సాక్షి, అమరావతి: సొంతంగా బొగ్గు తవ్వకాలు చేయడం ద్వారా ఆదాయం పెంచుకునే క్రమంలో ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) కీలకమైన ముందడుగు వేసింది. మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలి జిల్లా సుల్యారీ బొగ్గు గనిలోని 1,298 హెక్టార్ల భూమిలో మైనింగ్ కార్యక్రమాలకు సోమవారం భూమి పూజ నిర్వహించింది. ఈ వారంలోనే అక్కడ తవ్వకం పనులు ప్రారంభం కానున్నాయి. నెల రోజుల్లో ఉత్పత్తి మొదలవనుంది.
మొదటగా దాదాపు రూ. 2 వేల కోట్ల పెట్టుబడితో ప్రతి ఏటా 5 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయాలని ఏపీఎండీసీ లక్ష్యంగా పెట్టుకుంది. సుల్యారీ గనుల్లో మొత్తం 107 మిలియన్ టన్నుల బొగ్గును లీజు సమయం ఉన్న 22 ఏళ్ల పాటు వెలికితీసేందుకు అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. బొగ్గు తవ్వకం వల్ల ఆ ప్రాంతంలో నిర్వాసితులవుతున్న 1,250 కుటుంబాలకు పునరావాసం కల్పిస్తున్నారు. ఈ గనుల ద్వారా వెలికితీసే మొత్తం బొగ్గు ఉత్పత్తిలో 25 శాతం సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రిజర్వు చేయాలని నిర్ణయించారు.
మైనింగ్ చేయాల్సిన ప్రాంతాన్ని పరిశీలిస్తున్న అధికారులు
రాష్ట్ర పురోభివృద్ధి దిశగా సీఎం నిర్ణయాలు..
అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని పారిశ్రామిక అభివృద్ధి, రాష్ట్ర ఆర్థిక పరిపుష్టి కోసం సీఎం జగన్ పరితపిస్తున్నారు. రాష్ట్రంలో ఖనిజాభివృద్ధికి ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. సుల్యారీలో బొగ్గు తవ్వకాలు మొదలు కావడానికి సీఎం దూరదృష్టే కారణం. రాష్ట్ర పురోభివృద్ధి లక్ష్యంగా వివిధ ప్రాజెక్టులను సత్వరం వినియోగంలోకి తీసుకువచ్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. సుల్యారీ ప్రాజెక్టును త్వరితగతిన అమల్లోకి తీసుకువచ్చిన ఏపీఎండీసీ అధికారులను అభినందిస్తున్నా. ఖనిజాభివృద్ధి సంస్థ ద్వారా మైనింగ్ అవకాశాలపై ఎప్పటికప్పుడు సమీక్షలు జరుపుతున్నాం.
– పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గనులు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి
బొగ్గు తవ్వకాలతో సంస్థ పరిధిని విస్తరిస్తాం
బెరైటీస్ మైనింగ్‌లో అంతర్జాతీయ మార్కెట్‌ను సృష్టించుకున్న ఏపీఎండీసీ.. ఇతర రాష్ట్రాల్లో మైనింగ్ కార్యకలాపాలకు ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకుంటుంది. సుల్యారీలో బొగ్గు తవ్వకాల ద్వారా సంస్థ పరిధిని మరింతగా విస్తరిస్తున్నాం. ఛత్తీస్‌గఢ్‌లోని మదన్‌పూర్ సౌత్ బ్లాక్, జార్ఖండ్‌లోని బ్రహ్మదియా కోల్ బ్లాక్‌లను ఏపీఎండీసీ దక్కించుకుంది. ఈ ఏడాదిలోనే అక్కడ కూడా ఉత్పత్తిని సాధించే దిశగా చర్యలు తీసుకుంటున్నాం. గ్రానైట్, సిలికాశాండ్ ఖనిజాల వెలికితీత, మార్కెటింగ్‌పై కూడా దృష్టి పెట్టాం. ప్రస్తుతం ఖనిజాభివృద్ధి సంస్థ ద్వారా ఆర్జిస్తున్న ఆదాయాన్ని ఐదు రెట్లు పెంచాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం.
– వీజీ వెంకటరెడ్డి, ఏపీఎండీసీ వీసీ అండ్ ఎండీ
Comments
Please login to add a commentAdd a comment