భారత అత్యున్నత న్యాయస్థానం ఇటీవల మైనింగ్ రాయల్టీ కేసును విచారించి తీర్పును వెలువరించింది. ఖనిజాలు, గనులు కలిగి ఉన్న భూమిపై పన్నులు విధించే అధికారం రాష్ట్రాలకు ఉందని సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. దాంతో మైనింగ్ కంపెనీలపై దాదాపు రూ.2 లక్షల భారం పడవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. భారతీయ మైనింగ్ రంగం ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అత్యధిక పన్ను రేట్లను ఎదుర్కొంటుందని భారతీయ ఖనిజ పరిశ్రమల సమాఖ్య (ఫిమి) పేర్కొంది. సుప్రీం కోర్టు తీర్పు వల్ల మైనింగ్, ఉక్కు, విద్యుత్, బొగ్గు రంగాల్లోని సంస్థలు గణనీయంగా ప్రభావితం అవుతాయని ఫిమి విచారం వ్యక్తం చేస్తుంది. బొగ్గుపైనే ఆధారపడి విద్యుత్ తయారు చేసుకునే రాష్ట్రాలు ఇతర దేశాల నుంచి బొగ్గు దిగుమతి చేసుకోవాలని యోచిస్తున్నాయి.
సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం ఏప్రిల్ 1, 2005 నుంచి మైనింగ్ కంపెనీలు రాష్ట్రాలకు రాయల్టీలు చెల్లించాల్సి ఉంటుంది. ఖనిజాలు, గనులు ఎక్కువగా ఉన్న జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని కంపెనీలు దీనివల్ల ఎక్కువగా ప్రభావితం చెందుతాయి. బొగ్గు ఎక్కువ వెలికితీసి ఇతర రాష్ట్రాలకు సరఫరా చేసేది ఆ రాష్ట్రాలే. అయితే బొగ్గునే ఆధారంగా చేసుకుని విద్యుత్ తయారు చేసుకునే రాష్ట్రాలకు కోర్టు తీర్పుతో నష్టం జరిగే అవకాశం ఉందని కొందరు నిపుణులు భావిస్తున్నారు. రాష్ట్రాలకు రాయల్టీలు చెల్లించాలనే ఉద్దేశంతో కంపెనీలు బొగ్గు ధరను పెంచే ప్రమాదం ఉంది. అందుకు అనుగుణంగా రాష్ట్రాల ట్రాన్స్‌కోలు విద్యుత్ యూనిట్ ధరను పెంచుతాయి. అంతిమంగా సామాన్య ప్రజలపై భారం పడుతుంది. దాంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలపై స్థానిక ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది.
ఇదీ చదవండి: రూ.30 వేలకోట్ల ప్రాజెక్ట్‌లకు కేబినెట్ ఆమోదం
ఇప్పటికే చాలా రాష్ట్రాలు వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల ప్రచారంలో భాగంగా కొన్ని రాష్ట్రాల్లో గృహావరాలకు సైతం ఉచితంగా విద్యుత్‌ను అందిస్తామని పార్టీలు హామీ ఇచ్చాయి. ఆ పార్టీలే అధికారంలోకి రావడంతో విద్యుత్ సరఫరా భారంగా మారుతుంది. దానికితోడు సుప్రీం కోర్టు తీర్పు ప్రభావం చూపబోతుండడంతో విద్యుత్ తయారీకి అవసరమయ్యే బొగ్గును చౌకగా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాలని యోచిస్తున్నాయి. దేశీయ బొగ్గును మండిస్తే బూడిద ఎక్కువగా వెలువడి సామర్థ్యం తగ్గుతుందని గతంలో కొన్ని సర్వేలు వెల్లడించాయి. చైనా వంటి దేశాల్లోని బొగ్గుతో తక్కువ బూడిద వస్తుండడంతో దాన్ని దిగుమతి చేసుకునే అవకాశం ఉంది. ఇదిలాఉండగా, సుప్రీం కోర్టు తీర్పు వల్ల అంతిమ ఉత్పత్తులపై ప్రభావం పడుతుంది. దాంతో ద్రవ్యోల్బణం పెరుగుతుంది. పన్నుల విధానాన్ని స్థిరీకరించేందుకు, మైనింగ్ రంగం వృద్ధికి కేంద్ర ప్రభుత్వం శాసనపరమైన చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment