సాక్షి, హైదరాబాద్: సింగరేణి బొగ్గు గనుల సంస్థను యాంత్రీకరణ నిలబెడుతోంది. ఉద్యోగాల సంఖ్య తగ్గినా సంస్థను మాత్రం నష్టాల నుంచి యాంత్రీకరణే కాపాడుతోంది. సింగరేణి సంస్థలో 29 భూగర్భ, 17 ఓపెన్ కాస్ట్ కలిపి మొత్తం 45 బొగ్గు గనులున్నాయి. వీటిలో యాంత్రీకరణ సాయంతో నడుస్తున్న ఓపెన్ కాస్ట్ గనులు మాత్రమే లాభాలార్జిస్తున్నాయి. పూర్తిగా మానవ శక్తితో బొగ్గు తవ్వకాలు నిర్వహిస్తున్న భూగర్భ గనుల్లో చాలావరకు తీవ్ర నష్టాలే తెచ్చిపెడుతున్నాయి.
ఈ నేపథ్యంలో సంస్థ యాజమాన్యం కూడా యాంత్రీకరణకు పెద్దపీట వేస్తోంది. ఒకప్పుడు కార్మికుడు భూగర్భంలోకి వెళ్లి తవ్వితీయడం ఒక్కటే బొగ్గు నిక్షేపాల వెలికితీతకు మార్గంగా ఉండేది. కొన్నేళ్లుగా పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇటు భూగర్భ, అటు ఓపెన్ కాస్ట్ గనుల్లో కార్మికులను పరిమితంగా వినియోగిస్తూ అరుదైన, అత్యాధునిక యంత్రాల సాయంతో బొగ్గు నిక్షేపాలను సింగరేణి వెలికి తీస్తోంది. సింగరేణి బొగ్గు గనుల సంస్థ పనితీరుపై పాత్రికేయులకు అవగాహన కల్పించేందుకు గత బుధ, గురువారాల్లో హైదరాబాద్ నుంచి పాత్రికేయుల బృందాన్ని సంస్థ యాజమాన్యం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని ఆండ్రియాల లాంగ్‌వాల్ భూగర్భ గని, ఆర్‌జీ2 ఓపెన్‌కాస్ట్ గనికి తీసుకెళ్లింది. రెండు గనుల్లోనూ అత్యాధునిక యంత్రాలను పెద్ద ఎత్తున వినియోగిస్తున్నారు. మున్ముందు సాంకేతిక విద్య అభ్యసించిన వారికి మాత్రమే సింగరేణిలో ఉద్యోగాలు దొరికే పరిస్థితి కనిపిస్తోందంటే అతిశయోక్తి కాదు.
అత్యాధునిక పరిజ్ఞానంతో..
ఆండ్రియాల భూగర్భ గనిలో 2014 అక్టోబర్ 15 నుంచి లాంగ్‌వాల్ పరిజ్ఞానం వినియోగం ప్రారంభమైంది. ఈ గని యాజమాన్యం ఆశించిన దానికంటే అధికంగా బొగ్గు ఉత్పత్తిని, దాంతోపాటే లాభాలను తెచ్చి పెడుతోంది. అత్యంత తీవ్ర, సంక్లిష్ట పరిస్థితులుండే భూగర్భ సొరంగం నుంచి జర్మన్ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ లాంగ్‌వాల్ మైనింగ్ యంత్రాలు టన్నుల కొద్దీ బొగ్గు నిక్షేపాలను నిమిషాల్లో వెలికి తీస్తున్నాయి. గతంలో పూర్తిగా కార్మిక శక్తిపై ఆధారపడి భూగర్భ గనుల్లో 300 నుంచి 350 మీటర్ల లోతు వరకే బొగ్గు తవ్వకాలు జరిపేవారు. లాంగ్‌వాల్ పరిజ్ఞానంతో ఇప్పుడు 800 మీటర్ల లోతు నుంచి కూడా బొగ్గును తవ్వి తీస్తున్నారు. తొలుత ఆండ్రియాలో 350 మీటర్ల లోతు వరకు ఓపెన్ కాస్ట్ గని విధానంలో బొగ్గు తవ్వకాలు జరిపారు. ఆ తర్వాత లాంగ్‌వాల్ పరిజ్ఞానంతో భూగర్భ గనిగా తీర్చిదిద్దారు. గతేడాది 2.5 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయగా, ఈ ఏడాది 3 మిలియన్ టన్నులను లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ గనిలో ఎలాంటి ప్రమాదం జరిగినా కంట్రోల్ రూంకు తక్షణం సమాచారం చేరేలా ఏకంగా 1,200 సెన్సార్లు ఏర్పాటు చేశారు.
ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం
సహజంగా భూగర్భ లోతుల్లోకి వెళ్లిన కొద్దీ ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతాయి. ఆండ్రియాల గనిలో ఏకంగా 800 మీటర్ల లోతులో పని చేయాల్సి ఉండటంతో ఎయిర్ చిల్లింగ్ ప్లాంట్ ద్వారా గని లోపలి ఉష్ణోగ్రతలను నియంత్రించడంతో కార్మికులు, అధికారులకు ఉక్కపోత తదితరాల నుంచి ఉపశమనం కలుగుతోంది. దేశంలో ఈ పరిజ్ఞానాన్ని కేవలం కోల్ ఇండియా సంస్థ, అది కూడా నైవేలీ బొగ్గు గనిలో మాత్రమే వాడుతోంది. అక్కడ కూడా కేవలం 350 మీటర్ల లోతు దాకా మాత్రమే బొగ్గు తవ్వకాలు జరుగుతున్నాయి.
లాంగ్‌వాల్ పరిజ్ఞానంతో వెలికి తీసిన బొగ్గు చెన్నైలో తయారైన కన్వేయర్ బెల్టుల ద్వారా అప్పటికప్పుడు బయటికి రవాణా అయి రైల్వే వ్యాగన్లలోకి వచ్చి పడే వరకు పూర్తిగా సాంకేతిక సహాయంతో ఈ గని నిర్వహణ జరుగుతోంది. ఈ గనిలో బొగ్గు రవాణా కోసం లారీలను వినియోగించాల్సిన అవసరం కూడా లేకపోవడంతో నిర్వహణ ఖర్చు సైతం తగ్గింది. ఈ బొగ్గు గని నుంచి మరో 31 ఏళ్ల వరకు బొగ్గు తవ్వకాలు జరిపేందుకు అవకాశముందని సంస్థ యాజమాన్యం తెలిపింది. ప్రస్తుతం రోజుకు 10 వేల టన్నుల ద్వారా ఇక్కడ బొగ్గు ఉత్పత్తి జరుగుతుంది. ఇక్కడ ఉత్పత్తి చేసిన బొగ్గును బహిరంగ మార్కెట్లో టన్నుకు రూ.4 వేల నుంచి రూ.4500 వరకు విక్రయిస్తున్నారు. లాంగ్‌వాల్ పరిజ్ఞానాన్ని అమలు చేసేందుకు ఈ గనిపై సంస్థ యాజమాన్యం రూ.1,228 కోట్ల పెట్టుబడి పెట్టింది.
విస్తరించనున్న ఆర్జీ 2 ఓపెన్ కాస్ట్
ఆర్‌జీ 2 ఓపెన్‌కాస్ట్ గనిని త్వరలో మరింత విస్తరించనున్నారు. దీన్ని 2,710.75 హెక్టార్లకు విస్తరించేందుకు సంస్థ యాజమాన్యం రంగం సిద్ధం చేసింది. ఇక్కడ 638.35 హెక్టార్ల పరిధిలో బొగ్గు నిక్షేపాలున్నట్లు సంస్థ గుర్తించింది. ఈ గనికి సమీపంలో ఉన్న బేగంపేట గ్రామాన్ని త్వరలో తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మొత్తం 2,700 మందికి పునరావాసం కల్పించడంతోపాటు ప్రత్యామ్నాయ నివాస ఏర్పాట్లను సంస్థ చేపట్టింది. దేశంలో ఎక్కడా లేని విధంగా కన్వేయర్ ఇన్ పిట్ క్రషింగ్ టెక్నాలజీతో నిర్వహిస్తున్న గని ద్వారా రోజుకు 15 నుంచి 20 టన్నుల బొగ్గు ఉత్పత్తి జరుగుతోంది. ఈ గనిలో సుమారు 1,200 మంది కార్మికులు పని చేస్తున్నారు. 1987లో గనిని ప్రారంభించగా 2010 నుంచి ఈ టెక్నాలజీని వినియోగంలోకి తెచ్చారు. మరో 27 ఏళ్ల పాటు గని నుంచి బొగ్గు వెలికితీసేందుకు సరిపడ నిక్షేపాలు ఉన్నాయని అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment