక్షేపాలు.. ఆ‘గని’ అన్వేషణ
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : ఆగర్భ సిరి భూగర్భంలో దాగెను మరి.. సింగరేణిలో తర‘గని’బొగ్గు సిరి.. మరో వందేళ్లు అయినా నిక్షిప్తమే మరి. ఇంకా మూడు తరాల వరకు తోడినా వీడని బంధమే అది. తెలంగాణకు తలమానికంగా విలసిల్లుతున్న సింగరేణిలో బొగ్గు నిక్షేపాలకు ఢోకా లేదు. 125 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర గల సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్సీసీఎల్)లో ‘ఎక్స్‌ప్లొరేషన్’విభాగం తాజా నివేదిక ప్రకారం 11,394.76 మిలియన్ మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నట్లు తేలింది. సింగరేణి విస్తరించి ఉన్న 6 జిల్లాల్లో 29 భూగర్భ గనులు, 19 ఓపెన్‌కాస్ట్ గనుల ద్వారా ఏటా 64 మిలియన్ టన్నుల మేరకే బొగ్గును వెలికితీస్తున్నారు. ఈ లెక్కన 2019–20 వరకు 1,501 మిలియన్ మెట్రిక్ టన్నుల బొగ్గును భూగర్భం నుంచి తీసింది. మరో 150 సంవత్సరాలు నిరంతరాయంగా తవ్వకాలు జరిపినా గోదావరి లోయ పరిధిలో బొగ్గు తరగ దని తేలింది. ఇక్కడి బొగ్గు గనులకు తోడు ఒడిశా లోని నైనా బ్లాక్, ఇతర దేశాల్లో మైనింగ్ కాంట్రాక్టు లను సొంతం చేసుకునే పనిలో ఉంది సింగరేణి సంస్థ. అదే సమయంలో జీపీఎస్, ఇతర అధునా తన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన 25 ప్రత్యేక వాహనాలతో గోదావరి కోల్‌ఫీల్డ్ పరిధిలో నల్ల బం గారం కోసం అధికారులు అన్వేషణ సాగిస్తున్నారు. 300 మీటర్ల లోపే వేల టన్నులు గోదావరి– ప్రాణహిత పరిధిలోని గోదావరి వ్యాలీ కోల్‌ఫీల్డ్ బొగ్గు నిక్షేపాలకు పుట్టినిల్లు. కొమరంభీం జిల్లా మొదలుకొని మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లోని భూగర్భంలో వందల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో బొగ్గుగనులు విస్తరించి ఉన్నాయి. భూగర్భంలో 300 మీటర్ల లోతులోనే 6,760.90 మిలియన్ మెట్రిక్ టన్నుల బొగ్గు ఉన్నట్లు సింగరేణి గుర్తించింది. 300 మీటర్ల నుంచి 600 మీటర్ల లోతులో 4,308.54 మిలియన్ మెట్రిక్ టన్నుల నిల్వలు ఉండగా, 600 మీటర్ల కన్నా ఎక్కువ లోతులో మరో 325.76 మి. మెట్రిక్ టన్నుల బొగ్గును కనుగొన్నారు. నిజానికి బయోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అంచనా ప్రకారం గోదావరి వ్యాలీ కోల్‌ఫీల్డ్‌లో 1,200 మీటర్ల లోతు వరకు 22,207 మిలియన్ మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వలున్నాయి. అయితే 300 మీటర్ల లోపునే నాణ్యమైన బొగ్గు లభిస్తుండడంతో 50 వేల మంది కార్మిక శక్తితో సింగరేణి బొగ్గును రిస్క్ లేకుండా బొగ్గు తోడుతోంది. ఓపెన్‌కాస్ట్ విధానం ద్వారా కార్మికశక్తి కన్నా యాంత్రిక శక్తిని నమ్ముకొని తవ్వకాలు జరుపుతోంది. సీ గ్రేడ్ నుంచి ఎఫ్ గ్రేడ్ వరకు నాణ్యమైన బొగ్గు బొగ్గు మండే స్వభావాన్ని బట్టి దాని నాణ్యతను నిర్ధారిస్తారు. గ్రాస్ క్యాలరిక్ వాల్యూ(జీసీవీ) విధానం ద్వారా గ్రేడ్లవారీగా బొగ్గు రకాలను విభజించారు. ఈ లెక్కన జీ–1 నుంచి జీ –17 వరకు వివిధ రకాల నాణ్యతలో బొగ్గు లభిస్తుంది. గ్రేడ్‌ను బట్టి మార్కెట్లో టన్ను విలువ ఆధారపడి ఉంటుంది. సింగరేణిలో నాణ్యమైన ఏ గ్రేడ్ (జీసీవి విధానంలో జీ 1 నుంచి జీ 3 వరకు) బొగ్గు కేవలం 109.27 మి.మె.టన్నులు(1 శాతం) మాత్రమే ఉన్నట్లు తాజా నివేదికలో తేలింది. బీ గ్రేడ్ (జీ4, జీ5) బొగ్గు 486.51 మి. మెట్రిక్ టన్నులు (4 శాతం) ఉంది. గోదావరి వ్యాలీలో అత్యధికంగా సీ, డీ, ఈ, ఎఫ్ గ్రేడ్ల బొగ్గు లభిస్తుంది. అత్యధికంగా మంచిర్యాల, కొత్తగూడెం జిల్లాల్లో... గోదావరి– ప్రాణహిత నదుల మధ్య ప్రాంతంలో ఆసిఫాబాద్ నుంచి బెల్లంపల్లి, మందమర్రి, మంచిర్యాల, శ్రీరాంపూర్, చెన్నూరు, ఇందారంలలో ఎక్స్‌ప్లోరేషన్ విభాగం ఎక్కడ తవ్వినా బొగ్గు నిక్షేపాలే కనిపించాయి. ఈ లెక్కన మంచిర్యాల జిల్లాలోనే 3,557.67 మిలియన్ మె.టన్నులు, ఆసిఫాబాద్ పరిధిలో 630.34 మి.మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వలను గుర్తించారు. మంచిర్యాల తర్వాత రెండో స్థానంలో భద్రాద్రి కొత్తగూడెంలో 29,58.54 మి.మెట్రిక్ టన్నుల నిల్వలను గుర్తించారు. మరిన్ని ఓపెన్‌కాస్ట్‌లు సింగరేణిలో బొగ్గును వెలికితీసేందుకు ఇప్పటికే 19 ఓపెన్ కాస్ట్‌లపై ఆధారపడ్డ సింగరేణి సంస్థ వచ్చే ఐదారేళ్లలో మరో 6 ఓపెన్‌కాస్ట్‌లను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాల్లో ఉంది. ఇప్పటికే మందమర్రిలో అండర్‌గ్రౌండ్ మైన్ల స్థానంలో ఓపెన్‌కాస్ట్‌లను తీసుకొచ్చిన సంస్థ ఇందారంలో కొత్తగా రెండు ఓపెన్‌కాస్ట్‌లను తవ్వుతోంది. గోదావరిఖని, కొత్తగూడెం, భూపాలపల్లి, ఆసిఫాబాద్‌లలో కూడా ఓపెన్‌కాస్ట్‌లను కొత్తగా నిర్మించే ఆలోచనలో ఉంది. డోర్లే ఓసీపీతోపాటు జీడీకే 7 ఎల్ఈపీ ఓసీ, కొత్తగూడెంలో జేవీఆర్‌ఓసీ–2, మందమర్రిలో కేకేఓసీలలో పనులు మొదలయ్యాయి కూడా. ఓపెన్‌కాస్ట్‌ల ద్వారా అధిక మొత్తంలో బొగ్గును తవ్వేందుకు అధునాతన మిషనరీని కూడా తెప్పిస్తోంది. -
చంద్రబాబుకు ఏపీ ప్రభుత్వం నోటీసులు
సాక్షి, విజయవాడ: ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేలా తప్పుడు కథనాలు ప్రచురించిన వార్తా పత్రికలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆమోద పబ్లికేషన్స్, ఉషోదయా పబ్లికేషన్స్‌కు నోటీసులు జారీ చేసింది. ఈ సందర్భంగా రాష్ట్ర భూగర్భగనుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేదీ శనివారం మీడియా మాట్లాడారు. మైనింగ్‌పై అసత్య ఆరోపణలు చేసినవారిపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా ఉందని అన్నారు. ఆయా సంస్థలు, వ్యక్తులు 15 రోజుల్లో బేషరతుగా క్షమాపణ చెప్పాలని లేని పక్షంలో పరువునష్టం దావా వేస్తామని ద్విదేదీ స్పష్టం చేశారు. తప్పుడు కథనాలకు సంబంధించి ఆయా పత్రికలు స్పందించిన తీరు సంతృప్తికరంగా లేనందునే మీడియా ముందుకు వచ్చినట్టు ఆయన చెప్పారు. (చదవండి: టమాటో ఛాలెంజ్‌తో రైతులకు ఊరట) -
కేంద్రం నిర్ణయంపై సుప్రీం కోర్టులో సవాల్
న్యూఢిల్లీ: బొగ్గు గనులను ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని జార్ఖండ్ ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. కోవిడ్ విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో కేంద్రం నిర్ణయంతో జార్ఖండ్‌కు నష్టం వాటిల్లుతుందని శుక్రవారం దాఖలు చేసిన రిట్ పిటిషన్లో పేర్కొంది. గిరిజన జనాభా, అడవులపై ప్రతికూల ప్రభావానికి సంబంధించి సరైన అంచనా వేయకుండానే గనుల వేలం నిర్ణయం తీసుకున్నారని జార్ఖండ్ అడ్వకేట్ జనరల్ రాజీవ్ రంజన్ రిట్ పిటిషన్లో పేర్కొన్నారు. అన్ని అంశాలకు సంబంధించి వివరణాత్మక అధ్యయనం అవసరమని అన్నారు. కాగా, బొగ్గు గనుల ప్రైవేటీకరణను కేంద్ర ప్రభుత్వం అధికారికంగా మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. దేశంలోని 41 క్షేత్రాల ఆన్లైన్ వేలాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురువారం ప్రారంభించారు. ప్రపంచంలోనే భారత్ అతిపెద్ద బొగ్గు ఎగుమతిదారుగా నిలువాలని ఈ సందర్భంగా ప్రధాని ఆకాంక్షించారు. దిగుమతులు తగ్గించుకొని స్వయం సమృద్దిగా ఎదిగేందుకే ఈ నిర్ణయం తీసుక్నుట్టు ప్రధాని తెలిపారు. (చదవండి: ‘సెంట్రల్ విస్టా’పై మాదే తుది నిర్ణయం: సుప్రీం) -
బొగ్గు క్షేత్రం కేటాయించండి
మందాకిని బొగ్గు గనిని ఏపీజెన్కోకు కేటాయిస్తే ఏటా 7.5 మిలియన్ మెట్రిక్ టన్నుల బొగ్గు లభ్యమవుతుంది. ఈ బొగ్గుతో రోజూ 1700 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయవచ్చు. ఈ బొగ్గు క్షేత్రం నుంచి మొత్తం 287.886 మిలియన్ మెట్రిక్ టన్నుల బొగ్గు లభిస్తుందని వెల్లడైంది. సాక్షి, అమరావతి: ఒడిశా రాష్ట్రంలోని కొత్త బొగ్గు క్షేత్రం మందాకినిని ఏపీజెన్కోకు కేటాయించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాసినట్టు ముఖ్యమంత్రి కార్యాలయం మంగళవారం పేర్కొంది. 5,010 మెగావాట్ల సామర్థ్యం గల ఏపీ జెన్కో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు మహానది కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్, సింగరేణి కోల్ కాలరీస్ లిమిటెడ్‌ల నుంచి బొగ్గు సరఫరా ఒప్పందాలున్నాయని, ఉమ్మడి రాష్ట్రంలో సింగరేణి కోల్ కాలరీస్ లిమిటెడ్ నుంచే ఎక్కువగా సరఫరా అయ్యేదని తెలిపారు. రాష్ట్ర విభజన తర్వాత సింగరేణి కోల్ కాలరీస్‌ను తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చారని, కనీసం బొగ్గు నిల్వల్లో వాటాను కూడా ఆంధ్రప్రదేశ్‌కు ఇవ్వలేదని, దీంతో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే బొగ్గు మీదే ఎక్కువగా ఆధారపడుతున్నామని లేఖలో స్పష్టం చేశారు. దీనివల్ల రాష్ట్ర విద్యుత్ రంగానికి భరోసా లేకుండా పోయిందని, 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరాకు ఈ పరిస్థితి తీవ్ర అవరోధంగా మారిందని వివరించారు. లేఖలో ముఖ్యాంశాలు ఇలా.. – పొరుగున ఉన్న ఒడిశా రాష్ట్రంలో ఐబి వ్యాలీ, తాల్చేరు క్షేత్రాల్లో భారీగా బొగ్గు నిల్వలున్నాయి. ఒడిశా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, చత్తీస్ఘడ్, తెలంగాణాలు బొగ్గు సంపద ఉన్న రాష్ట్రాలు. – వాణిజ్య అవసరాల కోసం మధ్యప్రదేశ్‌లో ఒకటి, చత్తీస్‌ఘడ్‌లో ఒక గనిని ఏపీఎండీసీకి కేటాయించారు. ప్రతి గని నుంచి 5 ఎంఎంటీఏలు తీసుకోవచ్చు.. అయితే ఈ గనుల నుంచి బొగ్గు వెలికితీతకు నిర్వహణ వ్యయం చాలా అధికంగా ఉంది. – బొగ్గు గనుల చట్టం – 2015 ప్రకారం ట్రాంచీ –6ను ఏపీజెన్కో వినియోగం కోసం కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించింది. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుని బొగ్గు మంత్రిత్వ శాఖకు ఏపీజెన్కో దరఖాస్తు చేసుకుంది. – మార్చి 2020 నాటికి ఏపీ జెన్కో తన థర్మల్ కేంద్రాల ద్వారా మరో 1600 మెగావాట్ల అదనపు విద్యుత్ ఉత్పాదనకు సిద్ధమవుతోంది. ఇందుకోసం ఏటా 7.5 ఎంఎంటీఏ బొగ్గు నిల్వలు అవసరం. – ప్రస్తుతం ఎదుర్కొంటున్న బొగ్గు కొరతను నివారించడానికి, బొగ్గు ఒప్పందాల ప్రకారం మరింత బొగ్గును సరఫరా చేయాల్సి ఉంది. ఈ కారణంగా మందాకిని బొగ్గు క్షేత్రాన్ని వెంటనే కేటాయించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. – కేంద్ర బొగ్గు శాఖ ప్రకటించిన విధంగా ఛత్తీస్‌గఢ్, ఒడిశాల్లో ఏడాదికి కనీసం 50 ఎంఎంటీఏ బొగ్గును ఏపీఎండీసీ, ఏపీ జెన్కోకు కేటాయించండి. -
ఎఫ్‌డీఐ 2.0
న్యూఢిల్లీ: నీరసించిన ఆర్థిక వ్యవస్థకు ఉత్తేజాన్నిచ్చేందుకు ప్రభుత్వం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (ఎఫ్‌డీఐ) మరోసారి ద్వారాలు తెరిచింది. బొగ్గు మైనింగ్, కాంట్రాక్టు తయారీ రంగాల్లోకి నూరు శాతం ఎఫ్‌డీఐలను ప్రభుత్వం అనుమతి అవసరం లేని ఆటోమేటిక్ మార్గంలో ఆహ్వానించింది. అలాగే, డిజిటల్ మీడియాలో ఇప్పటి వరకు ఎఫ్‌డీఐలకు అవకాశం లేకపోగా, ఇకపై 26 శాతం వరకు ఎఫ్‌డీఐలను స్వీకరించొచ్చు. బుధవారం ప్రధాని మోదీ ఆధ్వర్యంలో ఢిల్లీలో భేటీ అయిన కేంద్ర కేబినెట్ ఈ నిర్ణయాలు తీసుకుంది. అలాగే, సింగిల్ బ్రాండ్ రిటైలర్లకు స్థానిక ఉత్పత్తులను సమీకరించుకునే విషయంలో మరింత వెసులుబాటు కల్పించింది. ఐదేళ్ల కనిష్ట స్థాయికి (5.8 శాతం) జీడీపీ వృద్ధి రేటు పడిపోవడంతో గత వారం పలు వర్గాలకు పన్ను రాయితీలు, ప్రోత్సాహకాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించగా.. వారం తిరగకముందే ఎఫ్‌డీఐలపై నిర్ణయం తీసుకోవడం ద్వారా ఆర్థిక వృద్ధి విషయంలో మరిన్ని చర్యలకూ అవకాశం ఉందని ప్రభుత్వం సంకేతాలు పంపినట్టయింది. గత 3–4 త్రైమాసికాలుగా దేశ వృద్ధి కుంటుపడిన విషయం గమనార్హం. ఈ ఏడాది మార్చితో ముగిసిన త్రైమాసికంలో నమోదైన జీడీపీ వృద్ధి 5.8 శాతం అన్నది ఐదేళ్ల కనిష్ట స్థాయి. దీంతో ప్రభుత్వరంగ బ్యాంకులకు రూ.70,000 కోట్ల తక్షణ నిధుల సాయం సహా పలు చర్యలను ప్రభుత్వం గతవారం ప్రకటించింది. మరిన్ని పెట్టుబడులు, ఉద్యోగాలు.. ‘‘ఎఫ్‌డీఐ విధానంలో మార్పులు చేయడం వల్ల భారత్ ఎఫ్‌డీఐలకు గమ్యస్థానంగా మరింత ఆకర్షణీయంగా మారుతుంది. తద్వారా పెట్టుబడుల రాక పెరిగి, ఉపాధి, వృద్ధికి తోడ్పడుతుంది’’ అని కేబినెట్ భేటీ అనంతరం కేంద్ర వాణిజ్య శాఖా మంత్రి పీయూష్ గోయల్ మీడియాతో అన్నారు. దేశంలో వ్యాపార నిర్వహణను మరింత సులభంగా మార్చేందుకు గాను ఎఫ్‌డీఐ పాలసీని మరింత సరళీకరించడమే కేబినెట్ నిర్ణయాల ఉద్దేశంగా పేర్కొన్నారు. కాంట్రాక్టు తయారీలో నూరు శాతం ఎఫ్‌డీఐలను ఆటోమేటిక్ మార్గంలో అనుమతించడం వల్ల దేశీ తయారీ వృద్ధి చెందుతుందన్నారు. సింగిల్ బ్రాండ్ రిటైల్ సింగిల్ బ్రాండ్ రిటైల్ విభాగంలో 51 శాతానికి మించి ఎఫ్‌డీఐలను కలిగిన సంస్థ... 30 శాతం ఉత్పత్తులను స్థానిక మార్కెట్ నుంచే సమీకరించుకోవాలన్నది ప్రస్తుతమున్న నిబంధన. ఇటువంటి సంస్థలకు కార్యకలాపాల నిర్వహణలో గొప్ప వెసులుబాటు కల్పించేందుకు గాను, భారత్ నుంచి సేకరించే అన్ని రకాల ఉత్పత్తులను స్థానిక సమీకరణగానే గుర్తిస్తారు. అంటే భారత్‌లో విక్రయించేందుకు అయినా, విదేశాలకు ఎగుమతి చేసేందుకు సమీకరించినా ఈ వెసులుబాటు లభిస్తుంది. అలాగే, భౌతికంగా సింగిల్ బ్రాండ్ రిటైల్ దుకాణాలు ప్రారంభించడానికి ముందే ఆన్లైన్లో అమ్మకాలు మొదలు పెట్టుకునేందుకు కూడా అనుమతించింది. ‘‘ఆన్లైన్ విక్రయాలతో లాజిస్టిక్స్, డిజిటల్ చెల్లింపులు, కస్టమర్ కేర్, శిక్షణ, ఉత్పత్తులపై నైపుణ్యం విభాగాల్లో ఉద్యోగాలు వస్తాయి’’ అని మంత్రి గోయల్ తెలిపారు. డిజిటల్ న్యూస్ మీడియా డిజిటల్ మీడియాకు ఊతమిచ్చేందుకు ప్రభుత్వం మంచి ముందడుగు వేసిందనే చెప్పాలి. ప్రింట్ మీడియా తరహాలోనే... ఇకపై డిజిటల్ మీడియాలో వార్తలు, కరెంట్ అఫైర్స్ అప్లోడింగ్, స్ట్రీమింగ్ విభాగంలోకి ప్రభుత్వ అనుమతితో 26 శాతం వరకు ఎఫ్‌డీఐలు ప్రవేశించొచ్చు. ప్రింట్ మీడియాలో ఇప్పటికే ప్రభుత్వ అనుమతితో 26 శాతం ఎఫ్‌డీఐకి అనుమతి ఉంది. అలాగే, బ్రాడ్‌కాస్టింగ్ కంటెంట్ సేవల్లోనూ ప్రభుత్వ అనుమతితో 49 శాతం ఎఫ్‌డీఐలకు ప్రవేశం ఉంది. బొగ్గు రంగంలోకి ఇలా... ప్రస్తుతం విద్యుత్ ప్రాజెక్టులు, ఐరన్, స్టీల్, సిమెంట్ ప్లాంట్ల సొంత వినియోగానికి ఉద్దేశించిన బొగ్గు, లిగ్నైట్ మైనింగ్‌లోకి ఆటోమేటిక్ మార్గంలో 100 శాతం ఎఫ్‌డీఐలకు అనుమతి ఉంది. ఇకపై బొగ్గు విక్రయాలు, మైనింగ్, కోల్ వాషరీ, క్రషింగ్, కోల్ హ్యాండ్లింగ్ తదితర బొగ్గు అనుబంధ విభాగాల్లోకీ వంద శాతం ఆటోమేటిక్ మార్గంలో ఎఫ్‌డీఐలను తెచ్చుకోవచ్చు. ఐదేళ్లలో 286 బిలియన్ డాలర్లు ఎఫ్‌డీఐ అన్నది ఆర్థిక వృద్ధికి కీలకమైన ఇంధనం వంటిది. రుణాల రూపంలో కాకుండా పెట్టుబడులుగా దేశాభివృద్ధికి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు తోడ్పడతాయి. ఇప్పటికే చాలా రంగాల్లోకి ప్రభుత్వం నూరు శాతం ఎఫ్‌డీఐలను ఆహ్వానించడం గమనార్హం. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల ఫలితంగా 2014–15 నుంచి 2018–19 వరకు దేశంలోకి 286 బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐలు వచ్చాయి. అంతకుముందు 5 ఏళ్లలో వచ్చిన 189 బిలియన్ డాలర్లతో పోలిస్తే మంచి వృద్ధి నమోదైంది. 2018–19లో వచ్చిన 64.37 బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐలు ఇప్పటి వరకు ఓ ఆర్థిక సంవత్సరంలో వచ్చిన గరిష్ట ఎఫ్‌డీఐలు కావడం గమనార్హం. యాపిల్, వన్‌ప్లస్‌లకు ప్రయోజనం దేశంలో సింగిల్ బ్రాండ్ రిటైల్ దుకాణాలకు సంబంధించి నిబంధనలను సరళీకరించడం వల్ల మొబైల్ హ్యాండ్సెట్ రిటైల్ మార్కెట్ అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతుందని, యాపిల్, వన్‌ప్లస్, ఒప్పో వంటి సంస్థలు సొంత దుకాణాలు తెరిచేందుకు మార్గం సుగమం అవుతుందని ఇండియా సెల్యులర్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ) పేర్కొంది. పెట్టుబడులు పెరుగుతాయ్: హెచ్అండ్ఎం ‘‘ హెచ్అండ్ఎం గత 30 సంవత్సరాలుగా అంతర్జాతీయ మార్కెట్ కోసం భారత్ నుంచి సమీకరిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్ కోసం సమీకరించేవి కూడా ఇకపై 30 శాతం స్థానిక సమీకరణ కింద పరిగణించడం ఆహ్వానించతగినది. ఇది భారత్‌లో వ్యాపార నిర్వహణను సులభతరం చేస్తుంది. విదేశీ కంపెనీల నుంచి మరిన్ని పెట్టుబడులను ఆకర్షిస్తుంది’’ అని హెచ్అండ్ఎం భారత మేనేజర్ జానే ఎనోలా పేర్కొన్నారు. ప్రోత్సాహకరం: ఐకియా ‘‘సింగిల్ బ్రాండ్ రిటైలర్లకు సంబంధించి స్థానిక ఉత్పత్తుల సమీకరణ నిబంధనను ప్రభుత్వం సులభతరం చేయడాన్ని ఐకియా ఇండియా ఆహ్వానిస్తోంది. సింగిల్ బ్రాండ్ రిటైలర్లకు సంబంధించి వ్యాపార నిర్వహణను సులభంగా మార్చే ప్రభుత్వ చర్యలు ప్రోత్సాహకరంగా ఉన్నాయి’’ అని ఐకియా ఇండియా పేర్కొంది. -
సింగరేణి చరిత్రలోనే రికార్డు టర్నోవర్!
గోదావరిఖని/సాక్షి, హైదరాబాద్: సింగరేణి బొగ్గు గనుల సంస్థ 2018–19 ఆర్థిక సంవత్సరంలో తన చరిత్రలోనే అత్యధిక టర్నోవర్, బొగ్గు రవాణా, ఉత్పత్తి సాధించి సరికొత్త రికార్డు నెలకొల్పింది. గత ఆర్థిక సంవత్సరం కన్నా టర్నోవర్ (అమ్మకాల)లో 21 శాతం ,బొగ్గు రవాణాలో 5 శాతం ,బొగ్గు ఉత్పత్తిలో 4 శాతం వృద్ధిని సాధించింది. రికార్డు స్థాయిలో రూ.25,828 కోట్ల టర్నోవర్ సాధించింది. 2017–18లో సాధించిన రూ.21,323 కోట్ల టర్నోవర్ కన్నా ఇది 21 శాతం అధికం. బొగ్గు రవాణాలో నిర్దేశించుకున్న లక్ష్యాన్ని దాటి 101 శాతంతో 676.73 లక్షల టన్నుల బొగ్గును వివిధ పరిశ్రమలకు రవాణా చేసింది. అంతకు ముందు ఏడాది రవాణా చేసిన 646.19 లక్షల టన్నులతో పోల్చితే 5 శాతం వృద్ధి నమోదు చేసింది. 4 శాతం వృద్ధి రేటుతో 644.05 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించింది. అంతకు ముందు ఏడాది 620 లక్షల టన్నుల ఉత్పత్తి చేసింది. సింగరేణిచరిత్రలో ఇంతపెద్ద మొత్తం లో టర్నోవర్, బొగ్గు రవాణా, ఉత్పత్తి సాధిం చడం ఇదే తొలిసారి అని సంస్థ సీండీ ఎన్.శ్రీధర్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. సింగరేణి కార్మికులు, అధికారులు, పర్యవేక్షక సిబ్బందికి, యూనియన్ నేతలకు తన అభినందనలు తెలిపారు. ఇదే ఒరవడితో కొత్త ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధిస్తూ పురోగమించాలని పిలుపునిచ్చారు. బొగ్గు రవాణాకు సహకరించిన రైల్వే శాఖకు ఆయన తన ధన్యవాదాలు తెలియజేశారు. బొగ్గు రవాణాలో సరికొత్త రికార్డు గత ఆర్థ్ధిక సంవత్సరంలో మొత్తం 10,422 రైల్వేర్యాకుల ద్వారా బొగ్గురవాణా చేసిన కంపెనీ, ఈ ఏడాది 12,372 ర్యాకుల ద్వారా బొగ్గు రవాణా జరిపి 18.71 శాతం వృద్ధిని నమోదుచేసింది. గత ఏడాది సగటున రోజుకు 28.5 ర్యాకుల ద్వారా రవాణా జరగగా ఈ ఏడాది 34 ర్యాకులకు పెరిగింది. మార్చిలో అత్యధికంగా సగటున 41 ర్యాకుల ద్వారా బొగ్గు రవాణా జరగడం విశేషం. ఈ నెలలో మొత్తం 1,270 ర్యాకుల ద్వారా రవాణా జరిపారు. సింగరేణి వ్యాప్తంగా ఉన్న 11 ప్రాంతాల్లో కొత్తగూడెం, ఇల్లెందు, శ్రీరాంపూర్, మందమర్రి, అడ్రియా లాంగ్వాల్ ఏరియా ప్రాజెక్టులు గత ఏడాది కన్నా ఎక్కువ వృద్ధిని కనబరుస్తూ బొగ్గు ఉత్పత్తి, రవాణాలో ముందంజలో ఉన్నాయి. రైల్వే ద్వారా బొగ్గు రవాణాలో కూడా ఏరియా లు మంచి వృద్ధిని సాధించాయి. కొత్తగూడెం 18 శాతం, ఇల్లెందు 64, మందమర్రి 31.5, శ్రీరాంపూర్ 41.3, బెల్లంపల్లి 3.26, రామగుండం–2 ఏరియా 5 శాతం వృద్ధిని సాధించాయి. రైల్వే శాఖతో సమన్వయం బొగ్గును వెంటనే రవాణా చేయకపోతే స్టాకు పెరిగి ఇబ్బంది అవుతోంది. వినియోగదారుల అవసరాల మేరకు ఎప్పటికప్పుడు రైలు ర్యాకుల ద్వారా బొగ్గు రవాణా జరపటానికి సంస్థ యాజమాన్యం రైల్వే శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడుతూ అత్యధిక ర్యాకుల ద్వారా బొగ్గు రవాణా జరగడానికి చర్యలు తీసుకుంది. సింగరేణిలో గతంలో రోజుకు సగటున 30 ర్యాకులు దాటి బొగ్గు రవాణా జరగడంలేదు. కానీ ఈ ఏడాది ఇది 40 ర్యాకులకు చేరడం గమనార్హం. తెలంగాణ పవర్ హౌస్‌కు సరఫరా అనేక రాష్ట్రాల్లోని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు సరఫరా తగినంత లేక ఇబ్బందులు పడగా, సింగరేణి సంస్థ నుండి బొగ్గును స్వీకరిస్తున్న థర్మల్ విద్యుత్ కేంద్రాలు ఏవీ బొగ్గు కొరతను ఎదుర్కొనలేదు. గరిష్ఠ స్థాయిలో విద్యుత్ వినియోగం ఉన్న సమయంలో కూడా థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు లోటు రాకుండా చూడగలిగింది. టీఎస్‌జెన్‌కోతో ఉన్న ఒప్పం దం ప్రకారం 2018–19లో 106.7 లక్షల టన్ను ల బొగ్గు సరఫరా చేయాల్సి ఉండగా సింగరేణి 129.6 లక్షల టన్నుల బొగ్గును సరఫరా చేసింది. ఇది 21 శాతం ఎక్కువ. అలాగే ఎన్టీపీసీ కేంద్రాలకు ఒప్పందం ప్రకారం 112 లక్షల టన్నుల సరఫరా చేయాల్సి ఉండగా 119 లక్షల టన్నుల బొగ్గును సరఫరా చేసింది. అలాగే ఇతర రాష్ట్రాల్లోని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు కూడా తగినంత బొగ్గు సరఫరా చేయగలిగింది. ఆంధ్రప్రదేశ్‌కు 78 లక్షల టన్నులు, తమిళనాడుకు 8.4 లక్షల టన్నులు, కర్నాటకకు 54 లక్షల టన్నులు, మçహారాష్ట్రకు 42 లక్షల టన్నులు సరఫరా చేసింది. అలాగే వివిధ పరిశ్రమల్లో కాప్టివ్ పవర్ ప్లాంటులకు 37 లక్షల టన్నులు, సిమెంటు పరిశ్రమలకు 29 లక్షల టన్నులు, చిన్నతరహా పరిశ్రమలకు 15.6 లక్షల టన్నులు , సిరమిక్స్ తదితర 2,000 పరిశ్రమలకు 47 లక్షల టన్నుల బొగ్గును సరఫరా చేయడం జరిగింది. -
వందకోట్ల భారీ జరిమానా విధించిన ఎన్జీటీ..!
సిమ్లా: అక్రమ మైనింగ్‌ను ఆపలేకపోయిన కారణంగా మేఘాలయ ప్రభుత్వానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) భారీ జరిమానా విధించింది. ప్రభుత్వానికి 100 కోట్లు జరిమాన విధిస్తున్నట్లు సంస్థ చైర్మన్ ఏకే గోయల్ శనివారం తీర్పును వెలువరించారు. నిబంధనలకు విరుద్ధంగా లైసెన్స్ లేకుండా మైనింగ్‌ను నిర్వహిస్తున్న కంపెనీలకు రద్దు చేయాలని 2014లో ఎన్జీటీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అనంతరం రాష్ట్రంలోని మైనింగ్ పరిశీలనకు పర్యటించిన కమిటీ ఈఏడాది జనవరి 2న ఎన్జీటీకి నివేదికను అందించింది. రాష్ట్రంలో 24వేలకు పైగా అక్రమ మైనింగ్ కంపెనీలు ఉన్నట్లు కమిటీ గుర్తించింది. అక్రమ మైనింగ్ కారణంగా నీరు, గాలి, వాతావరణం కాలుష్యానికి గురువుతోందని తీర్పులో పేర్కొన్నారు. రెండు నెలల్లోగా కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు (సీపీసీబీ) వద్ద రూ.100 కోట్లు జమ చేయాలని గోయల్ ఆదేశించారు. మేఘాలయలోని బొగ్గు గనుల్లో ఇటీవల 15 మంది కార్మికులు చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. దట్టమైన చెట్లు ఉన్న కొండపై ఎలుక బొరియల్లా ఉండే గనుల్లో అక్రమంగా బొగ్గు తవ్వేందుకు కూలీలు లోపలికి వెళ్లారు. పక్కనే ప్రవహిస్తున్న లిటిల్ నది నీరు గనిలోకి ముంచెత్తడంతో కార్మికులు అందులోనే చిక్కుకుపోయారు. కొందరు ప్రాణాలతో బయటపడ్డారు. చిక్కుకుపోయిన వారిని కాపాడేందుకు ఎన్డీఆర్ఎఫ్, వైమానిక దళం, అగ్నిమాపక దళం రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపడుతున్నారు. ఘటన జరిగి రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు కార్మికుల ఆచూకి ఇప్పటివరకు దొరకటేదు. -
యాంత్రీకరణే శ్రీరామరక్ష
సాక్షి, హైదరాబాద్: సింగరేణి బొగ్గు గనుల సంస్థను యాంత్రీకరణ నిలబెడుతోంది. ఉద్యోగాల సంఖ్య తగ్గినా సంస్థను మాత్రం నష్టాల నుంచి యాంత్రీకరణే కాపాడుతోంది. సింగరేణి సంస్థలో 29 భూగర్భ, 17 ఓపెన్ కాస్ట్ కలిపి మొత్తం 45 బొగ్గు గనులున్నాయి. వీటిలో యాంత్రీకరణ సాయంతో నడుస్తున్న ఓపెన్ కాస్ట్ గనులు మాత్రమే లాభాలార్జిస్తున్నాయి. పూర్తిగా మానవ శక్తితో బొగ్గు తవ్వకాలు నిర్వహిస్తున్న భూగర్భ గనుల్లో చాలావరకు తీవ్ర నష్టాలే తెచ్చిపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో సంస్థ యాజమాన్యం కూడా యాంత్రీకరణకు పెద్దపీట వేస్తోంది. ఒకప్పుడు కార్మికుడు భూగర్భంలోకి వెళ్లి తవ్వితీయడం ఒక్కటే బొగ్గు నిక్షేపాల వెలికితీతకు మార్గంగా ఉండేది. కొన్నేళ్లుగా పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇటు భూగర్భ, అటు ఓపెన్ కాస్ట్ గనుల్లో కార్మికులను పరిమితంగా వినియోగిస్తూ అరుదైన, అత్యాధునిక యంత్రాల సాయంతో బొగ్గు నిక్షేపాలను సింగరేణి వెలికి తీస్తోంది. సింగరేణి బొగ్గు గనుల సంస్థ పనితీరుపై పాత్రికేయులకు అవగాహన కల్పించేందుకు గత బుధ, గురువారాల్లో హైదరాబాద్ నుంచి పాత్రికేయుల బృందాన్ని సంస్థ యాజమాన్యం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని ఆండ్రియాల లాంగ్వాల్ భూగర్భ గని, ఆర్జీ2 ఓపెన్‌కాస్ట్ గనికి తీసుకెళ్లింది. రెండు గనుల్లోనూ అత్యాధునిక యంత్రాలను పెద్ద ఎత్తున వినియోగిస్తున్నారు. మున్ముందు సాంకేతిక విద్య అభ్యసించిన వారికి మాత్రమే సింగరేణిలో ఉద్యోగాలు దొరికే పరిస్థితి కనిపిస్తోందంటే అతిశయోక్తి కాదు. అత్యాధునిక పరిజ్ఞానంతో.. ఆండ్రియాల భూగర్భ గనిలో 2014 అక్టోబర్ 15 నుంచి లాంగ్వాల్ పరిజ్ఞానం వినియోగం ప్రారంభమైంది. ఈ గని యాజమాన్యం ఆశించిన దానికంటే అధికంగా బొగ్గు ఉత్పత్తిని, దాంతోపాటే లాభాలను తెచ్చి పెడుతోంది. అత్యంత తీవ్ర, సంక్లిష్ట పరిస్థితులుండే భూగర్భ సొరంగం నుంచి జర్మన్ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ లాంగ్వాల్ మైనింగ్ యంత్రాలు టన్నుల కొద్దీ బొగ్గు నిక్షేపాలను నిమిషాల్లో వెలికి తీస్తున్నాయి. గతంలో పూర్తిగా కార్మిక శక్తిపై ఆధారపడి భూగర్భ గనుల్లో 300 నుంచి 350 మీటర్ల లోతు వరకే బొగ్గు తవ్వకాలు జరిపేవారు. లాంగ్వాల్ పరిజ్ఞానంతో ఇప్పుడు 800 మీటర్ల లోతు నుంచి కూడా బొగ్గును తవ్వి తీస్తున్నారు. తొలుత ఆండ్రియాలో 350 మీటర్ల లోతు వరకు ఓపెన్ కాస్ట్ గని విధానంలో బొగ్గు తవ్వకాలు జరిపారు. ఆ తర్వాత లాంగ్వాల్ పరిజ్ఞానంతో భూగర్భ గనిగా తీర్చిదిద్దారు. గతేడాది 2.5 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయగా, ఈ ఏడాది 3 మిలియన్ టన్నులను లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ గనిలో ఎలాంటి ప్రమాదం జరిగినా కంట్రోల్ రూంకు తక్షణం సమాచారం చేరేలా ఏకంగా 1,200 సెన్సార్లు ఏర్పాటు చేశారు. ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం సహజంగా భూగర్భ లోతుల్లోకి వెళ్లిన కొద్దీ ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతాయి. ఆండ్రియాల గనిలో ఏకంగా 800 మీటర్ల లోతులో పని చేయాల్సి ఉండటంతో ఎయిర్ చిల్లింగ్ ప్లాంట్ ద్వారా గని లోపలి ఉష్ణోగ్రతలను నియంత్రించడంతో కార్మికులు, అధికారులకు ఉక్కపోత తదితరాల నుంచి ఉపశమనం కలుగుతోంది. దేశంలో ఈ పరిజ్ఞానాన్ని కేవలం కోల్ ఇండియా సంస్థ, అది కూడా నైవేలీ బొగ్గు గనిలో మాత్రమే వాడుతోంది. అక్కడ కూడా కేవలం 350 మీటర్ల లోతు దాకా మాత్రమే బొగ్గు తవ్వకాలు జరుగుతున్నాయి. లాంగ్వాల్ పరిజ్ఞానంతో వెలికి తీసిన బొగ్గు చెన్నైలో తయారైన కన్వేయర్ బెల్టుల ద్వారా అప్పటికప్పుడు బయటికి రవాణా అయి రైల్వే వ్యాగన్లలోకి వచ్చి పడే వరకు పూర్తిగా సాంకేతిక సహాయంతో ఈ గని నిర్వహణ జరుగుతోంది. ఈ గనిలో బొగ్గు రవాణా కోసం లారీలను వినియోగించాల్సిన అవసరం కూడా లేకపోవడంతో నిర్వహణ ఖర్చు సైతం తగ్గింది. ఈ బొగ్గు గని నుంచి మరో 31 ఏళ్ల వరకు బొగ్గు తవ్వకాలు జరిపేందుకు అవకాశముందని సంస్థ యాజమాన్యం తెలిపింది. ప్రస్తుతం రోజుకు 10 వేల టన్నుల ద్వారా ఇక్కడ బొగ్గు ఉత్పత్తి జరుగుతుంది. ఇక్కడ ఉత్పత్తి చేసిన బొగ్గును బహిరంగ మార్కెట్లో టన్నుకు రూ.4 వేల నుంచి రూ.4500 వరకు విక్రయిస్తున్నారు. లాంగ్వాల్ పరిజ్ఞానాన్ని అమలు చేసేందుకు ఈ గనిపై సంస్థ యాజమాన్యం రూ.1,228 కోట్ల పెట్టుబడి పెట్టింది. విస్తరించనున్న ఆర్జీ 2 ఓపెన్ కాస్ట్ ఆర్జీ 2 ఓపెన్‌కాస్ట్ గనిని త్వరలో మరింత విస్తరించనున్నారు. దీన్ని 2,710.75 హెక్టార్లకు విస్తరించేందుకు సంస్థ యాజమాన్యం రంగం సిద్ధం చేసింది. ఇక్కడ 638.35 హెక్టార్ల పరిధిలో బొగ్గు నిక్షేపాలున్నట్లు సంస్థ గుర్తించింది. ఈ గనికి సమీపంలో ఉన్న బేగంపేట గ్రామాన్ని త్వరలో తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మొత్తం 2,700 మందికి పునరావాసం కల్పించడంతోపాటు ప్రత్యామ్నాయ నివాస ఏర్పాట్లను సంస్థ చేపట్టింది. దేశంలో ఎక్కడా లేని విధంగా కన్వేయర్ ఇన్ పిట్ క్రషింగ్ టెక్నాలజీతో నిర్వహిస్తున్న గని ద్వారా రోజుకు 15 నుంచి 20 టన్నుల బొగ్గు ఉత్పత్తి జరుగుతోంది. ఈ గనిలో సుమారు 1,200 మంది కార్మికులు పని చేస్తున్నారు. 1987లో గనిని ప్రారంభించగా 2010 నుంచి ఈ టెక్నాలజీని వినియోగంలోకి తెచ్చారు. మరో 27 ఏళ్ల పాటు గని నుంచి బొగ్గు వెలికితీసేందుకు సరిపడ నిక్షేపాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. -
తాడిచెర్ల బ్లాక్ ప్రైవేటుకు..
- ఏఎంఆర్ కంపెనీకి తవ్వకం పనులు అప్పగించిన సింగరేణి - 25 ఏళ్లపాటు ఓబీ, బొగ్గు తవ్వకాలకు ఒప్పందం కోల్‌బెల్ట్(భూపాలపల్లి): సింగరేణిలో నూతన అంకానికి తెరలేచింది. సంస్థ ఆవిర్భావం నుంచి భూగర్భ గనులు.. ఓసీల్లో సొంతంగా బొగ్గు వెలికితీయడంతో పాటు విదేశాల్లోనూ బొగ్గు వెలికితీతకు ప్రయత్నిస్తున్న సింగరేణి పురిటిగడ్డపై బొగ్గు వెలికితీత పనులను ప్రైవేటుకు అప్పగించింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా తాడిచెర్ల బ్లాక్–1 పరిధిలో ఓసీ తవ్వకం పనులను ఏఎంఆర్ అనే ప్రైవేటు కంపెనీకి అప్పగించింది. ఈ కంపెనీ 25 ఏళ్లపాటు ఓవర్ బర్డెన్(ఓబీ–పైన మట్టి తవ్వడం), బొగ్గు వెలికితీత పనులు చేయనుంది. ఈ మేరకు తాడిచెర్ల సమీపంలోని కాపురం గ్రామ పరిసరాల్లో 15 రోజులుగా పనులు కొనసాగిస్తోంది. తాడిచర్ల బ్లాక్–1 పరిధిలో పనులను ఏఎంఆర్ కంపెనీకి అప్పగిస్తూ గతంలోనే నిర్ణయం తీసుకోగా.. నెల క్రితం ఒప్పంద ప్రక్రియ పూర్తయింది. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో బొగ్గు బ్లాకులను ప్రైవేట్ కంపెనీలు దక్కించుకున్నా.. తెలంగాణ రాష్ట్రంలో ఇదే మొదటిసారి. మరో 3 నెలల్లో పూర్తి స్థాయిలో పనులు ప్రారంభించేందుకు ఏఎంఆర్ సంస్థ సిద్ధమవుతుండగా తొలిదశ పనులు చేపట్టింది. తాడిచెర్ల బ్లాక్–1 పనులు చేపట్టే సామర్థ్యం కలిగిన సింగరేణి సంస్థను విస్మరించి ప్రైవేట్ రంగం వైపు తెలంగాణ ప్రభుత్వం మొగ్గు చూపడంపై విమర్శలు వస్తున్నాయి. -
నిర్లక్ష్యం నీడలో ‘బెల్లంపల్లి’
బెల్లంపల్లి : కార్మికక్షేత్రం బెల్లంపల్లి తీవ్ర నిరాధరణకు గురవుతోంది. బొగ్గుట్టగా ప్రసిద్ధిగాంచిన ఈప్రాంతం క్రమేపీ ఉనికిని కోల్పోతోంది. బొగ్గు గనులు అంతరించి, జనరల్ మేనేజర్ కార్యాలయాన్ని తరలించి, విభాగాలను ఎత్తివేయడంతో సింగరేణి చిత్రపటం నుంచి బెల్లంపల్లి కనుమరుగయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిణామాలు కార్మికవర్గాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. జీఎం కార్యాలయం తరలింపుతో.. బెల్లంపల్లి కేంద్రంగా దశాబ్దాల కాలం పాటు కార్మికవర్గానికి సేవలు అందించిన సింగరేణి జనరల్ మేనేజర్ కార్యాలయాన్ని 2006 మే 1న రెబ్బెన మండలం గోలేటీటౌన్షిప్నకు తరలించారు. సింగరేణి ఉన్నతాధికారులు కొందరు తీసుకున్న అనాలోచిత విధానాల వల్ల జీఎం కార్యాలయాన్ని బెల్లంపల్లి నుంచి ఎత్తివేశారు. అప్పటి నుంచి క్రమంగా బెల్లంపల్లిలో ఉన్న వర్క్‌షాపు, స్టోర్, ఆటో గ్యారేజ్ తదితర విభాగాలను ఎత్తివేశారు. 18 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే పవర్‌హౌజ్‌ను ముంబైకి చెందిన ఓ ప్రైవేట్ కంపెనీకి అమ్మేశారు. విభాగాలు ఎత్తివేసి, జీఎం కార్యాలయాన్ని తరలించి ఈ ప్రాంతంలో పనిచేస్తున్న కార్మికులను నిర్ధాక్షిణ్యంగా ఇతర ప్రాంతాలకు బదిలీ చేసి బెల్లంపల్లి ప్రాభవాన్ని తగ్గించారు. ఏరియాలో సర్దుబాటుతో బెల్లంపల్లిని కొన్నాళ్ల పాటు గోలేటీ జీఎం కార్యాలయం పరిధిలో ఉంచారు. ఇక్కడ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను అడపాదడపా సింగరేణి అధికారులు పర్యటించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకున్నారు. రెండేళ్ల క్రితం బెల్లంపల్లిని మందమర్రి ఏరియాలో కలిపారు. బెల్లంపల్లిలోని సింగరేణికి చెందిన సుమారు 5 వేలకుపైబడి క్వార్టర్లు, సివిల్ విభాగం, ఎలక్ట్రిసిటీ, తిలక్‌స్టేడియం, బుధాగెస్ట్హౌజ్, ఎల్లందు క్లబ్ మందమర్రి ఏరియా పరిధిలో చేర్చగా, ఏరి యా ఆస్పత్రి నిర్వహణను బెల్లంపల్లి ఏరియా(గోలేటీటౌన్‌షిప్)కు కట్టబెట్టి బెల్లంపల్లిని రెండు ముక్కలుగా చేశారు. ఈ పరిణామాలతో కార్మికులు అవసరాల కోసం గోలేటీటౌన్‌షిప్, మందమర్రికి వెళ్లాల్సిన పరిస్థితి. చిన్నచూపు బెల్లంపల్లి ప్రస్తుతం రెండు ఏరియాల పరిధిలో కొట్టుమిట్టాడుతోంది. ఏ ఒక్క ఏరియాకు బెల్లంపల్లిపై ఆధిపత్యం లేకుండా పోయింది. బెల్లంపల్లి పట్ల సింగరేణి యాజమాన్యం చిన్నచూపు చూస్తుందనే ఆరోపణలు వస్తున్నాయి. ఇతర ఏరియాలకు జీవం పోసిన బెల్లంపల్లి ప్రస్తుతం ఉనికిని కోల్పోయి తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతోంది. ఈ పరిస్థితుల్లో కాసిపేట, శాంతిఖని గనులు బెల్లంపల్లిలో విలీనం చేసి జీఎం కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కార్మికవర్గం ముక్తకంఠంతో కోరుతోంది. ఆ తీరుగా చేసినట్లయితే బెల్లంపల్లికి పూర్వవైభవం వచ్చే అవకాశాలు ఉంటాయి. సింగరేణి అధికారులు ఇప్పటికైనా బెల్లంపల్లి భవిష్యత్ కోసం తగిన కార్యాచరణ రూపొందించాలని పలువురు కోరుతున్నారు. -
బొగ్గు గనులు, బీమా ఆర్డినెన్స్‌లకు రాష్ట్రపతి ఆమోదం
న్యూఢిల్లీ: బొగ్గు గనులు, బీమా రంగానికి సంబంధించిన రెండు ఆర్డినెన్సులపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శుక్రవారం సంతకాలు చేశారు. దీంతో బీమా రంగంలో మరింతగా విదేశీ పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) రాకకు వీలు కానుంది. అలాగే సుప్రీం కోర్టు గతంలో రద్దు చేసిన బొగ్గు గనులను తిరిగి కేటాయించేందుకూ సాధ్యపడనుంది. ఈ రెండు రంగాల్లో సంస్కరణలకు ఉద్దేశించిన బిల్లులు మంగళవారంతో ముగిసిన పార్లమెంటు సమావేశాల్లో ఆమోదానికి నోచుకోని నేపథ్యంలో కేంద్రం ఆర్డినెన్సుల మార్గాన్ని ఉపయోగించాలని కేంద్రం నిర్ణయించింది. అందుకు అనుగుణంగా బీమా బిల్లుపై ఒకటి, బొగ్గు గనుల కేటాయింపులకు సంబంధించి కొత్తగా మరొకటి ఆర్డినెన్సులు జారీ చేసేందుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. తాజాగా వీటికే రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితి పెంచడం వల్ల ఈ రంగంలో 6-8 బిలియన్ డాలర్ల మేర ఎఫ్‌డీఐలు రాగ లవని అంచనా వేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. తమ ప్రభుత్వం సంస్కరణలకు కట్టుబడి ఉందనేందుకు తాజా ఆర్డినెన్సులు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. అలాగే, పార్లమెంటులోని ఏదో ఒక సభలో కీలకాంశాలను అడ్డుకుంటూపోతే.. సుదీర్ఘకాలం నిరీక్షిస్తూ కూర్చునే పరిస్థితి ఉండబోదని ఇటు ఇతర దేశాలకు, అటు ఇన్వెస్టర్లకూ తెలియజేసినట్లయిందన్నారు. బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని 26 శాతం నుంచి 49 శాతం దాకా పెంచాలన్న ప్రతిపాదన 2008 నుంచి పెండింగ్‌లో ఉంది. రాజ్యసభ కమిటీ ఆమోదముద్ర పడినప్పటికీ మతమార్పిళ్లు మొదలైన ఇతర అంశాలపై పార్లమెంటులో దుమారం రేగినందు వల్ల ఇటీవలే ముగిసిన సమావేశాల్లో కూడా బీమా బిల్లుపై చర్చ సాధ్యపడలేదు. అటు, లోక్‌సభ ఆమోదించినప్పటికీ బొగ్గు గనులు బిల్లుకు కూడా మోక్షం లభించలేదు. -
‘తాడిచర్ల’ రద్దు
- జెన్కోకు అచ్చిరాని బొగ్గు సేకరణ - సుప్రీంకోర్టు తీర్పుతో గనులపై నీలినీడలు - చెల్పూర్ పవర్ ప్లాంట్‌కూ ఆటంకాలు - తొమ్మిదేళ్లలో రూ.120 కోట్లకు పైగా వ్యయం మంథని : మంథని మండలం తాడిచర్లలో అపారమైన బొగ్గు నిక్షేపాలు ఉన్నాయని గుర్తించిన ఎంఈసీఎల్ (మినరల్ ఎక్స్‌ప్లోరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్) సంస్థ 1989లో రెండేళ్లపాటు అన్వేషణ చేసింది. ఆ సమయంలో అప్పటి పీపూల్స్వార్ కార్యకలాపాలు ఉధృతంగా కొనసాగుతున్నాయి. వారి హెచ్చరికలతో ఆ సంస్థ బొగ్గు నిక్షేపాల అన్వేషణను నిలిపివేసింది. అనంతరం రంగంలోకి దిగిన సింగరేణి సంస్థ.. 1999లో ఆగిపోయిన పనులు మొదలుపెట్టింది. ఏడాది తర్వాత 2000 సంవత్సరంలో సింగరేణికి సంబంధించిన యంత్రాలను నక్సల్స్ తగులబెట్టారు. దీంతో తాడిచెర్ల-1, 2 బ్లాక్‌లను ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలని సింగరేణి అధికారులు నిర్ణయించారు. దీన్ని వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాలు 2013లో 17 రోజులపాటు సమ్మె చేపట్టాయి. దీంతో సింగరేణి సంస్థ, ప్రభుత్వం తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాయి. తిరిగి జెన్కో సంస్థ వరంగల్ జిల్లా భూపాలపల్లిలో నిర్మిస్తున్న కేటీపీపీ రెండోదశ విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి అవసరమైన బొగ్గును తాడిచర్ల బ్లాక్-1 నుంచి ఉత్పత్తి చేసుకుంటామని ప్రభుత్వానికి నివేదించింది. దీనికి సర్కారు ఆమోదించడంతో 2005లో సింగరేణి సంస్థ జెన్కోకు తాడిచర్ల బొగ్గుబ్లాకును అప్పగించింది. మొదటిసారిగా చేపట్టిన ఉపరితల బొగ్గు గనుల ఏర్పాటు తమకు మంచి ఫలితాలను తీసుకొస్తాయని జెన్కో భావించినా.. లాభాల మాట అటుంచితే తలనొప్పి తెచ్చిపెట్టింది. నిర్వాసితులకు పరిహారం చెల్లింపు తాడిచర్ల-1 ప్రాజెక్టుకు మొత్తం 2,186 ఎకరాలు అవసరమైంది. ఇందులో 752.33 ఎకరాలకు పట్టాదారులున్నట్లు గుర్తించి వారికి ఎకరాకు రూ.3.80 లక్షల చొప్పున రూ.32.07 కోట్లను పరిహారంగా అందించింది. మిగిలిన 1434 ఎకరాల అసైన్డ్ భూమికి చెల్లింపు కోసం రూ.33కోట్లు డిపాజిట్ చేసింది. ఈ సొమ్మును మరో పదిహేను రోజుల్లో నిర్వాసితులకు చెల్లిస్తామని రెవెన్యూ అధికారులు ప్రకటించారు. సుప్రీంకోర్టు తీర్పుతో ఆందోళన ఇన్ని చేశాక.. ఆ బ్లాక్ నుంచి బొగ్గు కేటాయింపులను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు తాజాగా తీర్పు చెప్పడంతో నిర్వాసితుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. 2015 మార్చి నాటికి చెల్పూర్ విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించేందుకు సిద్ధమవుతుండగా.. ఆ లోపు తాడిచర్ల బ్లాక్‌లో బొగ్గు సేకరణ చేయాలనే నిబంధన ఉంది. కానీ కేటాయింపుల్లో అక్రమాలు, పనుల ఆలస్యం కారణంగా బొగ్గు బ్లాక్ రద్దు కావడంతో గనుల ఏర్పాటుకు గ్రహణం పట్టుకున్నట్లయ్యింది. బొగ్గు గనులు ఏర్పాటైతే తాడిచర్లలో పారిశ్రామిక ప్రగతి సాద్యమవుతుందని ఈ ప్రాంత ప్రజలు ఆశలపై నీళ్లు చల్లినట్లయ్యింది. తాడిచర్ల ప్రాజెక్టు ప్రొఫైల్ ►1989లో ఏంఈసీఎల్ సంస్థ ఆధ్వర్యంలో బొగ్గు నిక్షేపాల కోసం అన్వేషణ ►అప్పటిపీపుల్స్వార్ హెచ్చరికలతో అన్వేషణ నిలిపివేత ►1999లో రంగంలోకి దిగిన సింగరేణి ►2000 సంవత్సరంలో యంత్రాలను తగులబెట్టిన మావోయిస్టులు ►1, 2 బ్లాక్‌లను ప్రైవేటు అప్పగిస్తూ సింగరేణి నిర్ణయం ►2013లో 17 రోజులు సమ్మె చేసిన కార్మిక సంఘాలు ►భూపాలపల్లిలోని కేటీపీపీ రెండోదశ విద్యుత్ కేంద్రానికి ఇక్కడి నుంచే బొగ్గు రవాణాకు జెన్కో సంసిద్ధత ►2005లో జెన్కో చేతికి తాడిచర్ల బొగ్గు బ్లాక్ ►నిర్వాసితులకు 32.07 కోట్లు చెల్లించిన జెన్కో ►1434 అసైన్డ్ భూములకూ రూ.33 కోట్లు డిపాజిట్ ►సుప్రీంకోర్టు నిర్ణయంతో తాజాగా రద్దయిన బ్లాక్‌లు -
కొండంత ఆశ
► భూగర్భ గనుల ప్రారంభానికి సీఎం చర్యలు ► సర్వే చేసిన అధికారులు ► 20 వేల మందికి ఉపాధి అవకాశాలు ► బెల్లంపల్లికి పూర్వవైభవం బెల్లంపల్లి : సింగరేణిలో భూగర్భగనులపై ఆశలు చిగురిస్తున్నాయి. తెలంగాణ సీఎం చంద్రశేఖర్‌రావు భూగర్భగనులను ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని సింగరేణి యాజమాన్యానికి సూచించడంతో బెల్లంపల్లి ఏరియాలో సర్వే చేసిన భూగర్భగనులకు మోక్షం లభిస్తుందనే ఆశ కార్మికుల్లో వ్యక్తమవుతోంది. 1927 సంవత్సరంలో తాండూర్ కోల్‌మైన్స్ పేరిట ఈ ప్రాంతంలో బొగ్గు గనుల తవ్వకాలు ప్రారంభమయ్యాయి. మార్గన్స్‌ఫిట్, సౌత్‌క్రాస్‌కట్, శాంతిఖని, బోయపల్లి, ఎంవీకే-1, 2, 3, 5, 6, గోలేటీ-1, 1ఎ గనులతో బెల్లంపల్లి వేలాది మంది కార్మికులతో రెండున్నర దశాబ్దాల క్రితం కళకళలాడింది. ఆ తర్వాత కొందరు సింగరేణి అధికారులు తీసుకున్న అనాలోచిత నిర్ణయాలు, కొన్ని గనుల భూగర్భ భౌగోళిక పరిస్థితులు, సాంకేతిక సమస్యలతో ఒక్కొక్కటిగా గనుల మూసివేతకు పాల్పడ్డారు. మార్గన్స్‌ఫిట్, సౌత్‌క్రాస్‌కట్, బోయపల్లి, ఎంవీకే-1,2,3,5,6 గనులను మూసివేసి ఇక్కడ పనిచేస్తున్న వేలాది మంది కార్మికులను ఇతర ప్రాంతాలకు బదిలీ చేశారు. బెల్లంపల్లిలో 7 మెగావాట్స్తో నిర్మించిన పవర్‌హౌస్‌ను అర్ధంతరంగా మూసివేసి ప్రైవేట్ సంస్థకు విక్రయించారు. వర్క్‌షాప్, స్టోర్, ఆటోగ్యారేజ్, రెస్య్కూస్టేషన్ తదితర విభాగాలను ఇతర ప్రాంతాలకు తరలించడంతో బెల్లంపల్లి ఏరియా క్రమంగా మనుగడను కోల్పోయింది. ప్రస్తుతం ఏరియా పరిధిలోని గోలేటీ, డోర్లి, కైరిగూడ ప్రాంతాల్లో మూడు ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టులు, ఒక భూగర్భ గని మాత్రమే పని చేస్తున్నాయి. ఏరియా వ్యాప్తంగా సుమారు 2,400 మంది కార్మికులు సింగరేణిలో విధులు నిర్వహిస్తున్నారు. బెల్లంపల్లి ఏరియా పరిధిలోని శాంతిఖని గనిని మందమర్రి ఏరియాలోకి విలీనం చేశారు. ఈ క్రమంలో కొత్తగా భూగర్భ గనులకు శ్రీకారం చుట్టాలని సీఎం ఆదేశించడంతో బెల్లంపల్లి ఏరియాలో సర్వే చేసిన భూగర్భ గనులు ప్రారంభమవుతాయనే కొండంత ఆశ కార్మికుల్లో వ్యక్తమవుతోంది. సర్వే చేసిన భూగర్భ గనులు బెల్లంపల్లి ఏరియా పరిధిలో ఐదు భూగర్భ గనుల కోసం కొన్నేళ్ల క్రితం సర్వే జరిగింది. సింగరేణికి చెందిన ఎక్స్‌ప్లోరేషన్ విభాగం అధికారులు ఈ మేరకు అన్వేషణ చేసి భూగర్భంలో అపారమైన బొగ్గు నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించారు. తాండూర్ మండలం మాదారం పరిధిలోని ఎంవీకే-1, 2 గనుల మధ్య సుమారు 20 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నట్లు కనుగొన్నారు. ఇక్కడ సుమా రు 300 మీటర్ల పరిధిలో బొగ్గు నిల్వలు ఉన్నట్లు నిర్ధారించారు. ఈ భూగర్భ గని జీవిత కాలం సుమారు 25 నుంచి 30 ఏళ్లుగా సర్వేలో వెల్లడైంది. బెల్లంపల్లి శివారులో బెల్లంపల్లి షాఫ్ట్‌బ్లాక్-1,2,3లను గుర్తించారు. ఆయా బ్లాక్‌లలో సుమారు 450 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయి. 300 నుంచి 350 మీటర్ల లోతులో బొగ్గు నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించిన అధికారులు భూగర్భ గనుల కోసం ప్రాజెక్టు రిపోర్టును తయారు చేశారు. ఆయా బ్లాక్‌ల జీవిత కాలం సుమారు 50 నుంచి 60 ఏళ్ల వరకు ఉంటుందని సూత్రప్రాయంగా నిర్ధారించారు. నెన్నెల మండలం శ్రావణ్పల్లిలో సుమారు 200 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలు బయటపడ్డాయి. ఇక్కడ సుమారు 250 నుంచి 300 మీటర్ల లోతులో బొగ్గు నిల్వలు ఉన్నట్లు సర్వే అధికారులు తేల్చారు. ఈ గని జీవిత కాలం సుమారు 30 నుంచి 40 ఏళ్లుగా ఉంటుందని అంచనా వేశారు. ఇందుకు సంబంధించి ప్రాజెక్టు రిపోర్టులు కూడా సింగరేణి యాజమాన్యం సిద్ధం చేసింది. ఆ రకంగా బెల్లంపల్లి ప్రాంతంలో ఐదు భూగర్భ గనులు ప్రారంభించడానికి అవకాశాలు ఉన్నాయి. వేలాది మందికి ఉపాధి భూగర్భ గనులు ప్రారంభించడం వల్ల బెల్లంపల్లికి పూర్వ వైభవం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ ప్రాంతంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది. కార్మికుల పిల్లలు ప్రధానంగా వారసత్వ ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడిగా ఎదురు చూస్తున్నారు. భూగర్భ గనులను ప్రారంభించడం వల్ల వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. ఒక్కో భూగర్భ గనిని ప్రారంభిస్తే సగటున 3 వేల నుంచి 4 వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆ తీరుగా ఐదు గనులను ప్రారంభించడం వల్ల సుమారు 20 వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కలుగుతుంది. తద్వారా బెల్లంపల్లి పారిశ్రామికంగా వృద్ధిలోకి వస్తుందని ఈ ప్రాంత ప్రజలు ఆశిస్తున్నారు. సీఎం కేసీఆర్ ఈ ఏడాదిలోపు రెండు, మూడు భూగర్భ బొగ్గు గనులను ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని సింగరేణి యాజమాన్యాన్ని ఆదేశించడంతో బెల్లంపల్లి ప్రాంతంలో భూగర్భ గని ప్రారంభమవుతుందనే ప్రచారం జరుగుతోంది. ఇందుకు సంబంధించి సింగరేణి అధికారులు కూడా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.