ఎఫ్‌డీఐ 2.0 | Doors open for FDI in coal mining, contract manufacturing | Sakshi
Sakshi News home page

ఎఫ్‌డీఐ 2.0

Published Thu, Aug 29 2019 5:10 AM | Last Updated on Thu, Aug 29 2019 5:13 AM

Doors open for FDI in coal mining, contract manufacturing - Sakshi

న్యూఢిల్లీ: నీరసించిన ఆర్థిక వ్యవస్థకు ఉత్తేజాన్నిచ్చేందుకు ప్రభుత్వం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (ఎఫ్‌డీఐ) మరోసారి ద్వారాలు తెరిచింది. బొగ్గు మైనింగ్, కాంట్రాక్టు తయారీ రంగాల్లోకి నూరు శాతం ఎఫ్‌డీఐలను ప్రభుత్వం అనుమతి అవసరం లేని ఆటోమేటిక్‌ మార్గంలో ఆహ్వానించింది. అలాగే, డిజిటల్‌ మీడియాలో ఇప్పటి వరకు ఎఫ్‌డీఐలకు అవకాశం లేకపోగా, ఇకపై 26 శాతం వరకు ఎఫ్‌డీఐలను స్వీకరించొచ్చు. బుధవారం ప్రధాని మోదీ ఆధ్వర్యంలో ఢిల్లీలో భేటీ అయిన కేంద్ర కేబినెట్‌ ఈ నిర్ణయాలు తీసుకుంది.

అలాగే, సింగిల్‌ బ్రాండ్‌ రిటైలర్లకు స్థానిక ఉత్పత్తులను సమీకరించుకునే విషయంలో మరింత వెసులుబాటు కల్పించింది. ఐదేళ్ల కనిష్ట స్థాయికి (5.8 శాతం) జీడీపీ వృద్ధి రేటు పడిపోవడంతో గత వారం పలు వర్గాలకు పన్ను రాయితీలు, ప్రోత్సాహకాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించగా.. వారం తిరగకముందే ఎఫ్‌డీఐలపై నిర్ణయం తీసుకోవడం ద్వారా ఆర్థిక వృద్ధి విషయంలో మరిన్ని చర్యలకూ అవకాశం ఉందని ప్రభుత్వం సంకేతాలు పంపినట్టయింది. గత 3–4 త్రైమాసికాలుగా దేశ వృద్ధి కుంటుపడిన విషయం గమనార్హం. ఈ ఏడాది మార్చితో ముగిసిన త్రైమాసికంలో నమోదైన జీడీపీ వృద్ధి 5.8 శాతం అన్నది ఐదేళ్ల కనిష్ట స్థాయి. దీంతో ప్రభుత్వరంగ బ్యాంకులకు రూ.70,000 కోట్ల తక్షణ నిధుల సాయం సహా పలు చర్యలను ప్రభుత్వం గతవారం ప్రకటించింది.

మరిన్ని పెట్టుబడులు, ఉద్యోగాలు..  
‘‘ఎఫ్‌డీఐ విధానంలో మార్పులు చేయడం వల్ల భారత్‌ ఎఫ్‌డీఐలకు గమ్యస్థానంగా మరింత ఆకర్షణీయంగా మారుతుంది. తద్వారా పెట్టుబడుల రాక పెరిగి, ఉపాధి, వృద్ధికి తోడ్పడుతుంది’’ అని కేబినెట్‌ భేటీ అనంతరం కేంద్ర వాణిజ్య శాఖా మంత్రి పీయూష్‌ గోయల్‌ మీడియాతో అన్నారు. దేశంలో వ్యాపార నిర్వహణను మరింత సులభంగా మార్చేందుకు గాను ఎఫ్‌డీఐ పాలసీని మరింత సరళీకరించడమే కేబినెట్‌ నిర్ణయాల ఉద్దేశంగా పేర్కొన్నారు. కాంట్రాక్టు తయారీలో నూరు శాతం ఎఫ్‌డీఐలను ఆటోమేటిక్‌ మార్గంలో అనుమతించడం వల్ల దేశీ తయారీ వృద్ధి చెందుతుందన్నారు.  

సింగిల్‌ బ్రాండ్‌ రిటైల్‌
సింగిల్‌ బ్రాండ్‌ రిటైల్‌ విభాగంలో 51 శాతానికి మించి ఎఫ్‌డీఐలను కలిగిన సంస్థ... 30 శాతం ఉత్పత్తులను స్థానిక మార్కెట్‌ నుంచే సమీకరించుకోవాలన్నది ప్రస్తుతమున్న నిబంధన. ఇటువంటి సంస్థలకు కార్యకలాపాల నిర్వహణలో గొప్ప వెసులుబాటు కల్పించేందుకు గాను, భారత్‌ నుంచి సేకరించే అన్ని రకాల ఉత్పత్తులను స్థానిక సమీకరణగానే గుర్తిస్తారు. అంటే భారత్‌లో విక్రయించేందుకు అయినా, విదేశాలకు ఎగుమతి చేసేందుకు సమీకరించినా ఈ వెసులుబాటు లభిస్తుంది. అలాగే, భౌతికంగా సింగిల్‌ బ్రాండ్‌ రిటైల్‌ దుకాణాలు ప్రారంభించడానికి ముందే ఆన్‌లైన్‌లో అమ్మకాలు మొదలు పెట్టుకునేందుకు కూడా అనుమతించింది. ‘‘ఆన్‌లైన్‌ విక్రయాలతో లాజిస్టిక్స్, డిజిటల్‌ చెల్లింపులు, కస్టమర్‌ కేర్, శిక్షణ, ఉత్పత్తులపై నైపుణ్యం విభాగాల్లో ఉద్యోగాలు వస్తాయి’’ అని మంత్రి గోయల్‌ తెలిపారు.

డిజిటల్‌ న్యూస్‌ మీడియా
డిజిటల్‌ మీడియాకు ఊతమిచ్చేందుకు ప్రభుత్వం మంచి ముందడుగు వేసిందనే చెప్పాలి. ప్రింట్‌ మీడియా తరహాలోనే... ఇకపై డిజిటల్‌ మీడియాలో వార్తలు, కరెంట్‌ అఫైర్స్‌ అప్‌లోడింగ్, స్ట్రీమింగ్‌ విభాగంలోకి ప్రభుత్వ అనుమతితో 26 శాతం వరకు ఎఫ్‌డీఐలు ప్రవేశించొచ్చు. ప్రింట్‌ మీడియాలో ఇప్పటికే ప్రభుత్వ అనుమతితో 26 శాతం ఎఫ్‌డీఐకి అనుమతి ఉంది. అలాగే, బ్రాడ్‌కాస్టింగ్‌ కంటెంట్‌ సేవల్లోనూ ప్రభుత్వ అనుమతితో 49 శాతం ఎఫ్‌డీఐలకు ప్రవేశం ఉంది.   

బొగ్గు రంగంలోకి ఇలా...
ప్రస్తుతం విద్యుత్‌ ప్రాజెక్టులు, ఐరన్, స్టీల్, సిమెంట్‌ ప్లాంట్ల సొంత వినియోగానికి ఉద్దేశించిన బొగ్గు, లిగ్నైట్‌ మైనింగ్‌లోకి ఆటోమేటిక్‌ మార్గంలో 100 శాతం ఎఫ్‌డీఐలకు అనుమతి ఉంది. ఇకపై బొగ్గు విక్రయాలు, మైనింగ్, కోల్‌ వాషరీ, క్రషింగ్, కోల్‌ హ్యాండ్లింగ్‌ తదితర బొగ్గు అనుబంధ విభాగాల్లోకీ వంద శాతం ఆటోమేటిక్‌ మార్గంలో ఎఫ్‌డీఐలను తెచ్చుకోవచ్చు.

ఐదేళ్లలో 286 బిలియన్‌ డాలర్లు
ఎఫ్‌డీఐ అన్నది ఆర్థిక వృద్ధికి కీలకమైన ఇంధనం వంటిది. రుణాల రూపంలో కాకుండా పెట్టుబడులుగా దేశాభివృద్ధికి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు తోడ్పడతాయి. ఇప్పటికే చాలా రంగాల్లోకి ప్రభుత్వం నూరు శాతం ఎఫ్‌డీఐలను ఆహ్వానించడం గమనార్హం. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల ఫలితంగా 2014–15 నుంచి 2018–19 వరకు దేశంలోకి 286 బిలియన్‌ డాలర్ల ఎఫ్‌డీఐలు వచ్చాయి. అంతకుముందు 5  ఏళ్లలో వచ్చిన 189 బిలియన్‌ డాలర్లతో పోలిస్తే మంచి వృద్ధి నమోదైంది. 2018–19లో వచ్చిన 64.37 బిలియన్‌ డాలర్ల ఎఫ్‌డీఐలు ఇప్పటి వరకు ఓ ఆర్థిక సంవత్సరంలో వచ్చిన గరిష్ట ఎఫ్‌డీఐలు కావడం గమనార్హం.

యాపిల్, వన్‌ప్లస్‌లకు ప్రయోజనం
దేశంలో సింగిల్‌ బ్రాండ్‌ రిటైల్‌ దుకాణాలకు సంబంధించి నిబంధనలను సరళీకరించడం వల్ల మొబైల్‌ హ్యాండ్‌సెట్‌ రిటైల్‌ మార్కెట్‌ అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతుందని, యాపిల్, వన్‌ప్లస్, ఒప్పో వంటి సంస్థలు సొంత దుకాణాలు తెరిచేందుకు మార్గం సుగమం అవుతుందని ఇండియా సెల్యులర్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ అసోసియేషన్‌ (ఐసీఈఏ) పేర్కొంది.  

పెట్టుబడులు పెరుగుతాయ్‌: హెచ్‌అండ్‌ఎం
‘‘ హెచ్‌అండ్‌ఎం గత 30 సంవత్సరాలుగా అంతర్జాతీయ మార్కెట్‌ కోసం భారత్‌ నుంచి సమీకరిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్‌ కోసం సమీకరించేవి కూడా ఇకపై 30 శాతం స్థానిక సమీకరణ కింద పరిగణించడం ఆహ్వానించతగినది. ఇది భారత్‌లో వ్యాపార నిర్వహణను సులభతరం చేస్తుంది. విదేశీ కంపెనీల నుంచి మరిన్ని పెట్టుబడులను ఆకర్షిస్తుంది’’ అని హెచ్‌అండ్‌ఎం భారత మేనేజర్‌ జానే ఎనోలా పేర్కొన్నారు.  

ప్రోత్సాహకరం: ఐకియా
‘‘సింగిల్‌ బ్రాండ్‌ రిటైలర్లకు సంబంధించి స్థానిక ఉత్పత్తుల సమీకరణ నిబంధనను ప్రభుత్వం సులభతరం చేయడాన్ని ఐకియా ఇండియా ఆహ్వానిస్తోంది. సింగిల్‌ బ్రాండ్‌ రిటైలర్లకు సంబంధించి వ్యాపార నిర్వహణను సులభంగా మార్చే ప్రభుత్వ చర్యలు ప్రోత్సాహకరంగా ఉన్నాయి’’ అని ఐకియా ఇండియా పేర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement