అరుదైన బొగ్గు క్షేత్రం ఏపీఎండీసీ కైవసం  | APMDC Agreement With Central Coal Mining Department | Sakshi
Sakshi News home page

అరుదైన బొగ్గు క్షేత్రం ఏపీఎండీసీ కైవసం 

Published Tue, Jan 12 2021 8:56 AM | Last Updated on Tue, Jan 12 2021 8:56 AM

APMDC Agreement With Central Coal Mining Department - Sakshi

సాక్షి, అమరావతి: జార్ఖండ్‌ రాష్ట్రంలోని అరుదైన కుకింగ్‌ కోల్‌ బ్లాక్‌ (బ్రహ్మదిహ)ను ఆంధ్రప్రదేశ్‌ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) కైవసం చేసుకుంది. బిడ్డింగ్‌లో ఏపీఎండీసీ ఎల్‌1గా నిలవడంతో ఆ బొగ్గు క్షేత్రాన్ని ఏపీఎండీసీకి అప్పగించారు. ఈ మేరకు సోమవారం ఢిల్లీలో కేంద్ర బొగ్గుగనుల మంత్రిత్వశాఖ – ఏపీఎండీసీ మధ్య ఒప్పందం కుదిరింది. కేంద్ర ప్రభుత్వం తరఫున కేంద్ర బొగ్గు గనుల శాఖ అదనపు కార్యదర్శి ఎం.నాగరాజు, ఏపీఎండీసీ తరఫున రాష్ట్ర భూగర్భ గనుల శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా, బొగ్గుగనుల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషిల సమక్షంలో కేంద్ర బొగ్గుగనుల శాఖ అధికారులు ఒప్పంద పత్రాలను గోపాలకృష్ణ ద్వివేదికి అందజేశారు.   

ఇది అత్యంత నాణ్యమైన, అరుదైన బొగ్గు 
జార్ఖండ్‌లోని గిరిడీ కోల్‌ ఫీల్డ్స్‌లో అత్యంత నాణ్యమైన, అరుదైన ఎస్‌1 రకం కుకింగ్‌ కోల్‌ ఉంది. అధికార వర్గాల సమాచారం ప్రకారం.. దేశంలో వినియోగమయ్యే ఈ రకం బొగ్గులో 1.5 శాతం మాత్రమే ఇక్కడ ఉత్పత్తి అవుతోంది. మిగిలిన 98.5 శాతం విదేశాల నుంచి దిగుమతి అవుతోంది. అందువల్ల దీనికి మంచి డిమాండ్‌ ఉంది. ఉక్కు కర్మాగారాల్లో బ్లాస్ట్‌ ఫర్నేస్‌ (ఉక్కును కరిగించడం) కోసం దీనిని వినియోగిస్తారు. ఏపీఎండీసీకి లభించిన గనిలో 25 లక్షల టన్నుల బొగ్గు నిక్షేపాలున్నట్లు అంచనా. ’బ్రహ్మదిహ’ క్షేత్రంలో తవ్వే బొగ్గు అమ్మకం ధరలో 41.75 శాతం జార్ఖండ్‌ రాష్ట్రానికి ఇవ్వాల్సి ఉంటుంది. మిగతా 48.25 శాతం ఏపీఎండీసీదన్నమాట. ఈ బొగ్గు గనిని పొందడంవల్ల ఏపీఎండీసీకి రూ.250 నుంచి రూ.350 కోట్ల వరకు నికర రాబడి వస్తుందని అధికారుల అంచనా.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement