కరెంటు వాడాలంటే ‘కులం’ తేలాలి
విజయవాడ : ఎస్సీ, ఎస్టీ విద్యుత్ వినియోగదారులకు 50 యూనిట్ల విద్యుత్ పథకం కష్టాల్లో పడింది. సబ్సిడీ విద్యుత్‌ను వినియోగించుకుంటున్న వినియోగదారులు తాము ఎస్సీ, ఎస్టీ వర్గానికి చెందిన వారమంటూ కులధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాలని సర్కారు మెలిక పెట్టింది. దీంతో వివిధ జిల్లాల్లోని విద్యుత్ అధికారులు ఎస్సీ, ఎస్టీ వినియోగదారుల నుంచి ధ్రువీకరణ పత్రాలు తీసుకునే పనిలో పడ్డారు. కృష్ణా జిల్లా అధికారులు 30 వేల మందివి, ప్రకాశం జిల్లా అధికారులు 15 వేల మంది, గుంటూరు, నెల్లూరు జిల్లాల అధికారులు మరో 30 వేల మంది నుంచి సర్టిఫికెట్లు తీసుకుని బిల్లులతో జత చేసి సర్కారుకు పంపారు. మిగతా జిల్లాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి. అయినా ప్రభుత్వం తరఫున నిధులు కేటాయించాల్సిన జిల్లా సాంఘిక, గిరిజన సంక్షేమశాఖల అధికారులు బిల్లులు విడుదల చేయడం లేదు. దీంతో సహనం కోల్పోతున్న విద్యుత్ డిస్కంలు దశలవారీగా సరఫరాను నిలిపివేస్తున్నారు. ఫలితంగా దళితవాడల్లో కారుచీకట్లు కమ్ముకుంటున్నాయి. రాష్ట్రంలో దారిద్య్రరేఖకు దిగువనున్న ఎస్సీ, ఎస్టీ విద్యుత్ వినియోగదారులు నెలకు 50 యూనిట్ల వరకూ విద్యుత్‌ను వినియోగించుకునే వె సులుబాటు కల్పిస్తూ 2013 ఏప్రిల్ ఒకటో తేదీన అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ పథకాన్ని ప్రకటించారు. 22 జిల్లాల్లోని 17.6 లక్షల ఎస్సీ, ఎస్టీ విద్యుత్ వినియోగదారులకు ప్రయోజనకరంగా ఉండేలా నెలకు 50 యూనిట్లకు విద్యుత్ బిల్లుల చెల్లింపును ప్రభుత్వమే భరిస్తుందని ఆయన పేర్కొన్నారు.
రాష్ట్ర విభజన జరిగాక ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లోనూ ఈ విధంగా విద్యుత్‌ను వాడుకుంటున్న ఎస్సీ, ఎస్టీ వినియోగదారులు సుమారు 8.5 లక్షల మందికి పైగానే ఉన్నారు. గడచిన 14 నెలలుగా వీరికి సంబంధించిన విద్యుత్ సబ్సిడీ బకాయిలు ప్రభుత్వం నుంచి విద్యుత్ డిస్కంలకు విడుదల కావడంలేదు. మూడు నెలల కిందటే బిల్లులు సిద్ధం చేసిన ట్రాన్స్‌కో అధికారులు బకాయిల్ని జమ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అంతలోగానే ఎన్నికలు, రాష్ట్ర విభజన జరిగాయి. దీంతో నిధులు విడుదలలో జాప్యం జరిగింది. కృష్ణా జిల్లాలో మొత్తం 1.42 లక్షల మంది ఎస్సీ, ఎస్టీలు ఈ సదుపాయాన్ని పొందుతుండగా, వీరు వినియోగించుకున్న విద్యుత్ సబ్సిడీ కింద ప్రభుత్వం నుంచి రూ. 6 కోట్లకు పైగానే విడుదల కావాల్సి ఉంది. అలాగే ప్రకాశం జిల్లాకు రూ.6.40 కోట్లు, గుంటూరు జిల్లాకు రూ. 7.20 కోట్లు, అనంతపురం జిల్లాకు రూ.13 కోట్లు విడుదల కావాల్సి ఉంది. మిగతా జిల్లాల్లోనూ సగటున 5 నుంచి రూ. 8 కోట్ల వరకూ బకాయిలు జమ కావాల్సి ఉంది. ఈ మొత్తం బకాయిలు సుమారు రూ. 80 కోట్లకు పైగానే ఉందని అధికారులు చెబుతున్నారు. దీనిలో ఎంతో కొంత జమ చేస్తేనే నష్టాల నుంచి గట్టెక్కుతామని విద్యుత్ సంస్థలు ప్రభుత్వానికి విన్నవించినా ఫలితం కనిపించడంలేదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే విద్యుత్ సరఫరా నిలిపివేయడం తప్ప తమకు మరో మార్గాంతరం లేదని విద్యుత్ సంస్థలు తేల్చిచెప్తున్నాయి.