ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు సుప్రీం గ్రీన్‌ సిగ్నల్‌ | Supreme Court Green Signal To SC ST Sub Classification | Sakshi
Sakshi News home page

ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు సుప్రీం గ్రీన్‌ సిగ్నల్‌

Published Fri, Aug 2 2024 4:42 AM | Last Updated on Fri, Aug 2 2024 4:42 AM

Supreme Court Green Signal To SC ST Sub Classification

రాష్ట్రాలు ఈ రిజర్వేషన్లను ఉప వర్గీకరణ చేయొచ్చు

రాజ్యాంగ ధర్మాసనం చరిత్రాత్మక తీర్పు

అంతర్గత వివక్ష కారణంగా ఎస్సీ, ఎస్టీ వర్గాలు అభివృద్ధి చెందలేకపోతున్నాయి 

వీటిలో ఉప వర్గాల ఏర్పాటుకు ఆర్టీకల్‌ 14 అనుమతిస్తోంది 

ఈ మేరకు ఉప వర్గీకరణ చేసుకునేందుకు రాష్ట్రాలకు అనుమతిస్తున్నాం 

ఒకే సబ్‌క్లాస్‌కు మొత్తం రిజర్వేషన్‌ను కేటాయించకూడదు 

ఏయే సబ్‌క్లాస్‌లకు రిజర్వేషన్‌ ఫలాలు అందడం లేదన్న డేటా ఆధారంగా వర్గీకరణ చేయాలని సూచన 

2004 నాటి ‘ఈవీ చిన్నయ్య’ కేసులోని తీర్పును పక్కనపెట్టిన ధర్మాసనం 

ఏడుగురు జడ్జీలలో ఆరుగురు అనుకూలంగా.. ఒకరు వ్యతిరేకంగా తీర్పు 

రాష్ట్రాలు తగిన మార్గదర్శకాలు రూపొందించుకోవచ్చని సూచన 

ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ తీర్పు రాష్ట్రాలకే పరిమితం!

కేంద్ర ప్రభుత్వ సంస్థలు, విద్యా సంస్థలకు వర్తించదంటున్న నిపుణులు  

ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలో క్రీమీలేయర్‌ అమలు చేయాలన్న జస్టిస్‌ బీఆర్‌ గవాయి, జస్టిస్‌ విక్రమ్‌నాథ్, జస్టిస్‌ సతీశ్‌చంద్ర శర్మ

రిజర్వేషన్లు ఒక్క తరానికే పరిమితం చేయాలన్న జస్టిస్‌ పంకజ్‌ మిత్తల్‌ 

రాష్ట్రాలకు ఉప వర్గీకరణ చేసేందుకు అర్హత లేదన్న జస్టిస్‌ బేలా ఎం.త్రివేది

  ‘‘ఎస్సీ, ఎస్టీ వర్గాలు అంతర్గత వివక్ష కారణంగా అభివృద్ధి చెందలేకపోతున్నాయి. అందుకే ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను ఉప వర్గీకరణ చేసుకోవడానికి రాష్ట్రాలకు అనుమతి ఇస్తున్నాం. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 14 కూడా ఒక వర్గంలో ఉప వర్గాలను ఏర్పాటు చేసేందుకు అనుమతిస్తోంది. ఈ క్రమంలో 2004 నాటి ఈవీ చిన్నయ్య కేసులోని తీర్పును వ్యతిరేకిస్తున్నాం. అయితే ఉప వర్గీకరణ సమయంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఏదో ఒక సబ్‌ క్లాస్‌కు మొత్తం రిజర్వేషన్‌ను కేటాయించ కూడదు. అంతేగాకుండా ఏయే ఉప వర్గాలు రిజర్వేషన్‌ ఫలాలు అందుకోలేక పోతున్నాయన్న డేటా ఆధారంగా వర్గీకరణ జరగాలి’’  – సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం  

సాక్షి, న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణకు సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం పచ్చజెండా ఊపింది. అత్యంత వెనుకబడిన ఉప కులాలకు ఊతమిచ్చేందుకు వీలుగా రాష్ట్రాలు ఆయా రిజర్వేషన్లను వర్గీకరణ చేసుకోవచ్చని తెలిపింది. రాజ్యాంగంలోని 14వ, 341వ ఆర్టికల్‌లు ఈ ఉప కోటాకు అడ్డంకి ఏమీ కాదని తేల్చింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ఏడుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం గురువారం చరిత్రాత్మక తీర్పు ఇచ్చింది. దీనితో విద్య, ఉద్యోగాలలో అమలవుతున్న ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను సబ్‌క్లాస్‌లుగా వర్గీకరించి.. ఆయా వర్గాల్లో అత్యంత వెనుకబడిన కులాలకు ప్రాతినిధ్యం కల్పించేందుకు మార్గం సుగమం కానుంది. 

25 ఏళ్లుగా నానుతున్న వర్గీకరణ!
దేశంలో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను ఆయా వర్గాల్లోని కొన్ని కులాల వారే పొందుతున్నారని.. అందువల్ల ఈ రిజర్వేషన్లను వర్గీకరించాలని చాలా కాలం నుంచి డిమాండ్లు ఉన్నాయి. దీనికి సంబంధించి 2000వ సంవత్సరంలో ఉమ్మడి ఏపీలో చేసిన రిజర్వేషన్ల చట్టం, దానిని కొట్టివేస్తూ 2004లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు, పంజాబ్‌ రాష్ట్ర ప్రభుత్వం చేసిన రిజర్వేషన్ల చట్టాన్ని ఈ తీర్పు ఆధారంగా పంజాబ్‌–హరియాణా హైకోర్టు కొట్టివేయడం తదితర పరిణామాలతో ఈ అంశం సుప్రీంకోర్టుకు చేరింది.

తొలుత దీనిపై (పంజాబ్‌ వర్సెస్‌ దేవీందర్‌సింగ్‌ కేసు) విచారణ జరిపిన ఐదుగురు జడ్జీల సుప్రీంకోర్టు ధర్మాసనం.. పూర్తిస్థాయిలో పునర్విచారణ నిమిత్తం చీఫ్‌ జస్టిస్‌ నేతృత్వంలోని ఏడుగురు జడ్జీల రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసింది. ఈ ధర్మాసనం ‘‘రాజ్యాంగం నిర్దేశించిన రిజర్వేషన్లను ఉప వర్గీకరణ చేయడం 14, 15, 16 ఆర్టికల్‌లకు భంగం కలిగిస్తుందా? షెడ్యూల్డ్‌ కులాలు/తెగలు సజాతీయమేనా (ఒకేవర్గం కింద పరిగణించవచ్చా?) లేక భిన్నమైన వర్గాల సమూహమా? ఆర్టికల్‌ 341కు ఇవి భిన్నమా? ఉప వర్గీకరణ పరిధిలో ఏమైనా పరిమితులు ఉన్నాయా?’’ అన్న అంశాలను లోతుగా పరిశీలించింది. ఈ కేసుకు సంబంధించి అన్ని వర్గాల వాదనలు విని.. ఈ ఏడాది ఫిబ్రవరి 8న తీర్పును రిజర్వు చేసింది. తాజాగా గురువారం తీర్పు వెలువరించింది.

నెహ్రూ వ్యాఖ్యలను కోట్‌ చేస్తూ..
‘‘మతపరంగా, కుల ప్రాతిపదికన రిజర్వేషన్లు కొనసాగితే భారతదేశం రెండో లేదా మూడో గ్రేడ్‌ దేశంగా మారుతుంది. ఈ మార్గం మూర్ఖత్వం మాత్రమే కాదు. విపత్తు కూడా. కానీ వెనుకబడిన వర్గాలకు అన్ని విధాలుగా సహాయం చేయాల్సి ఉంది..’’ అన్న మాజీ ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ వ్యాఖ్యలను ధర్మాసనం తమ తీర్పులో ఉటంకించింది.

మన తొలితరాల వారు, న్యాయమూర్తులతోపాటు మాజీ ప్రధాని కూడా.. ఏ వర్గం లేదా కులానికి చెందినవారికి పూర్తిగా కుల ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించే అంశాన్ని వ్యతిరేకించారని.. మెరిట్‌ ప్రాతిపదికన దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకున్నారని పేర్కొంది. ఈ విధమైన అభిప్రాయాలు ఉన్నప్పటికీ వెనుకబడిన తరగతుల్లో కొంతమంది ముందుకుసాగడంలో ఇబ్బంది పడుతున్నారని.. వారికి చేయూతనివ్వడం ఎంతో అవసరమని తెలిపింది. ఈ నేపథ్యంలోనే రిజర్వేషన్ల ఉప వర్గీకరణకు ధర్మాసనం అనుమతిస్తోందని వెల్లడించింది. ఈ మేరకు 565 పేజీల తీర్పు వెలువరించింది. ఈ తీర్పునకు అనుగుణంగా రాష్ట్రా లు తదుపరి మార్గదర్శకాలు రూపొందించుకోవచ్చని సూచించింది.

ఆరుగురు అనుకూలం.. ఒకరు వ్యతిరేకం
ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశంపై ఏడుగురు సభ్యుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరిపింది. ఇందులో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్‌ బీఆర్‌ గవాయి, జస్టిస్‌ విక్రమ్‌నాథ్, జస్టిస్‌ బేలా ఎం త్రివేది, జస్టిస్‌ పంకజ్‌ మిత్తల్, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రా, జస్టిస్‌ సతీశ్‌చంద్ర శర్మ ఉన్నారు. వీరిలో జస్టిస్‌ బేలా త్రివేదీ వర్గీకరణను విభేదించగా.. మిగతా ఆరుగురు న్యాయమూర్తులు సమర్థించారు. చీఫ్‌ జస్టిస్‌ డీవై చంద్రచూడ్, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రా కలిపి ఒకే తీర్పు ఇవ్వగా, మిగతా జడ్జీలు వేర్వేరుగా తమ తీర్పులు ఇచ్చారు. దీనితో మొత్తం ఆరు తీర్పులు వెలువడ్డాయి. మెజారిటీ న్యాయమూర్తులు అనుకూలంగా ఉండటంతో.. ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు ధర్మాసనం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్టు అయింది.

కేంద్ర ఉద్యోగాలు, విద్యాసంస్థలకు ‘వర్గీకరణ’ వర్తించనట్లే!
సాక్షి, హైదరాబాద్‌: ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్రాల పరిధిలోని విద్యా సంస్థలు, ఉద్యోగాలు, పదోన్నతులకు మాత్రమే వర్తిస్తుందని న్యాయ నిపుణులు, ఎమ్మార్పీస్‌ నేతలు చెప్తున్నారు. సుప్రీం తీర్పు కేంద్ర ప్రభుత్వ, కేంద్ర సంస్థల్లోని ఉద్యోగాలు, విద్యా సంస్థలపై ప్రభావం చూపదని అంటున్నారు. రాష్ట్రాలు చేసిన చట్టాలపైనే సుప్రీంకోర్టులో విచారణ జరిగిందని.. కోర్టు కూడా రాష్ట్రాలు ఉప వర్గీకరణ చేసుకోవచ్చనే దానిపైనే తాజా తీర్పు ఇచ్చిందని వివరిస్తున్నారు.

ఇందులో జాతీయ స్థాయిలో, కేంద్ర సంస్థల్లో రిజర్వేషన్ల వర్గీకరణకు సంబంధించిన అంశమేదీ లేదని స్పష్టం చేస్తున్నారు. అంతేగాకుండా రాష్ట్రాల వారీగా ఎస్సీ, ఎస్టీ వర్గాలు, కులాలు, తెగలు విభిన్నంగా ఉంటాయని.. వాటిని కేంద్ర స్థాయిలో వర్గీకరించడం సాధ్యమయ్యే పనికాదని అభిప్రాయపడుతున్నారు. కాగా.. ఎస్సీల్లోని మాదిగ వర్గం కేంద్ర సంస్థల్లో రిజర్వేషన్ల వర్గీకరణ గురించి ఇప్పటివరకు ఎలాంటి డిమాండ్‌ చేయలేదని, దేశవ్యాప్తంగా ఎలాంటి ఉద్యమం జరగలేదని తెలంగాణ రాష్ట్ర ఎమ్మార్పీస్‌ అధ్యక్షుడు నరేశ్‌ చెప్పారు. కేంద్ర ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో వర్గీకరణపై ఇప్పటివరకు తాము దృష్టి పెట్టలేదన్నారు.

వెనుకబాటు ఆధారంగా ఉప వర్గీకరణ
‘‘షెడ్యూల్డ్‌ కులాలు సజాతీయ తరగతి (ఒకే వర్గానికి చెందిన సమూహం) కాదని సూచించే చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఈ రిజర్వేషన్ల ఉప వర్గీకరణ రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 14 కింద పొందుపరిచిన సమానత్వ సూత్రాన్ని గానీ.. ఆర్టికల్‌ 341(2)ను గానీ ఉల్లంఘించదు. ఆర్టికల్‌ 15, ఆర్టికల్‌ 16లలో కూడా రిజర్వేషన్లను ఉప వర్గీకరణ చేయకుండా రాష్ట్రాలను నిరోధించేది ఏమీ లేదు.

ఉప వర్గీకరణ అయినా, మరేదైనా నిశ్చయాత్మక చర్య అయినా.. వాటి లక్ష్యం వెనుకబడిన తరగతులకు సమాన అవకాశాలు కల్పించడమే. కొన్ని కులాలకు తగిన ప్రాతినిధ్యం లేకపోవడం ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఉప వర్గీకరణ చేయవచ్చు. అయితే ఏదైనా కులం/ఉప వర్గానికి ప్రాతినిధ్యం అందకపోవడానికి దాని వెనుకబాటుతనమే కారణమని రాష్ట్ర ప్రభుత్వం నిర్ధారించుకోవాలి. ఆ కులం/ ఉప వర్గానికి ప్రాతినిధ్యం అందకపోవడంపై డేటాను సేకరించాలి. అందుకు అనుగుణంగా ఉప వర్గీకరణ చేయాలి..’’ – జస్టిస్‌ డీవై చంద్రచూడ్, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రా

రిజర్వేషన్లు ఒక తరానికే పరిమితం చేయాలి
ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ఉప వర్గీకరణను సమర్థిస్తున్నాను. అయితే ఏ రిజర్వేషన్లు అయినా మొదటి తరానికి లేదా ఒక తరానికి మాత్రమే వర్తింపజేయాలి. కుటుంబంలోని ఏదైనా తరం రిజర్వేషన్‌ను సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థితిని సాధిస్తే.. రిజర్వేషన్ల ప్రయోజనం లాజికల్‌గా రెండో తరానికి అందుబాటులో ఉండరాదు. రిజర్వేషన్‌ను సద్వినియోగం చేసుకుని సాధారణ వర్గంతో కలసిన కుటుంబాలను.. తర్వాత రిజర్వేషన్లు పొందకుండా మినహాయించడానికి కాలానుగుణ కసరత్తు చేపట్టాలి. – జస్టిస్‌ పంకజ్‌ మిత్తల్‌

క్రీమీలేయర్‌ వర్తింపజేయాలి
వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యం ఇవ్వడం రాష్ట్రాల విధి. ఎస్సీ, ఎస్టీ కేటగిరీలో కొద్ది మంది మాత్రమే రిజర్వేషన్లు అనుభవిస్తున్నారు. ఈ విషయంలో క్షేత్రస్థాయి వాస్తవాలను తిరస్కరించలేం. శతాబ్దాలుగా అణచివేతకు గురవుతున్న కులాలు ఎస్సీ, ఎస్టీ వర్గాల్లో ఉన్నాయి. అయితే ఉప వర్గీకరణ సమయంలో ఎస్సీ, ఎస్టీ వర్గాల్లోని క్రీమీలేయర్‌ (అధికాదాయం ఉన్నవారిని) గుర్తించాలి. నిజమైన సమానత్వం సాధించాలంటే ఇదొక్కటే మార్గం.

ఇందుకోసం రాష్ట్రాలు ఒక విధానాన్ని రూపొందించాలి. షెడ్యూల్డ్‌ కులాలు, షెడ్యూల్డ్‌ తెగల క్రీమీలేయర్‌ మినహాయింపు ప్రమాణాలు ఇతర వెనుకబడిన కేటగిరీలకు వర్తించే ప్రమాణాలకు భిన్నంగా ఉండవచ్చు. ఈవీ చిన్నయ్య వర్సెస్‌ ఏపీ ప్రభుత్వం కేసులో ప్రాథమిక లోపం ఏమిటంటే.. ఆర్టికల్‌ 341 రిజర్వేషన్లకు ప్రాతిపదిక అని అర్థం చేసుకొని ముందుకు వెళ్లడమే! ఆర్టికల్‌ 341 అనేది రిజర్వేషన్ల ప్రయోజనాల నిమిత్తం కులాల గుర్తింపు కోసం మాత్రమే. – జస్టిస్‌ బీఆర్‌ గవాయి

ఉప వర్గీకరణకు అనుకూలం
షెడ్యూల్డ్‌ కులాల్లో ఉప వర్గీకరణకు అనుమతి వీలుకాదన్న ‘ఈవీ చిన్నయ్య’ కేసులోని తీర్పు సరికాదన్న చీఫ్‌ జస్టిస్‌ డీవై చంద్రచూడ్, జస్టిస్‌ బీఆర్‌ గవాయిల అభిప్రాయాలతో నేను ఏకీభవిస్తున్నాను. క్రీమీలేయర్‌ విధానాన్ని కూడా అమలు చేయడం మరింత సమానత్వానికి తోడ్పడుతుంది.             – జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌

తగిన డేటా సేకరించి అమలు చేయాలి
రిజర్వేషన్ల ఉప వర్గీకరణకు రాజ్యాంగ చెల్లుబాటు ఉందన్న చీఫ్‌ జస్టిస్‌ డీవై చంద్రచూడ్, జస్టిస్‌ బీఆర్‌ గవాయిల అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నాను. రాష్ట్రాలు తగిన డాటా సేకరించి ఉప వర్గీకరణ అవసరాన్ని నిర్ధారించాలి. ఇందు లో క్రీమీలేయర్‌ గుర్తింపునకు కూడా ఆవశ్యకత ఉండాలి.      – జస్టిస్‌ సతీశ్‌చంద్ర

రాష్ట్రాలకు ఉప వర్గీకరణ అర్హత లేదు
ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ఉప వర్గీకరణ అర్హత రాష్ట్రాలకు లేదు. షెడ్యూల్డ్‌ కులాల పరిణామ చరిత్ర, నేపథ్యానికి తోడు రాజ్యాంగంలోని 341 కింద ప్రచురించిన రాష్ట్రపతి ఉత్తర్వులు కలసి షెడ్యూల్డ్‌ కులాలు ఒక సజాతీయ తరగతిగా మారాయి. దీని ప్రకారం షెడ్యూల్డ్‌ కులాలు, జాతులు లేదా తెగలను విభజించడం /ఉప వర్గీకరణ చేయడం/ పునర్విభజన చేయడం తద్వారా నిర్దిష్ట కులం/కులాలకు రిజర్వేషన్లు కల్పించడానికి చట్టాన్ని రూపొందించే శాసన అధికారం రాష్ట్రాలకు లేదు.

రిజర్వేషన్లు కల్పించే ముసుగులో, బలహీనవర్గాలకు మంచి చేస్తున్నామన్న నెపంతో రాష్ట్రాలు రాష్ట్రపతి జాబితాను మార్చకూడదు, ఆర్టికల్‌ 341తో విభేదించకూడదు. రాష్ట్ర ప్రభుత్వ చర్య సదుద్దేశంతో ఉన్నా, రాజ్యాంగంలోని నిర్దిష్ట నిబంధనలను ఉల్లంఘించినట్లయితే.. ఆర్టికల్‌ 142 ప్రకారం సుప్రీంకోర్టు తన అధికార పరిధిని ఉపయోగించి ధ్రువీకరించడం కుదరదు. సదుద్దేశ చర్య, చట్టపరమైన ఫ్రేమ్‌వర్క్‌ రెండూ సమసమాజం లక్ష్యంగా ఉన్నా.. న్యాయబద్ధత, రాజ్యాంగ బద్ధతను పాటించాలి. – జస్టిస్‌ బేలా ఎం త్రివేది

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement