Contract manufacturing
-
ఎఫ్‌డీఐ 2.0
న్యూఢిల్లీ: నీరసించిన ఆర్థిక వ్యవస్థకు ఉత్తేజాన్నిచ్చేందుకు ప్రభుత్వం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (ఎఫ్‌డీఐ) మరోసారి ద్వారాలు తెరిచింది. బొగ్గు మైనింగ్, కాంట్రాక్టు తయారీ రంగాల్లోకి నూరు శాతం ఎఫ్‌డీఐలను ప్రభుత్వం అనుమతి అవసరం లేని ఆటోమేటిక్ మార్గంలో ఆహ్వానించింది. అలాగే, డిజిటల్ మీడియాలో ఇప్పటి వరకు ఎఫ్‌డీఐలకు అవకాశం లేకపోగా, ఇకపై 26 శాతం వరకు ఎఫ్‌డీఐలను స్వీకరించొచ్చు. బుధవారం ప్రధాని మోదీ ఆధ్వర్యంలో ఢిల్లీలో భేటీ అయిన కేంద్ర కేబినెట్ ఈ నిర్ణయాలు తీసుకుంది. అలాగే, సింగిల్ బ్రాండ్ రిటైలర్లకు స్థానిక ఉత్పత్తులను సమీకరించుకునే విషయంలో మరింత వెసులుబాటు కల్పించింది. ఐదేళ్ల కనిష్ట స్థాయికి (5.8 శాతం) జీడీపీ వృద్ధి రేటు పడిపోవడంతో గత వారం పలు వర్గాలకు పన్ను రాయితీలు, ప్రోత్సాహకాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించగా.. వారం తిరగకముందే ఎఫ్‌డీఐలపై నిర్ణయం తీసుకోవడం ద్వారా ఆర్థిక వృద్ధి విషయంలో మరిన్ని చర్యలకూ అవకాశం ఉందని ప్రభుత్వం సంకేతాలు పంపినట్టయింది. గత 3–4 త్రైమాసికాలుగా దేశ వృద్ధి కుంటుపడిన విషయం గమనార్హం. ఈ ఏడాది మార్చితో ముగిసిన త్రైమాసికంలో నమోదైన జీడీపీ వృద్ధి 5.8 శాతం అన్నది ఐదేళ్ల కనిష్ట స్థాయి. దీంతో ప్రభుత్వరంగ బ్యాంకులకు రూ.70,000 కోట్ల తక్షణ నిధుల సాయం సహా పలు చర్యలను ప్రభుత్వం గతవారం ప్రకటించింది. మరిన్ని పెట్టుబడులు, ఉద్యోగాలు.. ‘‘ఎఫ్‌డీఐ విధానంలో మార్పులు చేయడం వల్ల భారత్ ఎఫ్‌డీఐలకు గమ్యస్థానంగా మరింత ఆకర్షణీయంగా మారుతుంది. తద్వారా పెట్టుబడుల రాక పెరిగి, ఉపాధి, వృద్ధికి తోడ్పడుతుంది’’ అని కేబినెట్ భేటీ అనంతరం కేంద్ర వాణిజ్య శాఖా మంత్రి పీయూష్ గోయల్ మీడియాతో అన్నారు. దేశంలో వ్యాపార నిర్వహణను మరింత సులభంగా మార్చేందుకు గాను ఎఫ్‌డీఐ పాలసీని మరింత సరళీకరించడమే కేబినెట్ నిర్ణయాల ఉద్దేశంగా పేర్కొన్నారు. కాంట్రాక్టు తయారీలో నూరు శాతం ఎఫ్‌డీఐలను ఆటోమేటిక్ మార్గంలో అనుమతించడం వల్ల దేశీ తయారీ వృద్ధి చెందుతుందన్నారు. సింగిల్ బ్రాండ్ రిటైల్ సింగిల్ బ్రాండ్ రిటైల్ విభాగంలో 51 శాతానికి మించి ఎఫ్‌డీఐలను కలిగిన సంస్థ... 30 శాతం ఉత్పత్తులను స్థానిక మార్కెట్ నుంచే సమీకరించుకోవాలన్నది ప్రస్తుతమున్న నిబంధన. ఇటువంటి సంస్థలకు కార్యకలాపాల నిర్వహణలో గొప్ప వెసులుబాటు కల్పించేందుకు గాను, భారత్ నుంచి సేకరించే అన్ని రకాల ఉత్పత్తులను స్థానిక సమీకరణగానే గుర్తిస్తారు. అంటే భారత్‌లో విక్రయించేందుకు అయినా, విదేశాలకు ఎగుమతి చేసేందుకు సమీకరించినా ఈ వెసులుబాటు లభిస్తుంది. అలాగే, భౌతికంగా సింగిల్ బ్రాండ్ రిటైల్ దుకాణాలు ప్రారంభించడానికి ముందే ఆన్లైన్లో అమ్మకాలు మొదలు పెట్టుకునేందుకు కూడా అనుమతించింది. ‘‘ఆన్లైన్ విక్రయాలతో లాజిస్టిక్స్, డిజిటల్ చెల్లింపులు, కస్టమర్ కేర్, శిక్షణ, ఉత్పత్తులపై నైపుణ్యం విభాగాల్లో ఉద్యోగాలు వస్తాయి’’ అని మంత్రి గోయల్ తెలిపారు. డిజిటల్ న్యూస్ మీడియా డిజిటల్ మీడియాకు ఊతమిచ్చేందుకు ప్రభుత్వం మంచి ముందడుగు వేసిందనే చెప్పాలి. ప్రింట్ మీడియా తరహాలోనే... ఇకపై డిజిటల్ మీడియాలో వార్తలు, కరెంట్ అఫైర్స్ అప్లోడింగ్, స్ట్రీమింగ్ విభాగంలోకి ప్రభుత్వ అనుమతితో 26 శాతం వరకు ఎఫ్‌డీఐలు ప్రవేశించొచ్చు. ప్రింట్ మీడియాలో ఇప్పటికే ప్రభుత్వ అనుమతితో 26 శాతం ఎఫ్‌డీఐకి అనుమతి ఉంది. అలాగే, బ్రాడ్‌కాస్టింగ్ కంటెంట్ సేవల్లోనూ ప్రభుత్వ అనుమతితో 49 శాతం ఎఫ్‌డీఐలకు ప్రవేశం ఉంది. బొగ్గు రంగంలోకి ఇలా... ప్రస్తుతం విద్యుత్ ప్రాజెక్టులు, ఐరన్, స్టీల్, సిమెంట్ ప్లాంట్ల సొంత వినియోగానికి ఉద్దేశించిన బొగ్గు, లిగ్నైట్ మైనింగ్‌లోకి ఆటోమేటిక్ మార్గంలో 100 శాతం ఎఫ్‌డీఐలకు అనుమతి ఉంది. ఇకపై బొగ్గు విక్రయాలు, మైనింగ్, కోల్ వాషరీ, క్రషింగ్, కోల్ హ్యాండ్లింగ్ తదితర బొగ్గు అనుబంధ విభాగాల్లోకీ వంద శాతం ఆటోమేటిక్ మార్గంలో ఎఫ్‌డీఐలను తెచ్చుకోవచ్చు. ఐదేళ్లలో 286 బిలియన్ డాలర్లు ఎఫ్‌డీఐ అన్నది ఆర్థిక వృద్ధికి కీలకమైన ఇంధనం వంటిది. రుణాల రూపంలో కాకుండా పెట్టుబడులుగా దేశాభివృద్ధికి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు తోడ్పడతాయి. ఇప్పటికే చాలా రంగాల్లోకి ప్రభుత్వం నూరు శాతం ఎఫ్‌డీఐలను ఆహ్వానించడం గమనార్హం. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల ఫలితంగా 2014–15 నుంచి 2018–19 వరకు దేశంలోకి 286 బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐలు వచ్చాయి. అంతకుముందు 5 ఏళ్లలో వచ్చిన 189 బిలియన్ డాలర్లతో పోలిస్తే మంచి వృద్ధి నమోదైంది. 2018–19లో వచ్చిన 64.37 బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐలు ఇప్పటి వరకు ఓ ఆర్థిక సంవత్సరంలో వచ్చిన గరిష్ట ఎఫ్‌డీఐలు కావడం గమనార్హం. యాపిల్, వన్‌ప్లస్‌లకు ప్రయోజనం దేశంలో సింగిల్ బ్రాండ్ రిటైల్ దుకాణాలకు సంబంధించి నిబంధనలను సరళీకరించడం వల్ల మొబైల్ హ్యాండ్సెట్ రిటైల్ మార్కెట్ అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతుందని, యాపిల్, వన్‌ప్లస్, ఒప్పో వంటి సంస్థలు సొంత దుకాణాలు తెరిచేందుకు మార్గం సుగమం అవుతుందని ఇండియా సెల్యులర్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ) పేర్కొంది. పెట్టుబడులు పెరుగుతాయ్: హెచ్అండ్ఎం ‘‘ హెచ్అండ్ఎం గత 30 సంవత్సరాలుగా అంతర్జాతీయ మార్కెట్ కోసం భారత్ నుంచి సమీకరిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్ కోసం సమీకరించేవి కూడా ఇకపై 30 శాతం స్థానిక సమీకరణ కింద పరిగణించడం ఆహ్వానించతగినది. ఇది భారత్‌లో వ్యాపార నిర్వహణను సులభతరం చేస్తుంది. విదేశీ కంపెనీల నుంచి మరిన్ని పెట్టుబడులను ఆకర్షిస్తుంది’’ అని హెచ్అండ్ఎం భారత మేనేజర్ జానే ఎనోలా పేర్కొన్నారు. ప్రోత్సాహకరం: ఐకియా ‘‘సింగిల్ బ్రాండ్ రిటైలర్లకు సంబంధించి స్థానిక ఉత్పత్తుల సమీకరణ నిబంధనను ప్రభుత్వం సులభతరం చేయడాన్ని ఐకియా ఇండియా ఆహ్వానిస్తోంది. సింగిల్ బ్రాండ్ రిటైలర్లకు సంబంధించి వ్యాపార నిర్వహణను సులభంగా మార్చే ప్రభుత్వ చర్యలు ప్రోత్సాహకరంగా ఉన్నాయి’’ అని ఐకియా ఇండియా పేర్కొంది. -
రూపాయి దాటనంటున్న క్యాండీలు!
86% మార్కెట్ 50 పైసలవే విలువ చేకూరిస్తేనే అధిక ధరలో అమ్మకం కాంట్రాక్ట్ తయారీకి కన్ఫెక్షనరీ కంపెనీల మొగ్గు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఏంటీ! ఇది రూపాయా? రూపాయికి రెండొచ్చేవి ఇవ్వండి. ప్రతి కిరాణా షాపులో చాకొలేట్ల కోసం వచ్చే పిల్లలు, వారితో వచ్చే తల్లిదండ్రులతో సహజంగా రోజూ జరిగే చర్చ ఇది. క్యాండీ, ఇక్లెయిర్ సైజు ఎంత ఉందో పిల్లలకు అవసరం లేదు. వారికి కావాల్సిందల్లా రూపాయికి రెండు. ఈ అంశమే కన్ఫెక్షనరీ కంపెనీలకు మింగుడు పడడం లేదు. ధర 50 పైసల నుంచి రూపాయికి పెంచుదామంటే బడా కంపెనీల ధాటికి తట్టుకునే పరిస్థితి లేదు. ఇదంతా ఒక ఎత్తై ఇప్పుడు యువత కొత్త రుచులను కోరుకుంటున్నారు. అందుకే కంపెనీలు ఒక అడుగు ముందుకేసి క్రీమ్, పౌడర్ నింపిన క్యాండీలు, ఇక్లెయిర్స్ వంటి విలువ చేకూర్చిన వెరైటీలను ప్రవేశపెడుతున్నాయి. మార్కెట్లో నిలదొక్కుకోవాలన్నా, ధర పెంచి విక్రయించాలన్నా ఉత్పత్తులు ప్రత్యేకత చూపాల్సిందేనని కంపెనీలు అంటున్నాయి. కన్ఫెక్షనరీ రంగంలో దేశంలో పార్లే, ఐటీసీ, పర్ఫెట్టి, క్యాడ్బరీ, నెస్లే కంపెనీలదే హవా. రూపాయివి 14 శాతం మాత్రమే.. దేశంలో హార్డ్ బాయిల్డ్ క్యాండీల విపణి పరిమాణం 9 శాతం వార్షిక వృద్ధితో రూ.1,800 కోట్లుంది. ఇందులో రూపాయి క్యాండీల వాటా 14 శాతం మాత్రమే. 86 శాతం మార్కెట్ 50 పైసల క్యాండీలదేనంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. చక్కెర మినహా మిగిలిన ముడి పదార్థాల ధర పెరుగుతూ వస్తోంది. ఈ పరిస్థితుల్లో ధర పెంచలేక క్యాండీల సైజు తగ్గించాల్సి వస్తోందని కంపెనీలు అంటున్నాయి. సైజుతో, రుచితో సంబంధం లేదు. ఎక్కువ వస్తాయి కాబట్టే కస్టమర్లు 50 పైసలవి కొంటున్నారని రవి ఫుడ్స్ చైర్మన్ రమేశ్ అగర్వాల్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ‘కన్ఫెక్షనరీ రంగంలో విపరీత పోటీ ఉంది. డబ్బున్న కంపెనీలే ప్రకటనల ద్వారా ఉత్పత్తులకు ప్రచారం కల్పించుకుంటున్నాయి. పోటీలో నిలదొక్కుకోలేక చాలా కంపెనీలు ప్లాంట్లను మూసివేసుకుంటున్నాయి. చిన్నా, పెద్దా కంపెనీలు ఇప్పుడు కాంట్రాక్ట్ తయారీకి మొగ్గుచూపుతున్నాయి’ అని వివరించారు. చాకొలేట్ల విషయానికి వస్తే బహుమతులకు విదేశీవైతే బాగుంటుందన్న అభిప్రాయం పెరుగుతోందని చెప్పారు. అమ్మాలంటే విలువ చేకూర్చాల్సిందే.. 20 ఏళ్లుగా చాలా కంపెనీల క్యాండీలు, ఇక్లెయిర్స్ ధర రూపాయిని మించడం లేదని డీఎస్ గ్రూప్ న్యూ ప్రొడక్ట్ డెవలప్మెంట్ వైస్ ప్రెసిడెంట్ శశాంక్ సురానా తెలిపారు. రూ.2కు విక్రయించిన కొన్ని కంపెనీలు చేతులు కాల్చుకుని తిరిగి రూపాయికే పరిమితమయ్యాయని, ఇంత ఖరీదైన వెరైటీలకు మార్కెట్ రెడీగా లేదని చెప్పారు. క్యాండీలు, ఇక్లెయిర్స్ను రూపాయి, ఆపై ధరల విక్రయించాలంటే ప్రత్యేక రుచి, ప్యాక్, ఆకారంలో తయారు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. అందుకే పాస్పాస్ పల్స్ పేరుతో పౌడర్ నింపిన క్యాండీలను ప్రవేశపెట్టామన్నారు. రూపాయి క్యాండీలు, ఇక్లెయిర్స్ విభాగంలో క్యాడ్బరీ, నెస్లే, డీఎస్ గ్రూప్ ఉత్పత్తులకు డిమాండ్ ఉందని రమేశ్ అగర్వాల్ తెలిపారు. పోటీ ఇవ్వాలంటే రుచిలో భిన్నత్వం చూపాల్సిందేనన్నారు. ఇదీ కన్ఫెక్షనరీ మార్కెట్.. భారత కన్ఫెక్షనరీ మార్కెట్ రూ.14,925 కోట్లుందని ఏసీ నీల్సన్ సర్వే చెబుతోంది. ఇందులో చాకొలేట్లు 56%తో రూ.8,400 కోట్లు, నాన్ గమ్-నో చాకొలేట్స్(ఎన్జీఎన్సీ) 32%తో రూ.4,800 కోట్లు, గమ్స్ రూ.1,725 కోట్లు కైవసం చేసుకున్నాయి. ఎన్జీఎన్సీలో హార్డ్ బాయిల్డ్ క్యాండీల (హెచ్‌బీసీ) మార్కెట్ అత్యధికంగా 38 శాతం వాటాతో రూ.1,800 కోట్లుంది. ఆ తర్వాతి స్థానాల్లో ఇక్లెయిర్స్ రూ.1,600 కోట్లు, జెల్లీ, లాలీపాప్స్, కాఫ్ లోజెంజెస్ వంటి ఇతర ఉత్పత్తుల విభాగం మార్కెట్ పరిమాణం రూ.1,400 కోట్లుగా ఉంది. హార్డ్ బాయిల్డ్ క్యాండీల వినియోగంలో ముంబై, హైదరాబాద్‌లు టాప్-2 నగరాలు. పచ్చి మామిడికాయ రుచిలో ఉండే క్యాండీలే ఎక్కువ అమ్ముడవుతున్నాయి. హైదరాబాద్‌కు చెందిన రవి ఫుడ్స్ పలు బ్రాండ్ల కన్ఫెక్షనరీ ఉత్పత్తులను థర్డ్ పార్టీగా తయారు చేస్తోంది. అలాగే సొంతంగానూ విక్రయిస్తోంది. కంపెనీ దేశీయంగా రూ.50 కోట్లు, ఎగుమతులు ద్వారా మరో రూ.50 కోట్ల వ్యాపారం చేస్తోంది. భాగ్యనగరికి చెందిన సాంప్రె సైతం పలు బ్రాండ్లకు థర్డ్ పార్టీగా ఉంటూ సొంతంగానూ ఉత్పత్తులను అమ్ముతోంది.