సాక్షి ప్రతినిధి, ఏలూరు: రాష్ట్రంలో అత్యధికంగా బొగ్గు నిల్వలున్న చింతలపూడి సెక్టార్–1, కృష్ణా జిల్లాలోని సోమవరం వెస్ట్ బ్లాక్‌లో తవ్వకాలకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు తాజాగా కేంద్ర బొగ్గు గనుల శాఖ.. సెక్టార్–1, సోమవరం వెస్ట్ బ్లాక్‌లను వేలం వేసేందుకు వీలుగా బిడ్లను ఆహ్వానించింది. దేశవ్యాప్తంగా 99 బొగ్గు బ్లాక్‌ల వేలానికి బిడ్లు ఆహ్వానించగా వాటిలో ఏపీకి చెందిన ఈ రెండు ఉన్నాయి. విభజనతో ఏపీ కోల్పోయిన సింగరేణి బొగ్గు లోటును చింతలపూడి తీర్చనుంది. అత్యంత నాణ్యమైన బొగ్గు నిల్వలు ఈ ప్రాంతంలో ఉన్నట్టు సర్వేల్లో స్పష్టమైంది. రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి, కృష్ణా బేసిన్‌లో అపారమైన బొగ్గు గనులు విస్తరించి ఉన్నాయి. రాష్ట్రంలో బొగ్గు నిల్వల కోసం సుదీర్ఘకాలం సర్వేలు, పరిశోధనలు జరిగాయి. 1964 నుంచి 2006 వరకు పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడితో పాటు.. జంగారెడ్డిగూడెం, కామవరపుకోట, తడికలపూడి ప్రాంతాల్లో బొగ్గు నిక్షేపాలున్నట్టు గుర్తించారు. ఆ తర్వాత 1996–2001 మధ్య కాలంలో ఖనిజాన్వేషణ సంస్థ సర్వే నిర్వహించి కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో బొగ్గు నిల్వలున్నట్టు నిర్ధారించింది.
తక్కువ లోతులో..
కృష్ణా జిల్లా చాట్రాయి మండలం సోమవరం గ్రామం నుంచి పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి వరకు సుమారు 3,000 మిలియన్ టన్నుల నాణ్యమైన డీ, ఎఫ్ గ్రేడ్ బొగ్గు నిల్వలున్నట్టు ప్రభుత్వం గుర్తించింది. అది కూడా భూ ఉపరితలానికి 200 నుంచి 500 మీటర్ల లోతులోనే ఉన్నట్టు తేల్చింది. చింతలపూడిలో 300 మిలియన్ టన్నులు, రాఘవాపురంలో 997 మిలియన్ టన్నులు, సోమవరంలో 746 మిలియన్ టన్నులున్నట్టు నిర్ధారించింది. చింతలపూడి ప్రధాన కేంద్రంగా 30 కిలోమీటర్ల వ్యాసార్థంలో పుష్కలంగా బొగ్గు నిల్వలున్నాయి. చింతలపూడి మండలం గురుభట్లగూడెం, రాఘవాపురం చుట్టు పక్కల గ్రామాల్లో 400 అడుగుల లోతు నుంచి 1,400 అడుగుల లోతులో సుమారు 1,000 అడుగుల మందంలో, వెంకటాపురం, నామవరం, సుబ్బారాయుడుగూడెం గ్రామాల్లో 70 అడుగుల లోతులో నాణ్యమైన బొగ్గు నిల్వలున్నాయి. చింతలపూడి సెక్టార్–1.. పట్టాయిగూడెం, నామవరం, వెంకటాద్రిగూడెం, లక్ష్మీనారాయణపురం తదితర గ్రామాల్లో సుమారు 12.4 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది. అలాగే సోమవరం వెస్ట్ కోల్ బ్లాక్.. చాట్రాయి మండలం సూర్యాపల్లి, చెక్కపల్లి, అక్కిరెడ్డిగూడెం, రమణక్కపేట పరిధిలో 15.11 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది.
వేలానికి బ్లాక్‌లు
ఈ ఏడాది ప్రారంభం నుంచి దేశంలోని వివిధ బొగ్గు బ్లాక్‌లను కేంద్ర ప్రభుత్వం విడతల వారీగా వేలం వేస్తోంది. దీని కోసం బిడ్లను ఆహ్వానిస్తోంది. అయితే ఈ ఏడాది ద్వితీయార్థంలో కృష్ణా జిల్లా సోమవరం బ్లాక్‌ను కూడా వేలం వేస్తున్నట్టు ప్రకటించింది. బిడ్లు దాఖలు కాకపోవడంతో సోమవరం బ్లాక్ కేటాయింపులు జరగలేదు. ఈ క్రమంలో మళ్లీ కేంద్ర బొగ్గు గనుల శాఖ ఈ నెల 16న దేశంలోని 99 బొగ్గు బ్లాక్‌లను వేలం వేస్తున్నట్టు ప్రకటించింది. వాటిలో చింతలపూడి సెక్టార్–1తో పాటు సోమవరం వెస్ట్ బ్లాక్‌ను కూడా చేర్చింది. బొగ్గు మైనింగ్‌పై వచ్చే రెవెన్యూలో వాటా ఆధారంగా వేలం ప్రక్రియను రెండు దశల్లో పూర్తి చేస్తారు.
రాష్ట్రంలో ఇక బొగ్గు తవ్వకాలు
Published Mon, Dec 20 2021 3:51 AM | Last Updated on Mon, Dec 20 2021 3:51 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment