Singareni: బొగ్గు ఉత్పత్తిలో వీరే కీలకం..  | Singareni Collieries Company Foundation Day: Coal Production Key Posts | Sakshi
Sakshi News home page

Singareni: బొగ్గు ఉత్పత్తిలో వీరే కీలకం.. 

Published Fri, Dec 23 2022 5:33 PM | Last Updated on Fri, Dec 23 2022 5:36 PM

Singareni Collieries Company Foundation Day: Coal Production Key Posts - Sakshi

కొత్తగూడెంలోని పీవీకే–5 షాఫ్ట్‌ గనిలో పనిచేస్తున్న కార్మికులు

సింగరేణి(కొత్తగూడెం): దక్షిణ భారతదేశానికి తలమానికంగా విరాజిల్లుతున్న సింగరేణి సంస్థ ఆవిర్భవించి నేటికి 134 సంవత్సరాలు కావస్తోంది. ప్రారంభంలో బొగ్గు తవ్వకానికే పరిమితమైన సింగరేణి.. క్రమంగా తెలంగాణ సహా ఏడు రాష్ట్రాల్లో విద్యుత్, సిమెంట్, పేపర్‌తో పాటు మరెన్నో పరిశ్రమలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా పాటు తోడ్పాటునందిస్తోంది. లక్షలాది మంది కుటుంబాలకు ఉపాధి కల్పిస్తోంది.

సింగరేణి ఖాళీ స్థలాల్లో 300 మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్లు ఏర్పాటు చేసి రోజుకు 10 లక్షల యూనిట్లు ఉత్పత్తి చేసి ప్రభుత్వ గ్రిడ్‌కు అందిస్తూ ఏడాదికి రూ.120 కోట్లు ఆర్జిస్తోంది. అంతేకాక అనేక సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ తన వంతు పాత్ర పోషిస్తోంది. 


నూతన టెక్నాలజీతో ఉత్పత్తి..

1889లో బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించిన సింగరేణి సుమారు 59 సంవత్సరాల పాటు మ్యాన్‌ పవర్‌ ద్వారా బొగ్గు ఉత్పత్తి చేసింది. ఆ తర్వాత 1948లో జాయ్‌ లోడర్‌ షటిల్‌ కార్‌ను, 1950లో క్యాప్‌ ల్యాంప్‌లు, 1951లో ఎలక్ట్రికల్‌ కోల్‌ డ్రిల్స్, 1953లో ఎలక్ట్రిక్‌ క్యాప్‌ ల్యాంప్స్, 1954లో ప్లేమ్‌ ప్రూఫ్‌ ఎలక్ట్రిక్‌ ఎక్విప్‌మెంట్లను వినియోగిస్తూ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచింది. 1975లో ఓపెన్‌కాస్ట్‌ గనులు, 1961లో రెస్క్యూ టీమ్‌ల ఏర్పాటు, 1979లో సైడ్‌ డిశ్చార్జ్‌ లోడర్, 1981లో లోడ్‌ హ్యాండ్‌ డంపర్స్‌ 1983లో లాంగ్‌ వాల్‌మైనింగ్, 1986లో వాకింగ్‌ డ్రాగ్‌లైన్, 1989లో ఫ్రెంచ్‌ బ్లాస్టింగ్‌ గ్యాలరీ మెథడ్‌ ఏర్పాటు చేసుకుంది.


గనుల్లో కార్మికుల నడకను తగ్గించేందుకు 1990లో మ్యాన్‌ రైడింగ్‌ చైర్‌ లిఫ్టింగ్‌ పద్ధతిని కొత్తగూడెం ఏరియాలోని వీకె–7షాఫ్ట్‌లో ఏర్పాటు చేసింది. 1994లో ఇన్‌పుట్‌ క్రషింగ్‌ కన్వేయర్‌ యంత్రాలను ప్రవేశ పెట్టింది. ఇలా అనేక రకాల నూతన టెక్నాలజీని వినియోగించి కార్మికులకు రక్షణతో పాటు అధిక బొగ్గు ఉత్పత్తికి అడుగులు వేసింది.  


బొగ్గు ఉత్పత్తిలో వీరే కీలకం.. 

ఫేస్‌ వర్కర్లు: బొగ్గు తీసే ప్రదేశంలో వీరు కీలక పాత్ర పోషిస్తారు. ఇందులో ఆపరేటర్లు, కోల్‌ కట్టర్లు, సపోర్ట్‌మెన్లు ఉంటారు.

► లైన్‌మెన్లు: ఉత్పత్తిలో ప్రధానమైన ఎస్‌డీఎల్, సీఎమ్మార్‌ యంత్రాలు నడిచేందుకు వీలుగా ట్రాక్‌లు వేయడం వీరి ప్రధాన విధి.

కన్వేయర్‌ ఆపరేటర్లు: బొగ్గును బయటికి తీసేందుకు అవసరమైన బెల్ట్‌ను నడుపుతారు.

► పంప్‌ ఆపరేటర్లు: బొగ్గుతీసే క్రమంలో భూమి పొరల నుంచి వచ్చే నీటిని ఎప్పటికప్పుడు బయటకు పంపిస్తారు.

► ఫిట్టర్లు: పని చేస్తున్న క్రమంలో మోటార్లు, యంత్రాలు మరమ్మతులకు గురైతే తక్షణమే రిపేర్‌ చేసి, పని ఆగకుండా చూస్తారు.

► ఎలక్ట్రీషియన్లు: గనుల్లో 24 గంటలూ విద్యుత్‌ అంతరాయం లేకుండా చూడడం వీరి ప్రధాన విధి.  పంపులకు, మోటార్లకు నిరంతరం విద్యుత్‌ సరఫరా చేస్తుండాలి.

► టెండాల్స్‌: బరువైన యంత్రాల విడి భాగాలను గనిలోకి చేర్చి, వాటిని బిగించే సమయంలో ఫిట్టర్లకు సహాయపడుతుంటారు.

► హాలర్‌ డ్రైవర్లు: బొగ్గు ఉత్పత్తికి, గనిలోని యంత్ర విభాగాలకు అంతరాయం కలగకుండా చూస్తుంటారు.

► జనరల్‌ మజ్దూర్లు: టెక్నికల్‌ సిబ్బంది ఎవరైనా విధులకు హాజరు కాకుంటే వారి స్థానంలో పనిచేసే వారికి వీరు తోడుగా ఉంటూ సహకరిస్తుంటారు.

► ఎలక్ట్రికల్, మైనింగ్‌ సూపర్‌వైజర్లు: గనిలో ఉత్పత్తికి సంబంధించిన పనులకు కార్మికులను పురమాయించడం, రక్షణ నిబంధనలను కార్మికులకు వివరిస్తూ, ఉత్పత్తికి అవసరమైన మెటీరియల అందిస్తుంటారు. వీరిని జూనియర్‌ అధికారులు అంటారు.

► సూపర్‌వైజర్లు, ఎలక్ట్రిక్‌ మెకానిక్‌లు: గనిలో ఎలక్ట్రికల్, యంత్రాలను నిత్యం పర్యవేక్షిస్తుంటారు. పని సమయంలో అవి ఆగకుండా చూడాల్సిన బాధ్యత వీరిదే.

► మైనింగ్‌ సర్దార్, ఓవర్‌మెన్లు: బొగ్గు పొరల్లో డ్రిల్లింగ్‌ వేసి, వాటిలో పేలుడు పదార్థాలతో బ్లాస్టింగ్‌ చేస్తేనే బొగ్గు వస్తుంది. ఆ తరువాత రూఫ్‌ సురక్షితంగా ఉందా లేదా అని పరిశీలించే బాధ్యత వీరిదే. అక్కడ పనిచేసే కార్మికులకు సైతం వీరే విధులు కేటాయిస్తుంటారు.

► అసిస్టెంట్‌ మేనేజర్లు: గనిలో అవసరమైన పనులను పర్యవేక్షించేవారు.

► ఇంజనీర్లు: యంత్రాల పర్యవేక్షణ, పనితీరు, రక్షణ చర్యలు, పనుల పర్యవేక్షణ, పనులకు సంబంధించిన రిపోర్టును ఉన్నతాధికారులకు అందించేవారు.

► రక్షణాధికారి : గనుల్లో కార్మికులు, ఉద్యోగుల రక్షణ వీరి విధి. ఎవరికైనా ప్రమాదం జరిగితే తక్షణమే వారికి అవసరమైన సహాయక చర్యలు చేపడతారు.

► వెంటిలేషన్‌ ఆఫీసర్‌: గనుల్లో గాలి, వెలుతురు, తాగునీటి సదుపాయం ఏర్పాటు చేయడం,  ప్రమాదాలు జరుగకుండా చూడడం వీరి బాధ్యత.

► సర్వేయర్‌: గనిని ప్రణాళిక ప్రకారం నడిపించి, బొగ్గు నిక్షేపాల గుర్తింపు, వాటిని ఏవిధంగా తీస్తే కంపెనీకి ఉపయోగకరంగా ఉంటుందో గమనించి అధికారులకు వివరించడం, కార్మికులకు పనులు పురమాయించడం వీరి విధి.

► ఆన్‌ షెట్టర్‌: గనిలోకి కార్మికులు, అధికారులను సిస్టమ్‌ ప్రకారం లోనికి పంపే యంత్రాన్ని(కేజీ) ఆపరేట్‌ చేస్తుంటారు.

► వైండింగ్‌ ఇంజన్‌ ఆపరేటర్‌: గనిలో అత్యంత ముఖ్యమైన వారు వైండింగ్‌ ఇంజన్‌ ఆపరేటర్లు. కేజీ గనిలోకి వెళ్లాలన్నా.. లోనికి వెళ్లిన కేజీ బయటకు రావాలన్నా వీరే కీలకం. 

► గని మేనేజర్‌: గని మొత్తం ఈ అధికారి ఆధీనంలో ఉంటుంది. గనికి కావాల్సిన ప్రతి మెటీరియల్‌ను ఏరియా స్టోర్స్‌ నుంచి తెప్పించడం, వాటి కేటాయింపు బాధ్యతలను పర్యవేక్షించడం, కార్మికులకు విధులు కేటాయించడంతో పాటు గని పర్యవేక్షణంతా ఈ అధికారిదే.  


గుండెకాయలా కార్పొరేట్‌

సింగరేణి సంస్థకు కార్పొరేట్‌ కార్యాలయం గుండెకాయలా పనిచేస్తోంది. ఇందులో ప్రధానంగా ఐదుగురు డైరెక్టర్లు, 53 మంది జీఎంలు విధులు నిర్వహిస్తుంటారు. సింగరేణి వ్యాప్తంగా ఉన్న గనులు, డిపార్ట్‌మెంట్లను మానిటరింగ్‌ చేస్తుంటారు. మొత్తంగా చూస్తే సంస్థలో 43 వేల మంది కార్మికులు, 2,400 మంది అధికారులు పని చేస్తున్నారు. మరో 10 లక్షల కుటుంబాలకు ఈ సంస్థ పరోక్షంగా ఉపాధి కల్పిస్తోంది. (క్లిక్ చేయండి: అక్షరదీపాలు.. నల్లసూరీళ్లు)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement